జోర్డాన్‌లో సంక్షోభం 

7 Apr, 2021 00:46 IST|Sakshi

చెదురు మదురుగా ఎప్పుడైనా జరిగే నిరసన ప్రదర్శనలు తప్ప ఇతర అరబ్‌ దేశాలతో పోలిస్తే గత అయిదు దశాబ్దాలుగా ప్రశాంతంగా, సుస్థిరంగా వుంటున్న జోర్డాన్‌లో ముసలం పుట్టింది. మాజీ యువరాజు హమ్జా బిన్‌ హుసేన్‌ ‘విదేశీ శక్తుల’తో కుమ్మక్కై ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్ర పన్నారని, దాన్ని సకాలంలో గుర్తించి అడ్డుకున్నామని జోర్డాన్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు సంబంధించి 20 మందిని అరెస్టు చేశామని తెలిపింది. అయితే మాజీ యువరాజు అందులో లేరని ప్రభుత్వం అంటుండగా, తనను గృహ నిర్బంధంలో వుంచారని హమ్జా ఆరోపిస్తున్నాడు. జోర్డాన్‌లో హఠాత్తుగా సమస్యలు పుట్టుకురావటం... అది కూడా అంతఃపుర కుట్ర కావటం అమెరికాను కల వరపెట్టింది. దాంతోపాటు జోర్డాన్‌కు సన్నిహితంగా వుండే ఈజిప్టు, సౌదీ అరేబియాలు ఆందోళన పడుతున్నాయి. ఇజ్రాయెల్‌కు సైతం జోర్డాన్‌ పరిణామాలు ఇబ్బందికరంగానే వున్నాయి. అమెరి కాకు జోర్డాన్‌ మొదటినుంచీ మిత్ర దేశం. అరబ్‌ దేశాల్లో ఇజ్రాయెల్‌ ఆవిర్భావం తర్వాత దాన్ని మొట్టమొదటగా గుర్తించింది జోర్డానే. పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, అరబ్‌ దేశాల మధ్య చెలిమి కుదర్చటంలో అది ఎంతో దోహదపడింది. ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) ఉగ్రవాదులు ఇరాక్, సిరియాల్లో సృష్టించిన బీభత్సాన్ని ఎదుర్కొనడానికి, మొత్తంగా అరబ్‌ దేశాల్లో సమస్యలు ఉత్పన్నమైనప్పుడు జోర్డాన్‌నుంచే అమెరికా అంతా చక్కబెట్టింది. పైగా జోర్డాన్‌లో దానికి కీలకమైన సైనిక స్థావరం వుంది. కనుక అక్కడ యధాతథ స్థితి కొనసాగకపోతే అమెరికా సహజంగానే కలవరపడుతుంది.

ప్రశాంతంగా ఉండే జోర్డాన్‌లో చిచ్చు ఎందుకు రగిలింది? కరోనా మహమ్మారి చుట్టుముట్టాక ఈ పరిస్థితి ఏర్పడింది. దాన్నుంచి బయటపడటానికి లాక్‌డౌన్‌తోసహా ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు వివిధ వర్గాల్లో అసంతృప్తిని రగిల్చాయి. ముఖ్యంగా ఉపాధ్యాయుల సమ్మె ఒక సవాలుగా మారింది. లాక్‌డౌన్‌ వంకన జీతాలకు కోత పెడుతున్నారని, నిరసనకు కూడా చోటీయడం లేదని ఉపాధ్యాయులు ఆరోపించారు. భావప్రకటనా స్వేచ్ఛను అడ్డుకుంటున్నారంటూ విపక్షాలు విరు చుకుపడ్డాయి. ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేస్తూ యువత రోడ్డెక్కారు. జీతాలు కోత పెట్టడం విరమించుకోవాలని, అధిక ధరలను నియంత్రించాలని ఉద్యమాలు బయల్దేరాయి.  జోర్డాన్‌కు ఇదంతా కొత్త. దశాబ్దం క్రితం అరబ్‌ దేశాలను ప్రజాస్వామిక ఉద్యమాలు ఊపిరాడ నీయకుండా చేసినప్పుడు ఆ దేశం చెక్కుచెదరలేదు. ఇతర దేశాల మాదిరిగా రాజు అబ్దుల్లా వ్యవహరించక పోవటమే ఇందుకు కారణం. ఆ సమయంలో ఆయన తన అవసరార్థం విశాల దృక్పథాన్ని ప్రద ర్శించారు. నిరసనలు తమ దేశం తాకకముందే పాలనాపరమైన సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రక టించారు. రాజ్యాంగంలో అనేక మార్పులు తీసుకురావటం మొదలుపెట్టారు. భిన్న తెగలకు పార్లమెంటులో వారి జనాభా నిష్పత్తి ప్రకారం స్థానాలు కేటాయించి 2016లో ఎన్నికలు నిర్వహిం చారు. అప్పటికే పొరుగునున్న సిరియాలో ప్రజాస్వామిక ఉద్యమంపై అక్కడి ప్రభుత్వం ఉక్కు పాదం మోపడంతో ఆ దేశం నుంచి 14 లక్షలమంది శరణార్థులు వచ్చిపడ్డారు. ఆ వెంటనే ఐఎస్‌ ఉగ్రవాదుల బెడద మొదలైంది. ఇన్నిటిమధ్యనే కొత్త పార్లమెంటుకు సజావుగా ఎన్నికలు నిర్వహిం చగలిగారు. అయితే కరోనా  జోర్డాన్‌ను ఆర్థికంగా కుంగదీసింది. పర్యవసానంగా అన్ని వర్గాల్లో అసంతృప్తి పెరిగింది. ఈ నేపథ్యంలోనే అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. దీన్నంతటినీ తనకు అనుకూలంగా మలుచుకునేందుకు మాజీ యువరాజు హమ్జా ప్రయత్నించటమే తాజా పరిణా మాలకు మూలం. అవినీతిపై నిలదీసినందుకే తనను గృహ నిర్బంధంలో వుంచారని హమ్జా ఒక వీడియో సందేశం ద్వారా తెలిపారు. ఈ సందేశం నిజానికి జోర్డాన్‌ ప్రజల కోసం కాదు... అమెరికానుద్దేశించి రూపొందించిందే. జోర్డాన్‌కు సహజ వనరులు అతి స్వల్పం. ఆఖరికి మంచినీరు సైతం అది కొనుక్కోవాల్సిందే. అయితే అత్యంత విశ్వసనీయమైన దేశం గనుక దానికి అమెరికా నిధులు పోటెత్తుతాయి. అమెరికా విదేశీ సాయంకింద భారీగా సొమ్ము పొందే దేశాల్లో జోర్డాన్‌ ఒకటి. నిరుడు 190 కోట్ల డాలర్ల సాయం అందిందని ఒక అంచనా. సైన్యానికి ఆయుధాలు సమకూర్చటం, శిక్షణ అందించటం... నిధులు ఇవ్వటం అమెరికాకు రివాజు. అక్కడున్న తన సైనిక స్థావరంలో అరబ్‌ దేశాల సైన్యానికి అది ఏడాది పొడవునా శిక్షణనిస్తుంది. 

ఒకపక్క రాచరికం, వంశపారంపర్య పాలన సాగిస్తూనే దానికి ప్రజాస్వామ్యం ముసు గేయటం... జనం మౌలిక సమస్యల పరిష్కారంలో వైఫల్యం ఇప్పుడు జోర్డాన్‌ను పీడిస్తున్నాయి. ప్రస్తుత రాజు అబ్దుల్లా 1999లో స్వయంగా తన సవతి సోదరుడు హమ్జాను యువరాజుగా ప్రకటించారు. కానీ 2004లో దాన్ని రద్దుచేసి, తన కుమారుడు హుస్సేనీకి కట్టబెట్టారు. అప్పటి నుంచీ హమ్జా సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. కరోనా అనంతర సంక్షోభం అతనికి అందివచ్చింది. ప్రజాస్వామిక హక్కులు సాధారణ ప్రజానీకానికి ఎప్పుడూ పెద్దగా ఉపయోగ పడింది లేదుగానీ... రాజకుటుంబంలో ప్రస్తుత ఆధిపత్య పోరుకు అవి తోడ్పడ్డాయి. జోర్డాన్‌ రాజకుటుంబంలో విభేదాలు పెరిగితే అక్కడ అసమ్మతి, ఉగ్రవాదం మరింత ముదురుతాయని, అరబ్‌ ప్రపంచంలో అది కొత్త సమస్యలకు దారితీయొచ్చని అమెరికా ఆందోళన. ప్రజలకు ప్రాతి నిధ్యం వహించాల్సిన ప్రభుత్వం అగ్రరాజ్యం చేతిలో కీలుబొమ్మగా వుండటం, ప్రజాస్వామ్యం అడు గంటడం పర్యవసానాలు ఇలాగే వుంటాయి.

మరిన్ని వార్తలు