సెలబ్రిటీ సరొగసీ రచ్చ!

12 Oct, 2022 23:10 IST|Sakshi

సినీ ప్రముఖుల ప్రతి అంశమూ ఆసక్తికరమే, అనేకసార్లు సంచలనమే. నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ దంపతులు తల్లితండ్రులైన వార్త అభిమానుల్లో ఆసక్తితో పాటు అనేక చర్చలకూ దారి తీసింది. పెళ్ళయిన 4నెలలకే తల్లితండ్రులైన ఈ దంపతులు బాహాటంగా ప్రకటించకున్నా, సరొగసీ (అద్దె గర్భం) ద్వారానే మగ కవలల్ని కన్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. అద్దె గర్భం ప్రక్రియ ఓ వ్యాపారంగా సాగడాన్ని అడ్డుకొనేందుకు కేంద్రం నిరుడు తెచ్చిన చట్టాలు ఉల్లంఘనకు గురయ్యాయని కొందరి అనుమానం. నయన కవలపిల్లల వ్యవహారంలో చట్ట ఉల్లంఘనలు జరిగిందీ, లేనిదీ రాష్ట్ర వైద్యసేవల డైరెక్టరేట్‌ ద్వారా విచారణ జరుపుతామంటూ తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రకటించడంతో కథ మరో మలుపు తిరిగింది. నయనతార దంపతులేమీ అధికారికంగా వివరణ ఇవ్వకపోవడంతో, వ్యక్తిగత వ్యవహారం కాస్తా సెలబ్రిటీ సరొగసీ రచ్చగా మారింది. 

సరొగసీపై 2021 డిసెంబర్‌లో భారత పార్లమెంట్‌ రెండు చట్టాలను ఆమోదించింది. అవి – సరొగసీ (నియంత్రణ) చట్టం, అసిస్టెడ్‌ రీప్రొడక్టివ్‌ టెక్నాలజీ (ఏఆర్టీ) నియంత్రణ చట్టం. మొదటి చట్టం దేశంలో సరొగసీ ప్రక్రియ, ఆచరణకు సంబంధించినది. రెండోది ఏఆర్టీ క్లినిక్‌లనూ, బ్యాంకు లనూ పర్యవేక్షించడానికీ, నియంత్రించడానికీ ఉద్దేశించినది. పిల్లలు లేనివాళ్ళు, నిర్ణీత వయస్కులు, అద్దెగర్భమే దిక్కయిన ఆరోగ్యపరిస్థితుల్లోని వారే ఈ చట్టాల కింద సరొగసీకి అర్హులు. గుజరాత్‌లోని ఆనంద్‌ సహా పలు ప్రాంతాలు అద్దెగర్భాల వ్యాపారానికి అడ్డా కావడంతో, అలాంటి అక్రమాలను ఈ చట్టాలు దేశంలో నిషేధించాయి. సరొగసీతో సంతానం పొందాలనుకొనే దంపతులకు సాయపడే అద్దె తల్లి వారికి రక్తసంబంధీకురాలై ఉండాలనీ పేర్కొన్నాయి. ఈ ఉద్దేశాలన్నీ మంచివే అయినా... సరొగసీ ద్వారా తండ్రి కావాలనుకున్న ఒంటరి మగాడి పట్ల, అలాగే ఒక బిడ్డ ఉన్నప్పటికీ అద్దెగర్భంతో కుటుంబాన్ని విస్తరించుకోవాలనుకొనే వివాహిత స్త్రీ పట్ల ఈ చట్టాలు దుర్విచక్షణతో ఉన్నాయనేది విమర్శ. దీనిపై ఢిల్లీ హైకోర్ట్‌లో ఓ పిటిషన్‌ పెండింగ్‌లో ఉంది. అలాగే, ఈ చట్టాల్లోని కొన్ని అంశాలను సవాలు చేస్తూ ఓ డాక్టర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీమ్‌ కోర్ట్‌ విచారిస్తోంది. 

