జడుపు వీడి జాగ్రత్తపడదాం

16 Jun, 2021 00:46 IST|Sakshi

భయాలను అధిగమించే సాక్షాధారాలు, శాస్త్రీయ సమాచారమే మనిషి మనుగడకు దీపదారి. మానవేతిహాస సుదీర్ఘ గమనంలో కాలపరీక్షకు నిలిచిన నిజాలే మనిషి జీవన గమనాన్ని శాసించాయి. నిష్కారణ భయాలు, నిర్హేతుక ఆందోళనలు కాలం గడిచే కొద్దీ గాలికి కొట్టుకు పోయే దూదిపింజల్లా కనుమరుగయ్యాయి. ఏ కొత్త పరిణామం విషయంలోనైనా... అనిశ్చితి వల్ల భయాందోళనతో గడపటమా? భరోసాతో నిర్భయంగా ఉండటమా అన్నది వాస్తవిక సమాచారాన్ని బట్టే ఉంటుంది. కోవిడ్‌-19 మూడో అల గురించి, ముఖ్యంగా పిల్లలకు ప్రమాద మని వస్తున్న వార్తలు, వార్తా కథనాలు గగుర్పాటు పుట్టిస్తున్నాయి. ఆయా కథనాలు, అంచనాల వెనుక శాస్త్రీయత ఎంత? సాక్షాధారాలపై అధ్యయనాలు చెబుతున్నదేమిటి? నిపుణుల విశ్లేషణలెలా ఉన్నాయి...? అని చూసినపుడు పరిస్థితి కొంత భిన్నంగా కనిపిస్తోంది. వాస్తవికత కన్నా అంచనాలే అధికం. సాక్షాధారాల కన్నా ప్రమాద ఆస్కారపు భయాలే ఎక్కువ ప్రచారం లోకి వచ్చాయి. వీటిని గుడ్డిగా నమ్మకుండా, కాస్త లోతుగా విశ్లేషించినపుడు... కలతతో భయాందోళన చెందాల్సినంత ప్రమాదం లేదనిపిస్తోంది. అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలతో వ్యవహరించడం మంచిది. కొన్ని అధ్యయనాల్లో పౌరుల, పిల్లల మానసిక స్థితి అదుపు తప్పి అరిష్టాలు సృష్టించిన ఉదంతాలున్నాయి. కనుక, ప్రాథమిక అవగాహన, సంపూర్ణ విషయ పరిజ్ఞానంతో మసలుకోవడమే మేలు. అంటే... నిర్లక్ష్యంగానో, ఏదీ పట్టనట్టో ఉండా లని కాదు! అలా అని, లేని భయాలతో పరుగులు పెట్టి స్వయంగాను, ఇతరులను ఆందోళనకు గురిచేయవద్దనేది భావన!

