సెన్సార్‌పై... మహా సెన్సార్‌!

1 Jul, 2021 00:17 IST|Sakshi

వినోదం, వివేచన కోసం ఉద్దేశించిన మాధ్యమం అది. కానీ, దానికి సంబంధించిన వ్యవహారాలు చివరకు వివాదమైతే? సృజనాత్మక ప్రదర్శనల అనుమతి కోసం సదుద్దేశంతో పెట్టుకున్న సర్టిఫికేషన్‌ వ్యవస్థ చివరకు ఆ ప్రదర్శననే అడ్డుకొనే పరిస్థితి వస్తే? ఇప్పుడదే జరుగుతోందని వాపోతున్నారు సినీ సృజనశీలురు. సినీ మాధ్యమానికి సంబంధించి దశాబ్దాల క్రితం చేసుకున్న ‘సినిమాటోగ్రాఫ్‌ చట్టం’, పెట్టుకున్న ‘కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ బోర్డు’ (సీబీఎఫ్‌సీ) మళ్ళీ వార్తల్లోకి వచ్చాయి. కేంద్ర సర్కారు చేపట్టిన తాజా ‘సినిమాటోగ్రాఫ్‌ (సవరణ) బిల్లు– 2021’ వివాదానికి కేంద్రమైంది. చాన్నాళ్ళుగా ఉన్న ‘సినిమాటోగ్రాఫ్‌ చట్టం–1951’లో మార్పులు, చేర్పుల ద్వారా రాజ్యవ్యవస్థ సినిమాలపై పెద్దన్న పాత్ర పోషించడానికి సిద్ధమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సవరణ బిల్లుపై జూలై 2 లోగా ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పవచ్చని సర్కారు పేర్కొంది. ఈ సవరణలను వ్యతిరేకిస్తూ, పలువురు సినీ దర్శక, నిర్మాతలు, నటీ నటులు సమష్టిగా ఆదివారం నాడు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖకు లేఖ రాయడం గమనార్హం.  

నిజానికి, మనది ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ బోర్డే తప్ప, అందరం పిలుచుకొంటున్నట్టుగా సెన్సార్‌ బోర్డు కాదు! అది సినీ ప్రదర్శనకు అనుమతి ధ్రువీకరణ కోసమే తప్ప, సెన్సార్‌ ఉక్కుపాదం మోపడానికి పెట్టుకున్నదీ కాదు!! కానీ, వ్యవస్థ తాలూకు భావజాలానికీ, ప్రయోజనాలకు అడ్డం వచ్చే ఏ సినిమానైనా అడ్డుకోవడానికి అదే బోర్డును ఆయుధంగా చేసుకోవడం ఆది నుంచీ ఆనవాయితీ అయింది. స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్‌ పాలకుల కాలం నుంచి అదే ధోరణి. స్వాతంత్య్రా నంతరం గద్దెపైనున్న సర్కార్లూ ఆ మార్గాన్నే అనుసరించాయి. అలా నాటి నుంచి నేటి దాకా పార్టీల ప్రమేయం లేకుండా అందరికీ ఈ తిలా పాపంలో తలా పిడికెడు భాగం ఉంది. ఇప్పుడు మళ్ళీ రీ–సెన్సార్షిప్‌ అనే సవరణ ప్రతిపాదన పాలకులకు మరిన్ని కొత్త కోరలు అందిస్తోంది. కేంద్రాన్ని ఏకంగా సెన్సార్‌కు పైన ఉండే ‘సూపర్‌ సెన్సార్‌’గా మారుస్తోంది. ఈ వివాదాస్పద ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని స్వేచ్ఛాభావనల సినీరంగం డిమాండ్‌ చేస్తోంది.

