నేపాల్‌లో చైనా ఓవరాక్షన్‌

1 Jan, 2021 00:47 IST|Sakshi

నేపాల్‌లోనూ, అక్కడి పాలకపక్షం కమ్యూనిస్టు పార్టీ(సీపీఎన్‌)లోనూ ఆ దేశ ప్రధాని కేపీ ఓలి శర్మ కారణంగా తలెత్తిన సంక్షోభంలో పెద్దరికం వహించాలన్న చైనా ఆశలు ఈడేరిన సూచనలు కనిపించటం లేదు. ఒక దేశం అంతర్గత వ్యవహారాల్లో మరో దేశం జోక్యం చేసుకోవటం... ఒక దేశంలోని పార్టీలో తలెత్తిన విభేదాలను వేరే దేశానికి చెందిన పార్టీ పరిష్కరించాలనుకోవటం ఎప్పుడైనా తగనిదే. జాతీయవాద ధోరణులు ప్రబలుతున్న వర్తమానంలో అది మరింత అనారోగ్యకరం. గొడవలు పడుతున్న దేశంతో పోలిస్తే సంపన్న దేశమైనందువల్లో... భౌగోళికంగా దానికన్నా పెద్ద దేశమైనందువల్లో తాము జోక్యం చేసు కోవచ్చునని, అది సహజసిద్ధమైన హక్కని ఎవరైనా అనుకుంటే అది అంతిమంగా వికటిస్తుంది. సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన నేపాల్‌ తన నడతనూ, నడకనూ తానే నిర్దేశించుకోగలగాలి.

అక్కడ పాలకపక్షమైనా అంతే. సమస్యలేమైనా వుంటే తామే చర్చించుకుని తేల్చుకోవాలి. ఆ విషయంలో తటస్థంగా వుండాలన్న మన దేశం వైఖరి హర్షించదగ్గది. అయితే ఇలా పొరుగు జోక్యానికి అలవాటుపడటం వల్ల కావొచ్చు... ప్రచండ మాత్రం నేపాల్‌ సంక్షోభంపై భారత్‌ మౌనం సరికాదంటూ మాట్లాడారు. ఇరుగు పొరుగు వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం విషయంలో మన దేశానికి చాలా అనుభవాలున్నాయి. నేపాల్‌ మాత్రమే కాదు... శ్రీలంక, మాల్దీవులు తదితర దేశాల అంతర్గత వ్యవహారాల్లో మన దేశం జోక్యం చేసుకున్న సందర్భాలు చాలానే వున్నాయి.

శ్రీలంకలో జోక్యం చేసుకోవటం పర్యవసానంగా మన దేశం భారీ మూల్యమే చెల్లించు కోవాల్సివచ్చింది. అక్కడ ప్రత్యేక తమిళ ఈలం కోసం సాయుధ పోరాటం చేస్తున్న ఎల్‌టీటీఈకి,  ప్రభుత్వానికి మధ్య  1987లో అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ శాంతి ఒప్పందం కుదర్చటం... తమతో ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించారని అనంతరకాలంలో ఎల్‌టీటీఈ ఆగ్ర హించి దాన్నుంచి తప్పు కోవటం... ఆ తర్వాత ఒప్పందం అమలు చేయటానికంటూ మన దేశం శాంతి పరిరక్షణ దళం ఐపీకేఎఫ్‌ను పంపటం చేదు అనుభవాలు మిగిల్చింది. ఎల్‌టీటీఈ ఉగ్ర వాదులు 1991 మే నెలలో అప్పటికి విపక్షంలో వున్న రాజీవ్‌గాంధీని ఎన్నికల ప్రచారసభలో మానవ బాంబును ప్రయోగించి పొట్టనబెట్టుకున్నారు. మాల్దీవుల్లో తిరుగుబాటును అణచటంతోసహా వేర్వేరు సందర్భాల్లో మన దేశం జోక్యం చేసుకుంది. నేపాల్‌లో రాజరిక వ్యవస్థ వున్నప్పుడు దానిపై మన దేశం పెత్తనం చేస్తున్న దన్న ఆరోపణలు తరచు వచ్చేవి. రాజరికంపై రాజుకున్న అసంతృప్తి ప్రజల్లో పెరిగినకొద్దీ మన దేశంపైనా దాని ప్రభావం పడేది. 

