మరో మైలురాయికి సిద్ధమా?

19 Jul, 2022 01:20 IST|Sakshi

కరోనా ఇప్పటికీ ప్రపంచాన్ని పూర్తిగా వదిలిపెట్టలేదని వార్తలు వస్తున్న వేళ... ఆదివారం ఒకింత సంతోషకర సమాచారం వచ్చింది. మనదేశంలో వేసిన కోవిడ్‌–19 టీకా డోసుల సంఖ్య తాజాగా 200 కోట్ల మైలురాయిని చేరుకుంది. దేశ వయోజనుల్లో 96 శాతానికి కనీసం ఒక డోసు, 87 శాతానికి రెండు డోసులూ అందినట్లయింది. ప్రపంచంలోనే అతి పెద్ద టీకాకరణ కార్యక్రమంలో ఇది ఓ అరుదైన విన్యాసం. ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే, ‘భారతదేశం మరోసారి చరిత్ర సృష్టించింది.’ టీకాలపై అపోహలు, మందకొడి టీకాకరణ, టీకాల కొరత – ఇలా సవాలక్ష సమస్యలు ఎదురైనా, 2021 జనవరి 16న మొదలుపెట్టి, 18 నెలల్లో ఇన్ని కోట్ల కరోనా టీకా డోసులు వేయడం కచ్చితంగా చరిత్రే. కాకపోతే, ‘ముందు జాగ్రత్త మూడో డోసు’ను వయోజనులకు ఉచితంగా వేస్తామని ప్రభుత్వం ఇటీవల ప్రకటించే వేళకు దేశంలో గత నాలుగు నెలల్లోకెల్లా గరిష్ఠస్థాయికి మళ్ళీ కరోనా కేసులు పెరిగాయి. అలక్ష్యం వదలాలని అందరికీ గుర్తుచేస్తున్నాయి. 

మన దేశంలో తొలి శతకోటి డోసులకు 9 నెలలు పడితే, ఇప్పుడీ రెండో శతకోటి సంబరానికీ మళ్ళీ 9 నెలలే పట్టింది. టీకాలు వేయడంలో వేగం తగ్గలేదనడానికి ఇదే సాక్ష్యమని ప్రభుత్వ వర్గాలు ఢంకా బజాయిస్తున్నాయి. లెక్కల్లో చూస్తే అది నిజమే కానీ, క్షేత్రస్థాయిలో నిజంగా వేగం తగ్గలేదంటారా అన్నది విమర్శకుల ప్రశ్న. వ్యవస్థాగతంగా ప్రభుత్వ సత్వర జోక్యం వల్లే దేశీయంగా ఒకటికి మించి కరోనా టీకాలు బయటికొచ్చాయని కేంద్ర ఆరోగ్య మంత్రి జవాబు. దేశాన్ని ఇవే కాపాడాయనీ, ముఖ్యంగా ఈ ఏడాది థర్డ్‌ వేవ్‌లో భారత్‌లో మరణాలు తక్కువగా ఉన్నాయంటే అదే కారణమనీ మంత్రివర్యుల మాట.

దేశంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారీ ‘కోవిషీల్డ్‌’ 160 కోట్లు, భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘కోవాగ్జిన్‌’ 33.5 కోట్లు, బయొలాజికల్‌ ‘ఇ’ వారి ‘కోర్బెవ్యాక్స్‌’ 6.5 కోట్లు – ఇలా పిన్నపెద్దలకు ఒకటికి మూడు డోసుల వంతున మొత్తం 200 కోట్ల డోసుల మార్కు చేరగలిగాం. ఇప్పటి దాకా వేసిన డోసుల్లో దాదాపు 71 శాతం గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించినవే. అలాగే, మొత్తం డోసుల్లో 48.9 శాతం ఆడవారికి అందాయని లెక్క.

రెండేళ్ళ పైచిలుకు క్రితం అంతుచిక్కని మాయదారి రోగంతో యావత్‌ ప్రపంచంతో పాటు దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న అధిక జనాభా దేశం ఇప్పుడు కాస్తంత ఊపిరి పీల్చుకోవడం వెనుక ఎంతోమంది శాస్త్రవేత్తల, వైద్యుల, పలు వర్గాల ఫ్రంట్‌ లైన్‌ యోధుల అవిశ్రాంత కృషి ఉంది. దేశీయంగా టీకాల అభివృద్ధి, డోసులు వృధా కాకుండా నిరంతర సమీక్షలతో ప్రాధాన్యతా క్రమంలో సమర్థంగా టీకాలేస్తూ వచ్చిన విధానం, ప్రజలకూ – పాలకులకూ తక్షణ సమాచారం అందించే ‘కోవిన్‌’ పోర్టల్‌ – ఇలా అనేకం ఈ విజయానికి తోడ్పడ్డాయి. ఎవరేమన్నా కరోనాపై టీకాల యుద్ధంలో అనేక దేశాల కన్నా భారత్‌ ముందంజలో ఉంది.

