పాలకులకు మేలుకొలుపు!

30 Sep, 2022 00:16 IST|Sakshi

‘ఉత్తములైన సివిల్‌ సర్వీస్‌ అధికారులుంటే సరైన చట్టాలు లేకున్నా సమర్థవంతమైన పాలనకు లోటుండదు. అత్యుత్తమ చట్టాలున్నప్పటికీ అధికారులు సరైనవారు కాకుంటే అలాంటిచోట పాలన కుంటుబడుతుంది’ అంటాడు జర్మన్‌ రాజనీతిజ్ఞుడు బిస్మార్క్‌. బాలికలుగా తమ అవసరాలేమిటో చెప్పిన ఒక విద్యార్థినికి బిహార్‌ మహిళా ఐఏఎస్‌ అధికారి హర్‌జోత్‌ కౌర్‌ నిర్దయగా ఇచ్చిన జవాబు గమనిస్తే దేశంలో అధికార యంత్రాంగం మొద్దుబారుతున్నదా అనే సందేహం కలుగుతుంది.

రాజధాని పట్నాలో బుధవారం ఒక గోష్ఠి సందర్భంగా జరిగిన ఈ ఉదంతం ఒక రకంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే ఆ గోష్ఠి మకుటమే ‘సశక్తి బేటీ, సమృద్ధ బిహార్‌’. బాలికా సాధికారత ద్వారానే బిహార్‌ సమృద్ధి సాధిస్తుందన్నది దాని సారాంశం. కానీ ఆ అధికారిణి అందుకు విరుద్ధమైన పోకడలకు పోయారు. ప్రశ్న అడిగిన బాలికతో వాదులాటకు దిగారు. అనుచితమైన వ్యాఖ్యలు చేశారు. ‘ఇన్ని పథకాలకు ఇంతగా ఖర్చుపెడుతున్న ప్రభుత్వంవారు బాలికలకు ప్రతి నెలా 20, 30 రూపాయల విలువ చేసే నాప్‌కిన్‌లు ఇవ్వలేరా?’ అన్నది ఆ బాలిక ప్రశ్న. 

నిజానికి బాలికలు అడగకముందే పాలకులు గమనించి తీర్చవలసిన సమస్య ఇది. దేశంలో మధ్యలోనే చదువు ఆపేస్తున్న బాలికల శాతం ఆందోళనకరంగానే ఉంది. కౌమార దశలో బడి మానేస్తున్న ఆడపిల్లల శాతం గత మూడేళ్లలో బిహార్‌లోనే అధికమని మొన్న ఏప్రిల్‌లో కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణా దేవి పార్లమెంటులో చెప్పారు. రుతుస్రావ సమయంలో పరిశుభ్రమైన నాప్‌కిన్‌లు వాడలేకపోవటం, ఉన్నా వాడటానికి అనువైన మరుగు స్కూళ్లలో కొరవడటం బాలికలకు శాపంగా పరిణమిస్తోంది. వారు అనేక వ్యాధులబారిన పడవలసివస్తోంది.

కేవలం ఈ కారణంతో ఏటా చదువులకు దూరమయ్యే విద్యార్థినులు 23 శాతం ఉంటారని ఐక్యరాజ్యసమితికి చెందిన నీటి సరఫరా, పారిశుద్ధ్యం వ్యవహారాల మండలి నిరుడు తెలియ జేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని మహిళాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా ఉంటూ కూడా ఇలాంటి దుఃస్థితిని బాలిక చెప్పేంతవరకూ గమనించలేకపోయినందుకు సిగ్గుతో తలవంచు కోవాల్సిందిపోయి హర్‌జోత్‌ కౌర్‌ దబాయింపు ధోరణిలో మాట్లాడటం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. 

‘ఇవాళ నాప్‌కిన్స్‌ అడుగుతున్నారు. రేపు జీన్స్, ఆ తర్వాత అందమైన షూస్‌ కావాలంటారు. చివరకు ఉచితంగా కండోమ్‌లు ఇవ్వమని అడుగుతారు’ అంటూ ఆమె జవాబివ్వటం బాధ్యతా రాహిత్యానికి పరాకాష్ఠ. అడిగిన ప్రశ్నకు జవాబివ్వలేక ‘అన్నీ ప్రభుత్వమే ఎందుకివ్వాలి... ఇది తప్పుడు ఆలోచనాధోరణి’ అంటూ వాదులాటకు దిగడం ఆమె వైఖరికి అద్దం పడుతుంది. మరుగుదొడ్ల గురించి అడిగినప్పుడు సైతం తలతిక్క సమాధానమే వచ్చింది.

పైగా దేశాన్ని పాకిస్తాన్‌ చేస్తారా అని బాలికలను ప్రశ్నించారు.  అయినా తొమ్మిది, పది తరగతులు చదువుతున్న ఆ బాలికలు వెరవకుండా నిలదీసిన తీరు ప్రశంసించదగ్గది. మొదటగా ప్రశ్నించిన బాలిక నేపథ్యం గమనిస్తే సమస్య తీవ్రతేమిటో అర్థమవుతుంది. రియా కుమారి అనే ఆ బాలిక నగరంలోని ఒక మురికివాడకు చెందినామె. నాప్‌కిన్‌ వాడకం ఈమధ్యే తెలిసిందట. తనవంటి బాలికలు ఇంకా వేలాదిమంది ఉన్నార ని, తెలిసినా వాటిని వాడే స్థోమత ఆ బాలికలకు లేదని చెబుతోంది.

చదువుల్లో చురుగ్గా ఉండేవారు, నాయకత్వ లక్షణాలున్నవారు, సవాళ్లను ఎదుర్కొనే సాహస వంతులు సివిల్‌ సర్వీసుల బాట పడతారని ఒక అభిప్రాయం ఉంది. దేశంలో మెజారిటీగా ఉన్న అట్టడుగువర్గాల ప్రజానీకం సమస్యలపై సహానుభూతితో వాటిని ఆకళింపు చేసుకుని, సృజనాత్మక పరిష్కారాలను వెదికే అధికారుల వల్లనే సమాజానికి మేలు జరుగుతుంది. హర్‌జోత్‌ కౌర్‌కు ఈ అవగాహన ఏ మేరకుందో అనుమానమే. సివిల్‌ సర్వీసు పరీక్షలు రాసి, ఇంటర్వ్యూలో కృతార్థులయ్యాక ఆ అధికారులకు ఇక పరీక్షలేమీ ఉండకపోవచ్చు.

కానీ పాలనా యంత్రాంగంలో భాగస్థులై, సమస్యలను సవాలుగా తీసుకుని పనిచేసేవారికి ఎప్పుడూ పరీక్షే. నిజానికి ఆ బాలికలు అడిగిన సమస్యలేమీ తీర్చలేనివి కాదు. దేశంలో ఎవరూ అమలు చేయనివి కాదు. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం నిరుడు అక్టోబర్‌లో ఇలాంటి పథకం ప్రారంభించింది. 7వ తరగతి మొదలు ఇంటర్మీడియెట్‌ వరకూ చదివే పది లక్షలమంది బాలికలకు ప్రతినెలా పది నాప్‌కిన్‌ల చొప్పున ఈ పథకం కింద అందజేస్తున్నారు. ఆఖరికి ఇంటి దగ్గర వాడుకోవడానికి వేసవి సెలవుల ముందు ఒకేసారి ఇస్తున్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు వ్యయం చేస్తున్నారు.

రెండేళ్లనాడు సివిల్‌ సర్వీసుల ప్రొబేషనర్లనుద్దేశించి ‘ప్రజలను కేవలం ప్రభుత్వ పథకాలు తీసుకొనేవారిగా పరిగణించొద్దు. నిజానికి మన పథకాలకూ, కార్యక్రమాలకూ వారే చోదకశక్తులు’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అధికార యంత్రాంగంలో ఈ స్పృహ కలగాలంటే పనిచేస్తున్న శాఖల్లో వారి నిబద్ధత, నిమగ్నత ఏపాటో మదింపు వేస్తుండాలి. ఇతరేతర రాష్ట్రాల్లో అమలయ్యే పథకాలు, వాటి మంచిచెడ్డల గురించి వారి అవగాహనేమిటో తెలుసుకోవాలి. అసలు సివిల్‌ సర్వీసులకున్న ఎంపిక ప్రక్రియనే ప్రక్షాళన చేయాలి. ఎందుకంటే ప్రజలు మునుపట్లా లేరు. అన్నీ చూస్తున్నారు. ఎక్కడేం జరుగుతున్నదో తెలుసుకుంటున్నారు. ఆ ప్రశ్నలడిగిన బాలికలు ఒక రకంగా పాలకులకు మేలుకొలుపు పాడారు. సరిదిద్దుకోవాల్సిన వంతు వారిదే. 

మరిన్ని వార్తలు