ఇరుగు పొరుగు దేశాలతో సఖ్యతగా మెలగటం, ద్వైపాక్షిక సంబంధాలతో దాని అభివృద్ధికి తోడ్పడటం వంటివి అక్కడి ప్రజల్లో మన దేశం పట్ల సుహృద్భావాన్ని పెంచుతాయి. అంతర్జాతీ యంగా మన దేశంపై సానుకూల వాతావరణం కలిగిస్తుంది. అంతేతప్ప వేరే దేశం అంతర్గత వ్యవ హారాల్లో తలదూర్చటం వల్ల అంతిమంగా ఒరిగేదేమీ వుండదు. ప్రచండ దీన్ని గుర్తించినట్టు లేరు. ఒక పొరుగు దేశంగా నేపాల్‌ సంక్షోభం సమసిపోవాలని మన దేశం కోరుకోవటం తప్పేమీ కాదు. అందుకు కృషి చేస్తున్న శక్తులకు నైతిక మద్దతునీయటం కూడా సమర్థనీయమే. కానీ నేరుగా రంగంలోకి దిగి తీర్పరిగా వెళ్లటం అక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఒక పార్టీగా సీపీఎన్‌కి కూడా అది మంచిది కాదు. కాలాపానీ తదితరచోట్ల సరిహద్దుల విషయంలో సీపీఎన్, ప్రత్యేకించి ఓలి శర్మ మన దేశంపై ఆగస్టు వరకూ ఎలా కత్తులు నూరారో చూశాం.

వేరే దేశాల కనుసన్నల్లో పని చేస్తుంటాయని చాన్నాళ్ల వరకూ కమ్యూనిస్టు పార్టీలపై నింద వుండేది. ఆ పార్టీలు బలహీన పడటంలో దాని ప్రభావం కూడా వుంది. ఇప్పుడు చైనా జరుపుతున్న మంతనాల పర్యవసానం కూడా అలా పరిణమిస్తే ఆశ్చర్యం లేదు. చైనా కమ్యూనిస్టు పార్టీ(సీపీసీ) ప్రతినిధి బృందం నేపాల్‌లో అయిదారు రోజులుగా తిష్టవేసి ఓలి, ప్రచండ వర్గాలతో మాట్లాడుతోంది. రాజీ ప్రయత్నాలు చేస్తోంది. అదే పరిస్థితి తమకూ ఏర్పడితే అలాంటి అవకాశం బయటి పక్షాలకు ఇవ్వగలమా అని సీపీసీ ఆలోచించుకుంటే నేపాల్‌ ప్రజల మనోభావాలెలావుంటాయో దానికి సులభంగానే అర్థమవుతుంది. 

ఓలి, ప్రచండల వివాదాలను పరిష్కరించటానికి ఆ పార్టీలోని నాయకులు కొందరు ప్రయత్ని స్తున్నారు. ఓలి నాయకత్వంలోని సీపీఎన్‌(యూఎంఎల్‌), ప్రచండ నేతృత్వంలోని సీపీఎన్‌ (మావో యిస్టు సెంటర్‌)లు విలీనమైనపుడు అధికారం చేతికందితే ఇద్దరు నాయకులూ చెరి సగం కాలం పాలించాలన్న ఒప్పందం కుదిరింది. కానీ తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొన్నాళ్లకే ఓలి ప్రచం డను బేఖాతరు చేస్తూ వచ్చారు. ఆ ఒప్పందాన్ని అమలు చేసే ఉద్దేశం లేదన్న సూచనలు పంపుతూనే వున్నారు. ప్రచండ కూడా మౌనంగా లేరు. గట్టిగా పోరాడారు. హెచ్చరికలు చేశారు. పర్యవసానంగా ఆయనకు పార్టీ చైర్మన్‌ పదవి దక్కింది. పార్టీ కనుసన్నల్లోనే నిర్ణయాలుంటాయన్న అవగాహన కుదిరింది. కానీ ఆ వెంటనే ఓలి ఆ రాజీ ఫార్ములాను కూడా బుట్ట దాఖలు చేశారు.

ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవటం, ప్రభుత్వంలో నియామకాలు చేయటం మొదలుపెట్టారు. అది వికటిం చటం ఖాయమని అర్థమయ్యాక పార్లమెంటు రద్దుకు సిఫార్సు చేశారు. ఇప్పుడు సీపీఎన్‌ ఓలిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. పార్లమెంటు రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జనవరి 3లోగా అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు ఓలిని కోరింది. ఆయనేం చెబుతారు... కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చూడాల్సివుంది. అక్కడి ప్రజలు సైతం ఓలి నిర్ణయంపై ఆగ్రహంతో వున్నారు. ఒక ప్రజాస్వామిక సమాజంలో సమస్యలు తలెత్తితే వాటిని పరిష్కరించుకోవటానికి తగిన వేదిక లుంటాయి. ఎన్నికలు అనివార్యమైతే ఎటూ ప్రజలు తగిన తీర్పునిస్తారు. ఈలోగా తగుదునమ్మా అని తగువులో తలదూర్చటమంటే నేపాల్‌ ప్రజల విజ్ఞతను శంకించడమే. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు