ఇది కనపడని కరెన్సీ బూమ్‌! 

17 Nov, 2021 01:10 IST|Sakshi

లాటరీ తగులుతుందంటే కాదనడం కష్టమే! ఆర్థికసేవల్లో టెక్నాలజీని అంతర్భాగం చేసుకొనే ‘ఫిన్‌టెక్‌’ సంస్థలు పుట్టగొడుగుల్లా వెలుస్తూ, బిట్‌కాయిన్, క్రిప్టో కరెన్సీలతో కనివిని ఎరుగని రాబడి వస్తుందంటే సగటు భారతీయుడు మోజు పడకుండా ఉంటాడా? అందుకే, 2020లో 92.3 కోట్ల డాలర్లున్న భారతీయ క్రిప్టో పెట్టుబడులు 2021లో 660 కోట్ల డాలర్లకు చేరి, బ్రిటన్‌ను సైతం దాటేశాయి. ఇది ఒకింత ఆశ్చర్యకరం. మరింత ఆందోళనకరం.

ఆర్థిక వ్యవస్థను అస్థిరపరచే ప్రమాదం క్రిప్టోలతో ఉందని భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్బీఐ) మొత్తుకుంటోంది. మరోపక్క ఈ కంటికి కనపడని డిజిటల్‌ ఆస్తుల్లో పెట్టుబడి పెట్టి, కొద్దిరోజుల్లోనే కోట్లు గడించవచ్చని ఆశపడుతున్న అమాయకుల్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే శనివారం ప్రధాన మంత్రి మోదీ, సోమవారం పార్లమెంటరీ స్థాయీ సంఘ సభ్యులు చర్చలు జరిపారు. వీటన్నిటి క్రోడీకరణగా రానున్న పార్లమెంట్‌ శీతకాల సమావేశాల్లో క్రిప్టో కరెన్సీపై చట్టం తేవాలన్నది ప్రభుత్వ ప్రయత్నం. 

ప్రపంచ వ్యాప్త క్రిప్టో విజృంభణ ధోరణిని భారత్‌ ఒక్కటీ ఎలా నియంత్రించగలదన్నది ప్రశ్న. మొన్న సెప్టెంబర్‌లో ఎల్‌సాల్వడార్‌లా క్రిప్టోను కరెన్సీగా అంగీకరించాలా, లేక చైనాలా పూర్తిగా నిషేధించాలా అంటే తేల్చి చెప్పడం కష్టమే. నిజానికి, 2013 నుంచి మనదేశంలో క్రిప్టో చర్చనీయాంశమే. 2017లో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు, 2018లో క్రిప్టోపై ఆర్బీఐ నిషేధం, 2020 మార్చిలో నిషేధాన్ని సుప్రీమ్‌ కోర్టు కొట్టేయడం అంతా చరిత్ర. ఆపైన కరోనా కాలంలో భారత్‌లో బంగారాన్ని మించిన పెట్టుబడి మార్గంగా క్రిప్టో అవతరించింది. పన్నెండేళ్ళ క్రితం జరిగిన ఓ కొత్త ఆవిష్కరణ ప్రపంచాన్ని చుట్టేసిందంటే ఆశ్చర్యమే. 2009లో ‘బిట్‌కాయిన్‌’ పేరుతో క్రిప్టో కరెన్సీ విధానం మొదలైతే, ఇప్పుడు ఎథీరియమ్, రిపుల్, డోజ్‌కాయిన్‌ – ఇలా 10 వేల క్రిప్టో కరెన్సీలున్నాయి. 

క్రిప్టోగ్రఫీ, కరెన్సీల కలగలుపుగా కొత్త సృష్టి – క్రిప్టో కరెన్సీ. మామూలు మాటల్లో– క్రిప్టోకరెన్సీ అంటే ఎలక్ట్రానిక్‌ చెల్లింపు నెట్‌వర్క్‌. నెట్‌వర్క్‌లోని కంప్యూటర్ల లాంటివి లావాదేవీలను సరిచూసి, ధ్రువీకరిస్తాయి. హద్దుల్ని చెరిపేస్తూ, ప్రపంచమంతటా విస్తరించిన ప్రభుత్వేతర ఆన్‌లైన్‌ కమ్యూనిటీలు ఈ కరెన్సీలను సృష్టించి, నడుపుతుంటాయి. ప్రస్తుతం ప్రపంచంలో 3 లక్షల కోట్ల డాలర్ల విలువైన క్రిప్టో కరెన్సీలు చలామణీలో ఉన్నాయి. అత్యధికంగా భారత్‌లోనే 10 కోట్ల మందికి పైగా యూజర్లున్నారు. అందుకే, జాతీయ కరెన్సీలకు క్రిప్టోలు పోటీగా అవతరిస్తాయా అన్న చర్చ.    

క్రిప్టోల ప్రాచుర్యానికి కారణం– దాని ప్రత్యేకతలు. సాధారణ బ్యాంకుల్లో లాగా కాక, ఇక్కడ లావాదేవీల ధ్రువీకరణ పని ఇంటర్నెట్‌తో వికేంద్రీకృతంగా సాగుతుంది గనక యూజర్‌ ఛార్జీలు ఉండవు. ప్రపంచంలో ఎక్కడికైనా ఇప్పుడున్న చెల్లింపు వ్యవస్థల కన్నా చౌకగా, వేగంగా చెల్లింపులు జరిపేయచ్చు. దీనికి వాడే ‘బ్లాక్‌చెయిన్‌’ విధానంలో రికార్డులను తారుమారు చేయడం అసాధ్యం. అత్యంత సురక్షితం. విశ్వవ్యాప్త కరెన్సీల్లో లోపాలూ ఉన్నాయి.

కంప్యూటర్లు, వ్యాలెట్ల లాంటివి అవసరం కాబట్టి, సాంకేతికంగా పట్టున్నవారికే తప్ప అత్యధికులైన సామాన్యులకు ఈ క్రిప్టో కరెన్సీలు దూరమే. ఇక, వర్చ్యువల్‌ కరెన్సీలో మదుపరులెవరో ఎవరికీ తెలీదు గనక డ్రగ్స్, అంతర్జాతీయ హవాలాకు ఇది మంచి వాటం. తీవ్రవాదానికీ ఈ డిజిటల్‌ ఆస్తులు అండగా మారే ముప్పుంది.  

దేశంలో ద్రవ్యవిధానానికి మార్గదర్శనం చేసే కేంద్రీయ బ్యాంకులేవీ వీటిని నియంత్రించలేవు. కాబట్టి, ఈ కరెన్సీ కాని కరెన్సీకీ, రకరకాల క్రిప్టో కరెన్సీల నిర్వాహకులకీ అడ్డూ ఆపూ ఉండదు. మరోపక్క 5 వేల బిట్‌కాయిన్స్‌ను నిందితుడు కొట్టేసిన కర్ణాటకలోని బిట్‌కాయిన్‌ కుంభకోణం లాంటివి ఇప్పటికే జనాన్ని భయపెడుతున్నాయి. అయినా సరే, మన దేశంలో సాంప్రదాయిక స్టాక్‌ మార్కెట్‌లో కన్నా 5 రెట్లు ఎక్కువ మంది క్రిప్టోలో పెట్టుబడులు పెట్టారన్నది విస్తుపోయే వాస్తవం.

వారిలో 15 శాతం మంది స్త్రీలే. ఎక్కువగా 18 నుంచి 35 – 40 లోపు వాళ్ళే. లెక్కిస్తే భారతీయ క్రిప్టో యూజర్‌ సగటు వయసు పట్టుమని పాతికేళ్ళే. యువతరం, అందులోనూ ఎక్కువగా దేశంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్నవాసులు క్రిప్టో మోజులో పడుతున్నారు. సినీతారలు సైతం క్రిప్టోలకు ప్రచారకర్తలవుతున్నారు. అమితాబ్, కమలహాసన్, సల్మాన్‌ ఖాన్‌ తదితరులు ఒకరకం క్రిప్టో ఆస్తులైన ‘నాన్‌ఫంగిబుల్‌ టోకెన్‌’ (ఎన్‌ఎఫ్‌టి)లతో తమ బ్రాండ్లను సొమ్ము చేసుకొనే పనిలో పడ్డారు. 

ఒకప్పటి స్టాక్‌మార్కెట్, డాట్‌కామ్‌ విజృంభణల ఫక్కీలో ఇప్పుడీ క్రిప్టో బూమ్‌ వచ్చింది. ఇది నిజంగా బూమా? లేక వట్టి బుడగేనా? ఆర్బీఐ నో అంటున్నా, ఈ కొత్త విశ్వవ్యాప్త కరెన్సీ ధోరణిని కట్టగట్టి కాదనలేం. నిషేధించలేం. అలాగని కొత్త కుంపటిని యథాతథంగా నెత్తికెత్తుకోలేం. అందుకే, గత ఫిబ్రవరిలో నిషేధ చట్టం తేవాలనుకున్నా, ఇప్పుడు కొన్ని నియంత్రణలతో క్రిప్టోను స్వాగతించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టుంది. క్రిప్టో సమస్యల్ని అధిగమించాలంటే, కేంద్రీయ బ్యాంకులే డిజిటల్‌ కరెన్సీలను జారీ చేయడం ఓ మార్గం. కానీ, ద్రవ్యసృష్టిలో, చెల్లింపు వ్యవస్థల్లో ప్రభుత్వ పాత్ర లేకుండా చేయాలన్న క్రిప్టో కరెన్సీ ఆవిర్భావ ఆలోచనకే అది విరుద్ధం. 

ఇంతకాలం బ్యాంకులు, బీమాలు, బంగారమంటూ దేశంలోనే పెట్టుబడులుండేవి. ఇప్పుడీ క్రిప్టో పెట్టుబడులతో డబ్బు దేశం దాటే ప్రమాదం ఉంది. దేశభద్రత, ఆర్థిక సుస్థిరత, ఆశపడే సామాన్యప్రజల ప్రయోజనాల సంరక్షణే ప్రభుత్వ ప్రాథమిక కర్తవ్యం. భవిష్యత్‌ టెక్నాలజీని కాదనకుండానే, భారీ సంక్షోభాన్ని నివారించడమెట్లా? ఇది సర్కారు వారి మిలియన్‌ డాలర్ల క్రిప్టో ప్రశ్న!  

మరిన్ని వార్తలు