ఆదమరిస్తే... అపాయమే!

9 Jul, 2021 12:11 IST|Sakshi

రకరకాల అనుమానాలు, ఆందోళనలు, భయాల మధ్య ఇప్పటికే దేశంలో మనం ఒకటికి రెండు కరోనా ఉద్ధృతులను చూశాం. దేశవ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు మందిని పొట్టనబెట్టుకున్న ఈ వైరస్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టిందని సంబరపడుతున్నాం. కానీ ప్రజల్లో పెరుగుతున్న నిర్లక్ష్యం నేపథ్యంలో పరిస్థితి అంత అద్భుతంగా ఏమీ లేదని వార్తలు, కేంద్రం చేస్తున్న ప్రకటనలు వెల్లడిస్తున్నాయి. తాజాగా ఉత్తరాదిలోని మనాలీ, సిమ్లా, ముస్సోరీ తదితర పర్వతప్రాంత పర్యాటక కేంద్రాలలో, సుదీర్ఘకాలపు లాక్‌డౌన్‌ నుంచి బయటపడ్డ ఢిల్లీ మార్కెట్లలో, దక్షిణాదిన అనేక రాష్ట్రాలలో జాగ్రత్తలు గాలికి వదిలేసి మాస్కులు లేకుండా తిరుగుతున్న వేలాది జనం ఫొటోలు ఉలిక్కి పడేలా చేశాయి.

భౌతిక దూరం పాటించని జన సమూహాలు, నియంత్రణ పాటించని విందు వినోదాలు, అనేకచోట్ల చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగాల తీరు భయపెడుతోంది. కరోనా థర్డ్‌ వేవ్‌ పొంచి ఉన్న మాట దేవుడెరుగు... అసలు సెకండ్‌వేవ్‌ ముప్పే ఇంకా పూర్తిగా తొలగిపోలేదని కేంద్రం చేస్తున్న హెచ్చరికను పెడచెవిన పెట్టలేం. తక్షణమే కఠినచర్యలు చేపట్టమంటూ, కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న 8 (అరుణాచల్‌ ప్రదేశ్, మణిపూర్, అస్సామ్, మేఘాలయ, త్రిపుర, సిక్కిమ్, కేరళ, ఒడిశా) రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి బుధవారం లేఖ రాయడం గమనార్హం. 

నూటికి 90 మందికి పైగా వ్యాధి నుంచి కోలుకుంటున్నప్పటికీ, ఇప్పటికీ దేశంలో 73 జిల్లాల్లో కరోనా పాజిటివిటీ రేటు (సీపీఆర్‌) 10 శాతం కన్నా ఎక్కువుంది. త్వరితగతిన విస్తరించే ఈ వ్యాధి విషయంలో అదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఆ 73 జిల్లాల్లో 46 జిల్లాలు ఈశాన్య రాష్ట్రాలలోవే. కరోనా కట్టడి కోసం ‘టెస్టు చేయడం–ట్రాక్‌ చేయడం–ట్రీట్‌ చేయడం–టీకా వేయడం– కోవిడ్‌ జాగ్రత్తలను పాటించడం అనే అయిదంచెల ప్రణాళికను పాటించాలని సర్కారు గుర్తు చేసింది. భిన్న భౌగోళిక పరిస్థితుల సువిశాల భారతదేశంలో ఏ పాలకుడికైనా ఇది ఒక సవాలే. అందుకే, ఇలాంటి సందర్భాల్లో పౌరుల చైతన్యం, భాగస్వామ్యం అవసరమవుతుంది. అక్కడే అసలు చిక్కుంది.

గత ఏడాది తొలి ఉద్ధృతిలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ చూశాం. ఈ ఏడాది రెండో ఉద్ధృతిలో ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు, ఆధ్యాత్మికులను ఆకట్టుకొనే కుంభమేళాలకు ప్రాధాన్యమిస్తూ, కేంద్రం ప్రేక్షక పాత్ర పోషించడం చూశాం. పెద్దన్న చేతులెత్తేశాక, రాష్ట్రాల వారీ స్థానిక నియంత్రణల్లో గడుపుతూ వచ్చాం. దేశంలో ఆక్సిజన్, ఆసుపత్రి పడకలు, ఇంజక్షన్లు, చివరకు టీకాలు – ఇలా అన్ని కొరతలూ అనుభవించి, దాదాపు రెండు నెలల భీతావహ అనుభవం నుంచి ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతున్నాం. కానీ, కొద్ది వారాల్లో మళ్ళీ మూడో వేవ్‌ ముప్పు తప్పదని విశ్లేషకుల మాట. అందుకే, ఇది అప్రమత్తంగా ఉండాల్సిన సమయమే తప్ప, ఆదమరిచిపోవాల్సిన తరుణం కాదు.
 
