చైనా–ఈయూ ఒప్పందం

2 Jan, 2021 02:41 IST|Sakshi

కరోనా అనంతర కాలంలో ఆర్థికంగా దెబ్బతిన్న దేశాలు దాన్నుంచి కోలుకోవటానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. సహజంగానే ఈ పరిణామం వేరే దేశాలతో పోలిస్తే కాస్త మెరుగైన స్థితిలో వున్న చైనాకు లాభించే అంశం. అమెరికాకు సమస్యాత్మకం. అందులోనూ దీర్ఘకాలంగా అమెరికాతో సన్నిహితంగా వుంటూ, దాని నేతృత్వంలోని నాటో కూటమిలో కొనసాగుతున్న యూరొపియన్‌ యూనియన్‌(ఈయూ) సైతం చైనా వైపు చూడటం మరింతగా కంటగింపయ్యే విషయం. ఇప్పుడు జరిగింది అదే. చైనా–ఈయూల మధ్య బుధవారం పెట్టుబడులకు సంబంధించి సూత్రప్రాయమైన అవగాహన కుదిరింది. ఆన్‌లైన్‌లో అటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఈయూ కమిషన్‌ అధ్యక్షు రాలు ఉర్సులా వోన్‌డెర్‌ లెయన్, జర్మనీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మేక్రాన్, యూరొపియన్‌ కౌన్సిల్‌ అధ్యక్షుడు చార్లెస్‌ మైకేల్‌ తదితరుల సమక్షంలో ఇదంతా పూర్తయింది. ఒప్పందంపై లాంఛనంగా సంతకాలు పూర్తికావటమే మిగిలింది.

అమెరికా అభ్యంతరం, యూరప్‌ దేశాల్లో వినబడుతున్న నిరసన స్వరాల సంగతలా వుంచితే అవసరం ఎంత పని చేయిస్తుందో చెప్ప టానికి ఈ తాజా ఒప్పందం ఉదాహరణ. మరే దేశంతోనూ చైనా ఇంత సరళమైన ఒప్పందం కుదు ర్చుకోలేదని, ఇది ఎంతో ప్రయోజనకరమైనదని ఈయూ వాణిజ్య కమిషనర్‌ వాల్డిస్‌ అంటున్నారు.  అటు చైనా సైతం ఒప్పందంపై చాలా ఉత్సాహంగా వుంది. వాస్తవానికి ఇదేమీ ఇప్పుడే హడావుడిగా కుదిరిన ఒప్పందం కాదు. ఏడేళ్లుగా దీనిపై చర్చలు సాగుతున్నాయి. అప్పటినుంచీ అమెరికా ఈయూను వెనక్కి లాగుతూనే వుంది. అమెరికాతో ఈయూకి ఇతరత్రా వుండే అవసరాలు, చైనా విధిస్తున్న షరతులు ఈ ఒప్పందం సాకారం కావటానికి ఇన్నాళ్లూ అవరోధంగా మారాయి. ఇప్పుడు మారిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని రెండు పక్షాలూ ఒప్పందానికి సిద్ధపడ్డాయి. అమెరి కాలో అధికార మార్పిడి పూర్తయ్యాక ఈయూపై ఒత్తిళ్లు పెరుగుతాయని గ్రహించిన చైనా చకచకా పావులు కదిపింది. అందువల్లే ఇది సాధ్యమైంది.

అమెరికాలో నాలుగేళ్ల డోనాల్డ్‌ ట్రంప్‌ పాలన మరికొన్ని రోజుల్లో ముగుస్తోంది. ఆయన స్థానంలో జో బైడెన్‌ రాబోతున్నారు. బైడెన్, ట్రంప్‌ల మధ్య ఇతరత్రా అంశాల్లో ఎన్ని విభేదాలున్నా చైనా విషయంలో వారిది ఏకాభిప్రాయం. అమెరికా అధ్యక్ష పీఠంపై ఎవరున్నా దేశానికి చెందిన బహుళజాతి కార్పొరేషన్ల ప్రయోజనాలు కాపాడటానికి ప్రాధాన్యతనిస్తారు. హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌లపై భారత్‌లో అధిక టారిఫ్‌లు విధిస్తున్నారని ట్రంప్‌ తన హయాంలో ఎన్నిసార్లు విరుచుకుపడ్డారో అందరికీ తెలుసు. ట్రంప్‌ తన నోటి దురుసుతో, ఏకపక్ష విధానాలతో సన్నిహిత దేశాలపై సైతం ఇష్టానుసారం వ్యాఖ్యానాలు చేసి వాటిని దూరం చేసుకున్నారు. అందువల్లే ఎవరూ ఆయనతో కలిసి రాలేదు. చివరకు  చైనాతో ఒంటరి పోరాటం చేయాల్సివచ్చింది. దీన్ని బైడెన్‌ సరిచేయదల్చు కున్నారు.