కోవిడ్‌-19 కారణమవుతున్న కరోనా వైరస్‌ తరచూ ఉత్పరివర్తన చెందుతూ స్వభావాన్ని మార్చుకుంటున్న తీరు, ప్రభావితం చేస్తున్న పోకడ ప్రమాదకరంగానే ఉంది. మొదటి అల కన్నా రెండో అల సృష్టించిన విధ్వంసాన్ని కళ్లారా చూశాం. దేశంలో నిలకడగా రోజూ నాలుగు లక్షలకు తగ్గకుండా కేసులు నమోదైన దుస్థితి! పాతిక రోజుల్లో లక్షమంది మరణించారు. కొత్త వైవిధ్యం ‘డెల్టా’ వల్ల ఇంతటి ఉపద్రవం అనేది విశ్లేషణ! ఇలాగే, ‘డెల్టా ప్లస్‌’, మరో ఉత్పరి వర్తన- వైవిధ్యంతో వైరస్‌ రేపు ఇంకో రూపు సంతరించుకుంటే అనివార్యంగా ‘మూడో అల‘ పుట్టొచ్చు! ప్రతికూల ప్రభావమూ చూపొచ్చు. దాన్నెవరూ కాదనలేరు. అది చూపే తీవ్రత, కలిగించే నష్టం మాత్రం, మన వ్యవహార శైలిని బట్టే ఉంటుంది. మొదటి అల ప్రభావం తగ్గిన వెంటనే... మనం ఆంక్షలు సడలించి, నిర్భందం ఎత్తేసి, కట్టడిని తొలగించిన వైనం సవ్యంగా లేకుండింది. మార్గదర్శకాల్ని గాలికి వదిలి... మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా, గుంపులుగా కలియతిరుగుతూ జనం చేసిన స్వేచ్ఛా విహారం వైరస్‌ వ్యాప్తిని పెంచింది. ఫలితంగా రెండో అల ఉదృతమైంది. కోవిడ్‌ సముచిత ప్రవర్తన (సీఏబీ) పూర్తిగా మరిచాం. ప్రమాదస్థితి చెయిదాటి, మూల్యం చెల్లించాల్సి వచ్చింది. మొదటి, రెండో అలల సందర్భంగా దేశంలో, ప్రపంచ వ్యాప్తంగానూ పిలల్లలపై అవి చూపిన ప్రభావం గురించి పలు అధ్యయనాలు జరిగాయి. కోవిడ్‌ సోకిన పిల్లల్లో (నవజాత శిశువులు కాకుండా పదేళ్ల లోపు వారు) 0.1 నుంచి 1.9 శాతం మంది మాత్రమే ఆస్పత్రుల్లో చేరాల్సి వచ్చింది. ఆస్పత్రి పాలైన వారిలోనూ 1.3 నుంచి 3.2 శాతం మంది మరణించారు. అందులో 40 శాతం మంది, అప్పటికే ఇతరేతర జబ్బుల (కోమార్బిడిటీస్‌)తో ఉన్నవారు. మన దేశంలో కోవిడ్‌ వల్ల మరణించిన మొత్తం 3.7 లక్షల మందిలో పిల్లలు 0.1 శాతం అనేది గుర్తించాలి. కారణం ఏమైతేనేం, రెండు అలల సందర్భంగా పిల్లల విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. ఇప్పటివరకు పెద్దలకు టీకా మందు ఇప్పిస్తున్నాము. పిల్లల టీకా గురించి ఇంకా ఆలోచించలేదు. టీకా పొందిన వారికి వైరస్‌ సోకినా ప్రాణాంతక ప్రమాదం లేక, వారు వైరస్‌ వాహకులుగా పిల్లలకు వ్యాధిని అంటించవచ్చు... ఇలాంటి వేర్వేరు కారణాల వల్ల రేపు, మూడో అల వచ్చి, ఉదృతంగా ఉంటే... పిల్ల లకు అధిక ప్రమాద ఆస్కారం ఉండొచ్చు అనేది ఒక అంచనా. ఇదొక ముందు జాగ్రత్త! అంతే తప్ప, మూడో అలలో వైరస్‌ పిల్లల కోసమే రాదు! వారికి వైరస్‌ సోకనీకుండా, సోకే ఆస్కారం తొలగించి మనం జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలపై తీవ్రత ప్రభావం అధ్యయనానికి ప్రత్యే కంగా ఏర్పాటైన ‘లాన్సెట్‌–కోవిడ్‌ కమిషన్‌ ఇండియా టాస్క్‌ఫోర్స్‌’ నిపుణులు కూడా ఇదే సూచించారు.

పిల్లల మానసిక స్థితిపై కోవిడ్‌ ప్రభావం గురించి 10 దేశాల్లో జరిగిన 15 అధ్యయనాల ప్రకారం... 22,996 మంది పిల్లలు/ కౌమారుల్లో, 79.4 శాతం మంది కోవిడ్‌కు భయపడి క్వరంటైన్‌ అయ్యారు. 21.3 శాతం మంది నిద్రలేమి/ నిద్రా భంగానికి గురయ్యారు. 22.5 శాతం మంది భయం వల్ల ఆస్పత్రి పాలు కావాల్సి వచ్చింది. పిల్లలు మానసికంగా ఆందోళనకు గురికాకుండా చూడాలని నిపుణుల సూచన. వైరస్‌ సోకే ఆస్కారం లేకుండా జాగ్రత్త పడాలి. మంద్రంగా లక్షణాలు కనిపించినా ఇంట్లోనే వేరుగా (ఐసొలేషన్‌) ఉంచి, జ్వరం మాత్రలు వేయాలి. కొంచెం తీవ్రత, ఇన్ఫెక్షన్‌ వంటివి వస్తే వెంటనే ఆస్పత్రిలో చేర్చాలి. దేశవ్యాప్తంగా టీకా ప్రక్రియను ముమ్మరం చేయాలి. ప్రస్తుత కట్టడిని దశల వారిగా ఉపసంహరించాలి. పౌరులు కోవిడ్‌ సముచిత ప్రవర్తనతో మెదలాలి. పిల్లల్ని కాపాడుకోవడమంటే మన భవిష్యత్తును భద్రపరచుకోవడమే! ఇది మనవిధి, అంతకు మించి కర్తవ్యం!

మరిన్ని వార్తలు