కడకు కరోనా కూడా...!

18 Jun, 2021 00:54 IST|Sakshi

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకి... ఉన్నవాళ్లు, లేనివాళ్లనే వ్యత్యాసం లేదు. అందరిపైనా అది ఒకేలా ప్రభావం చూపుతోంది, అన్నది సాధారణ భావన! ఉపరితలం నుంచి చూస్తే అలానే కనిపించినా.. లోతుల్లోకి వెళితే అది తప్పని తేలుతోంది. విరుద్ధ పరిస్థితి క్షేత్రంలో నెలకొంది. ఈ కోవిడ్‌–19 కాలంలో పేదలు మరింత పేదలవుతుంటే, సంపన్నులు ఇంకా సంపన్నులౌతున్నారు. దేశంలోని కోట్లాది మంది వ్యయస్తోమత దారుణంగా పడిపోయింది. రానురాను కొన్ని కుటుంబాల్లో జరుగుబాటు దుర్భరమయ్యే పరిస్థితి! ప్రయివేటు వినియోగం నలభయ్యేళ్ల కనిష్టానికి (9 శాతం) అడుగంటింది. గత పదహారు నెలల్లో దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాల్ని గమనిస్తే, ఇదే ధ్రువపడుతోంది. పేద, అల్ప, మధ్యాదాయ వర్గాలకు చెందిన మెజారిటీ కుటుంబాల పరిస్థితి నేడెంతో దయనీయంగా ఉంది. మధ్యతరగతిపైనా కోవిడ్‌ పెద్ద దెబ్బే కొట్టింది. కుటుంబ సభ్యులు కరోనా బారిన పడి, సంపాదించే వ్యక్తిని పోగొట్టుకున్న వారు, ఆస్పత్రిపాలై పెద్ద మొత్తాల్లో ఫీజులు కట్టాల్సి వచ్చిన వారి దుస్థితి వేరే చెప్పనక్కర్లేదు. ధనిక–పేద మధ్య అంతరం సహజంగానే ఏటా పెరుగుతున్నట్టు ప్రపంచ ఆర్థిక నివేదికలు చెబుతూనే ఉన్నాయి. దురదృష్టమేమంటే, కోవిడ్‌ పాడుకాలంలోనూ అదే దుస్థితి పునరావృతమౌతోంది! అది కూడా రెట్టించిన ప్రభావంతో, తీవ్ర రూపంలో ఉండటమే ఆందోళనకరం. ఏడాదిన్నర కాలంగా కొత్త ఉద్యోగాలు పెద్దగా రాలేదు. ఉన్న ఉద్యోగాలు ఊడుతున్నాయి. ముఖ్యంగా అసంఘటిత రంగంలో! చాలా చోట్ల జీతాలు, వేతనాల్లో కోతలు అమలవుతున్నాయి. వ్యాపార–సేవా రంగాల్లో వస్తున్న రాబడులు రమారమి తగ్గాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సంస్థలే కాకుండా ఓ మోస్తరు కంపెనీలు కూడా మూతపడు తున్నాయి. పర్యాటక, ప్రయాణ, హోటల్, వినోద, విహార, విలాస... ఇలా పలు రంగాలు స్తంభిం చాయి. ఉపాధిపోయి ఉద్యోగులు, కార్మికులు రోడ్డున పడుతున్నారు. కోవిడ్‌ తొలి, రెండో అల ఉధృతిలోనూ తిరోగమన వలసలు పెరిగి, దిన కూలీల కళ్లల్లో నీళ్లు, జీవితాల్లో దిగుళ్లే మిగిలాయి.

సంపన్నులు మరింత సంపన్నులు అవుతున్నారనడానికి ఎక్కువ ఉదాహరణలు అవసరం లేదు. షేర్‌ మార్కెట్లో... సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు పైపైకి వెళుతూ ఏ రోజుకారోజు కొత్త రికార్డులు బద్దలు కొట్టడం దేనికి సంకేతం? కొందరు పెట్టుబడిదారులు, ప్రమోటర్లు, దళారీ వ్యవహారకర్తలు...  ఇబ్బడిముబ్బడిగా సంపదను పెంచుకోవడం మన కళ్లముందరి వాస్తవం! కోవిడ్‌ దుర్భర కాలం లోనూ పెద్ద మొత్తాల్లో వార్షికాదాయాలు పెంచుకొని ప్రపంచ కుబేరుల జాబితా (బ్లూమ్‌బర్గ్‌)లో పైపైకెగబాకిన మన అంబానీ, అదానీలు తాజా స్థితికి మరో సాక్ష్యం! అంబానీ ఈ ఏడాదిలోనే 7.62 బిలియన్‌ డాలర్ల (రూ.55,802 కోట్లు) ఆదాయం పెంచుకొని 84 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.6.15 లక్షల కోట్లు) సంపన్నుడయారు. ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో 12 స్థానం దక్కించుకున్నారు. ఇక అదానీది శీఘ్ర ప్రగతి! కోట్లాది కుటుంబాలు కోవిడ్‌ కోరల్లో విలవిల్లాడిన ఈ సంవ త్సరమే... 43.2 బిలియన్‌ డాలర్ల ఆదాయం కొత్తగా గడించి, మొత్తమ్మీద 77 బిలయన్‌ డాలర్ల (దాదాపు రూ.5.64 లక్షల కోట్లు) సంపద గడించి 14 వ స్థానానికి ఎదిగారు. ప్రపంచ సంపన్నుల జాబితాల్లో, ఆర్థిక నివేదికల్లో, కార్పొరేట్‌ సంపద వృద్ధి రేఖల్లో ఇది కొట్టొచ్చినట్టు కనిపించే.... ‘దాచేస్తే దాగని సత్యం!’ దురదృష్టకరంగా అదే సమయంలో... మరో 23 శాతం మంది భారతీ యులు దారిద్య్ర రేఖ (బీపీఎల్‌) కిందికి నిర్దాక్షిణ్యంగా జారిపోయారు. అంటే, పేదలు మరింత పేదరికంలోకి నెట్టబడటం! ఇది, అజీమ్‌ప్రేమ్‌జీ (విప్రో) వర్సిటీ అధ్యయన నివేదిక! ఇంకో లెక్క ప్రకారం ఈ శాతం ఇంకా ఎక్కువే అంటారు. దేశంలోని కోట్ల కుటుంబాలకు ఆరోగ్యభద్రత కరువై మూమూలుగానే ఏటా 6.3 కోట్ల మంది దారిద్య్రరేఖ దిగువకి వెళుతున్నట్టు నీతి ఆయోగ్‌ వెల్లడిం చింది. మే మొదటి వారంలో 7.29 శాతంగా ఉన్న నిరుద్యోగిత, పది రోజుల తర్వాత 14.34 శాతా నికి (దాదాపు రెట్టింపు) పెరిగింది. ఈ ఏడాది తొలి అయిదు మాసాల్లోనే 2.5 కోట్ల ఉద్యోగాలు ఊడి పోయాయి. స్థూలంగా శ్రమజీవుల ఆదాయం 17 శాతం తగ్గినట్టు ఒక అధ్యయనం చెప్పింది.

దేశంలో నెలకొన్న ఆర్థిక స్థితిని లోతుగా మదింపు చేసిన ఇద్దరు ఆర్థిక నిపుణులు, సమాజంలో పెరుగుతున్న ఆర్థిక అంతరాల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. భారత రిజర్వ్‌బ్యాంకు మాజీ గవర్నర్లు వేర్వేరుగా మాట్లాడుతూ, అంతరాలు తగ్గించాలని నొక్కి చెప్పారు. కోవిడ్‌ నేపథ్యంలో... అసమ తుల్య ఆర్థిక పునరుజ్జీవనం సిద్ధాంతపరంగా తప్పు, రాజకీయంగా నష్టదాయకమన్నది దువ్వూరి సుబ్బారావు వ్యాఖ్య! దేశీయ మార్కెట్లలో ద్రవ్య లభ్యత, విదేశీ నిధుల ప్రవాహం వల్ల షేర్లు, ఇతర ఆస్తుల విలువ పెరగటాన్ని ఆయన ప్రస్తావించారు. మరోవైపు అసంఘటిత రంగంలో లక్షలాది కుటుంబాల ఇబ్బందుల్ని గుర్తు చేశారు. ‘జీడీపీ గణాంకాలు కొంత ఆశాజనకంగా ఉన్నా, వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించటం లేద’ని రఘురామరాజన్‌ వ్యాఖ్యానించారు. పబ్లిక్‌ వ్యయం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామీణ ఉపాధి హామీని మరింత విస్తరించడం, తిండి గింజలు, నిత్యా వసరాల్ని ఉచితంగా పంపిణీ చేయడం, అవసరమైతే నగదు పంపిణీ చేసి పౌరుల కొనుగోలు శక్తిని, సామర్థ్యాన్ని, భవిష్యత్తు పట్ల విశ్వాసాన్నీ పెంచాలని ఇద్దరూ సూచించారు. ప్రజాస్వామ్య హితైషులు ఎవరు కోరేదైనా ఒకటే, అశాంతికి, అలజడికి దారితీసే ఆర్థిక అంతరాలు తగ్గాలి! ఫలితంగా శాంతి వెల్లివిరియాలి. 

మరిన్ని వార్తలు