చైనా టెక్నాలజీ పరిశ్రమలపై ఆంక్షలు విధించటం ద్వారా దాన్ని ఆర్థికంగా ఊపిరాడ కుండా చేసి దారికి తేవాలన్న ఉద్దేశంతో ట్రంప్‌ ఇప్పటికే కొన్ని ఉత్తర్వులు జారీ చేశారు. వాటిని కొనసాగిస్తూనే మళ్లీ పాత నేస్తాలకు సన్నిహితం కావాలని బైడెన్‌ ఆలోచిస్తున్నారు. ఇందుకోసమే ఈయూ–చైనాల ఒప్పందంపై చర్చలు తుది దశలో వున్నాయని తెలిసిన వెంటనే ఈయూ కమిషన్‌ అధ్యక్షురాలు, జర్మనీ చాన్సలర్‌ వగైరాలకు బైడెన్‌ బృందం వర్తమానం పంపింది. ఒప్పందానికి తొందరపడొద్దని కోరింది. చైనా వాణిజ్య విధానాలకూ, వీగర్‌ ప్రాంతంలో ముస్లింలపట్ల అది అనుసరిస్తున్న అమానుష ధోరణులకూ వ్యతిరేకంగా సమష్టిగా పోరాడి, ఒత్తిడి తేవాల్సివుంటుందని సూచించింది. బైడెన్‌ హయాంలో జాతీయ భద్రతా సలహాదారు కాబోతున్న జేక్‌ సులివాన్‌ గత వారం ట్విటర్‌ వేదికగా ఈయూ నేతలకు మరోసారి విజ్ఞప్తిచేశారు.

అయినా ఈయూ వెనక్కి తగ్గలేదు. నిజానికి ఈ విషయంలో చైనానే మెచ్చుకోవాలి. అమెరికా కదలికలను పసిగట్టిన వెంటనే అది ఒప్పందంలోని సమస్యాత్మక అంశాలు కొన్నిటిపై రాజీకొచ్చి, ఆన్‌లైన్‌ భేటీకి ఆగమేఘాలపై అందరినీ ఒప్పించింది. దీనిపై అమెరికాకు అభ్యంతరాలుంటాయన్న వాదనను ఈయూ పెద్దలు తోసిపుచ్చుతున్నారు. ట్రంప్‌ హయాంలో కుదిరిన ఒప్పందం పర్యవసానంగా అమెరికా–చైనాల వాణిజ్యంలో కొంతమేర సమతుల్యత ఏర్పడిందని, తాజా ఒప్పందంతో ఆ ప్రయోజనమే తమకూ కలిగే అవకాశం వున్నదని ఈయూ వాణిజ్య కమిషనర్‌ అభిప్రాయం. 

అసలే అంతంతమాత్రంగా వున్న ఈయూ ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి దెబ్బకు మరింత కుదేలైంది. దాని వాణిజ్యావసరాలకు విస్తృతమైన మార్కెట్లు తక్షణావసరం. అటు చైనా తన విద్యుత్‌ ఆధారిత వాహనాల విక్రయానికి ఆటంకాలు వుండరాదని చూస్తోంది. ఈయూ కమిషన్‌ లేవనెత్తు తున్న అభ్యంతరాలు దానికి అవరోధంగా వున్నాయి. ఈ ఒప్పందం సాకారమైతే సమస్యలు సమసి పోతాయని చైనా ఆశ. అలాగే పునర్వినియోగ ఇంధన వనరులకు సంబంధించిన సాంకేతికతకు ఈయూలో మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇటు ప్రభుత్వ రంగ సంస్థలకు చైనా ఇస్తున్న రహస్య సబ్సిడీలకు తాజా ఒప్పందంతో వీలుండదని ఈయూ అంటున్నది.

వీగర్‌ ముస్లింలతో బలవం తంగా వెట్టి చేయిస్తున్నారన్న అంశంలో చైనా నుంచి గట్టి హామీ తీసుకున్నామని, అది అంతర్జాతీయ కార్మిక సంస్థ ఒడంబడికలకు లోబడి వుండటానికి అంగీకరించిందని, కనుక మానవ హక్కుల ఉల్లంఘన జరగబోదని ఈయూ పెద్దలు చెబుతున్న మాటలు అక్కడి మానవ హక్కుల కార్యకర్తలకు రుచించటం లేదు. యూరప్‌ దేశాలు నమ్ముతున్న విలువలకు ఈయూ పోకడ విఘాతం కలిగిస్తుం దని వారి ఆరోపణ. పైగా ఒప్పందం వల్ల అన్నివిధాలా చైనాకే మేలు కలుగుతుందని ఆర్థిక నిపు ణులు వాదిస్తున్నారు. తాజా ఒప్పందం వల్ల ఈయూకి కలిగే ప్రయోజనమెంతో, దీని పర్యవసా నంగా అమెరికా–ఈయూ సంబంధాల్లో కలిగే మార్పులేమిటో మున్ముందు చూడాల్సివుంది. 

మరిన్ని వార్తలు