ఇది కూడా యుద్ధమే... నరమేధమే!

6 Mar, 2022 00:45 IST|Sakshi

జనతంత్రం

ఇక్కడ జరుగుతున్నది కూడా యుద్ధమే. మరింత భయానకమైనది. కుట్రపూరితమైనది. దురాక్రమణపూరిత యుద్ధం. అన్యాయమైన దాడి. గోబెల్స్‌ ఇన్వేజన్‌. రష్యావాళ్ల – టీ–90 ట్యాంకులు కక్కుతున్న మృత్యు కాలుష్యం కంటే ఈ ప్రచార యుద్ధ కాలుష్యం మరింత ప్రమాదకరమైనది. కలష్నికోవ్‌ రైఫిళ్ల రక్తదాహం కంటే ఇక్కడి అధికార దాహపు కుట్ర మరింత భయంకరమైనది. ఏపీ వేరియంట్‌ గోబెల్స్‌ వార్‌హెడ్ల విలయ విధ్వంసక శక్తి ముందు రష్యన్‌ వ్యాక్యూమ్‌ బాంబుల మారణహోమం దిగదుడుపే!

యాభయ్యేళ్ల కింద లాటిన్‌ అమెరికాలో సీఐఏ నడిపిన కుట్ర నాటకం గుర్తుకొస్తున్నది. చిలీ దేశంలో అమెరికా సంపన్నుల ఆస్తులు, పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిన సందర్భం. ఆ దేశానికి డాక్టర్‌ సాల్వెడార్‌ అలెండీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అతనొక సోషలిస్టు. చిలీ జీవనాడుల్ని గుప్పెట్లో పెట్టుకున్న అమెరికన్ల ఆస్తుల్ని జాతీయం చేస్తాడేమోనని అమెరికా శంకించింది. సీఐఏను రంగంలోకి దించింది. డాక్టర్‌ అలెండీని అంతం చేసే కుట్రను సదరు పంచమాంగదళం విజయవంతంగా పూర్తిచేసింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో ఒక రాజధాని జూదం నడుస్తున్నది. ఇందులో తాము ఒడ్డిన పందెపు సొమ్మును పదింతలు చేసుకోవాలని పెత్తందార్లు తహతహలాడుతున్నారు. కుట్ర నాటకాన్ని రచించారు. అదింకా ప్రదర్శితమవుతున్నది. ఈ రెండు నాటకాల్లో ఏది ఎక్కువ కళాత్మక విలువలు కలిగి ఉన్నదో తేల్చడానికి ఒక తులనాత్మక అధ్యయనం తప్పనిసరి అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న దురాక్రమణ యుద్ధం గురించి... ఎవరి మీద ఎవరు జరుపుతున్న దాడి ఇది? రూపంలో అన్నీ రాజకీయ పాత్రలే కనిపిస్తాయి. కానీ, సారంలో సామాజిక శక్తుల సంఘర్షణ ధ్వనిస్తున్నది. అమలులో ఉన్న అన్యాయమైన రాజకీయ, సామాజిక విలువలకు ప్రత్యామ్నా యంగా సరికొత్త విలువలు మొలకెత్తడానికి సిద్ధపడుతున్నాయి. చీకట్లో మగ్గుతున్న సామాజిక శక్తులు వెలుతురు ద్వారాలను తోసుకొని రావడానికి ప్రయత్నిస్తున్నాయి. తమసోమా జ్యోతిర్గమయ మంత్రాన్ని ఆ శక్తులు జపిస్తున్నాయి. పాత విలువల పల్లకీ పెత్తందార్లకు ఈ పరిణామం రుచించలేదు. కత్తులు దూస్తున్నారు. కొత్త విలువల నవజాత శిశువు పాల బుగ్గపై రక్త సంతకాన్ని చెక్కుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో 2019 సంవత్సరం ఒక మూలమలుపు కాలం. మేలిమలుపు కాలం కూడా! అప్పుడు అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం కొన్ని కీలక జీవన రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. అంతకుముందు రెండున్నర, మూడు దశాబ్దాల కాలం నుంచి విద్యారంగంలో ధనిక – పేద విభజన స్థిరపడిపోయింది. కుల మత ప్రాంత తేడాలు లేకుండా పేదలంటే పేదలే. ధనికులంటే ధనికులే! ఈ నడమంత్రపు రిఫార్మిస్టు కాలంలో ఇంగ్లీషులో చదువుకున్న వారికి దేశదేశాల్లో ముఖ్యంగా అమెరికాలో కూడా ఉద్యోగాలు దొరికాయి. అందుకని ధనవంతుల పిల్లలంతా ప్రైవేట్‌లో ఇంగ్లీషు చదువు కొనుక్కొని లాభపడ్డారు. ఓమాత్రపు స్థోమత కలిగిన మధ్య తరగతి తల్లిదండ్రులు ధనవంతుల్ని అనుసరించి అప్పుల పాలయ్యారు. కూడుపెట్టని తెలుగు మీడియం చదువుతో, వసతుల్లేని బడుల్లో పేద పిల్లల భవిష్యత్తు బలైపోయింది. ఒక తరానికి తరం మరో రెండు మూడు తరాలపాటు కోలుకోలేని స్థాయి వెనకబాటుతనానికి గురైంది. ఈ అన్యాయాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సరిచేసింది. అందరికీ నాణ్యమైన ఉచిత ఇంగ్లీష్‌ బోధనా విద్యను అందజేసే బృహత్తర యజ్ఞాన్ని ప్రారంభించింది. ఇందులో కుల మత ప్రాంత వివక్ష లేదు. ధనిక, పేద తేడా లేదు. పిల్లలందరినీ ప్రభుత్వం తన ఒడిలోకి చేర్చుకున్నది. కుల మత జాతి అంతస్తు భేదం లేని నవతరం నిర్మాణానికి అంకురార్పణ చేసింది.

