ఆ కళ్లలో వాటర్‌లూ..! 

21 Nov, 2021 00:44 IST|Sakshi

జనతంత్రం

బాబు ఏడ్చారు. మీడియా సమావేశం పెట్టి మరీ పబ్లిగ్గా రోదించారు. కన్ను తడిచిందా? కన్నీరు కనిపించిందా వంటి సందేహాలు అనవసరం. గుండె తడిగా ఉంటేనే కన్ను తడిచే అవకాశం ఉంటుంది. ఆర్ద్రత ఉంటేనే అది ఉబికి కనురెప్పల మత్తడి దూకుతుంది. అందువలన తడి కనిపించినా కనిపించక పోయినా ఆయన కన్నీరు పెట్టుకున్నట్టే లెక్క. అతడనేక యుద్ధ ముల ఆరియుతేరినటువంటి వృద్ధ నాయకుడు. నాలుగున్నర దశాబ్దాల అనుభవంలో ఏడిపించుటయే గానీ, ఏడ్చుట ఎరుగని రాజకీయ చతురుడు. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు ఏడ్చారు? ‘గుండె మంటలారిపే చన్నీళ్ళు కన్నీళ్ళు’ అంటారు ఆత్రేయ. తన గుండెల్లో రగులుతున్న మంటలను చల్లార్చుకునే ప్రయత్నంలో కన్నీరు కార్చారా? శుక్రవారం నాడు అసెంబ్లీలో జరిగిన మాటల యుద్ధమే ఆయన కన్నీళ్లకు కారణమని తెలుగు దేశం వారు చెబుతున్నారు. తన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలే బాధించాయని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు. కానీ జాగ్రత్తగా విశ్లేషిస్తే ఈ వాదనలో సత్తా కనిపించడం లేదు. ఇంకేదో కారణం ఉందన్న అభిప్రాయం కలుగుతున్నది.

శుక్రవారం నాటి ఏపీ అసెంబ్లీ పరిణామాలనే తీసు కుందాం. సభలో అల్లరి చేసి, ఆ తర్వాత ఈ సెషన్‌ మొత్తాన్ని బహిష్కరించాలనే ముందస్తు వ్యూహంతోనే ఆ పార్టీ శాసన సభాపక్షం వ్యవహరించిందని విశ్వసనీయ సమాచారం ఉన్నది. ఆ వ్యూహానికి అనుగుణంగానే టీడీపీ సభ్యుల ప్రవర్తన కూడా ఉన్నది. స్వయానా ప్రతిపక్ష నేతే ముఖ్యమంత్రి కుటుంబ సభ్యు లను ప్రస్తావిస్తూ మాట్లాడారు. ‘బాబాయ్‌ – గొడ్డలి, తల్లికి మోసం, చెల్లికి మోసం’పై చర్చిద్దామంటూ ఆయనే నిప్పు రాజే శారు. తెలుగుదేశం పార్టీ బృందం దాన్నే రన్నింగ్‌ కామెంట్రీగా అందుకొని ఆజ్యం పోసింది. ఆ సమయంలో ముఖ్యమంత్రి సభలో లేరు. దక్షిణ జిల్లాల్లో ఏర్పడిన వరద పరిస్థితిపై అధికారు లతో సమీక్షిస్తూ సహాయ చర్యలను నిర్దేశిస్తున్నారు. రైతుల సమస్యలపై మాట్లాడుతున్న మంత్రికి పదేపదే తెలుగుదేశం సభ్యులు అడ్డు తగిలారు. ముఖ్యమంత్రి కుటుంబాన్ని టార్గెట్‌ చేయడం పైనే దృష్టి పెట్టి దాడికి దిగారు. ఈ దాడికి స్వయానా ప్రతిపక్ష నేత నాయకత్వం వహించారు. అసెంబ్లీ రికార్డుల సాక్షిగా ఇది సత్యం.

