గణాంకాలు–వాస్తవాలు 

3 Sep, 2021 00:44 IST|Sakshi

బ్రిటిష్‌ మాజీ ప్రధాని బెంజమిన్‌ డిజ్రేలీ స్వయంగా నవలా రచయిత కూడా కనుక తన అనుభవాన్ని రంగరించి గణాంకాల గురించి ఓ చక్కని మాట చెప్పారు. గణాంకాలు చెప్పని వాస్తవాలేమిటో తెలుసుకున్నాకే వాటిని విశ్వసించాలన్నారు. జాతీయ గణాంక కార్యాలయం(ఎన్‌ఎస్‌ఓ) వర్తమాన ఆర్థిక సంవత్సరంలో జూన్‌తో ముగిసిన త్రైమాసికానికి విడుదల చేసిన జీడీపీ, జీవీఏ గణాంకాలను ఆ దృష్టితో చూడకతప్పదు.

దేశవ్యాప్తంగా కఠినమైన లాక్‌డౌన్‌ అమలైన గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మైనస్‌ 24.4 శాతానికి పడిపోయిన వృద్ధి రేటు, ఈసారి అదే త్రైమాసికంనాటికి 20.1 శాతానికి ఎగబాకిందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. కరోనా రెండో దశ దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించి భారీగా కేసులు నమోదైన సమయంలో జీడీపీ ఇంతగా వృద్ధి చెందడం గమనించదగ్గదని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం అంటున్నారు. నిరుడు తొలి త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థను అవస్థలపాలు చేసిన కరోనా, ఈ ఏడాది మరింత ఉగ్రరూపం దాల్చినా మనల్ని ఏమీ చేయలేకపోయిందని కూడా ఆయన చెప్పారు
(చదవండి: ఇలాంటి పందుల పోటీలు ఎప్పుడైనా చూశారా?)

ఈ ఏడాది ప్రపంచంలోనే వేగంగా వృద్ధి నమోదు చేస్తున్న దేశంగా భారత్‌ను పరిగణించవచ్చునని ఆయన లెక్కేశారు. ఆయనే కాదు...ఆర్‌బీఐ, ఐఎంఎఫ్, ఎస్‌ అండ్‌ పీ వగైరా సంస్థలు భారత వార్షిక వృద్ధి రేటు ఈసారి చైనాను అధిగమిస్తుందని జోస్యం చెప్పాయి. అయితే ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంతో పోలిస్తే జీడీపీ 16.9 శాతం కుంచించుకుపోయింది. అదే సమయంలో ప్రస్తుత వృద్ధి రేటు రిజర్వ్‌ బ్యాంకు, బ్లూమ్‌బర్గ్‌ అంచనాలకు దగ్గరగానే ఉంది.

కరోనా మహమ్మారి కంటే చాలా ముందే మన ఆర్థిక వ్యవస్థ కష్టాల్లో కూరుకుపోవడం మొదలైంది. 2017 ఆర్థిక సంవత్సరానికి ముందు 8 శాతంగా ఉన్న వృద్ధి రేటు 2020 ఆర్థిక సంవత్సరానికి 4 శాతానికి పడిపోయింది. అనాలోచితమైన పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, హడావుడిగా అమలుచేసిన జీఎస్‌టీ ఇందుకు కారణాలు. అయితే అప్పట్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకూ భరోసానిస్తూ దేన్నయినా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం మన ఆర్థిక వ్యవస్థకున్నదని, ఇది తిరిగి మరింత శక్తిమంతంగా పుంజుకుంటుందని చెప్పారు.  

కరోనా మహమ్మారి కాటేయకపోతే ఆయన ఆశలు నెరవేరేవేమో! కానీ జరిగిందంతా అందుకు విరుద్ధం. వేరే దేశాలతో పోలిస్తే మన ఆర్థిక వ్యవస్థ చిగురుటాకులా వణికింది. తలసరి జీడీపీలో బంగ్లాదేశ్‌ వంటి చిన్న దేశాలు కూడా మనల్ని అధిగమించాయి. 

అసలు జీడీపీ ఆధారంగా ఒక దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను అంచనా వేయడం సరికాదన్నది పలువురు ఆర్థిక నిపుణులు ఎప్పటినుంచో చేస్తున్న వాదన. నిర్దిష్ట కాలంలో వ్యవసాయం, ఉత్పాదక రంగం, సేవా రంగం తదితరాల్లో సాగిన లావాదేవీల మారకపు విలువ ఆధారంగా జీడీపీని లెక్కగడతారు. అయితే ఈ సంపదంతా ఏ రకంగా పంపిణీ అవుతున్నదన్న అంశమే ప్రధానం.

కరోనాకు ముందే కుంగిపోవడం మొదలైన సామాన్యుల జీవితాలు ఆ మహమ్మారి కాటుతో మరింత దెబ్బతిన్నాయి. సంఘటిత, అసంఘటిత రంగాలు రెండిటా ఉపాధి లేమి ఎన్నడూ లేనంతగా పెరిగింది. ఫలితంగా ప్రజానీకం సగటు ఆదాయం గణనీయంగా క్షీణించింది. ప్రజారోగ్యం సరేసరి. కరోనా మహమ్మారి దాన్ని బాహాటంగా బయటపెట్టింది. తాజాగా భారతీయ ఆర్థిక వ్యవస్థ సమీక్షా కేంద్రం(సీఎంఐఈ) వెల్లడించిన గణాంకాలు బెంబేలెత్తిస్తున్నాయి.
(చదవండి: అక్కడ రూపాయికే ఇడ్లీ: ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజమే..)

గత నెలలో సంఘటిత, అసంఘటిత రంగాల్లో 15 లక్షలమంది ఉపాధి కోల్పోయారని దాని సారాంశం. ఇందులో గ్రామీణ భారతం వాటాయే అధికమని ఆ సంస్థ అంచనా వేస్తోంది. అంతకుముందు జూలై నెలలో కొద్దో గొప్పో సాధించిన పురోగతి కాస్తా నెలరోజుల వ్యవధిలో తిరగబడిందని సీఎంఐఈ అంటున్నది. జూలై నెలలో నిరుద్యోగిత 6.95 శాతం ఉంటే ఆగస్టులో అది 8.32 శాతం. తరచి చూస్తే జూలై నెలలో పుంజుకున్నట్టు కనబడిన ఉపాధి అవకాశాలన్నీ సాగు రంగానికి సంబంధించినవేనని అర్థమవుతుంది. వానాకాలంలో వ్యవసాయ సంబంధ కార్యకలాపాలు జోరందుకోవడం ఇందుకు ప్రధాన కారణం. 

జీడీపీ గణాంకాలు చూసి, స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెడుతున్న తీరు చూసి మన ఆర్థిక వ్యవస్థ క్రమేపీ సాధారణ స్థితికి చేరుకుంటున్నదన్న అభిప్రాయం మధ్య తరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్లో కనబడుతోంది. కానీ జీడీపీని, స్టాక్‌ మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలు వేరే ఉంటాయి. వాటికి క్షేత్ర స్థాయి వాస్తవాలతో పెద్దగా సంబంధం ఉండదు. ఉదాహరణకు సీఎంఐఈ ప్రకారం 2,546 కంపెనీల నికర అమ్మకాలు 2019 జూన్‌ త్రైమాసికం స్థాయికి చేరకపోయినా, వాటి నికర లాభాలు మాత్రం కరోనా మహమ్మారికి ముందునాటికన్నా బాగున్నాయి.

వ్యయంలో భారీగా కోత వేయడం వల్లే ఇది సాధ్యమైందని నిశితంగా పరిశీలిస్తే తెలుస్తుంది. పెరిగిన ముడి సరుకుల వ్యయాన్ని తగ్గించుకోవడం ఎటూ సాధ్యం కాదు. ఏతా వాతా కోత పడేది ఉద్యోగాల్లోనే. అలాగే వడ్డీ రేట్ల పెంపుదల ఉండదని ఆర్‌బీఐ చెప్పడంతో స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ఉన్నాయి. మొత్తానికి గత ఏడాది ఇదే సమయంలో అట్టడుగుకు పడిపోయిన వృద్ధితో పోల్చడం వల్లే ఈసారి జీడీపీ మెరుగ్గా ఉన్నట్టు కనబడుతోంది. స్థూల ఆర్థిక వ్యవస్థ పుంజుకోనిదే ఉపాధి అవకాశాలుండవు. ప్రజల కొనుగోలు శక్తి పెరగదు. ఇవి సాధ్యం కావాలంటే కేంద్ర వ్యయం భారీగా పెరగాలి.

పెట్రో ఉత్పత్తులపై పరోక్ష పన్నుల భారం తగ్గించాలి. ద్రవ్య లోటును అదుపు చేయడం ప్రధానమే. కానీ ఉపాధి అవకాశాలనూ, కొనుగోలు శక్తినీ పెంచకుండా కృత్రిమంగా పైకి ఎగబాకే వృద్ధి రేటును చూసి ఎన్నాళ్లు సంతృప్తి పడతాం? కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.  
(చదవండి: టీకాలకు లొంగని కోవిడ్‌ ఎంయూ వేరియంట్‌!)

మరిన్ని వార్తలు