గడచిన మూడు దశాబ్దాల రిఫార్మిస్టు కాలం ప్రజా వైద్య రంగానికి ఒక పీడ కల. అంతకుముందు ఆధునిక వైద్యం పెద్దగా విస్తరించకపోయినా కనీసం సంప్రదాయ వైద్యమైనా అందరికీ అందుబాటులో ఉండేది. ఊరూరా ఆర్‌ఎంపీ, పీఎమ్‌పీ వైద్యులుండేవారు. సాధారణ స్థాయి రుగ్మతలన్నీ ఊళ్లోనే నయమయ్యేవి. కొంచెం పెద్ద జబ్బులకు టౌన్‌ హాస్పిటళ్లకు వెళ్లినా ఖర్చు అలవికాని భారంగా మాత్రం ఉండేది కాదు. కార్పొరేట్‌ వైద్యం ప్రవేశించడంతో పరిస్థితులు మారిపోయాయి. గ్రామీణ వైద్యుల్ని కార్పొరేట్‌ ఏజెంట్లుగా మార్చాయి. చిన్నచిన్న జబ్బులకు కూడా కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పెద్ద రోగం వచ్చిందంటే ఇల్లూ – వాకిలి అమ్ముకోవడం తప్ప మరో మార్గం కనిపించేది కాదు.

ప్రజారోగ్య రంగంలోనూ వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అద్భుతమైన సంజీవని వంటి కార్యక్రమాన్ని డిజైన్‌ చేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠం చేస్తున్నారు. ఈ పరిధిలో ఇద్దరు డాక్టర్లుంటారు. ఒక డాక్టర్‌ ఇల్లిల్లూ తిరుగుతుంటే, ఒక డాక్టర్‌ వైద్య కేంద్రంలో ఉంటారు. అందరికీ ఫ్యామిలీ డాక్టర్‌ అందుబాటులో ఉండే వ్యవస్థ ఏర్పడుతున్నది. వైద్యుడు లేని ఊళ్లో ఉండొద్దన్నాడు సుమతీ శతకకారుడు. వైద్యుడు లేని ఊరే లేకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏరియా ఆస్పత్రు లను కార్పొరేట్‌కు దీటుగా మార్చుతున్నారు. సూపర్‌ స్పెషాలిటీ సేవలు ప్రభుత్వరంగంలోనే అందుబాటులోకి తెస్తున్నారు. కొత్తగా ప్రభుత్వమే 16 మెడికల్‌ కాలేజీలనూ, అనుబంధంగా ఆస్పత్రులనూ నిర్మిస్తున్నది. ఏకబిగిన ఇన్ని కాలేజీల నిర్మాణం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. పేదవాడికి రోగం రాకడ... ప్రాణం పోకడ అనే విషాద అధ్యాయానికి ఏపీ ప్రభుత్వం ముగింపు పలకబోతున్నది. 

ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయరంగం వెన్నెముక. జనాభాలో నూటికి 65 మంది ఈ రంగం మీద జీవిస్తున్నారు. కానీ జీఎస్‌డీపీలో దాని వాటా 30 శాతం మాత్రమే. అరవై అయిదు శాతం మంది శ్రమశక్తి విలువ 30 శాతం కిమ్మత్తు మాత్రమే చేస్తున్న నిర్హేతుక మార్కెట్‌ వ్యవస్థ రాజ్యం చేస్తున్నది. రైతు ఉత్పత్తికి న్యాయమైన ధర దక్కకపోవడం, పెట్టుబడి వ్యయం పెరిగిపోవడం అనే రెండు అంశాలు వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణాలు. దీనికి తోడు నూటికి ఎనభై మంది రెండున్నర ఎకరాల కంటే తక్కువ కమతం కలిగిన చిన్న సన్నకారు రైతులు. గడిచిన మూడు దశాబ్దాల కాలం భారతదేశ వ్యవసాయ రంగానికి శాపగ్రస్థ కాలం. లక్షలాది పేద రైతులు ఆత్మహత్యలు చేసుకున్న చేటు కాలం. ఈ పరిస్థితులను కల్పించిన రాజకీయ నాయకత్వం వ్యవసాయం దండగ అనే అభిప్రాయాన్ని వ్యాపింపజేసింది. చిన్న రైతులను భూముల నుంచి వెళ్లగొట్టి, బడా సంస్థలకు కట్టబెట్టాలనే దురుద్దేశంతో సృష్టించిన అభిప్రాయం ఇది. ఈ వాస్తవిక పరిస్థితులను గమనంలోకి తీసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే కార్యక్రమాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూపొందించింది.

చిన్నరైతులు స్వయంపోషకంగా ఎదగగలిగే సమీకృత వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తున్నది. ఈ రంగంలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతున్నది. రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఒక విప్లవాత్మక ముందడుగు. ఈ కేంద్రాల వల్ల నాణ్యమైన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు రైతు గడపలోకే వస్తున్నాయి. సలహాలు, సూచనలు పొలం గట్టు దగ్గరకే వస్తున్నాయి. గడచిన సంవత్సరం పండించిన ధాన్యంలో మద్దతు ధర కంటే ఎక్కువ చెల్లించి మిల్లర్లు కొనుగోలు చేసిందీ, రైతుకు కుటుంబ అవసరాల కోసం మినహాయించుకున్నదీ పోను మిగిలిన మొత్తం ధాన్యాన్ని మద్దతు ధరలకు కొనుగోలు చేసిందీ ప్రభుత్వమే. వ్యవసాయరంగ సంక్షోభ కారకాలైన రెండు ప్రధాన సమస్యలను పరిష్కరించడానికి ముందడుగు వేసింది. అర్‌బీకే సెంటర్లు నిలదొక్కుకున్న తర్వాత∙మరిన్ని సత్ఫలితాలు రాబట్టే అవకాశం ఉన్నది.

వెనుకబడిన, పేద వర్గాల ప్రజలు అభివృద్ధి పథంలో పయనించడానికి దోహదపడే ప్రాథమిక రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ఈ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సంస్కరణలు ప్రారంభించింది. ఈ సంస్కరణలు పేదల జీవితాల్లో గణనీయమైన మార్పులు తేగల సామర్థ్యం కలిగినవి. వీటితోపాటు ఈ వర్గాల ప్రజలూ, మహిళలూ సాధికారత శక్తిని సంతరించుకునేటందుకు కూడా ప్రభుత్వం బాటలు వేస్తున్నది. సాధికారతతోనే ఆత్మగౌరవం సిద్ధిస్తుంది. ఆత్మగౌరవంతోనే మనిషికి సార్ధకత సిద్ధిస్తుందని వైఎస్‌ జగన్‌ విశ్వాసం. అందు కోసమే అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచీ మంత్రివర్గంతో సహా అన్నిచోట్లా సింహభాగం పదవులను వెనకబడిన వర్గాలు, స్త్రీలకు కేటాయిస్తున్నారు.