తెలుగుదేశం పార్టీ దాడిని సహజంగానే పాలకపక్షం కౌంటర్‌ చేసింది. మీరు అడిగేవాటితో పాటు, మరిన్ని విషయా లను చర్చిద్దామని సవాల్‌ చేసింది. రంగా హత్యోదంతం, మాధవరెడ్డి విషయం కూడా మాట్లాడదామని అంబటి రాంబాబు అన్నారు. మాధవరెడ్డి ప్రస్తావనతో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన సమయంలో కీలకపాత్ర పోషించిన నేతల్లో మాధవరెడ్డి ఒకరు. చంద్రబాబు కేబినెట్లో హోం మంత్రిగా నెంబర్‌ టూగా చెలామణి అయ్యారు. ఒక బలమైన సామాజిక వర్గం నాయకుడైనందువల్ల భవిష్యత్తులో తన పదవికి ఆయన నుంచి ముప్పు ఉంటుందనే అభద్రతాభావం చంద్రబాబుకు ఉన్నదని అప్పట్లో ఒక ప్రచారం ఉండేది.

కేవలం ప్రచారం మాత్రమే కావచ్చు. రాజకీయ ప్రత్య ర్థుల సృష్టి కూడా కావచ్చు. కానీ, ఆ ప్రచారం ఉన్న మాట వాస్తవం. ఆ సమయంలోనే మాధవరెడ్డి హత్య జరిగింది. దీంతో ఈ ప్రచారం మరోసారి షికారు చేసింది. వైయస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను ప్రస్తావిస్తూ ‘బాబాయ్‌–గొడ్డలి’ వ్యాఖ్యలు తెలుగుదేశం సభ్యులు చేసినప్పుడు ప్రతిగా రంగా, మాధవరెడ్డిల పేర్లను రాంబాబు ప్రస్తావించారు. టీవీలో అసెంబ్లీ సమావేశాలు తిలకించిన వారికి అర్థమైన విషయం ఇది. అసెంబ్లీ రికార్డులు పరిశీలించినా కూడా ఇదే విషయం స్పష్టమవుతున్నది. ముఖ్య మంత్రి సైతం ఈ మేరకు సభలో ఒక స్పష్టమైన ప్రకటన కూడా చేశారు.

అధికార సభ్యుల రన్నింగ్‌ కామెంటరీలో భాగంగా ఒక సభ్యుడు గౌరవ ప్రతిపక్ష నేత సతీమణిని ఉద్దేశించి మాట్లాడా రని టీడీపీ సభ్యుడు బుచ్చయ్య చౌదరి ఒక టీవీ చర్చా వేదికలో చెప్పారు. అదే వేదికగా ఆ ఆరోపణలను సదరు సభ్యుడు తీవ్రంగా ఖండించారు. తాను ఆ ప్రస్తావనే తేలేదని ఆ సభ్యుడు ఘంటాపథంగా చెప్పారు. గౌరవ మహిళను కించపరిచే విధంగా ఎవరూ మాట్లాడిన దాఖలా కూడా నిన్నటి అసెంబ్లీ ప్రొసీ డింగ్స్‌లో కనిపించలేదు. ఎందుకు ఈరకమైన ప్రచారం ముందుకు వచ్చిందో, చంద్రబాబు ఎందుకు అంత విపరీతంగా స్పందించారో తెలియవలసి ఉన్నది. మహిళా సాధికారత విష యంలో ఈ దేశంలో ఇంతవరకు యూనియన్‌ ప్రభుత్వం గానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం గానీ చేయనంత కృషిని ఆంధ్రప్రదేశ్‌లో వైయస్‌ జగన్‌ ప్రభుత్వం చేసింది. మహిళలకు 50 శాతం పద వుల దిశగా అడుగులు వేస్తున్నది. అటువంటి ప్రభుత్వం ఒక గౌరవ మహిళపై అనుచిత వ్యాఖ్యలను ఉపేక్షిస్తుందని అను కోవడం కేవలం అవివేకం అవుతుంది. 

చంద్రబాబు కంట తడి తర్వాత అనేక పాత విషయాలు సోషల్‌ మీడియా వేదికగా ముందుకొస్తున్నాయి. చంద్రబాబుకు తన కూతురునిచ్చి వివాహం చేసి, ఆయన రాజకీయ జీవితానికి రాచబాట వేసిన తెలుగు ప్రజల ప్రియతమ నాయకుడు నంద మూరి తారక రామారావు కన్నీరు పెట్టుకున్న సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు. 1995 ఆగస్టు 27వ తేదీన సరిగ్గా మీడియా సమావేశంలోనే ఆయన కన్నీరు కార్చారు. ‘‘నేను నా జీవితంలో ఏనాడూ కంటతడి పెట్ట లేదు. ఎన్ని కష్టాలు – నష్టాలు ఎదురైనా, ఆప దలు ముంచుకొచ్చినా బేలగా ఏడవలేదు. కానీ ఈ రోజున 74 ఏళ్ల వయసులో నా అనుకున్న వాళ్లు, నా వాళ్ళు మోసానికి దిగితే, వెన్నుపోటు పొడిస్తే తట్టుకోలేకపోతున్నాను’’ అంటూ విలపించారు. ఎన్టీఆర్‌ ప్రెస్‌మీట్‌కు సంబంధించిన పేపర్‌ కటిం గ్స్‌ను విస్తృతంగా షేర్‌ చేస్తున్నారు. వృద్ధాప్యంలో చేదోడు కోసం ఎన్టీఆర్‌ వివాహం చేసుకున్న లక్ష్మీపార్వతి చంద్రబాబుకు అత్త గారు. ఆమెపై చంద్రబాబు ఎంత నీచ ప్రచారాన్ని చేయించా రన్న అంశంపై కూడా చర్చ జరుగుతున్నది.

చంద్రబాబు నేతృత్వంలో వైఎస్‌ జగన్‌పై, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన కుట్రలను, విషప్రచారాలను కూడా ప్రజలు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్‌తో కుమ్మ క్కయి వైఎస్‌ జగన్‌పై తప్పుడు కేసులు బనాయించి కుట్రపూరిత వ్యవహారాలు నడిపి, ఆయనను పదహారు నెలలు జైలుపాలు చేసిన సంగతిపై ఇప్పుడు మళ్లీ జనం మాట్లాడుతున్నారు. సోషల్‌ మీడియాలో కాదు. పత్రికలూ, టీవీ చానెళ్ల ద్వారానే (ఎల్లో మీడియా) వైఎస్‌ జగన్‌పై జరిగిన వ్యక్తిత్వ హనన దాడి ఈ దేశ చరిత్రలో నభూతో నభవిష్యతి! పత్రికా ప్రమాణాలను, సంప్రదాయాలను, కట్టుబాట్లను, మార్గదర్శకాలనూ ‘థూ... నాబొడ్డు’ ప్రమాణంగా నేలకేసి కొట్టి వైఎస్‌ జగన్‌ను ఒక నేరస్థుడిగా చిత్రించడం కోసం పడిన ప్రయాస వెనుక ఉన్న సూత్రధారిపై కూడా ప్రజలు మరోసారి మాట్లాడుతున్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ఫ్యాక్షనిస్టు ముద్ర వేయ డానికి చేయని ప్రయత్నం లేదు. 

మాస్‌ ఇమేజ్‌ ఉన్న వైఎస్‌ఆర్‌తో ప్రత్యక్షంగా ఎన్నికల్లో తలపడటం కష్టం అనే ఉద్దేశంతో నిత్యం మంత్రులు, నాయకుల చేత ప్రెస్‌మీట్లు పెట్టించి మరీ ఆరోపణలు చేయించేవారు. ఆరోపణలు చేయ డానికి రెడ్డి సామాజికవర్గం నేతలనే ఎంపిక చేసుకునే వారు. ప్రెస్‌మీట్లకు కూడా కులస్పృహను జోడించిన తొలి నాయకుడు చంద్రబాబు. అప్పట్లోనే వైఎస్‌ఆర్‌ను వేధించడం కోసం ధర్మ వరం సూట్‌కేసు బాంబు కేసులో జగన్‌మోహన్‌రెడ్డిని ఇరికించ డానికి చేయని ప్రయత్నం లేదు. నిండా ముప్పయ్యేళ్ల వయసు కూడా లేని జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి దూరంగా వ్యాపారం చేసుకుంటున్న సందర్భం అది. అ«ధికార బలంతో గతంలో చంద్రబాబు ప్రత్యర్థుల కుటుంబాలను వెంటాడి వేటాడిన జ్ఞాప కాలను ఇప్పుడు జనం నెమరువేసుకుంటున్నారు.  

వైఎస్‌ షర్మిల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా సరిగ్గా ఎన్నికల సమయంలోనే తెలుగుదేశం అనుకూల వెబ్‌సైట్ల ద్వారా జరిగిన దుష్ప్రచారాన్ని కూడా ప్రజలు ఇప్పుడు ఉదాహరిస్తున్నారు. ఆమెపై జరిగిన ప్రచారాన్ని పోలీసులు శోధించినప్పుడు నంద మూరి బాలకృష్ణ ఇంటి అడ్రస్‌ వైపే చూపుడు వేలు మళ్లింది. అదే బాలకృష్ణ ఆధ్వ ర్యంలో శనివారం నాడు నందమూరి కుటుంబ సభ్యుల ఉమ్మడి ప్రెస్‌మీట్‌ ఏర్పాటైంది. తమ సోదరి మీద జరుగుతున్న ప్రచా రాన్ని ఇంకెంత మాత్రమూ సహించబోమని వారు హెచ్చరిం చారు. నిజమే, ఎంతమాత్రమూ సహించకూడదు. ఆమె పేరును పబ్లిగ్గా బయటకీడ్చి ప్రచారం చేసిన వ్యక్తిని గుర్తించి దోషిగా నిలబెట్టాలి. ఎన్టీ రామారావు కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలో కూడా కుటుంబ సభ్యులలో ఇదే విధంగా తండ్రికి వ్యతిరేకంగా ప్రెస్‌మీట్‌ పెట్టించారు. ఇప్పుడూ అదే వ్యూహం కనబడిందని సోషల్‌ మీడియా విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

అప్పుడాయన వేధించారు కనుక, ఇప్పుడాయనను వేధిం చాలని ఎవరూ అనడం లేదు. అది భావ్యం కూడా కాదు. ‘ఒక్క వేలు చూపి ఒరులను నిందించ, వెక్కిరించు నిన్ను మూడువేళ్లు’ అనే నీతి సూత్రాన్ని ఇప్పుడాయనకు గుర్తు చేస్తున్నారు. చంద్ర బాబు ఆరోపిస్తున్నట్టు వారి సతీమణిపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినట్లయితే అది కచ్చితంగా క్షమార్హం కాని విష యమే! కానీ, శుక్రవారం నాటి అసెంబ్లీలో ఎవరూ అలా మాట్లా డినట్టు ఎటువంటి రుజువూ లేదు. మరి ఈ సీనియర్‌ రాజకీయ వేత్త ఎందుకు షాడో బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగినట్టు? రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించేవారికి చంద్రబాబు ప్రస్తుత పరిస్థితిపై ఇప్పటికే ఒక స్పష్టత ఏర్పడింది. ఆయన ఆవేదన నిజం. నిర్వేదం నిజం. గుండె మంట నిజం. దుఃఖం నిజం. అది తన రాజకీయ భవిష్యత్తు, తన కుమారుని రాజకీయ భవిష్యత్తు, తన పార్టీ భవిష్యత్తుకు సంబంధించిన విషయం. తన రాజకీయ ప్రత్యర్థి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పరిపాలన ప్రజాదరణ పొందింది. 

రెండున్నరేళ్ల లోనే ప్రభుత్వాన్ని ప్రజల గుమ్మం దగ్గరకు ఆయన చేర్చగలి గారు. విద్య, వైద్యం, వ్యవ సాయ రంగాల్లోనూ – మహిళలూ, బలహీనవర్గాల సాధికారత లోనూ విప్లవాత్మక సంస్కరణలను ఆయన ప్రవేశపెట్టారు. ఫలితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ 55 శాతానికి తగ్గని ఓటు బ్యాంకు ఇప్పటికే ఆయనకు స్థిరపడి పోయింది. మరోపక్క టీడీపీ ఓటు బ్యాంకు 30 శాతానికి పడిపోయింది. స్థానిక సంస్థ లకు జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సాధించిన విజయాల రికార్డు రాష్ట్ర చరిత్రలో కనీవినీ ఎరుగనటువంటిది.

