Nagaland Tragedy: నాగాలాండ్‌ నరమేథం

7 Dec, 2021 10:13 IST|Sakshi

ఈశాన్య భారతంలో తిరుగుబాట్లను అణిచే పేరిట దశాబ్దాలుగా అమలవుతున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం పౌరుల జీవితాల్లో ఎంతటి కల్లోలం సృష్టిస్తున్నదో తెలియడానికి శనివారం చోటుచేసుకున్న నాగాలాండ్‌ నరమేథమే తార్కాణం. ఆ రాష్ట్రంలోని మోన్‌ జిల్లాలో 13మంది పౌరులు, ఒక జవాను మరణించడానికి దారి తీసిన ఈ ఉదంతం అత్యంత విషాదకరమైనది. వాహ నంలోని వారిని తిరుగుబాటుదారులుగా పొరబడి కాల్పులు జరిపామని సైన్యం ఇస్తున్న సంజాయిషీ నేర తీవ్రతను తగ్గించలేదు.

వారి ప్రకటన ప్రకారం నిషేధిత నేషనల్‌ సోషలిస్టు కౌన్సిల్‌ ఆఫ్‌ నాగా లాండ్‌ –ఖప్లాంగ్‌(ఎన్‌ఎస్‌సీఎన్‌–కే)లోని చీలిక వర్గం తిరుగుబాటుదారులు ఫలానా వాహనంలో వస్తున్నారని నిఘా సంస్థలు సమాచారం ఇచ్చాయి. దాని ఆధారంగా కాల్పులు జరిపామని సైన్యం అంటున్నది. తిరుగుబాటుదారుల గురించి అంత ఖచ్చితమైన సమాచారం అందించిన నిఘా సంస్థకూ, దాన్ని విశ్వసించిన సైన్యానికీ సమీపంలోని బొగ్గు గనిలో పనిచేస్తూ రోజూ అదే సమయా నికి వాహనంలో కూలీలు వెళ్తారన్న ఇంగితం లేకపోవడం, జాగరూకతతో వ్యవహరించాలన్న స్పృహ కొరవడటం క్షమార్హంకాదు.

పద్ధతిగా అయితే ఇలాంటి దాడుల సమయంలో స్థానిక పోలీసుల సాయం తీసుకోవాలి. కానీ, అక్కడ కార్యకలాపాలు చూసే అస్సాం రైఫిల్స్‌కు కూడా చెప్పకుండా సైన్యంలోని ఒక ఎలైట్‌ యూనిట్‌ తనకు తానే నిర్ణయం తీసుకుని ఈ దాడికి పాల్పడిందని వస్తున్న కథనాలు ఆందోళనకరమైనవి. బలగాలమధ్య సమన్వయం లేదని  దీన్నిబట్టి అవగతమవుతోంది. అసలు సైన్యం నిర్వహిస్తున్న ఆపరేషన్ల తీరుతెన్నులనే ఈ ఉదంతం ప్రశ్నార్థకం చేస్తున్నది. 

ఆ వాహనంలో నిజంగా తిరుగుబాటుదారులే వెళ్తున్నా అచ్చం వారి మాదిరే పొంచివుండి దాడి చేయాలనుకోవడం సరికాదు. గత నెలలో మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ఒక కమాండింగ్‌ ఆఫీసర్‌నూ, మరో ఆరుగురినీ తిరుగుబాటుదారులు బలితీసుకున్ననాటినుంచీ సూత్రధారుల కోసం గాలింపు మొదలైంది. తిరుగుబాటుదారులను సజీవంగా పట్టుకుంటేనే ఆ అధికారి మరణానికి కారకులెవరో, వారి కార్యకలాపాలేమిటో తెలిసేది. అందుకు భిన్నంగా పొంచివుండి హఠాత్తుగా గుళ్ల వర్షం కురిపించడం వల్ల దేశ భద్రతకు కలిగే ప్రయోజనమేమిటి? కాస్తయినా ఆలోచించారా? వాహ నాన్ని ఆపడానికి బలగాలు ప్రయత్నించాయని, కానీ వారు ‘పారిపోయే ప్రయత్నం’ చేయడంతో అందులో తీవ్రవాదులు వెళ్తున్నారని భావించారని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పార్లమెంటులో చేసిన ప్రకటన  హేతుబద్ధంగా లేదు.

తీవ్రవాదులు వాహనంలో ఉండుంటే మారణాయుధాలతో దాడికి దిగరా? వాహనం ఆపనంత మాత్రాన అందులో తీవ్రవాదులే ప్రయాణిస్తున్నారన్న నిర్ధార ణకు రావడం సబబేనా? నాగాలాండ్‌ పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలిన అంశాలు మరింత గుబులు పుట్టిస్తున్నాయి. ఘటన జరిగాక మృతదేహాలపై ఉన్న దుస్తులను  తొలగించి, ఖాకీ దుస్తులు వేసేందుకు బలగాలు ప్రయత్నించాయని ఆ దర్యాప్తు చెబుతోంది. మరణించినవారు తీవ్రవాదులని కట్టుకథలల్లడానికి ఈ పని చేశారా అన్నది తేలాలి. ఆ రాష్ట్రంలో ఉన్నది ఎన్‌డీపీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం. కానీ బీజేపీ నేతలకే అక్కడ రక్షణ కరువు! ఘటనాస్థలికి బీజేపీ జెండాతో వెళ్తున్న తమ వాహనంపై కూడా బలగాలు కాల్పులు జరిపి, ఒకరి ప్రాణం తీశాయని, మరో ముగ్గురు గాయపడ్డా రని మోన్‌ జిల్లా బీజేపీ నేత అంటున్నారు. ఇదంతా వింటుంటే మనం ప్రజాస్వామ్య వ్యవస్థలోనే జీవిస్తున్నామా అనే సందేహం రాకమానదు

తీవ్రవాదాన్ని అదుపు చేయడం, శాంతిభద్రతల్ని పరిరక్షించడం ప్రభుత్వాల కర్తవ్యం. మయ న్మార్‌కూ, చైనాకూ కూతవేటు దూరంలో ఉండే నాగాలాండ్‌ వంటిచోట అది మరింత అవసరం. కానీ కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిన చందంగా చట్టాలు ఉండకూడదు. రాజ్యాంగంలోని అధికరణలను సైతం అపహాస్యం చేసేలా సైన్యానికి అపరిమిత అధికారాలిస్తున్న సాయుధ బలగాల (ప్రత్యేకాధికారాల) చట్టం ఈ పోకడే పోతోంది. పర్యవసానంగా ఇది అమలవుతున్న ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడో ఒకచోట నిత్యం మానవ హక్కుల ఉల్లంఘన సాగుతూనే ఉంది.

అక్రమ నిర్బం ధాలు, అత్యాచారాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, మనుషుల్ని మాయం చేయడం వంటి ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. మణిపూర్‌ ఎన్‌కౌంటర్‌ ఘటనలపై 2013లో దర్యాప్తు చేసిన జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే కమిషన్‌ సాయుధ బలగాల చట్టం అశాంతికి కారణమవుతున్నదని తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధ చర్య లకు పాల్పడిన భద్రతా బలగాలకు ఏ రక్షణా ఉండబోదని సుప్రీంకోర్టు ఒక కేసులో స్పష్టం చేసింది. జస్టిస్‌ బీపీ జీవన్‌ రెడ్డి కమిటీ ఆ చట్టాన్ని రద్దు చేయాలని 2005లో సూచించింది. నిర్భయ ఉదం తంలో నియమించిన జస్టిస్‌ జేఎస్‌ వర్మ కమిటీ నివేదిక సైతం ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పింది.

అయినా ఆనాటి యూపీఏ సర్కారుకు పట్టలేదు. అది జరిగితే భద్రతా బలగాల నైతిక స్థైర్యం దెబ్బ తింటుందన్నదే ప్రభుత్వాల వాదన. మరి పౌరుల నైతిక స్థైర్యం సంగతేమిటి? నాగాలాండ్‌ ఉదం తంలో కారకుల్ని శిక్షిస్తామని సైన్యం అంటున్నది. కేంద్రం కూడా హామీ ఇస్తోంది. మంచిదే. కానీ ఇన్ని దశాబ్దాలుగా ఎంతమందిని శిక్షించారు... లెక్కలు తీస్తారా? సాయుధ బలగాల (ప్రత్యేకాధి కారాల) చట్టం అమల్లో ఉన్నంతకాలం ఇలాంటి ఉదంతాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి.  చట్టం రద్దు చేయాలన్న నాగాలాండ్, మేఘాలయ సీఎంల తాజా డిమాండ్‌ ముమ్మాటికీ సబబే. ఇప్పటికైనా కేంద్రం ఆలోచించాలి. ప్రజా శ్రేయస్సుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. 

>
మరిన్ని వార్తలు