CDS India: ఆచితూచి అడుగేయాలి!

10 Jun, 2022 01:35 IST|Sakshi

ఎట్టకేలకు రథం కదిలింది. దేశ రక్షణలో కీలకమైన ‘ఛీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌’ (సీడీఎస్‌) పదవిని భర్తీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాగైతేనేం ఒక అడుగు ముందుకు వేసింది. దేశంలోని ఈ ఉన్నత సైనిక పదవిని చేపట్టేందుకు అవకాశాలను విస్తృతం చేస్తూ, సరికొత్త మార్గదర్శకాలను మంగళ వారం విడుదల చేసింది. భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణించిన ఆరు నెలల తర్వాతైనా కొత్త సీడీఎస్‌ కోసం సర్కారు శ్రద్ధ పెట్టడం హర్షణీయం.

అయితే, త్రివిధ దళాలకూ, దళాధిపతులకూ మధ్య సమన్వయానికి ఉద్దేశించిన ఈ పదవికి పెట్టిన కొత్త నిబంధనలే కాస్తంత తికమక తెస్తున్నాయి. పదాతి, నౌకా, వైమానిక దళాలలో దేనికీ అధిపతిగా పదవిని చేపట్ట లేకపోయిన వారు సైతం తాజా నిబంధనలతో తమ సీనియర్లను దాటుకొని, ఆ పైన ఉండే సీడీఎస్‌ పగ్గాలు పట్టేందుకు వీలు చిక్కుతుంది. అదే ఇప్పుడు భిన్నాభిప్రాయాలకూ, చర్చకూ తావిస్తోంది. 

భారత తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్, ఆయన సతీమణి గత డిసెంబర్‌ 8న తమిళ నాడులో జరిగిన సైనిక హెలికాప్టర్‌ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. రావత్‌ సహా డజను మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన ఆ ఘటన తర్వాత నుంచి ఇన్నాళ్ళుగా మరో సీడీఎస్‌గా ఎవరినీ ప్రభుత్వం నియమించ లేదు. ఇప్పుడు కొత్త మార్గదర్శకాల ప్రకారం సర్వీసులో ఉన్న, లేదా రిటైరైన త్రివిధ దళాల ఛీఫ్‌లు, వారి వైస్‌ ఛీఫ్‌లలో ఎవరైనా సరే సీడీఎస్‌గా అర్హులే.

కాకపోతే వారి వయస్సు 62 ఏళ్ళ లోపుండాలి. అలాగే, అవసరాన్ని బట్టి సీడీఎస్‌ పదవీ కాలాన్ని గరిష్ఠంగా 65 ఏళ్ళ వయసు వరకు పొడిగించవచ్చు. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ మార్పులు చేర్పులు ప్రకటించింది. అందుకు అవసరమైన రీతిలో ఆర్మీ, నౌకాదళం, వైమానిక దళాలకు చెందిన మూడు వేర్వేరు చట్టాల కింద ఒకే రకమైన నోటిఫికేషన్లు జారీ చేసింది. 

త్రివిధ దళాధిపతులకు పెద్ద తలకాయగా, దళాలన్నీ సమన్వయంతో పనిచేసేలా చూడడం సీడీఎస్‌ బాధ్యత. సర్వసాధారణంగా త్రివిధ దళాల అధిపతులు మూడేళ్ళ వరకు, లేదంటే 62 ఏళ్ళ వయస్సు వరకే ఆ హోదాలో ఉంటారు. ఆర్మీ ఛీఫ్‌గా రిటైరైన రావత్‌ ఆపైన భారత తొలి సీడీఎస్‌గా ఉన్నత పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ రకంగా ఆయన ఆ పదవి చేపట్టేటప్పుడు, సర్వీసులో ఉన్న ఛీఫ్‌లు అందరి కన్నా వయసులోనూ, హోదాలోనూ పెద్ద.

దాంతో, ఇబ్బంది లేకుండా పోయింది. కానీ, మారిన నిబంధనలతోనే తంటా. ఇప్పుడిక నాలుగు స్టార్లుండే త్రివిధ దళాధిపతులతో పాటు, వారి కన్నా దిగువ హోదాలోని మూడు స్టార్ల అధికారులు సైతం ఒకే ఉన్నత హోదాకు పోటీ పడతారన్న మాట. ఏ కారణం వల్లనైనా దళాధిపతి కాలేక, మూడు స్టార్ల హోదాకే పరిమిత మైనవారు సైతం ఏకంగా సీడీఎస్‌ పదవి చేపట్టే ఛాన్స్‌ ఉంది.

అదే జరిగితే, త్రివిధ దళాధిపతులకు తమ దిగువ ఉద్యోగే దాదాపు బాస్‌. అందరూ సమానులే అనుకున్నా, ఎంతైనా సీడీఎస్‌ కొద్దిగా ఎక్కువ సమానం కాబట్టి, పరిస్థితి తేడాపాడాగా తయారవుతుంది. అప్పుడిక సర్వీసులోని నాలుగు స్టార్ల దళాధిపతులు ఆ నియమిత వ్యక్తికి నివేదించడం ఇబ్బందికరమే!

నిజానికి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు జాతీయ స్థాయిలో రకరకాల పేర్లతో సీడీఎస్‌ను పెట్టుకున్నాయి. పేర్లు వేరైనా, అన్నిచోట్లా విధులు దాదాపు ఒకటే. బ్రిటన్‌లో 1959లోనే ఈ నియామకం చేశారు. అయితే, ఈ సీనియర్‌ మోస్ట్‌ సైనిక హోదా మనకు కొత్త. 1999లో కార్గిల్‌ యుద్ధం తర్వాత భారత రక్షణ వ్యవస్థలోని లోటుపాట్ల అధ్యయనానికి ఆనాటి ప్రభుత్వం ఓ ఉన్నత స్థాయి కమిటీ వేసింది.

రక్షణ మంత్రికి ఏక కేంద్రక సైనిక సలహాదారుగా సీడీఎస్‌ను నియమిం చాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది. దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న ఆ సిఫార్సును మూడేళ్ళ క్రితం కేంద్రం అమలులోకి తెచ్చి, ఆర్మీ మాజీ ఛీఫ్‌ రావత్‌ను దేశ తొలి సీడీఎస్‌గా నియమించింది. రక్షణ శాఖలోని సైనికవ్యవహారాల విభాగాన్ని సీడీఎస్‌ నడుపుతారు. దశాబ్దాలుగా దేనికదిగా పని చేస్తున్న సైనిక దళాలను అనుసంధానించి, మెరుగైన సమన్వయంతో పురోగమించేలా చూస్తారు. త్రివిధ దళాలు కలసి శత్రువుపై పోరాడేలా కొత్త సైనిక కమాండ్ల ఏర్పాటు సంస్కరణలూ దీనిలో భాగమే!    

ఖండాంతర ప్రపంచ సవాళ్ళ సందర్భంగా అమెరికాలో సత్ఫలితాలిచ్చిన ఈ సీడీఎస్‌ విధానం మన సైన్యాన్ని కూడా మరింత కేంద్రీకృతంగా, ప్రభావశీలంగా తీర్చిదిద్దుతుందని రక్షణ నిపుణుల మాట. ఆ మాటకొస్తే పార్లమెంటరీ స్థాయీ సంఘమే ఒప్పుకున్న పదేళ్ళ క్రితం నాటి లోటుపాట్లతో పోలిస్తే, ఇప్పుడు మన సైనికదళాల సన్నద్ధత మెరుగైంది. సీడీఎస్‌ పదవీ సృష్టి సైతం కీలక మార్పే. అయితే, రావత్‌ మరణానంతరం కొత్త నియామకానికి ఇంత తాత్సారం చేయడం సరికాదు. ఫలితంగా, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సైనిక సంస్కరణలు ముందుకు సాగలేదు. తీరా ఇప్పుడు కొత్త మార్గదర్శకాలతో సీడీఎస్‌ హోదాయే పలుచనయ్యే ప్రమాదం వచ్చి పడింది. 

అందుకే, సర్కారు అలక్ష్యం వీడి, ఆచితూచి అడుగేయాలి. త్వరితగతిన నియామకం ఎంత అవసరమో, దేశ రక్షణ, రక్షణ దళాల ప్రయోజనాలను కాపాడేలా పర్యాలోచించి, నిర్ణయించడమూ అంతే అవసరమని గ్రహించాలి. 2018 నుంచి పెండింగ్‌లో ఉన్న జాతీయ భద్రతా వ్యూహాన్ని సైతం తొందరగా తెర పైకి తేవాలి. ప్రశ్నార్థకమయ్యే సీడీఎస్‌ నియామకాలు జరిగితే, సైన్యాన్ని సదా సర్వసన్నద్ధంగా ఉంచే అసలు లక్ష్యం పక్కకు పోతుంది. రక్షణ దళాల మధ్య సమశ్రుతి తప్పుతుంది. మన పొరుగున చైనా, పాకిస్తాన్‌ లాంటి ప్రతికూల దేశాలు పొంచివున్నాయి. తస్మాత్‌ జాగ్రత్త! 

మరిన్ని వార్తలు