పేదవర్గాల ప్రజలు నిలదొక్కుకోవడానికి, సాధికారతను సంతరించుకోవడానికి, ఆత్మగౌరవంతో జీవించ డానికి విప్లవాత్మక పథకాలు రచించిన కారణంగానే జగన్‌ ప్రభుత్వంపై ఇప్పుడు యుద్ధం జరుగుతున్నది. ఇది కుట్ర పూరిత యుద్ధం. ఇది దుష్ప్రచార యుద్ధం. ఇది తిమ్మిని బమ్మిగా చూపే కనికట్టు యుద్ధం. అత్యాధునిక యుద్ధ మిసైళ్లకు దీటైన గజకర్ణ గోకర్ణ టక్కుటమారాది మాయా మారణాయుధా లను ఈ యుద్ధంలో ఉపయోగిస్తున్నారు.

ఈ యుద్ధం చేస్తున్నది ఎవరు? వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల ఫలితంగా నష్టపోయే స్వార్థపూరిత శక్తులు. వాటి రాజకీయ రూపమైన తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో, దాని అధిపతి చంద్రబాబు నాయ కత్వంలో యుద్ధం చేస్తున్నారు. విద్యారంగం నుంచి ప్రభుత్వం పెట్టుబడులను తగ్గించి పేద ప్రజల చదువును అటకెక్కించిన వారిలో ప్రముఖుడు చంద్రబాబు. ప్రైవేట్‌ విద్యను అందల మెక్కించి విద్యా వ్యాపారంలో నయా కుబేరుల సృష్టికి కారణ మైన నాయకుడు చంద్రబాబు. ప్రభుత్వ వైద్యాన్ని శిథిలం చేసి వైద్య వ్యాపారానికి లంగరెత్తిన వారిలో కీలక వ్యక్తి చంద్రబాబు. వ్యవసాయం దండగని ప్రచారం సృష్టించిన ప్రవక్త ఆయన. సాగు రంగంలో నిత్యం వందలాదిమంది ప్రాణాలు కోల్పో తున్న సమయంలో ప్రైవేట్‌ రంగ ఫిడేలు వాయించిన అపర నీరో చక్రవర్తి చంద్రబాబు. ప్రపంచ బ్యాంకు జీతగాడుగా ఆయన సాధించిన అపఖ్యాతి నిరుపమానమైనది.

