మితి మీరితే... మరో ప్రమాదం!

25 Apr, 2023 00:01 IST|Sakshi

పవిత్ర చార్‌ధామ్‌ యాత్ర ఎప్పటి లానే ఈ ఏడూ మొదలైంది. అక్షయ తృతీయ వేళ గంగోత్రి, యమునోత్రి ఆలయాలు తెరుచుకున్నాయి. ఏప్రిల్‌ 25న కేదార్‌నాథ్, 27న బదరీనాథ్‌ తెరిచేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. మొదలవుతూనే ఈ యాత్ర అనేక ప్రశ్నలనూ మెదిలేలా చేసింది. హిమాలయ పర్వతాల్లో కఠోర వాతావరణ పరిస్థితుల మధ్య సాగే ఈ యాత్రలో కొండచరియలు విరిగిపడి బదరీనాథ్‌ హైవే తాజాగా మూసుకుపోవడం పొంచివున్న ప్రమాదాలకు ముందస్తు హెచ్చరిక.

యమునోత్రి ప్రయాణంలో తొలిరోజే ఇద్దరు గుండె ఆగి మరణించడం యాత్రికుల శారీరక దృఢత్వానికి సంబంధించి అధికారుల ముందస్తు తనిఖీ ప్రక్రియపై అనుమానాలు రేపుతోంది. ఇప్పటికే 16 లక్షల మందికి పైగా యాత్రకు పేర్లు నమోదు చేసుకున్న వేళ... రానున్న కొద్ది వారాల్లో ఈ పర్వత ప్రాంత గ్రామాలు, పట్నాల మీదుగా ప్రయాణంపై భయాందోళనలు రేగుతున్నాయి. 

‘దేవభూమి’ ఉత్తరాఖండ్‌ అనేక హిందూ దేవాలయాలకు ఆలవాలం. చార్‌ధామ్‌గా ప్రసిద్ధమైన యమునోత్రి, గంగోత్రి, కేదారనాథ్, బదరీనాథ్‌లు ఇక్కడివే. ఇన్ని ఆలయాలు, ప్రకృతి అందాలకు నెలవైన ఉత్తరాఖండ్‌కు ఆర్థిక పురోభివృద్ధి మంత్రాల్లో ఒకటి – పర్యాటకం. అయితే, అదే సమయంలో హిమాలయాల ఒడిలోని ఈ ప్రాంతం పర్యావరణపరంగా అతి సున్నిత ప్రాంతం. ఈ సంగతి తెలిసినా, పర్యావరణ నిపుణులు పదేపదే హెచ్చరిస్తున్నా పాలకులు పెడచెవిన పెడుతూనే ఉన్నారు.

ఉత్పాతాలనూ లెక్క చేయకుండా, చార్‌ధామ్‌ ప్రాంతాలను వ్యాపారమయం చేసి, భరించలేనంతగా యాత్రికుల్ని అనుమతిస్తున్నారు. హిమాలయాల్లో పద్ధతీ పాడూ లేక ఇష్టారాజ్యంగా చేపడుతున్న సోకాల్డ్‌ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, అనియంత్రిత పర్యాటకం కలగలసి మానవ తప్పిదంగా మారాయి. ఈ స్వయంకృతాపరాధాలతో వాతావరణ మార్పులకు మంచుదిబ్బలు విరిగిపడుతున్నాయి. జోషీ మఠ్‌ లాంటి చోట్ల జనవరిలో భూమి కుంగి, ఇళ్ళన్నీ బీటలు వారి మొదటికే మోసం రావడం తెలిసిందే!

నియంత్రణ లేని విపరీత స్థాయి పర్యాటకం ఎప్పుడైనా, ఎక్కడైనా మోయలేని భారం. విషాదమేమంటే, ప్రాకృతిక సంపదైన హిమాలయాలను మన పాలకులు, ప్రభుత్వాలు ప్రధాన ఆర్థిక వనరుగా చూస్తుండడం, వాటిని యథేచ్ఛగా కొల్లగొట్టడం! అభివృద్ధి, పర్యాటక అనుభవం పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఉండడం! కనీసం ఆ ప్రాంతాలు ఏ మేరకు సందర్శకుల తాకిడిని తట్టుకోగలవనే మదింపు కూడా ఎన్నడూ మనవాళ్ళు చేయనేలేదు.

బదరీనాథ్, కేదార్‌నాథ్‌లు తట్టుకోగలవని పర్యావరణ నిపుణులు అంచనా వేసిన రద్దీ కన్నా రెండు, మూడింతలు ఎక్కువగా, దాదాపు 15 వేల మందికి పైగా జనాన్ని నిరుడు ప్రభుత్వం అనుమతించడం విచిత్రం. ఒక్క గడచిన 2022లోనే ఏకంగా కోటి మంది పర్యాటకులు ఉత్తరాఖండ్‌ను సందర్శించినట్టు లెక్క. కేవలం చార్‌ధామ్‌ యాత్రాకాలంలోనే రికార్డు స్థాయిలో 46 లక్షల మంది వచ్చారు. ఈ ఏడాది ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా. ఈ పరిస్థితుల్లో రోజుకు అనుమతించాల్సిన యాత్రికుల సంఖ్యపై పరిమితిని ఎత్తేస్తూ ప్రభుత్వం నిర్ణయించడం ఏ రకంగా సమర్థనీయం! 

నిజానికి ‘జాతీయ విపత్తు నివారణ సంస్థ’ (ఎన్డీఎంఏ) 2020 నాటి నివేదికలోనే భారత హిమా లయ ప్రాంతం ఎదుర్కొంటున్న పర్యావరణ సవాళ్ళను ఏకరవు పెట్టింది. పర్యాటకం, పట్టణ ప్రాంతాలకు వలసల వల్ల పట్నాల మొదలు గ్రామాల వరకు తమ శక్తికి మించి రద్దీని మోయాల్సిన పరిస్థితి వచ్చిందని కూడా చెప్పింది.

బఫర్‌ జోన్‌ను సృష్టించడం సహా అనేక నియంత్రణ చర్యలను సిఫార్సు చేసింది. మంచుదిబ్బలు విరిగిపడి, వరదలకు కారణమయ్యే ప్రాంతాల్లో పర్యాటకాన్ని నియంత్రించాలనీ, తద్వారా కాలుష్యస్థాయిని తగ్గించాలనీ సూచించింది. పాలకులు వాటిని వినకపోగా, ఏటేటా ఇంకా ఇంకా ఎక్కువ మందిని యాత్రకు అనుమతిస్తూ ఉండడం విడ్డూరం. 

జోషీమఠ్‌లో విషాదం ఇప్పటికీ బాధిస్తూనే ఉంది. బీటలు వారిన అనేక ఇళ్ళు కూల్చివేయక తప్పలేదు. గూడు చెదిరి, ఉపాధి పోయి వీధినపడ్డ వారికి ఇంకా పరిహారం అందనే లేదు. తాత్కాలిక శిబిరాల్లోనే తలదాచుకుంటున్న దుఃస్థితి. ఈ పరిస్థితుల్లో గత వారం కూడా కొత్తగా కొన్ని ఇళ్ళు బీటలు వారాయన్న వార్త ప్రకృతి ప్రకోపాన్ని చెబుతోంది. సిక్కు పర్యాటక కేంద్రం హేమ్‌కుండ్‌ సాహిబ్‌కూ, చార్‌ధామ్‌ యాత్రలో బదరీనాథ్‌కూ సింహద్వారం ఈ జోషీమఠే.

పరిస్థితి తెలిసీ ఈసారి పర్యాటకుల సంఖ్య రికార్డులన్నీ తిరగరాసేలా ఉంటుందని రాష్ట్ర సీఎం ప్రకటిస్తున్నారు. జోషీమఠ్‌, ఔలీ ప్రాంతాలు అన్ని రకాలుగా సురక్షిత ప్రాంతాలని ప్రచారం చేసేందుకు తపిస్తున్నారు. ప్రమాదభరితంగా మారిన ఆ కొండవాలు ప్రాంతాల్లో తాత్కాలిక నిర్మాణాలు చేసి, విపరీతంగా వాహనాలను అనుమతించడం చెలగాటమే. కనుక తొందరపాటు వదిలి, తగిన జాగ్రత్తలు చేపట్టాలి. 

హిందువులకు జీవితకాల వాంఛల్లో ఒకటైన ఈ యాత్ర ప్రభుత్వానికీ, స్థానిక ఆర్థిక వ్యవస్థకూ బోలెడంత డబ్బు తెచ్చిపెట్టవచ్చు గాక. ధర్మవ్యాప్తిలో ముందున్నామని పాలక పార్టీలు జబ్బలు చరుచుకొనేందుకూ ఇది భలేఛాన్స్‌ కావచ్చు గాక. జలవిద్యుత్కేంద్రాలు సహా విధ్వంసకర అభివృద్ధితో ఇప్పటికే కుప్పకూలేలా ఉన్న పర్యావరణ వ్యవస్థపై అతిగా ఒత్తిడి తెస్తే మాత్రం ఉత్పాతాలు తప్పవు.

మొన్నటికి మొన్న 2013లో 5 వేల మరణాలకు కారణమైన కేదారనాథ్‌ వరదల్ని విస్మరిస్తే ఎలా? పర్యావరణం పట్ల మనం చేస్తున్న ఈ పాపం పెను శాపంగా మారక ముందే కళ్ళు తెరిస్తే మంచిది. హిమాలయ పర్వత సానువులు అనేకులకు అతి పవిత్రమైనవీ, అమూల్యమైనవీ గనక వాటిని పరిరక్షించడం మరింత ఎక్కువ అవసరం. అందుకు దీర్ఘకాలిక ప్రణాళికా రచన తక్షణ కర్తవ్యం.  

మరిన్ని వార్తలు