రాజ్యాంగ సంస్కరణల అనంతరం ఇప్పుడున్న పద్ధతిలో ఐదు సార్లు స్థానిక ఎన్నికలు జరిగాయి. అంతకు ముందు మరో ఐదు సార్లు జరిగాయి. ఈ పది ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ సాధించిన విజయాల శాతం ఏ పార్టీ సాధించలేదు. ఈ ఎన్నికల్లో నూటికి నూరుశాతం మునిసిపల్‌ కార్పొరేషన్లను, 96 శాతం మునిసి పాలిటీలను ఆ పార్టీ గెలిచింది. రెండు మునిసిపాలిటీలను మాత్రమే (తాడిపత్రి, దర్శి) టీడీపీ గెలిచింది. ఈ రెండుచోట్ల కూడా టీడీపీకి వార్డులు ఎక్కువ వచ్చినా పాపులర్‌ ఓటు వైసీపీకే ఎక్కువగా నమోదైంది. ‘టై’గా మిగిలిన కొండపల్లిలో కూడా పాపులర్‌ ఓటు వైసీపీకే ఎక్కువ. నూటికి నూరుశాతం జిల్లా పరిషత్‌ పీఠాలు, 98 శాతం జడ్‌పీటీసీ స్థానాలు, 86 శాతం ఎంపీటీసీ స్థానాలు వైఎస్సార్‌సీపీ ఖాతాలో పడ్డాయి. పార్టీ ప్రాతిపదికపై జరగని సర్పంచ్‌ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు 90 శాతం గ్రామాల్లో గెలిచారు.

ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగన్‌ మోహన్‌రెడ్డిని ఓడించడం సాధ్యం కాదన్న విషయం అనుభవ జ్ఞుడైన చంద్రబాబుకు సులభంగానే అర్థమవుతున్నది. రెండు పార్టీల మధ్య 20 శాతానికి పైగా ఏర్పడిన అగాథం ఇప్పుడ ప్పుడే పూడ్చడం సాధ్యం కాదు. చివరికి మూడు దశాబ్దాలకు పైగా ప్రాతినిధ్యం వహిస్తున్న ‘కుప్పం అవమానం’ ఆయన్ను తీవ్రంగా క్రుంగదీసి ఉంటుంది. అక్కడ జరిగిన సర్పంచ్, ఎంపీటీసీ, జడ్‌పీటీసీ, మునిసిపల్‌ ఎన్నికల్లో టీడీపీ సంపూర్ణ పరాజయాన్ని మూటగట్టుకున్నది. 2024 ఎన్నికల్లో తనకు సురక్షిత స్థావరం కూడా మిగల్లేదు. ఇప్పటికే వయోభారం మీద పడు తున్నది. 2029 ఎన్నికల నాటికి ఆయన వయసు 80 ఏళ్లకు చేరుకుంటుంది. వారసుడు ఇంకా తన సమర్థతను నిరూపించు కోలేదు. రాజకీయ చిత్రం ముగింపు దశకు చేరుకుంటున్నది. ఆర్థికంగా కూడా అమరావతి మీద ఆయనకు చాలా ఎక్కువ స్టేక్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. కుప్పం ఫలితం ఆయన ఆశలను పూర్తిగా హరింపజేసింది. ఐరోపా ఖండమంతటా జైత్రయాత్రలు నడిపిన నెపోలియన్‌ ఒక్క వాటర్‌లూ యుద్ధంతో కుప్పకూలిపోయాడు. కుప్పంలో చంద్రబాబుకు తన వాటర్‌లూ కనిపిస్తున్నది. ఆయన కళ్లలోనూ అదే కనిపించింది.


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

మరిన్ని వార్తలు