న్యాయమైన ప్రయత్నం!

22 Sep, 2022 00:54 IST|Sakshi

మరణశిక్షపై మళ్ళీ ఒకసారి చర్చ మొదలైంది. ఒకే అంశానికి సంబంధించి ఒక్కో కేసులో ఒక్కో రకమైన తీర్పులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తమవుతున్న నేపథ్యంలో అతి పెద్ద శిక్షల విధింపుపై ఆలోచన మొదలైంది. మరణశిక్ష తీర్పుల విషయంలో నిర్ణీత నియమాలు ఏర్పరిచే అంశాన్ని సుప్రీమ్‌ కోర్టు తనకు తానుగా చేపట్టి, అయిదుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి సోమవారం నివేదించింది.

మరణశిక్షపై వాదనలు ఎప్పుడు, ఎలా వినాలనే దానిపై పరస్పర విరుద్ధ తీర్పులు వస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు భారత ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ముగ్గురు సభ్యుల బెంచ్‌ తెలిపింది. ఆలోచించి, అత్యంత సంయమనంతో విధించాల్సిన ఉరిశిక్షను నేరం రుజు వైన రోజే ప్రకటిస్తున్న కోర్టులు, కేసులు ఇప్పుడు అనేకం. అందుకే, శిక్ష పడ్డ వ్యక్తికి ప్రతికూలంగా ఉన్న ప్రస్తుత పద్ధతుల్లో మార్పు కోసం సుప్రీమ్‌ చేపట్టిన ఈ చర్య కచ్చితంగా ఆహ్వానించదగ్గది.  

ఇప్పటికి 42 ఏళ్ళ క్రితం 1980లో బచ్చన్‌ సింగ్‌ వర్సెస్‌ పంజాబ్‌ ప్రభుత్వం కేసులో అయిదుగురు సభ్యుల సుప్రీమ్‌ ధర్మాసనం మరణశిక్షను సమర్థిస్తూనే, ‘అత్యంత అరుదైన’ సందర్భాల్లోనే ఉరిశిక్ష వేయాలంటూ రక్షణ కవచం ఇచ్చింది. గత నాలుగు దశాబ్దాలలో అది ఎంత సమర్థంగా అమలైందంటే అనుమానమే. అరుదైన సందర్భాలంటే ఏమిటనే దానికి ఎవరి వ్యాఖ్యానం వారిది కావడమూ దానికో కారణం. తీవ్రవాద కేసుల్లో తప్ప మిగతావాటిలో మరణశిక్ష విధించరాదంటూ, 2015 నాటి లా కమిషన్‌ నివేదిక ఏకంగా ఉరిశిక్ష రద్దుకు సిఫార్సు చేసింది. ఇప్పటికే 144కి పైగా దేశాలు మరణశిక్షను రద్దు చేశాయి.

భారత్‌లో మాత్రం దీనిపై ఇంకా భిన్నాభిప్రాయాలున్నాయి. అంతకన్నా విచిత్రమేమిటంటే – కొద్దికాలంగా మన దగ్గర మరణశిక్ష తీర్పులు ఎక్కువవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో అటు పూర్తి ఉరిశిక్ష రద్దుకూ, ఇటు ప్రతి చిన్న నేరానికీ ఉరిశిక్ష విధించే దూకుడుకూ మధ్య సమతూకం అవసరం. ఉరిశిక్ష విధింపునకు సంబంధించిన విధివిధానాలకు మరింత కట్టు దిట్టం చేసి, అంతటా ఒకే రకమైన ఉన్నత ప్రమాణాలు పాటించేలా చూడడం తప్పనిసరి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొనే ఏకరూప నియమావళిని రూపొందించే పనిని సుప్రీమ్‌ భుజానికి ఎత్తుకుంది. 

కులం, మతం, వర్గం లాంటి దుర్విచక్షణ ఉరిశిక్ష విధింపుపైనా ప్రభావం చూపుతోందనేది నిష్ఠురసత్యం. ఇది వివిధ అధ్యయనాల మాట. ఢిల్లీ నేషనల్‌ లా యూనివర్సిటీకి చెందిన నేర సంస్కరణల అనుకూలవాద బృందం ‘ప్రాజెక్ట్‌ 39ఏ’ 2016లో 385 మంది ఉరిశిక్ష ఖైదీల వివరాలను విశ్లేషించింది. ఉరిశిక్ష పడ్డవారిలో 76 శాతం మంది ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలవారే. ఇక, నాలుగింట మూడొంతుల మంది ఆర్థికంగా వెనకబడ్డవారు. ఒక వర్గంపై సమాజంలో ఉండే చిన్నచూపు మరణశిక్ష విధింపులోనూ కొనసాగుతోందనిపిస్తోంది.