నిజానికి, దేశంలో ఈ ఏడాది జనవరి 16న కరోనా టీకాలు వేసే బృహత్తర యజ్ఞం మొదలైంది. నిండా ఆరు నెలలైనా అయ్యీ అవక ముందే దాదాపు 34 కోట్ల మందికి, అంటే దాదాపు అమెరికా మొత్తం జనాభా అంతమందికి కనీసం ఒక డోసయినా టీకా వేశామన్నది కేంద్ర సర్కారు లెక్క. అలాగే, జూన్‌ 21 నుంచి ప్రతిరోజూ సగటున 50 లక్షల మందికి, అంటే దాదాపు నార్వే మొత్తం జనాభా అంతమందికి టీకా వేస్తున్నామని కేంద్రం ప్రకటిస్తోంది. కానీ, మునుపటితో పోలిస్తే దేశవ్యాప్తంగా సగటున టీకాల ప్రక్రియ వేగం తగ్గిందనేది వాస్తవం. గత నెల ఆఖరు వారంలో రోజుకు 46 లక్షల టీకాలు వేస్తే, ఈ నెల తొలివారంలో అది రోజుకు 35 లక్షలకు తగ్గిందని వార్తా కథనాల మాట. అంకెల ఆర్భాటం మాటెలా ఉన్నా, అసలైతే కరోనా టీకాల ప్రక్రియ ఆగకుండా సాగుతోందన్నంత వరకు అనుమానాలు ఉండక్కర లేదు. కానీ, అదొక్కటే సరిపోతుందా? టీకాలు వేసుకున్నా, ప్రాథమిక జాగ్రత్తలు సుదీర్ఘ కాలం తప్పనిసరి అన్న శాస్త్ర నిపుణుల మాట పెడచెవిన పెట్టచ్చా? ఇవన్నీ జవాబు తెలిసి కూడా మనం ఉదాసీనతతో విస్మరిస్తున్న ప్రశ్నలు!  

ప్రపంచ వ్యాప్తంగా చూసినా, అప్రమత్తత అవసరమనే అర్థమవుతోంది. మరో రెండు వారాల్లో ఈ నెల 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్‌ జరగనున్న వేళ జపాన్‌ అక్కడ ‘వైరస్‌ ఎమర్జెన్సీ’ని ప్రకటించడం గమనార్హం. పెరుగుతున్న కరోనా కేసులతో అక్కడ ఒలింపిక్స్‌ కాలమంతా అనేక కఠినఆంక్షలు విధించారు. 11 వేల మంది అథ్లెట్లు పాల్గొనే ఈ ప్రపంచ స్థాయి పండుగలో విందు, వినోదాలనూ నిషేధించారు. ప్రేక్షకులు లేకుండానే పోటీలు జరుగుతాయని ప్రకటించారు. పొరుగునే జరుగుతున్న ఈ పరిణామాలు మనం పడాల్సిన ముందుజాగ్రత్తను మళ్ళీ గుర్తు చేస్తున్నాయి. పైపెచ్చు, వచ్చే ఏడాది మొదట్లో దేశంలో మరో 5 రాష్ట్రాల ఎన్నికలు జరగనుండడం అప్పుడే వేడి పుట్టిస్తోంది. పార్టీలు గనక మళ్ళీ పాత పొరపాటే చేస్తే, అది ఆత్మహత్యా సదృశమే.
 
సభల మాటెలా ఉన్నా, భుక్తి కోసం సామాన్యులకు జీవన పోరాటం తప్పదు. కరోనాతో సహజీవనం చేయక తప్పనివేళ పాలకులు అనుసరించే విధానాలు, చేపట్టే ఆరోగ్యకార్యక్రమాలతో పాటు ప్రజలు తీసుకొనే స్వీయజాగ్రత్తలూ అంతే ముఖ్యం. మాస్కు ధరించడం, చేతులు ఎప్పటి కప్పుడు శుభ్రం చేసుకోవడం, సమూహాలకు దూరంగా ఉండడం ఎవరికి వారు సులభంగా ఆచరించదగినవే. ఫస్ట్‌వేవ్‌ తగ్గీ తగ్గగానే ఈ జనవరి నుంచి మనం చేసిన తప్పు– ఆ కనీస జాగ్రత్తలు విస్మరించడమే! అలా సెకండ్‌ వేవ్‌ కష్టాలు తెచ్చుకున్నాం. మరుపు మానవ సహజం, స్వభావం. కష్టాల్ని మర్చిపోవాల్సిందే కానీ, పడ్డ కష్టాల నుంచి నేర్చుకున్న పాఠాలను మర్చిపోతేనే పెద్ద కష్టం!

మరిన్ని వార్తలు