ముంచుకొస్తున్న ముప్పు

26 Jun, 2021 00:02 IST|Sakshi

పర్యావరణవేత్తల హితవు అరణ్యరోదనమవుతున్నప్పుడు పర్యవసానాలు ప్రమాదకరంగా పరిణ మించక తప్పదు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వాతావరణ మార్పులపై పనిచేస్తున్న ఐపీసీసీ బృందం రూపొందించిన ముసాయిదా నివేదిక భూగోళం నానాటికీ ఎలా నాశనమవుతున్నదో కళ్లకు కట్టింది. సకాలంలో మేల్కొనకపోతే అంచనాలకు భిన్నంగా త్వరలోనే తీవ్రమైన ప్రకృతి వైపరీ త్యాలు తప్పవని, తిరిగి కోలుకోలేనంత నష్టం వాటిల్లడం ఖాయమని హెచ్చరించింది. ఇప్పుడు లీకైన నివేదిక అసంపూర్ణమైనదే. వచ్చే నవంబర్‌లో గ్లాస్గోలో సమితి ఆధ్వర్యంలో జరిగే వాతావరణ సదస్సు కాప్‌ 26 సారథులు ఇంకా పరిశీలించాల్సివుంది గనుక అధికారికంగా నివేదికను విడుదల చేయలేదు. ఒకసారంటూ ఉష్ణోగ్రతలు నిర్దిష్ట స్థాయికి చేరాయంటే ఆ తర్వాత ఊహకందని వరుస పరిణామాలు చోటుచేసుకుంటాయని నివేదిక అంటున్నది. ఆర్కిటిక్‌లో అతిశీతోష్ణస్థితిలో ఉన్న మంచు పెను ఉష్ణోగ్రతలకు కరగడం మొదలైందంటే భారీయెత్తున మీథేన్‌ వాయువు వెలువడుతుం దని, శక్తివంతమైన ఈ వాయువు మరింత వేడిమికి కారణమవుతుందని నివేదిక అంచనా. పర్యావరణ పెనుమార్పుల తర్వాత జీవావరణ వ్యవస్థలోని ఇతరాలన్నీ దానికి అనుగుణంగా మారొచ్చు గానీ.. మనిషికి మాత్రం అది అసాధ్యమని, అంతరించిపోవటం ఖాయమని హెచ్చరిస్తోంది.

నానాటికీ మనిషి దురాశకు అంతూ పొంతూ లేకుండా పోవడంతో ప్రకృతిలోని పంచభూతాలూ కాలుష్యం బారిన పడుతున్నాయి. కనుకనే వైపరీత్యాలు తప్పడం లేదు. త్రికాలాలూ ఉత్పాతాలను చవిచూస్తున్నాయి. అకాల వర్షాలు, వరదలు, వడగాలులు, కరువుకాటకాలు, భూకంపాలు తరచుగా వేధిస్తున్నాయి. ధ్రువప్రాంతాల్లో మంచు పలకలు కరిగి విరుగుతున్నాయి. సముద్రాలు వేడెక్కు తున్నాయి. ఫలితంగా ప్రపంచ దేశాలన్నిటా ప్రతియేటా కోట్లాదిమంది పౌరుల జీవితాలు చిన్నా భిన్నమవుతున్నాయి. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలను జాగృతం చేయటం సంగతి అటుంచి, ప్రభుత్వాలే అచేతనంగా పడివుంటున్నాయి. తమ బాధ్యతలను పూర్తిగా విస్మరిస్తున్నాయి. పర్యావరణంపై అంతర్జాతీయ సదస్సులు జరిగినప్పుడు ఒకరు ముందుకు లాగితే, మరొకరు వెనక్కి లాగటం... మర్కట తర్కాలకు దిగటం అగ్ర రాజ్యాలకు అలవాటైపోయింది. 1992లో రియోడి జెనైరోలో ప్రపంచ దేశాలన్నీ తొలిసారి సభ చేసుకుని భూగోళాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరంపై అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకున్నాయి. అందరం కలిసి పర్యావరణ క్షీణతను సరిదిద్దుకుందామని సంకల్పం చెప్పుకున్నాయి. అందుకొక కార్యాచరణను సైతం రూపొందించుకున్నాయి. ఆ తర్వాత 1997లో క్యోటోలో శిఖరాగ్ర సదస్సు జరిగింది. అక్కడ కూడా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా కదులుదామని తీర్మానించాయి. 1990 నాటితో పోలిస్తే 2012కల్లా 5 శాతం ఉద్గారాలను తగ్గించు కోవాలని నిర్ణయించాయి. ఇందుకు అప్పటి అమెరికా ఉపాధ్యక్షుడు అల్‌ గోర్‌ సైతం అంగీకరించి సంతకం చేశారు. కానీ ఇదంతా అశాస్త్రీయమని, చాదస్తమని అమెరికన్‌ కాంగ్రెస్‌లో రిపబ్లికన్‌లు అడ్డుకున్నారు. దాంతో ఆ వాగ్దానం కాస్తా అటకెక్కింది. క్యోటో శిఖరాగ్ర సదస్సు తీసుకున్న నిర్ణయా లన్నీ ఆవిధంగా దాదాపు దశాబ్దంపాటు స్తంభించిపోయాయి. అగ్ర దేశమే ఇలా అఘోరిస్తే వేరే దేశాల సంగతి చెప్పనవసరం లేదు. ఇతర సంపన్న దేశాలు సైతం పట్టనట్టు వుండిపోయాయి. 2015నాటి పారిస్‌ శిఖరాగ్ర సదస్సు ఒడంబడికపై అందరూ ఆశావహ దృక్పథంతో వుంటుండగా, అమెరికాలో ట్రంప్‌ మహాశయుడు పగ్గాలు చేపట్టి ఆ ఆశలపై చన్నీళ్లు చల్లారు. జో బైడెన్‌ అధికారం లోకొచ్చాక పారిస్‌ ఒడంబడికను గుర్తిస్తున్నట్టు అమెరికా తెలియజేసింది. వాస్తవానికి ఆ ఒడంబడిక లక్ష్యాలు కనీసం మూడింతలు మించితే తప్ప ప్రయోజనం శూన్యమని పర్యావరణవేత్తలు పెదవి విరిచారు. విషాదమేమంటే, కనీసం అదైనా సక్రమంగా అమలు కావటం లేదు. 

ఈసారి ఐపీసీసీ ముసాయిదా నివేదికలో ఉపయోగించిన భాష ఎలాంటివారికైనా దడ పుట్టి స్తుంది. ఆకలి, అనారోగ్యం, కరువు కొన్ని దశాబ్దాల్లోనే కోట్లాదిమందిని చుట్టుముడతాయని ముసా యిదా హెచ్చరించింది. 2050 నాటికి మరో 8 కోట్లమంది ఆకలి బారిన పడతారని, ఆసియా, ఆఫ్రి కాల్లో అదనంగా కోటిమంది పిల్లలు పౌష్టికాహార లోపంతో వ్యాధుల బారిన పడతారని తాజా ముసాయిదా చెబుతున్నది. గత నివేదికలు సైతం జరుగుతున్న పరిణామాలపై, రాగల ప్రమాదా లను ఏకరువు పెట్టిన మాట వాస్తవమే. కానీ ఎలాంటి మార్పుల తర్వాత ఇక వెనక్కి వెళ్లలేని స్థితికి చేరుకుంటామన్న అంశంలో శాస్త్రవేత్తలకు ఇంత స్పష్టత లేదు. అటువంటివాటిని తాజా ముసాయిదా డజనువరకూ గుర్తించింది. 2050 నాటికి భూతాపం పెరుగుదలను పారిశ్రామికీకరణకు ముందున్న ఉష్ణోగ్రతలకంటే 2 డిగ్రీల సెల్సియస్‌ మించకుండా చూడాలని, అది కనీసం 1.5 డిగ్రీల సెల్సియస్‌ కైనా పరిమితం కావాలని పారిస్‌ శిఖరాగ్ర సదస్సు భావించింది. తాజా ముసాయిదా భూగోళం 3 డిగ్రీల సెల్సియస్‌ పెరుగుదలను చవిచూడబోతున్నదని జోస్యం చెబుతోంది. 2100లోగా పర్యావ రణం పెను మార్పులు చవిచూసే అవకాశంలేదని గత నమూనాలు సూచించగా, తాజా ముసా యిదా మాత్రం అందుకు భిన్నమైన అంచనాలు చెబుతోంది.  కనుక ఈ విశ్వంలో జీవరాశికి చోటి స్తున్న ఒక్కగానొక్క భూగోళాన్నీ రక్షించుకునే నిర్ణయాలు వేగిరం తీసుకోనట్టయితే, ఇది సైతం అంత రించటం ఎంతో దూరంలో లేదని అన్ని దేశాలూ... ప్రత్యేకించి సంపన్న దేశాలూ గ్రహించటం తక్షణావసరం. 

మరిన్ని వార్తలు