స్వపక్షంలో విపక్షం

25 Aug, 2021 23:58 IST|Sakshi

‘నాలుగున్నరేళ్ళుగా ప్రభుత్వం సరిగ్గా పని చేయట్లేదు. ఈ ముఖ్యమంత్రి గద్దె దిగాలి’... ఎవరైనా పంజాబ్‌లోని ఈ మాటలు వింటే, ప్రతిపక్షాల వ్యాఖ్యలని అనుకుంటాం. అయిదు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలొస్తున్న వేళ ఇలాంటి విమర్శలు సాధారణమేగా అని సర్దుకుంటాం. కానీ, ఆ విమర్శలు సంధిస్తున్నది విపక్షాలు కాదు... సాక్షాత్తూ అధికార కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న 77 మంది ఎమ్మెల్యేలలో 30 మంది ఎమ్మెల్యేలు! వారు గద్దె దిగాలని కోరుతున్న కెప్టెన్‌ అమరిందర్‌ సింగ్‌ క్యాబినెట్‌లోనే పనిచేస్తున్న నలుగురు మంత్రులు! ముఖ్యమంత్రి అమరిందర్‌కూ, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) తాజా అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూకూ మధ్య కొన్నాళ్ళుగా రేగుతున్న వైరానికి ఇది పరాకాష్ఠ. 

ప్రజల్లో ఎలా ఉన్నా, పార్టీలో అంతర్గతంగా పంజాబ్‌ కాంగ్రెస్‌ పరిస్థితి బాగా లేదనడానికి కొద్ది వారాలుగా ఇలాంటి ఎన్నో సంఘటనలు ఉదాహరణలు. మోదీ వ్యతిరేకతే అజెండాగా విపక్షాలన్ని టినీ ఒకతాటి మీదకు తీసుకురావాలని జాతీయస్థాయిలో కాంగ్రెస్‌ తాపత్రయపడుతోంది కానీ, ఆ పార్టీ సత్వరమే సొంత ఇల్లు చక్కదిద్దుకోవాల్సి ఉందన్న మాట. నాలుగున్నరేళ్ళుగా తిరుగులేకుండా ఏలినచోట ఇలాంటి పరిస్థితి రావడం పార్టీ స్వయంకృతాపరాధమే. పాపులారిటీ ఉన్న సిద్ధూను బుజ్జగించడం కోసం, ముఖ్యమంత్రి వద్దన్నా సరే సరిగ్గా నెల క్రితం పీసీసీ పీఠమెక్కించింది అధి ష్ఠానమే! రాష్ట్రంలో విద్యుత్‌ అంశం, అవినీతి సహా అనేక అంశాలపై సిద్ధూ విమర్శలు ఎక్కుపెట్టినా, సహించి, భరించిందీ వారే! పీసీసీ పగ్గాలు తీసుకున్న వేదికపైనే, సీఎంపై అన్యాపదేశంగా విమ ర్శలు సంధించి మాజీ క్రికెటర్‌ సిద్ధూ తాను ‘టీమ్‌ ప్లేయర్‌’ని కానని నిరూపించుకున్నారు. 

సరిహద్దు సమస్య, సాగు చట్టాలపై రైతు ఉద్యమం లాంటి అంశాలెన్నో పంజాబ్‌ ముందున్నాయి. కానీ, సిద్ధూ తన సలహాదారుల పేరిట కొత్తగా సమాంతర మంత్రివర్గం నడిపే ప్రయత్నం చేశారు. ఒకప్పుడు అమరిందర్‌కు రాజకీయ కార్యదర్శిగా చేసి, ఇప్పుడు సిద్ధూకు సలహాదారైన మల్విందర్‌సింగ్‌ మాలీ కశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. ఆ మాటల్ని తప్పుబట్టిన కెప్టెన్‌ అండ్‌ కోను ‘ఆలీబాబా 40 దొంగలు’ అని మాలీ ఎదురుదాడి చేసినా, సిద్ధూ పెదవి విప్పలేదు. పాకిస్తానీ మహిళా జర్నలిస్టుతో అమరిందర్‌ ఉన్న ఓ ప్రైవేట్‌ ఫోటోతో రచ్చ చేసినా కిమ్మనలేదు. చివరకు పంజాబ్‌లో ఇద్దరు సర్దార్ల మధ్య పోరు తారస్థాయికి చేరి, కెప్టెన్‌పై అంతర్గత తిరుగుబాటు సంకేతాలిచ్చింది. అధిష్ఠానం బుధవారం కళ్ళు తెరిచి, 2022 ఎన్నికలకు కెప్టెన్‌ సారథ్యాన్ని మార్చే ప్రశ్నే లేదని దూతల ద్వారా చెప్పాల్సి వచ్చింది. సిద్ధూ బృందం మాత్రం సోనియాను కలుస్తానంటోంది. ఈ పరిణామాలు ప్రతిపక్ష అకాలీదళ్‌లో, బీజేపీలో ఆశలు రేపుతున్నాయి. 

ఇతర రాష్ట్రాల్లోనూ కలహాలతో కాంగ్రెస్‌ కొట్టుమిట్టాడుతోంది. ఛత్తీస్‌గఢ్‌లోనూ సీఎం భూపేశ్‌ బాఘేల్‌కూ, ఆ పీఠం ఆశిస్తున్న ఆయన మాజీ మిత్రుడు – ఆరోగ్యమంత్రి టి.ఎస్‌. సింగ్‌ దేవ్‌కూ పొసగడం లేదు. రాజకుటుంబీకుడూ, రాష్ట్రంలోకెల్లా ధనిక ఎమ్మెల్యే అయిన దేవ్‌కు తొలి రెండున్నరేళ్ళ తర్వాత అధికారం అప్పగించాలనేది 2018లోనే బాఘేల్‌తో చేసుకున్న అనధికారిక ఒప్పందం. రెండున్నరేళ్ళు దాటినా ఇప్పటి దాకా అధికార పగ్గాలు అప్పగించట్లేదని దేవ్‌ బాధ. చివరకు పంచాయతీ ఢిల్లీకి చేరింది. మంగళవారం రాహుల్‌ మూడు గంటలు చర్చలు జరపాల్సి వచ్చింది. పక్కా కాంగ్రెస్‌వాది దేవ్‌కు ప్రభుత్వ నిర్వహణలో మరింత భాగం కల్పించాలన్నది రాజీ ఫార్ములా. 

ఇక, రాజస్థాన్‌లో సీఎం అశోక్‌ గెహ్లాట్‌కు సచిన్‌ పైలట్‌ బద్ధవిరోధిగా మారారు. ఈ మాజీ ఉప ముఖ్యమంత్రి మద్దతుదారులు మంత్రివర్గ విస్తరణ చేయాలనీ, తమ వర్గానికి రాజకీయ పదవులు కట్టబెట్టాలనీ కొంతకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. గెహ్లాట్, పైలట్‌ వర్గాల మధ్య అధిష్ఠానం సంధి కుదిర్చి, ఇప్పటికే ఏడాది దాటింది. అప్పుడిచ్చిన హామీలు నెరవేర్చకుండా గెహ్లాట్‌ సాచివేత ధోరణికి పాల్పడుతున్నారని వారి ఆక్రోశం. ‘సర్కారుకు మద్దతిస్తున్న స్వతంత్ర శాసనసభ్యులకూ, కాంగ్రెస్‌లో చేరిన బీఎస్పీ ఎమ్మెల్యేలకూ పదవులు ఇవ్వాలిగా’ అన్నది గెహ్లాట్‌ వాదన. 

అధికారంలో లేని కర్ణాటక, గుజరాత్‌లలోనూ కాంగ్రెస్‌ నేతల మధ్య విభేదాలు బోలెడు. ఆ మాటకొస్తే – కాంగ్రెస్‌ అధినాయకత్వానికీ సవతిపోరు తప్పట్లేదు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యాక అధ్యక్ష పీఠం నుంచి రాహుల్‌ పక్కకు తప్పుకున్నారు. చేసేది లేక సోనియా పగ్గాలు చేపట్టారు. కానీ, పార్టీకి కావాల్సింది పూర్తికాలిక, క్రియాశీలక నాయకత్వమంటూ 23 మంది సీనియర్‌ నేతలు కొద్ది నెలలుగా తిరుగుబాటు స్వరం వినిపిస్తూనే ఉన్నారు. గత ఏడాది ఆగస్టు మొదలు ఈ ‘జి–23’ నేతల గొంతు పైకి లేస్తున్నా, అధిష్ఠానం ఇల్లు చక్కదిద్దుకోవట్లేదు. ఇంట్లోనే ఇన్ని సమస్యలున్నా, కాంగ్రెస్‌ జాతీయస్థాయిలో ప్రతిపక్ష ఐక్యతపై దృష్టి పెట్టడం విచిత్రం.

దేశంలో ఇప్పుడు కాంగ్రెస్‌ సొంతకాళ్ళపై అధికారంలో మిగిలినదే– పంజాబ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో! అమరిందర్‌ భార్య ప్రణీత్‌ కౌర్‌ అన్నట్టు... ఇది పార్టీ ఐక్యంగా నిలవాల్సిన సమయం. సమస్యలుంటే అంతర్గతంగా మాట్లాడుకొని, సర్దుకోవాల్సిన సందర్భం. ఇలా వీధికెక్కి, మాటల తూటాలను పేల్చుకుంటూ పోతే – పంజాబ్‌ సైతం చేజారినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే కాంగ్రెస్‌ నేతలు తమను తామే నిందించుకోవాలి. ఎందుకంటే – సుశిక్షిత సైనికుడైన అమరిందర్‌ ఉండగా సిద్ధూ ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ వైపు మొగ్గుతాడనే భయంతో పీసీసీ పీఠమిచ్చిందీ, రెండు అధికార కేంద్రాలకు దోవ చూపిందీ అధిష్ఠానమే. అవును... రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలే ఉంటాయి. 

మరిన్ని వార్తలు