ఐరోపా అంతటా కలిపి 130 కోట్ల డోసులైతే... మన దగ్గర 200 కోట్ల డోసులు వేయడం, మరో 23 కోట్లకు పైగా డోసుల్ని 50కి పైగా దేశాలకు ఎగుమతి చేయడం విశేషం. ఇవి కాక దాదాపు మరో 10 కోట్ల డోసులు నిల్వలో సిద్ధంగా ఉన్నాయి. అంటే, గత 18 నెలల్లో భారత్‌ దాదాపు 233 కోట్ల టీకా డోసులు ఉత్పత్తి చేసిందన్న మాట. ఇది రొమ్ము విరుచుకొనే విషయమే. 

ప్రపంచ జనాభాలో 17.5 శాతం, అందులోనూ 95 కోట్ల మంది వయోజనులూ ఉన్న దేశం మనది. ప్రతి ఇద్దరి మధ్య కనీసం నాలుగు భిన్నాభిప్రాయాలుంటాయనే ఇలాంటి దేశంలో ఇప్పటికి ఏడు విడతల్లో ఇంతమంది స్వచ్ఛందంగా టీకాకరణకు ముందుకొచ్చేలా చేయడం అంత సులభ మేమీ కాదు. అందులో ప్రభుత్వం విజయం సాధించింది. 75 రోజుల పాటు ఉచిత ‘ముందు జాగ్రత్త మూడో టీకా’ ప్రకటనతో మరోసారి ఊపు తేవాలని ప్రభుత్వ ప్రయత్నం.

ఇదీ విజయవంతమైతే, అయిదారు నెలల్లో 250 కోట్ల డోసుల మైలురాయినీ దాటేస్తాం. నిజానికి, 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళకు ఈ జనవరి 10 నుంచీ, 18 –59 ఏళ్ళ మధ్యవయసు వారికి ఏప్రిల్‌ 10 నుంచే ప్రభుత్వం మూడో డోస్‌కు వీలు కల్పించింది. అయినా, ఆరు నెలల్లో నూటికి అయిదుగురే వేయించుకున్నారు. రెండు, మూడు డోసుల మధ్య ఉండాల్సిన విరామాన్ని తొమ్మిది నెలల నుంచి ఆరు నెలలకు ఈ జూలై మొదట్లో సర్కార్‌ తగ్గించింది. అయినా అదే పరిస్థితి. 

ఉద్ధృతి తగ్గిందంటూ ఉదాసీనత ప్రజల్లో పేరుకుపోయిందనడానికి ఇది ఉదాహరణ. కానీ, కరోనా పూర్తిగా పోలేదని పెరుగుతున్న కేసులు తట్టి చెబుతున్నాయి. కొత్తగా మంకీ పాక్స్‌ కేసులు వెలుగు చూస్తుండడం ఆందోళనకరం. ప్రభుత్వం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.  మాస్కులు, ముందు జాగ్రత్త డోసు లాంటివి అశ్రద్ధ చేయవద్దని వైద్యులు చెవినిల్లు కట్టుకొని మరీ చెబుతున్నది అందుకే. కేంద్రం సైతం 18–59 ఏళ్ళ వారికి మూడో డోసుకు ఓకే చెప్పడానికి తాత్సారం చేసింది.

ప్రజారోగ్య రీత్యా ఏ మహమ్మారికైనా ఉచితంగా టీకా వేయాల్సిన పాలకులు 75 రోజులే ఉచితం అనడం సరికాదు. డబ్బులకే టీకా అంటే ఆరోగ్యంలోనూ ఆర్థిక, భౌగోళిక అంతరాలు పెరుగుతాయి. 2017 నాటి జాతీయ ఆరోగ్య విధానంలోని సమానత్వ భావనకే ఇది విరుద్ధం. అలాగే, కరోనా విజయగాధను ఇతర టీకాలకూ విస్తరించాలి. సాధారణ పిల్లల టీకాలను నేటికీ నూటికి 80 మందికే టీకాలిస్తూ, నేపాల్, శ్రీలంక కన్నా మనం వెనుకబడి ఉన్నాం. ద్విశత కోటి విజయగానంతో ఊరుకోకుండా బాలల టీకాల్లోనూ భారత్‌ ఉపక్రమించడానికి ఇదే సరైన సమయం. 

మరిన్ని వార్తలు