Cyclone Tauktae: టౌటే ఉగ్రరూపం 

18 May, 2021 00:20 IST|Sakshi

పుట్టుకొచ్చిన మూడు నాలుగు రోజుల్లోనే మహోగ్రంగా రూపుదాల్చిన టౌటే తుపాను గుజరాత్‌లో తీరం దాటబోతోంది. ఒకపక్క కరోనా వైరస్‌ మహమ్మారితో   దేశమంతా పోరాడుతున్న వేళ పడమటి తీర ప్రాంత రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్‌లను ఈ తుపాను వణికించింది. మన దేశానికి తూర్పున బంగాళాఖాతం, పడమర అరేబియా సముద్రం తుపానులకు నిలయాలు. గత అయిదు దశాబ్దాల్లో వచ్చిన తుపానులు, వరదలు, ఇతరత్రా తీవ్ర వాతావరణ పరిస్థితులవల్ల దాదాపు లక్షన్నరమంది ప్రాణాలు కోల్పోయారని అంచనా. ఈ తుపానుల కారణంగా జరిగే ఆస్తుల విధ్వంసం కూడా అపారమైనది. కోట్లాది రూపాయల విలువైన పంట నాశనమవుతుంది. లక్షల ఇళ్లు దెబ్బతింటాయి. బంగాళాఖాతంతో పోలిస్తే అరేబియా సముద్రంలో తుపానుల తాకిడి మొదటినుంచీ తక్కువే. కానీ ఇదంతా మారింది.

ఇప్పుడు బంగాళాఖాతంతో సమానంగా అరేబియా సముద్రంలోనూ తుపానులు విరుచుకుపడుతున్నాయి. ఎప్పుడో అరుదుగా తుపానులేర్పడే ఈ ప్రాంతంలో గత నాలుగేళ్లుగా ఏటా రుతుపవనాల రాకకు ముందు ఠంచనుగా ఒక తుపాను తప్పడం లేదు. ఈ నాలుగు తుపానుల్లో మూడు గుజరాత్, మహారాష్ట్రలను తాకగా 2018లో వచ్చిన మెకాను తుపాను ఒమన్‌ దేశంపై విరుచుకుపడింది.  నిరుడు కరోనాపై పోరుతో మహారాష్ట్ర సతమతమవుతుండగా నిసర్గ తుపాను విరుచుకుపడింది. అయితే కొంతలో కొంత ఉపశమనం ఏమంటే...ముంబై మహానగరం వందేళ్లలో కనీవినీ ఎరుగని స్థాయి ఉపద్రవాన్ని చవిచూడబోతున్నదని నిపుణులు అంచనా వేసినా తీరం దగ్గరవుతుండగా అది బలహీనపడింది. ఆరుగురు మరణించడంతోపాటు పెనుగాలులతో ఇళ్లు కూలడం, చెట్లు విరిగిపడటంవంటి ఉదంతాలైతే తప్పలేదు. 

ఉష్ణమండల తుపానులకు సముద్ర జలాలు వేడెక్కడం ప్రధానమైన షరతు. ఆ వేడి జలాలే తుపానుల పుట్టుకకు కారణం కావడంతోపాటు, వాటికి కావలసినంత శక్తిని సమకూరుస్తాయి. బంగాళాఖాతంలోని జలాలు ఎప్పుడూ 28 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతతో వుంటాయి. కనుకనే అక్కడ తుపానుల తాకిడి అధికం. దాంతో పోలిస్తే అరేబియా సముద్ర జలాలు ఎప్పుడూ ఒకటి, రెండు డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రతల్లో వుండేవి. కానీ నానాటికీ పెరుగుతున్న భూతాపం దీన్ని తలకిందులు చేసింది. గత వందేళ్లలో అరేబియా సముద్ర జలాల ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. తరచు అవి పరిమితులను దాటుతున్నాయి.

సముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఉపరితలంలో 50 మీటర్లలోతు వరకూ వుండే నీరు ఆవిరై భారీ వర్షాలకూ, పెను తుపానులకూ దారితీస్తుంది. వాతావరణంలోకి ఏమేరకు ఆవిరి విడుదలవుతుందో ఆ మేరకు వాతావరణ పీడనం పడిపోతుంది. ఒకసారంటూ అల్పపీడనం ఏర్పడితే అది వివిధ స్థాయిల్లోకి పరివర్తన చెందడం తప్పదు. బంగాళాఖాతం, అరేబియా సముద్రం సగటున ఏటా అయిదు తుపానులు తీసుకొస్తున్నాయి. అరేబియా సముద్రంలోని తుపానులు ఎక్కువగా లక్షద్వీప్‌ సమీపంలో బయల్దేరతాయి. వేరే దేశాలవైపు సాగిపోతాయి.  కానీ ఇటీవలకాలంలో ఈ ధోరణి కూడా మారుతోంది.  ఓఖ్రి, ఫణి, ఆంఫన్‌ తుపానులు నిజానికి చాలా బలహీనంగా మొదలై అతితక్కువ వ్యవధిలో తీవ్రత పెంచుకోవడం నిపుణులను ఆశ్చర్యపరిచింది. 

వాన రాకడ, ప్రాణం పోకడ ఎవరికీ తెలియదని నానుడి. కానీ వాతావరణ అధ్యయనంలో రూపొందే నమూనాలు ఆ పరిస్థితిని చాలావరకూ మార్చాయి. అయితే పర్యావరణం సైతం శాస్త్రవేత్తలతో పోటీ పడుతూ రూపు మార్చుకుంటూ కొత్త సవాళ్లు విసురుతోంది. ఎంతో అధునాతన సాంకేతిక సంపత్తితో శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నా, సముద్ర జలాల తీరుతెన్నులు దానికి అందకుండా పోతున్నాయి. ఇలా దోబూచులాడుతూ విరుచుకుపడే తుపానులు ప్రభుత్వాలకు తలనొప్పి సృష్టిస్తాయి. జనాన్ని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి తగిన వ్యవధి దొరకదు. తుపానుల రాకడనూ, వాటి నడతనూ, తీవ్రతనూ అంచనా వేయడానికి ఆకాశంలో తిరుగాడే ఉపగ్రహాలు మొదలుకొని సముద్ర తీరాల్లో అమర్చే పరికరాల వరకూ అన్నింటి అవసరమూ శాస్త్రవేత్తలకు వుంటుంది. ఈ సమస్త డేటానూ వినియోగించి వేర్వేరు నమూనాలను రూపొందించి, ఏమేరకు తీవ్రత పెరిగితే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయో శాస్త్రవేత్తలు అంచనాకొస్తారు. 

తుపానులైనా, ఇతర విలయాలైనా భూతాపం పెంచే కార్యకలాపాలకు దూరంగా వుండాలని మనిషిని హెచ్చరిస్తున్నాయి. 2030కల్లా భూతాపాన్ని 1.5 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మేర తగ్గించాలని 2015నాటి పారిస్‌ ఒడంబడిక లక్ష్యంగా పెట్టుకుంది. ట్రంప్‌ ఏలుబడిలో అమెరికా ఆ ఒడంబడికనుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించినా, బైడెన్‌ వచ్చాక ఆ నిర్ణయాన్ని మార్చారు. అయితే ఆస్ట్రేలియా, కొన్ని ఇతర దేశాల శాస్త్రవేత్తలు మాత్రం ఆ లక్ష్యసాధన అసాధ్యమన్నట్టు ఇటీవల మాట్లాడుతున్నారు. ఇది ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేస్తే... ధనిక దేశాలు వెనకబడిన దేశాలకు ఉదారంగా పర్యావరణ అనుకూల సాంకేతికతలను బదిలీ చేస్తే పెద్ద కష్టంకాదని నిపుణులు చెబుతున్న మాట. ఈ విషయంలో బ్రిటన్, యూరప్‌ యూనియన్‌ ఉమ్మడిగా కృషి చేస్తున్నాయి. ఈ ఏడాది ఆఖరుకు గ్లాస్గోలో జరగబోయే కాప్‌–26 శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకించి పారిస్‌ ఒడంబడిక ప్రధాన లక్ష్యాన్ని సాధించడంపై కార్యాచరణను ఖరారు చేయబోతోంది. ఇవన్నీ సక్రమంగా అమలైతేనే భూగోళం సురక్షితంగా మనగలుగుతుంది. 

మరిన్ని వార్తలు