బీసీ కులాల్లో పుట్టినవారు న్యాయమూర్తులుగా పనికిరారని చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసిన ఏకైక రాజకీయవేత్త ఈ దేశంలో చంద్రబాబు ఒక్కరే! ‘ఎస్‌సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా’ అని బాహాటంగా ప్రెస్‌మీట్‌ లోనే ఈసడించుకున్న మహానాయకుడు కూడా ఈ దేశంలో ఆయన ఒక్కరే! ‘కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా’ అని లింగవివక్షను బహిరంగంగా ప్రదర్శించిన పురుషాహంకారం ఆయన సొంతం. నాయీ బ్రాహ్మణులు, మత్స్యకారులు... ఇలా ఎందరో బలహీనవర్గాల ప్రజలను తోకలు కత్తిరిస్తానని బెదిరించిన వ్యక్తి ఆయన. పేదలు – మహిళల సాధికారతకు వారి ఆత్మగౌరవానికి చంద్రబాబు బద్ధ వ్యతిరేకి అని చెప్పడానికి ఇంతకంటే పెద్ద రుజువు లుంటాయా? ప్రజలను కులాలవారీగా విభజించి రాజకీయం చేయడం చంద్రబాబు నైజం. పేదరికమే ప్రాతిపదికగా కులరహితమైన అభివృద్ధి పనులు చేపట్టిన జగన్‌ ప్రభుత్వం చర్యలను ఆయన ఎట్లా సహిస్తారు? అందుకే ఈ యుద్ధం జరుగుతున్నది. జగన్‌ ప్రభుత్వ సాధికారతా యజ్ఞం వల్ల నష్టపోయే గుప్పెడుమంది సంపన్నులు వారి సర్వశక్తులనూ ఒడ్డి బాబుకు సహకరిస్తున్నారు. ప్రతిరోజూ ఏదో ఒక విషప్రచారాన్ని ప్రభుత్వంపై గురిపెట్టి వదులుతున్నారు. ఈ సంక్లిష్ట సన్ని వేశంలో కొన్ని దర్యాప్తు సంస్థలు ఇచ్చే లీకులు, న్యాయస్థానాల తీర్పులను కూడా ఈ శక్తులు ఆయుధాలుగా చేసుకుంటున్నాయి. జనం మదిలో అనేక ప్రశ్నలు, సందేహాలు తలెత్తడానికి కారణ మవుతున్నాయి.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు విషయంలోనూ అనేక కామన్‌సెన్స్‌ ప్రశ్నలు, వాటిని సీబీఐ ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదన్న సందేహాలు తలెత్తుతున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలపై సందేహ నివృత్తి అవసరం. 1) వైఎస్‌ వివేకానందరెడ్డి 2010లో షమీమ్‌ అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నారు. 2015లో వారికో బాబు పుట్టాడు. ఆ బాబుకు తన ఆస్తిలో వాటా ఇస్తానని వివేకా చెప్పడం, తన వారసుడిగా ప్రకటిస్తానని కూడా చెప్పడాన్ని మొదటి భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు (చిన్న బావమరిది) నర్రెడ్డి రాజ శేఖరరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారన్నది బహిరంగ రహస్యం. బెంగుళూరు భూసెటిల్‌మెంట్‌లో వచ్చే మొత్తంలో రెండో కుటుంబానికి వాటా ఇస్తానని చెప్పిన కొద్దిరోజులకే ఆయన హత్య జరిగింది.

సీబీఐ దర్యాప్తులో ఈ కుటుంబ కోణం ఎందుకో మిస్సయ్యింది. 2) వివేకా మరణించిన విషయం 2019 మార్చి 15 ఉదయం మొదట గుర్తించిన వ్యక్తి ఆయన పీఏ కృష్ణారెడ్డి. ఆ విషయాన్ని వెంటనే హైదరాబాద్‌లో ఉన్న వివేకా భార్య, కుమార్తె, అల్లుడికి ఫోన్‌ చేసి చెప్పారు. మృతదేహం వద్ద లభించిన ఉత్తరాన్ని, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని తన దగ్గర ఉంచుకున్నాడు. ఉత్తరంలో డ్రైవర్‌ ప్రసాద్‌ తనపై దాడి చేసి కొట్టాడని రాసి ఉంది. ఆ విషయాన్ని వారితో కృష్ణారెడ్డి చెప్పి ఉండాలి కదా! ఉత్తరంలో ఉన్న విషయాల ఆధారంగా వివేకా హత్యకు గురయ్యారని ఆయన కుమార్తె, అల్లుడు గుర్తించి ఉండాలి కదా! ఆ సెల్‌ఫోన్‌ను, లేఖను పోలీసులకు స్వాధీనం చేయమని కృష్ణారెడ్డికి వారు చెప్పి ఉండాలి కదా! మరి కృష్ణారెడ్డి ఆ లేఖను గానీ, సెల్‌ఫోన్‌ను గానీ పోలీసులకు ఎందుకు స్వాధీనం చేయలేదు? మధ్యాహ్నం సునీత, నర్రెడ్డి వచ్చేంత వరకూ తన దగ్గరే ఎందుకు ఉంచుకున్నాడు? లేఖ విషయం తెలిస్తే ఆయన హత్య విషయం అక్కడికి వచ్చిన వారికీ, పోలీసులకూ తెలిసి ఉండేది. మృతదేహాన్ని ఎవరూ ముట్టుకొని ఉండేవారు కాదు. ఫింగర్‌ ప్రింట్స్‌ వంటి ఆధారాలు చెక్కు చెదరకుండా ఉండేవి. 3) వివేకా పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డి (అల్లుడి అన్న) ఫోన్‌ చేసి చెప్పడంతో వివేకా అనుచరుడు ఇనాయతుల్లా అక్కడికి వెళ్లి మృతదేహాన్ని ఫోటోలు, వీడియో తీసి ఆయన వాట్సాప్‌ ద్వారా పంపించారు.

