కాంగ్రెస్‌లో కుదుపు

25 Aug, 2020 00:40 IST|Sakshi

న్యూఢిల్లీ: రెండురోజులపాటు మీడియాలో హోరెత్తిన కాంగ్రెస్‌ అంతర్గత సంక్షోభం తాత్కాలికంగా సద్దుమణి గింది.  ఏడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ) భేటీలో అధ్యక్ష పదవికి తగిన నాయకత్వాన్ని అన్వేషించే ప్రక్రియ ప్రారంభించాలని సభ్యులకు సూచించి, ఆర్నెల్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగుతానని సోనియాగాంధీ ప్రకటించారు. ఇది టీ కప్పులో తుపానో, కాంగ్రెస్‌ పనిపట్టడానికి పుట్టుకొచ్చిన ముసలమో తేలడానికి మరికొంతకాలం పడుతుంది. ‘పార్టీ భవిష్యత్తు పెను ప్రమాదంలో పడింది. దేశం కూడా సంక్షోభంలోవుంది. అందుకే మేం అన్నిటినీ దాపరికంలేకుండా, నిర్మొహమాటంగా తేటతెల్లం చేసే బాధ్యతను మా భుజస్కంధాలపై వేసు కున్నాం’ అంటూ పార్టీలోని 23మంది సీనియర్‌ నేతలు సోనియానుద్దేశించి లేఖ రాయడం తాజా సంక్షోభానికి మూలం. ఈ లేఖరాసినవారు సాధారణ నాయకులు కాదు. వీరిలో అత్యధికులు పార్టీలో మొదటినుంచీ వున్నవారు, పైపెచ్చు సోనియాకు వీర విధేయులుగా ముద్రపడినవారు.

\ఆమె తరఫున వ్యవహారాలన్నీ చక్కబెడుతూ వచ్చినవారు. గులాంనబీ ఆజాద్‌ మొదలుకొని వీరప్ప మొయిలీ వరకూ దాదాపు అందరూ కాంగ్రెస్‌లో తలపండినవారు. పక్షం రోజులక్రితం రాసిన ఈ లేఖ ముఖ్య ఉద్దేశం పార్టీ ప్రక్షాళన. ప్రస్తుత నాయకత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైందని లేఖ ఆరోపించింది. పూర్తికాలం పనిచేసే నాయకత్వం ఇటు ఏఐసీసీలోనూ, అటు పీసీసీల్లోనూ అత్య వసరమని వీరు కుండబద్దలుకొట్టారు. ఇవి తమ అభిప్రాయాలు మాత్రమే కాదని... పార్టీలో తాము  సంప్రదించిన దాదాపు మూడొందలమంది మనోభావం కూడా ఇదేనని ఈ నేతలంటున్నారు. నిరుడు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోరపరాజయం పాలైనప్పుడు అందుకు నైతిక బాధ్యత వహిస్తున్నానని రాహుల్‌ పార్టీ అధ్యక్ష పదవినుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత చాన్నాళ్లపాటు ఆయన్ను బతిమాలే కార్యక్రమం కొనసాగింది. అవేమీ ఫలించకపోవడంతో కొందరు ఇదే అదునుగా ప్రియాంకగాంధీని రంగంలోకి దించుదామనుకున్నారు. తానే కాదు, తన సోదరి కూడా పార్టీ బాధ్య తలు తీసుకోబోరని ఆమె తరఫున కూడా రాహులే చెప్పారు. దాంతో గత్యంతరంలేక పార్టీ అధ్యక్ష బాధ్యతల్ని మళ్లీ సోనియాగాంధీయే తీసుకున్నారు. అయితే ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, తన స్థానంలో మరొకరొస్తారని ఆమె చెప్పారు. అలా చెప్పి కూడా ఏడాదవుతోంది. ఇప్పుడూ అదే మాట అంటున్నారు. అంటే ఈ మొత్తం ఎపిసోడ్‌తో పార్టీలో వచ్చిన మార్పేమీ లేదన్నమాట!

సంక్షోభాలు వచ్చినప్పుడు ప్రదర్శించే చాకచక్యతే నాయకత్వ పటిమను నిగ్గుతేలుస్తుంది. ఈ సంగతి గ్రహించివుంటే తాజా లేఖను కాంగ్రెస్‌ ఒక సువర్ణావకాశంగా పరిగణించేది. ఎందుకంటే రాహుల్‌ ఆ పదవి వద్దంటున్నారు. ఈమధ్యే ప్రియాంక సైతం ఆ మాటే చెప్పారు. తాను తాత్కాలిక అధ్యక్షురాలినని ఏడాదిగా సోనియా అంటున్నారు. నాయకత్వ సమస్యను ఈ లేఖ ప్రధాన అంశంగా ఎజెండాలోకి తీసుకొచ్చిన ఈ తరుణంలోనే దాన్ని తేల్చడానికి సిద్ధపడివుంటే అది పార్టీకి తోడ్పడేది. కానీ దురదృష్టమేమంటే ఏడాదికాలంగా వుంటున్న ఆ సమస్యను గాంధీ కుటుంబం తమకు అలవాటైన రీతిలో ఇంకా నాన్చదల్చుకున్నదని సీడబ్ల్యూసీ భేటీ రుజువు చేసింది. తమకు నాయ కత్వం మోజు లేదంటూనే లేఖ కోరినట్టు నాయకత్వ మార్పునకు సిద్ధపడదామని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వకపోవడంలో ఆంతర్యం ఏమిటి? పైగా లేఖ రాసినవారిపై రాహుల్, సోనియాలు చేశా రని చెబుతున్న వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ‘పార్టీ ఒకపక్క మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో పోరాడుతున్న తరుణంలో ఈ లేఖ రాశారని, వారంతా బీజేపీతో కుమ్మక్కయ్యారని భావించవలసి వస్తుందని రాహుల్‌ అన్నట్టు మీడియాలో గుప్పుమంది. అయితే తానలా అనలేదని రాహుల్‌ వివరణ నిచ్చుకున్నారు. లేఖ రాసినవారిపై తనకు కోపం లేదని సోనియా చెప్పడం, జరిగిందేదో జరిగింద నడం మాత్రం సరైన సంకేతాలు పంపదు. తాను ఏడాదిగా వ్యక్తం చేస్తున్న అభిప్రాయాన్ని లేఖ ప్రతి బింబిస్తున్నప్పుడు ఆ విషయమే ఆమె నేరుగా చెప్పాల్సింది. 

అయితే ఈ లేఖ రాసినవారు పార్టీలో తలెత్తిన సంక్షోభం నుంచి తమను తాము వేరు చేసుకుని మాట్లాడటం వింతగా అనిపిస్తుంది. వీరెవరూ సాధారణ కార్యకర్తలో, మధ్యశ్రేణి నేతలో కాదు. ఆ పార్టీ ఈ దుస్థితికి చేరడంలో వీరి పాత్ర కాదనలేనిది. కానీ ఆ మాదిరి ఆత్మవిమర్శ మచ్చుకైనా ఇందులో కనబడదు. ఇప్పుడు అధికార వికేంద్రీకరణ గురించి, పీసీసీల బలోపేతం గురించి, పార్ల మెంటరీ పార్టీ సమావేశాలు నామమాత్రంగా జరగడం గురించి వీరంతా ఏకరువు పెడుతున్నారు. రాష్ట్రాల ఇన్‌చార్జిలుగా వున్నప్పుడు, కేంద్ర నాయకులుగా వెలిగిపోయినప్పుడు తాము ఏం చేశారో ఈ నేతలకు గుర్తులేదనుకోవాలా, లేక ఎవరికీ అవి గుర్తుండవని భావిస్తున్నారనుకోవాలా? పార్టీలో సమర్థులుగా ముద్రపడి, క్రియాశీలంగా వుంటున్నవారిపై లేనిపోని అపోహలు కలిగించి, కట్టడి చేయడానికి ప్రయత్నించిన నేతలు... పెత్తనం చలాయిద్దామని చూసిన నేతలు ఈ జాబితాలో చాలా మందే వున్నారు. పదకొండేళ్లక్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ ఆకస్మిక మరణా నంతరం ఆయన కుటుంబాన్ని ఇబ్బందులుపాలు చేసి, ఆయన కుమారుడు జగన్‌మోహన్‌ రెడ్డిని అక్రమ కేసుల్లో ఇరికించి జైలు పాలు చేసిన సందర్భంలో ఆజాద్‌ చేసిన వ్యాఖ్య ఎవరూ మరిచిపోరు. ‘ఆయన మా మాట వినివుంటే కేంద్రమంత్రి అయ్యేవారు. ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు’ అని ఆజాద్‌ తలబిరుసుగా మాట్లాడారు. ఆ కుటుంబంపట్ల ఈ తీరు సరికాదని చెప్పినవారు వీరిలో ఒక్కరైనా వున్నారా? ఇప్పుడు అధినాయకత్వాన్ని వేలెత్తి చూపి ఘనకార్యం చేశామనుకోవడానికి ముందు పార్టీలో ఇన్నేళ్లుగా తమ పాత్రేమిటో వీరు తేటతెల్లం చేస్తే బాగుండేది. ఏదేమైనా అడ్‌హాకిజంతో కాంగ్రెస్‌ ఎన్నాళ్లు నెట్టుకొస్తుందో, ఈ అసమ్మతి నేతల తదుపరి వ్యూహమేమిటో వేచిచూడాలి. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా