టీకా ధరల దడ

22 Apr, 2021 00:43 IST|Sakshi

కరోనా టీకా ఎప్పుడొస్తుంది... వస్తే అందరికీ ఉచితంగా ఇస్తారా లేదా అన్న చర్చ చాన్నాళ్లక్రితం బిహార్‌ ఎన్నికల సమయంలోనే మొదలైంది. తాము అధికారంలోకొస్తే కరోనా టీకాను ఉచితంగా అందజేస్తామని వాగ్దానం చేయడం ద్వారా బీజేపీయే ఈ చర్చకు తెరలేపింది. ఇది బిహార్‌కే పరి మితమా అన్న సందేహం అప్పట్లో తలెత్తింది. అనంతరకాలంలో జరిగిన ఇతర ఎన్నికల ప్రచా రాల్లోనూ ఈ ‘ఉచిత టీకా’ వాగ్దానాలు హోరెత్తాయి. తీరా కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటన రాష్ట్రాలను దిగ్భ్రాంతిపరిచింది. వచ్చే నెల 1 నుంచి మొదలుకాబోయే మూడో దశ వ్యాక్సినేషన్‌లో 18 ఏళ్లు, అంతకుపైబడినవారికి టీకాలిచ్చే కార్యక్రమం మొదలవుతుందని చెబుతూనే 18–45 ఏళ్ల మధ్య వయస్కులకు ఇచ్చే టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలే కొనుగోలు చేసుకోవాలని, అంతకు పైబడి వయసున్నవారికి, ఆరోగ్య రంగ సిబ్బందికి, కరోనాపై పోరులో ముందుండే∙ఇతర సిబ్బందికి  తాము అందిస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది. టీకా ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తిలో సగం తమకు ఇంతకుముందు మాట్లాడుకున్న ధరకు అందించాలని... మిగిలిన సగ భాగాన్ని రాష్ట్రాలతోపాటు మార్కెట్‌కు అమ్ముకోవచ్చని తెలిపింది. ఈ వ్యూహంలోని హేతు బద్ధతేమిటో అర్థంకాదు. తన నిర్ణయం వల్ల ఎలాంటి పరిణామాలు తలెత్తగలవో కేంద్రం లోతుగా ఆలోచించిందా అన్నది కూడా సందేహమే. ప్రభుత్వాలు పాలించాలి గానీ, వ్యాపారాలు చేయడ మేమిటన్న తర్కంతో పబ్లిక్‌ రంగ సంస్థల అమ్మకాన్ని సమర్థించుకున్న కేంద్రం... ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రాలు బజారునపడి టీకాల కొనుగోలు కోసం ఆసుపత్రులతో, ఇతర ప్రైవేటు సంస్థ లతో, వేరే రాష్ట్రాలతో  పోటీపడాలని చెబుతోంది! పోనీ ఇంత కీలక నిర్ణయం తీసుకునేముందు రాష్ట్ర ప్రభుత్వాలతో ఆలోచించిన దాఖలా లేదు. వివిధ రాష్ట్రాలు స్పందిస్తున్న తీరే ఈ సంగతిని వెల్లడి స్తోంది. కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్‌ ఏలుబడిలోని ఛత్తీస్‌గఢ్‌ పౌరులకు ఉచితంగా అంది స్తామంటున్నాయి. కానీ ఎన్ని రాష్ట్రాలు ఇలా చేయగలవు?

దేశంలో అన్ని రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులూ ఒకేలా లేవు. అధికాదాయం వచ్చే రాష్ట్రాలున్నాయి. అంతగా ఆదాయం లేని రాష్ట్రాలున్నాయి. చెప్పాలంటే కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడటం, లాక్‌డౌన్‌ విధించటం పర్యవసానంగా అన్ని రంగాలూ తీవ్రంగా దెబ్బతిని ఆదాయం క్షీణించి, రాష్ట్రాలు పెను సంక్షోభంలో పడ్డాయి. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఎంతో కొంత మెరుగు. కానీ చాలా రాష్ట్రాల ఆదాయం అంతంతమాత్రం. విభజన తర్వాత సమస్య లెదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌ సరేసరి. జనసాంద్రత ఎక్కువున్న రాష్ట్రాలున్నాయి. సహజంగానే అధి కాదాయం వుండే రాష్ట్రాలు మార్కెట్‌లో టీకాలు దక్కించుకుంటాయి. ఆర్థికంగా సమస్యలెదు ర్కుంటున్న రాష్ట్రాలకు అది తలకు మించిన భారమవుతుంది. కరోనా మహమ్మారి విరుచుకుపడ్డాక కేంద్రం రాష్ట్రాలకు నిర్దిష్టంగా అందించిన ఆర్థిక సాయం పెద్దగా లేదు. అప్పులు తెచ్చుకోవటానికి గతంలో వున్న పరిమితులను పెంచటంవంటివి మాత్రమే చేసింది. వాటి తిప్పలేవో అవి పడుతూ రోజులు నెట్టుకొస్తుంటే ఇప్పుడు టీకాలకయ్యే వ్యయం భరించాలనటం న్యాయం కాదు. టీకాల కొనుగోలు ఒక ఎత్తయితే, వాటి పంపిణీ మరో పెద్ద సమస్య. కేంద్రం 45 ఏళ్లు పైబడ్డవారికి ఉచితంగా ఇస్తున్న టీకాలే ఇంకా నిర్దేశిత వర్గాలకు సరిగా చేరడంలేదు. ఉదాహరణకు తమిళనాడు ఆ కేటగిరీలోని వారికి టీకాలివ్వాలనుకుంటే ఇంతవరకూ అరకోటి మందికి కూడా ఇవ్వలేక పోయింది. ప్రజారోగ్య వ్యవస్థలు అస్తవ్యస్థ స్థితిలో వుండటం ఇందుకొక కారణం కాగా... టీకాలపై సామాన్య ప్రజానీకంలో వున్న అనేక అపోహలు కూడా దోహదపడుతున్నాయి.

టీకాల ధరలతోనూ పేచీవుంది. కేంద్రం రూ. 150కి కొనుగోలు చేస్తున్న టీకాను రాష్ట్రాలు రూ. 400 చొప్పున ఎందుకు కొనాలో ఊహకందనిది. పరిశోధనల కోసం ఫార్మా సంస్థలు అపారంగా ఖర్చు చేయాల్సివుంటుంది గనుక ఆ ధర వుండాలని వాదించవచ్చు. టీకా ఉచితంగా ఇవ్వకపోతే పోయారు... కనీసం రాష్ట్రాలు సైతం అదే రూ. 150 మొత్తం వెచ్చిస్తే, మిగిలిన మొత్తాన్ని ఫార్మా కంపెనీలకు తాము చెల్లిస్తామని కేంద్రం చెప్పలేకపోయింది. ఇప్పుడు ఒక్కొక్కరికి రెండు డోసులు చొప్పున పౌరుల్లో ప్రతి ఒక్కరికోసం రూ. 800 చొప్పున ప్రభుత్వాలు వ్యయం చేయాల్సివుంటుంది. టీకాల పంపిణీకయ్యే ఇతరత్రా ఖర్చులు దీనికి అదనం. ఇక అదే టీకాను ప్రైవేటు ఆసుపత్రులు రూ. 600కు కొనుగోలు చేయాలి. ప్రైవేటు సంస్థల ఉద్దేశమే లాభార్జన కనుక దీనిపై అదనంగా ఎంత మొత్తం వసూలు చేస్తాయో మున్ముందు తెలుస్తుంది. ఆసుపత్రులు ఎంత చొప్పున వసూలు చేయాలో నిర్దేశించే అధికారం రాష్ట్రాలకు వుంటుందా లేదా... అవి పారదర్శక విధానం పాటిం చేందుకు ప్రభుత్వాలు ఏం చేస్తాయన్నది కూడా చూడాలి. ప్రస్తుతానికి ఈ టీకాలు ‘అత్యవసర విని యోగం’ కేటగిరీలో వున్నాయి గనుక ఔషధ దుకాణాల్లో దొరికే అవకాశం లేదు. మరో ఆర్నెల్లలో అది సాధారణ కేటగిరీలోకి మారితే అన్నిచోట్లా లభ్యత వుంటుంది. కానీ ధర మాత్రం కొండెక్కి కూర్చో వచ్చు. ఏతావాతా ఏణ్ణర్థంనుంచి ఏటికి ఎదురీదుతున్న ప్రభుత్వాలు, సాధారణ పౌరులు టీకాల కోసం భారీ మొత్తంలో ఖర్చుపెట్టాలి. లేదా దేవుడిపై భారం వేయాలి. ఒకపక్క కరోనా మహ మ్మారిని పారదోలడానికి అలుపెరగని యుద్ధం చేయాలంటూనే, ఆ యుద్ధాన్ని బలహీనపరిచే విధా నాలు అనుసరిస్తే లక్ష్యాన్ని ఎప్పటికి చేరుకుంటాం? కేంద్రం ఆలోచించాలి.

మరిన్ని వార్తలు