అలాగే, నిన్న మొన్నటి దాకా సెన్సార్‌ బోర్డు ఇచ్చిన కట్స్‌తో కానీ, దాని పైన ఉండే రివైజింగ్‌ కమిటీ నిర్ణయంతో కానీ సంతృప్తి చెందని దర్శక, నిర్మాతలు ‘ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌’ (ఎఫ్‌సీఏటీ)కి వెళ్ళి, న్యాయం పొందే అవకాశం ఉండేది. రాజకీయ కారణాలతో గద్దె మీది పెద్దలు కావాలని ఇబ్బంది పెట్టినా, న్యాయమూర్తులుండే చట్టబద్ధ సంస్థ ట్రిబ్యునల్‌ దగ్గర దర్శక– నిర్మాతలకు ఊరట లభించేది. ఎన్టీఆర్‌ ‘బొబ్బిలిపులి’ (1982), నారాయణమూర్తి ‘లాల్‌సలామ్‌’ (1992) లాంటి అనేక సినిమాలు అలా సెన్సార్‌ బోర్డుపై పోరాడి, ట్రిబ్యునల్‌ దాకా వెళ్లి సెన్సార్‌ సర్టిఫికెట్‌ సంపాదించుకున్నవే. కానీ, ఈ ఏప్రిల్‌లో కేంద్ర సర్కారు ప్రత్యేకంగా ఆర్డినెన్స్‌ తెచ్చి, ఆ ట్రిబ్యునల్‌నే రద్దు చేసేసింది. అంటే ఇప్పుడిక దర్శక, నిర్మాతలు అందరిలా సాధారణ కోర్టు గుమ్మం ఎక్కి, ఎన్ని నెలలు ఆలస్యమైనా భరిస్తూ, తమ సినిమా సెన్సార్‌ కష్టాలను కడతేర్చుకోవాల్సిందే.  తాజా సవరణ బిల్లు గనక చట్టమైతే–ఇప్పటికే సెన్సారైన సినిమాలను కూడా ప్రభుత్వం వెనక్కి పిలిపించవచ్చు. జనం నుంచి ఫిర్యాదు వచ్చి, అది సమంజసమని ప్రభుత్వం భావిస్తే చాలు– ఇక ఆ సినిమా ప్రదర్శన ఆగిపోనుంది. అంటే, ప్రభుత్వం నియమించిన నిపుణులతో సెన్సారై రిలీజైన సినిమాపైనే మళ్ళీ మరో సెన్సార్షిప్‌ అన్న మాట. అసలు సెన్సార్‌ బోర్డు ఒక సినిమాకు అనుమతి ఇచ్చాక, దాన్ని తిరగదోడే అధికారం కేంద్రానికి లేదంటూ కె.ఎం. శంకరప్ప (2001) కేసులో సర్వో న్నత న్యాయస్థానం ఎప్పుడో తేల్చింది. అలా చూస్తే ఈ కొత్త సవరణ ఆ ఆదేశాలకు విరుద్ధమే.

అయితే, దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లుతుందనుకుంటే రాజ్యాంగ బద్ధమైన భావప్రకటన స్వేచ్ఛ హక్కుకూ కొన్ని పరిమితులుంటాయని మన రాజ్యాంగం పేర్కొంది. ఆ పరిమితులను ఆసరాగా చేసుకొని, సుప్రీం కోర్టు ఆదేశాలకు సైతం కేంద్రం కొత్త క్లాజు పెట్టింది. మరోపక్క ఇప్పటికే ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) వేదికల పైనా కొన్ని నియంత్రణ చట్టాలు ప్రభుత్వం తెచ్చింది. నిజానికి, ఇప్పుడొస్తున్న కొన్ని వెబ్‌ సిరీస్‌లు, చిత్రాల బాధ్యతారాహిత్యం చూస్తుంటే నియంత్రణలు అవసరమనే అనిపిస్తుంది. కానీ అది కక్షసాధింపు కాకూడదు. సమతూకం, సంయమనం అవసరం. ప్రతిపాదిత తాజా బిల్లులోని అంశాలు మాత్రం ప్రజాస్వామ్యబద్ధమైన అసమ్మతిని సహించలేక చేస్తున్నవేననే అభిప్రాయం ప్రబలుతోంది. ప్రభుత్వ భావజాలానికో, ఏ కొందరి మనోభావాలకో వ్యతిరేకంగా ఉంటే చాలు... కొద్దిమంది కలసి ఓ సినిమా ప్రదర్శనను ఆపేయవచ్చు. సెన్సారైన సినిమానూ వెనక్కి రప్పించవచ్చనేది సృజనశీలురను భయపెడుతోంది. 

ఆ మధ్య సంజయ్‌ భన్సాలీ ‘పద్మావత్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’ సహా అనేక సినిమాల విషయంలో ఇప్పటికే అనేక చేదు అనుభవాలు సినీసీమకు ఉన్నాయి. అందుకే, సినిమాటోగ్రాఫ్‌ చట్టంలో కేంద్రం చేయాలనుకుంటున్న సవరణల పట్ల సినీ సమాజంలో నెలకొన్న భయాందోళనలు చాలావరకు అర్థవంతమైనవి. అర్థం చేసుకోదగినవి. ఆ భయాందోళనల్ని పోగొట్టాల్సిన బాధ్యత పాలకుల మీదే ఉంది. లేదంటే, స్వేచ్ఛా స్వాతంత్య్రాలను కాపాడుతూ, పరస్పర భిన్నాభిప్రాయాలను గౌరవించు కొంటూ సాగాల్సిన ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. విమర్శనూ, సృజనాత్మక స్వేచ్ఛనూ సహించ లేక ఉక్కుపాదం మోపుతున్నారనే అప్రతిష్ఠను మూటగట్టుకోవాల్సి వస్తుంది.


 

మరిన్ని వార్తలు