అవి చూసిన తర్వాత కూడా శివప్రకాశ్‌రెడ్డి అప్పటి టీడీపీ మంత్రి ఆదినారా యణరెడ్డికి ఫోన్‌ చేసి వివేకా గుండెపోటుతో మరణించారని చెప్పారు. గుండెపోటు థియరీని ఎవరు ప్రచారంలో పెట్టినట్టు? పైగా వివేకాకు రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి ఆది నారాయణరెడ్డికి ఎందుకు ఫోన్‌ చేసి చెప్పినట్టు? 4) సునీత, రాజశేఖరరెడ్డి మధ్యాహ్నానికి పులివెందుల చేరుకున్నారు. కృష్ణారెడ్డి దగ్గరున్న లేఖను, సెల్‌ఫోన్‌ను తీసుకున్నారు. అనంతరం సాయంత్రం దాకా తమ దగ్గరే ఎందుకు ఉంచు కున్నారు? పోలీసులకు స్వాధీనం చేసే లోపల ఏయే మెసేజ్‌లను డిలీట్‌ చేశారు. వాటిలో కొన్ని మెసేజిలను ‘సిట్‌’ పోలీసులు టెలికామ్‌ కంపెనీ ద్వారా తెలుసుకున్నారు. హత్యకు కొన్ని గంటల ముందు కూడా ఒక మహిళ నుంచి మెసేజిలు వచ్చా యని వెల్లడైంది.

5) మృతదేహం దగ్గరున్న రక్తపు మరకలను వివేకా పెద్దబావమరిది శివప్రసాద్‌రెడ్డి ఆదేశాల మేరకే తుడి చేశానని నిందితుడు ఎర్ర గంగిరెడ్డి పోలీసులకు చెప్పారు. రక్తపు మరకలను తుడిచేయాలని శివప్రసాద్‌రెడ్డి ఎందుకు భావిం చాడు? 6) హత్య తర్వాత చాలారోజుల వరకు వివేకా కుమార్తె సునీత తమ కుటుంబ సభ్యులపై ఎటువంటి ఆరోపణలూ చేయలేదు. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలనీ, అవినాశ్‌ను ఎంపీ చేయాలనీ చివరివరకూ తన తండ్రి పనిచేశారని చెప్పారు. కానీ ఇప్పుడు ఆమె ఎందుకు మాట మార్చారు? మొదట టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ ఆమె, ఇప్పుడెందుకు వారితో సఖ్యంగా ఉంటున్నారు? టీడీపీ, చంద్రబాబునాయుడు చేస్తున్న వాదననే ఇప్పుడామె ఎందుకు వల్లె వేస్తున్నారు? ప్రస్తుతానికి ఇవన్నీ శేషప్రశ్నలే!

ఇక రాజధాని విషయంలో హైకోర్టు వెలువరించిన తీర్పుపై కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధానిపై నిర్ణయం కేంద్రానిదేననీ, అసెంబ్లీకి అధికారం లేదనీ చెప్పడం ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్ధమైన తీర్పు. అమరావతిని రాజధానిగా నిర్ణయించింది చంద్రబాబు ప్రభుత్వమే. దానికి ప్రాతిపదిక తాను నియమించుకున్న నారాయణ కమిటీయే తప్ప కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ కాదు. ప్రభుత్వాలు చట్టాలు చేయకుండా ఎలా నిరోధిస్తామని తొలుత పిటిషనర్లను ప్రశ్నించిన ధర్మాసనం తీరా అందుకు భిన్నమైన తీర్పును వెలువరించింది. చేతిలో నాలుగేళ్ల సమయం ఉన్నా రాజధాని ప్రాజెక్టును పట్టాలెక్కించడం బాబు ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. ఇప్పుడు దాన్ని ఆరు నెలల్లో పూర్తిచేయాలనీ, నెల రోజుల్లో మౌలిక సదుపాయాల కల్పన పూర్తవ్వాలనీ చెప్పడం ఎంతవరకు సమంజసమనే అభిప్రాయాలు వెల్లడ వుతున్నాయి.

ప్రభుత్వం అమలుచేసే సంక్షేమ పథకాలకూ, రాజధాని ప్రాజెక్టుకూ ముడిపెట్టి సంక్షేమాన్ని స్వప్రయోజనం కోసం చేసే వ్యయమన్న భావన కలిగించడం కూడా ఉచితంగా లేదు. అమలవుతున్న చట్టాలపై విచారణ జరిగే సందర్భంలో ప్రభుత్వాలు వాటిని రద్దుచేస్తున్నట్టు ప్రకటిస్తే పిటిషన్లను మూసివేస్తున్నట్టు ప్రకటించడం న్యాయస్థానాలకు రివాజు. కానీ ఇక్కడెందుకో అలా జరగలేదు. ల్యాండ్‌ పూలింగ్‌ కింద ఇచ్చి నంత మాత్రాన రైతులకు హామీ ఇచ్చినట్టు అక్కడ రాజధాని నిర్మించి తీరాలనడం, భూముల్ని ఇతర ప్రయోజనాలకు వినియోగించకూడదని అనడం సరికాదు. ఆ ప్రాజెక్టు అమలు చేయదల్చుకోనప్పుడు భూమిని మళ్లీ రైతులకు ఇవ్వమనడం వరకూ సబబు. ఆర్థిక కారణాలతో ప్రాజెక్టులు ఆపవద్దనడం, ఆర్థిక ఇబ్బందులకు సంబంధిం చిన ఆధారాలు ఇవ్వలేదు గనుక రాజధానిని పూర్తి చేసి తీరాలనడం పాలనా వ్యవహారాల్లో వేలు పెట్టడమే! హైకోర్టులు అనవసర వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని నిరుడు ఏప్రిల్‌లో సుప్రీంకోర్టులోని జస్టిస్‌ డీవై చంద్రచూడ్, ఎల్‌. నాగేశ్వరరావు, రవీంద్ర భట్‌ల ధర్మాసనం చెప్పింది. కరోనా కట్టడిలో ప్రభుత్వాల తీరును తప్పుబడుతూ మద్రాస్‌ హైకోర్టు, ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై ఈ తీర్పునిచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం మీద తెలుగుదేశం పార్టీ, దాని ఆధ్వ ర్యంలో పనిచేసే నానాజాతి సమితి సభ్యులు చేస్తున్న యుద్ధంలో ఇప్పుడీ రెండు కొత్త శస్త్రాలు వాటి చేతికి దొరికాయి. రష్యా వాళ్లయినా అప్పుడప్పుడు తాత్కాలిక యుద్ధ విరామం ప్రకటిస్తున్నారు గానీ, ఎన్నికలయ్యేంతవరకూ ఈ నానాజాతి సమితి తన యుద్ధాన్ని ఆపేలా లేదు. రాజకీయంగా ఈ యుద్ధం జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన ప్రభుత్వం మీదనే కావచ్చు. కానీ అంతస్సారంలో ఇది ఒక సామాజిక విధ్వంస యుద్ధం. సాధికారత కోసం ఎదురు చూస్తున్న కష్టజీవుల మీద యుద్ధం. యుగయుగాల అణచివేతకు గురైన మహిళల హక్కుల మీద యుద్ధం. సామాజిక న్యాయ పోరాటాల మీద యుద్ధం. పేద వర్గాల ఆకాంక్షల మీద యుద్ధం. పేద లోగిళ్లలో మొగ్గ తొడుగుతున్న ఉన్నత చదువుల లక్ష్యాలను మొగ్గలోనే తుంచేసే అమానుష యుద్ధం. పూమొగ్గలను తుంచి తొక్కేసే మనుషుల్ని ఆ పువ్వులేమని శపిస్తాయో ‘పుష్పవిలాపం’ కావ్యంలో ‘కరుణశ్రీ’ జంధ్యాల పాపయ్యశాస్త్రి చెప్పారు. ‘‘బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమో! అందమును హత్యచేసే హంతకుండ, మైలపడిపోయెనోయి! నీ మనుజ జన్మ!’’

వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు