నంబి నారాయణన్‌: ఎట్టకేలకు న్యాయం

17 Apr, 2021 00:48 IST|Sakshi

నిప్పులాంటి నిజాయితీపరుడైన శాస్త్రవేత్తపై గూఢచారిగా ముద్రేసిన కుట్రదారులెవరో నిర్థారించడం కోసం సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించటం స్వాగతించదగ్గ నిర్ణయం. 1994లో కొందరి కుట్ర ఫలితంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త నంబి నారాయణన్‌ ఒక నకిలీ కేసులో ఇరుక్కున్నారు. విలువైన తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిగత జీవితాన్ని కోల్పోయి అనేక విధాలుగా అవమానాలకు లోనయ్యారు. ఆయనా, ఆయన కుటుంబం చెప్పనలవికాని ఇబ్బందులు చవిచూశారు. అయినా నారాయణన్‌ అలుపెరగని పోరాటం సాగించారు.

1998లో సీబీఐ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఈ కేసు నుంచి ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది. పరిహారం కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌కి స్పందించి ఆయనకు రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని 2018లో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  కానీ నంబి నారాయణన్‌ అంతటితో సంతృప్తి చెందలేదు. ఈ నకిలీ కేసు వెనకున్న అధికారులెవరో, వారి ఉద్దేశాలేమిటో దర్యాప్తు చేయించాలని రాష్ట్ర హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీన్ని ముగిసిన అధ్యాయంగా భావించాలని ఆ న్యాయస్థానం ఇచ్చిన సలహాతో సంతృప్తిచెందకుండా సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశారు. ఫలితంగా ధర్మాసనం సుప్రీం మాజీ న్యాయమూర్తి జైన్, మరో ఇద్దరు అధికారులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఇప్పుడు ఆ కమిటీ నివేదిక పర్యవసానంగానే తాజా తీర్పు వెలువడింది.

మన దేశంలో నచ్చనివారిని తప్పుడు కేసుల్లో ఇరికించటం, ఏ స్థాయి వ్యక్తులనైనా అధఃపాతాళానికి నెట్టేయడం ఎంత సులభమో ఇస్రో గూఢచర్యం కేసు నిరూపించింది. ఈ కేసులో నిందితుడిగా ముద్రపడటం వల్ల నంబి నారాయణన్‌ వ్యక్తిగా చాలా కోల్పోయారన్నది వాస్తవం. కానీ అంతకన్నా ఎక్కువగా మన దేశం నష్టపోయింది. గూఢచారిగా ముద్రపడి దేశవ్యాప్తంగా మీడియాలో పతాకశీర్షికకు ఎక్కేనాటికి నంబినారాయణన్‌ ఇస్రోలో క్రయోజెనిక్‌ ఇంజన్‌ రూపొందించే విభాగానికి ప్రాజెక్టు డైరెక్టర్‌. వీసా గడువు తీరినా దేశంలోనే వున్న మాల్దీవుల మహిళ మరియం రషీదాను 1994 అక్టోబర్‌లో అరెస్టు చేసినప్పుడు ఆ మహిళతో ఆయనకు ఎందుకు సంబంధం అంటగట్టారో, ఏం ఆశించి పోలీసులు ఆ పనిచేశారో తెలియడానికి సీబీఐ జరపబోయే దర్యాప్తు పూర్తి కావాలి. ఆ కట్టుకథ మాయలో పడి ఆరోజుల్లో మీడియా ‘గూఢచారి నంబి’ గురించి కోడై కూసింది.

తాము స్వయంగా అక్కడుండి చూసినట్టు నారాయణన్‌ ఆమె వ్యామోహంలో చిక్కుకుని అత్యంత కీలకమైన క్రయోజెనిక్‌ ఇంజన్‌ డ్రాయింగ్‌లను ఆమె చేతుల్లో పెట్టిన వైనం గురించి పుంఖానుపుంఖాలుగా కథనాలు అల్లింది. ఇది నిజానికి హాస్యాస్పదమైన కేసు. క్రయోజెనిక్‌ ఇంజన్‌పై మన శాస్త్రవేత్తలు ఇంకా పరిశోధనలు కూడా మొదలుపెట్టకుండానే దానికి సంబంధించిన సమస్త పరిజ్ఞానాన్ని శత్రువుల చేతిలో పెట్టినట్టు పోలీసులు కట్టుకథ అల్లారు. క్రయోజెనిక్‌ పరిజ్ఞానాన్ని అందజేయడానికి పుర్వపు సోవి యెట్‌ యూనియన్‌ అంగీకరించిన దగ్గరనుంచి అమెరికా మనపై కడుపుమంటతో వుంది. ఆ ఒప్పందాన్ని ఆపాలని అది ప్రయత్నిస్తున్న తరుణంలోనే సోవియెట్‌ యూనియన్‌ కుప్పకూలింది. అయితే దాని స్థానంలో ఆవిర్భవించిన రష్యా ఈ విషయంలో మనపట్ల సానుకూలంగానే వున్నా, అప్పట్లో మనం జరిపిన అణు పరీక్షలను సాకుగా చూపి క్రయోజెనిక్‌ పరిజ్ఞానాన్ని భారత్‌కు ఇవ్వడానికి వీల్లేదంటూ అమెరికా ఒత్తిడి తెచ్చి ఆపించింది.

భూ స్థిర కక్ష్యలోకి భారీ ఉపగ్రహాలను పంపాలంటే ఆ పరిజ్ఞానం మినహా ఇస్రోకు గత్యంతరం లేదు. రష్యా సహాయ నిరాకరణతో దాన్నొక సవాలుగా తీసుకున్న ఇస్రో శాస్త్రవేత్తలు అందుకోసం నంబి నేతృత్వంలో దేశీయ పరిజ్ఞానం అభివృద్ధికి ఒక ప్రాజెక్టు ఏర్పాటుచేశారు. కానీ ఆరంభ దశలోనే ఈ ఉచ్చులో చిక్కుకుని ఆ ప్రాజెక్టు కాస్తా మూలనపడింది. దీన్నుంచి కోలుకొని, ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించి విజయం సాధించటానికి ఇస్రో శాస్త్రవేత్తలకు రెండు దశాబ్దాలు పట్టింది. 2014 జనవరిలో తొలి దేశీయ క్రయోజెనిక్‌ ఇంజన్‌ సాకారమైంది. ఈలోగా వేరే అంతరిక్ష సంస్థల సాయం తీసుకోవడం వల్ల మనకు భారీ వ్యయం తప్పలేదు. రష్యా క్రయోజెనిక్‌ ఇంజన్‌ వ్యయం రూ.100 కోట్లు కాగా, మన శాస్త్రవేత్తలు రూ. 40 కోట్లకే దాన్ని నిర్మించగలిగారు. 

ఈ నకిలీ కేసులో విదేశాల పాత్ర గురించి, వారితో స్థానిక పోలీసుల కుమ్మక్కు గురించి అనంతరకాలంలో ఎన్నో కథనాలు వచ్చాయిగానీ... ఆనాటి రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దల మధ్య సాగిన అధికార కుమ్ములాటల ఫలితంగానే ఇది పుట్టుకొచ్చిందని, ఒక వర్గానికి కేరళ పోలీసులు అన్నివిధాలా సహకరించి ఇంత పెద్ద కుట్ర కథనాన్ని పకడ్బందీగా అల్లారని వెల్లడైంది. దేశంలో విచారణలో వున్న ఖైదీల్లో అత్యధికులు ఇలా తప్పుడు కేసుల్లో ఇరుక్కొని విలవిల్లాడుతున్నవారేనని మానవ హక్కుల సంఘాలు లోగడ పలుమార్లు గణాంకసహితంగా నిరూపించాయి.

క్రిమినల్‌ కేసుల్లో నిర్దోషులుగా విడుదలైనవారికి పరిహారం చెల్లించే విధానానికి రూపకల్పన జరగాలని, కారకులైన అధికారులపై చర్యలుండాలని ఆ సంఘాలు కోరుతున్నాయి. నంబి నారాయణన్‌ ఉన్నత స్థాయి శాస్త్రవేత్త గనుక ఆయనకు పరిహారం లభించింది. ఆయన కోరుకున్నట్టు ఈ నకిలీ కేసును నడిపించిన అప్పటి పోలీసు అధికారులపై సీబీఐ దర్యాప్తు జరగబోతోంది. కానీ సామాన్య పౌరుల మాటేమిటి? అందుకే అందరికీ సమానంగా న్యాయం దక్కేందుకు అనువైన చట్టం రూపొందాలి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి.

మరిన్ని వార్తలు