చైనా సైబర్‌ పడగ!

3 Mar, 2021 01:13 IST|Sakshi

సైబర్‌ దాడుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో అపకీర్తి మూటగట్టుకున్న చైనా నిరుడు అక్టోబర్‌లో మన విద్యుత్‌ గ్రిడ్‌లపై తన ప్రతాపం చూపిందన్న కథనం సహజంగానే అందరినీ కలవరపెట్టింది. అమెరికాలోని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ వెలువరించిన కథనంపై చైనా ఆగ్రహోదగ్రం కావటం, ఆ దాడిలో మనకు ఎలాంటి నష్టమూ కలగలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించటం ఈ కథనంపై కొంత అయోమయాన్ని సృష్టించాయి. అయితే దాడి జరిగిన మాట వాస్తవం. దాని పర్యవసానంగా నిరుడు అక్టోబర్‌ 12న ముంబై విద్యుత్‌ గ్రిడ్‌ దాదాపు రెండు గంటలపాటు విఫలం కావటం, విద్యుత్‌ సరఫరా నిలిచిపోవటం, రైళ్లు ఆగిపోవటం, ఆస్పత్రుల్లో అత్యవసర చికిత్సలో వున్న వేలాదిమంది రోగులు ఇబ్బందులెదుర్కొనటం వగైరాలు నిజం. ఇది చైనా సైబర్‌ దుండగుల పని కాకపోతే ఎవరు చేసివుంటారన్నది మున్ముందు వెల్లడయ్యే అవకాశం వుంది. అయితే ఈ దాడి జరిగిన సమయం చూస్తే సహజంగానే చైనాపై అనుమానాలు తలెత్తుతాయి. అప్పటికి లద్దాఖ్‌లో భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలున్నాయి. నిరుడు మే నెలలో కల్నల్‌ సంతోష్‌బాబుతోసహా మన జవాన్లు 21మందిని చైనా సైనికులు కొట్టి చంపారు. ఆ తర్వాత మన ప్రభుత్వం భద్రతా కార ణాలరీత్యా దాదాపు వంద చైనా యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. వీటన్నిటికీ ప్రతీ కారంగానే చైనాకు చెందిన దుండగులు సైబర్‌ దాడులకు పాల్పడ్డారని, భారత్‌ను బెదిరించటమే ఈ దాడుల లక్ష్యమని ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ అనే అమెరికన్‌ సంస్థను ఉటంకిస్తూ ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం చెబుతోంది.

భూగోళంలో ఎక్కడినుంచి ఎక్కడికైనా కన్నుమూసి తెరిచేంతలో ఏ సమాచారాన్నయినా చేర్చగల సామర్థ్యం, దేన్నయినా నియంత్రించగల శక్తి సైబర్‌ ప్రపంచంలో వుంది. కానీ ఇంత వెసులుబాటులోనూ నిత్యం పెను ప్రమాదాలు పొంచివుంటాయి. దాన్ని దుర్వినియోగం చేసే చిల్లర నేరగాళ్ల సంగతలావుంచి  పకడ్బందీ భద్రత వుందనుకునే కీలక వ్యవస్థల్లోకి చొరబడగల హ్యాకర్లు కూడా వుంటారు. దాదాపు నాలుగేళ్లక్రితం ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లోని లక్షలాదిమంది వ్యక్తుల, సంస్థల కంప్యూటర్లు హ్యాక్‌ చేసిన సైబర్‌ దుండగులు వాటిల్లోని విలువైన సమాచారాన్ని గుప్పెట్లో పెట్టుకుని దాన్ని వెనక్కివ్వాలంటే బిట్‌ కాయిన్ల రూపంలో 300 డాలర్ల చొప్పున చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత దాదాపు 50,000 డాలర్లు వారికి ముట్టాయి కూడా. ఆ హ్యాకింగ్‌ వల్ల మన దేశంతోపాటు బ్రిటన్, జర్మనీ, అమెరికా, జపాన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, స్వీడన్, చైనా తదితర దేశాల్లో ఐటీ, కమ్యూనికేషన్లు, విద్యుత్, గ్యాస్‌ పంపిణీ సహా భిన్న రంగాలు స్తంభించిపోయాయి. బ్రిటన్‌లో శస్త్ర చికిత్సలు నిలిచిపోయాయి. సాధారణ రోగులకు వైద్య సలహాలివ్వటం కూడా డాక్టర్లకు అసాధ్యమైంది. నిరుడు మన వ్యవస్థలపై ఈ మాదిరి దాడే జరిగింది. డేటాలోకి దుండగులు చొరబడటంగానీ, దాన్ని దొంగిలించటం గానీ జరగలేదని కేంద్రం చెబుతోంది. అయితే ముంబై మహానగరంలో నిరుడు జరిగిన విద్యుత్‌ అంతరాయానికీ, దీనికీ సంబంధం వున్నదో లేదో చెప్పలేదు.

మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ మాత్రం సైబర్‌ విద్రోహం కారణంగానే ఈ అంతరాయం కలిగివుండొచ్చని అంటున్నారు. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ కథనం ప్రకారం చైనా మాల్‌వేర్‌ మన దేశంలోని విద్యుత్‌ సరఫరా వ్యవస్థల్లోకి చొరబడింది. అందులో హైవోల్టేజ్‌ విద్యుత్‌ పంపిణీ సబ్‌ స్టేషన్లతోపాటు, బొగ్గు ఆథారిత విద్యుదుత్పాదన కేంద్రం కూడా వుంది. ఇలా మొత్తం 12 భారతీయ సంస్థలకు చెందిన 21 ఐపీ అడ్రస్‌లపై హ్యాకర్లు దాడిచేసి వాటికి సంబంధించిన కంప్యూటర్లలోకి మాల్‌వేర్‌ను చొప్పించారంటున్నది. చైనా అధికార వ్యవస్థకు చెందిన ‘రెడ్‌ ఇకో’ ఈ నేరానికి పాల్పడిందని ఆ కథనం సారాంశం. మన దేశంలో కీలకమైన వ్యవస్థలకు సైబర్‌ దుండగులనుంచి మప్పు వాటిల్లకుండా నిరంతరం నిఘావుంచే కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్సాన్స్‌ టీం (సెర్ట్‌–ఇన్‌)కు తమ దర్యాప్తులో వెల్లడైన అంశాలను అందజేశామని ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ సంస్థ చెబుతున్నది కనుక దీనిపై మున్ముందు నిజాలు వెల్లడవుతాయని భావించాలి. హ్యాకర్లు చేసిన ప్రయత్నాలు చిన్నవేమీ కాదు. కేవలం అయిదు రోజుల వ్యవధిలో 40,300 సార్లు ఐటీ, బ్యాంకింగ్‌ వ్యవస్థలపై ఈ ప్రయత్నాలు జరిగాయంటున్నారు. ఆఖరికి కరోనా టీకాలు రూపొందించిన సీరమ్‌ ఇనిస్టిట్యూట్, భారత్‌ బయోటెక్‌లపై కూడా దుండగులు కన్నేశారని సమాచారం. ఈ దాడులకు మూలమైన డొమైన్లు చైనాలోని గాంగ్డంగ్, హెనాన్‌ ప్రావిన్స్‌లలో వున్నాయని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ చెబుతోంది.

గతంలో దేశాల మధ్య ఘర్షణలు నివారించకపోతే అణుయుద్ధం సంభవిస్తుందన్న భయాందోళనలుండేవి. ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రత్యర్థి దేశాన్ని స్తంభింపజేసి, ఊపిరాడకుండా చేయటానికి సైబర్‌ దాడికి పాల్పడితే చాలు. ఇందులో చైనా మాత్రమే కాదు...అమెరికా, రష్యాలు కూడా ఆరితేరాయి. భిన్న సందర్భాల్లో ఆ దేశాలపైనా ఆరో పణలొచ్చాయి. ఇవాళ ఐటీతో ముడిపడని రంగమంటూ దేశంలో లేదు. కనుక అందులో అడు గడుగునా ఎదురయ్యే ఉపద్రవాలను ఎదుర్కొనడానికి అనువైన రీతిలో మన నిఘా సంస్థలు న్నప్పుడే ఆ వ్యవస్థలన్నిటినీ కాపాడుకోగలం. ఈ విషయంలో మన ప్రభుత్వాలు మరింత శ్రద్ధ పెట్టకతప్పదు.

మరిన్ని వార్తలు