నయన, శివన్‌ 2022 జూన్‌లో చెన్నైలో పెళ్ళి చేసుకొన్నారు. నాలుగు నెలలకే సంతానం కలగడం, నటనలో బిజీగా ఉన్న నయన గర్భవతిగా ఉన్న సూచనలేవీ బయట కనిపించకపోవడం, ఆంతరంగిక వర్గాల కథనం అది అద్దెగర్భమనే అనడంతో ఇంత చర్చా మొదలైంది. నటి కస్తూరి సహా కొందరు ప్రముఖులు, నెటిజన్లు కమర్షియల్‌ సరొగసీ నిషేధమంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేసరికి ఇంటికథ రచ్చకెక్కింది. నిజానికి, సంతానం కోసం సెలబ్రిటీలు సరొగసీని ఆశ్రయించడం మన దేశంలోనూ కొత్తేమీ కాదు. హీరో షారుఖ్‌ ఖాన్‌ 2013 మేలో తన మూడో బిడ్డ అబ్‌రామ్‌ కోసం సరోగసీని ఆశ్రయించినప్పటి నుంచి చర్చ రేగింది. ధనికులు తప్పుడు కారణాలతో అద్దెతల్లుల్ని పెట్టుకుంటున్నారనే వివాదం మొదలైంది. నటి మంచు లక్ష్మి, 2017 మార్చిలో నిర్మాత కరణ్‌ జోహార్‌ దాకా పలువురు బిడ్డల కోసం సరొగసీనే ఆశ్రయించారు. సినిమా సహా గ్లామర్‌ ప్రపంచంలో ఉన్నవారు తమ వృత్తి అవసరాల రీత్యా అద్దె తల్లుల్ని అరువు తెచ్చుకోవడం జరుగుతూనే ఉంది. నైతిక చర్చలు పక్కనపెడితే, అందులో న్యాయ విరుద్ధమేమీ లేదు. 

పెళ్ళికాక ముందే ఏడేళ్ళుగా 2015 నుంచి నయన, శివన్‌ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. సహ జీవనం సైతం చట్టబద్ధమని కోర్టులే  తేల్చాయి. కాబట్టి, పెళ్ళయి అయిదేళ్ళయితేనే సరొగసీకి అర్హులనే చట్ట నిబంధనను వారు ఉల్లంఘించారనే వాదన నిలుస్తుందా? అలాగే, కొత్త సరొగసీ చట్టాలు ఈ ఏడాది జనవరి 25 నుంచి అమలులోకి వచ్చాయి. అప్పటికే అద్దె తల్లులుగా ఉన్నవారి క్షేమం కోసం పది నెలల గర్భధారణ కాలమూ ఇచ్చాయి. దాని ప్రకారం చూస్తే జనవరికి ముందే నయన దంపతులు సరొగసీని ఎంచుకొని ఉంటే, అదీ చట్టవిరుద్ధం అనలేం. కాబట్టి వారి సరొగసీ చట్టవిరుద్ధమనే వాదన చివరకు నిలబడకపోవచ్చు. విచారణలో వివరాలు బయటకొచ్చేదాకా, నయన దంపతులు పెదవి విప్పేదాకా జరిగిందేమిటో తెలియదు. తొందరపడి తీర్పులు చెప్పడమూ భావ్యం కాదు. 

నిజానికి, సరొగసీ దోపిడీని అరికట్టడానికి పెట్టిన చట్టాలు సైతం పేదలైన వేలాది అద్దెతల్లుల్ని మరింత దోపిడీకి గురి చేస్తున్నాయనే వాదన ఉంది. నయనతారతో పాటు వేలాది కేసుల్లో ఒకవేళ చట్ట ఉల్లంఘనలు జరిగాయనుకున్నా, ప్రతి కేసులో విచారణ అయ్యేపనీ కాదు. వైవాహిక అత్యాచారం సహా అనేకవాటిని నేరంగా తీర్మానించడానికి నిరాకరిస్తున్న మనం ఒక మహిళ తన బతుకుతెరువు కోసం తన దేహాన్ని వాణిజ్య సరొగసీకి వాడి, మరో స్త్రీకి సాయం చేస్తే తప్పేమిటనే వాదనకు జవాబు లేదు. సమాజంలో పెళ్ళికీ, మాతృత్వానికీ ఇచ్చిన అతి ప్రాధాన్యమూ సరొగసీపై చర్చోపచర్చలకు కారణమవుతోంది. అద్దె గర్భంతో బిడ్డను కంటే ఆ స్త్రీ ‘మంచి తల్లి’ కాదంటారా? అలాంటి తప్పుడు మూస ఆలోచన నుంచి మనం బయటపడేదెప్పుడు?

నటి ప్రియాంకాచోప్రా, నిక్‌ జోన్స్‌ దంపతులు ఆ మధ్య సరొగసీతో సంతానం పొందినప్పుడూ వారిని అనరాని మాటలన్నారు. ఒక మహిళ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుని, తన హక్కును వినియో గించుకుంటే... ‘ఆడవాళ్ళంటే ఇలానే ఉండాలి, ఇలాగే అమ్మతనం పొందా’లంటూ పితృస్వామ్య భావజాలంతో ఒత్తిడి చేయడానికి ఎవరికి ఏం హక్కుంది? ఈ సెలబ్రిటీ సరొగసీ రచ్చతో చర్చకు వచ్చిన అనేక అంశాలను సావధానంగా ఆలోచించాల్సిందే! సమాజం సమాధానం చెప్పాల్సిందే! 

మరిన్ని వార్తలు