ఇక, 2020లో ఆ బృందమే జరిపిన మరో అధ్యయనంలో ఇంకొక చేదునిజం బయటకొచ్చింది. 2000కూ, 2013కూ మధ్య ఢిల్లీలో కింది కోర్టులు 80 ఉరిశిక్షలు విధించగా, తర్వాత హైకోర్టులో 60 శాతానికి పైగా కేసుల్లో ఆ శిక్ష తగ్గడమో, రద్దవడమో జరిగింది. సమాజంలోని భావావేశాలు సైతం కొన్నిసార్లు ఉరిశిక్ష విధింపునకు దారి తీస్తున్నాయట. ఇలా వివిధ ప్రభావాలు, కోర్టు కోర్టుకూ తీర్పులు మారి పోవడంపై ఇప్పటికైనా నిజాయతీగా దృష్టి పెట్టి, సరిదిద్దాల్సిన అవసరం ఉంది. 

నిజానికి, ముంబయ్‌ 26/11 దాడి, 2001లో పార్లమెంట్‌పై దాడి, ‘నిర్భయ’ లాంటి తీవ్రమైన కేసుల్లోనే నేరస్థులకు ఉరిశిక్ష అమలవుతోంది. కానీ, దిగువ కోర్టులు ఏటా పదులకొద్దీ కేసుల్లో ఉరి శిక్షలు విధిస్తూనే ఉన్నాయి. ఉరిశిక్ష వేయడానికి వీలు కల్పించే భారత శిక్షాస్మృతిలోని 302వ సెక్షన్, చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా), పసిపిల్లలపై లైంగిక అత్యాచారాలకు సంబం ధించిన ‘పోక్సో’ చట్టం వగైరాలను అవసరానికి మించి అతి చొరవతో చేతుల్లోకి తీసుకుంటున్న సందర్భాలూ ఉన్నాయని విమర్శ.

సంపన్న వర్గాలతో పోలిస్తే ఆర్థికంగా నిరుపేదలకు నాణ్యమైన న్యాయసేవలు అందవనేది జగద్విదితం. అలాంటి సందర్భంలో మరణశిక్ష పడ్డ అమాయకులు కోర్టులో తమ వాదనను సమర్థంగా వినిపించుకోలేక అన్యాయమైపోతున్నారు. అందుకే, సర్వోన్నత న్యాయ స్థానం సైతం నేరస్థుడి సామాజిక నేపథ్యం, వయస్సు, విద్యార్హతలు, కుటుంబ పరిస్థితులు, మానసిక స్థితి, శిక్షానంతర ప్రవర్తన లాంటివన్నీ చూడాలంటోంది. ఆ కీలక అంశాలను బట్టి నింది తుడికి ఉరిశిక్ష అమలుపై నిర్ణయం తీసుకోవాలని కింది కోర్టులకు నొక్కి చెబుతోంది. ఆ అంశాల రీత్యా నిందితుడికి శిక్షలో ఉపశమన చర్యలు అందించే వీలు పరిశీలించాలనేదే భావం. 

చాలా సందర్భాల్లో సుప్రీమ్‌ మార్గదర్శకాల స్ఫూర్తిని దిగువ కోర్టులు అక్షరాలా పాటిస్తున్నాయ నుకోలేం. ఇప్పటికీ రాజద్రోహం లాంటి కాలం చెల్లిన చట్టాలపై సుప్రీమ్‌ చూపిన మార్గంలో దిగువ కోర్టులు వెళుతున్నట్టు లేదు. ఐటీ చట్టంలోని ‘సెక్షన్‌ 66ఏ’ లాంటివి సుప్రీమ్‌ కొట్టేసినా, కింది కోర్టు లకు అది పట్టినట్టు లేదు. ఈ పరిస్థితుల్లో ఉరిశిక్షల విధింపునకు స్పష్టమైన నియమావళిని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించడమే కాక, దిగువ కోర్టుల్లోనూ అది అమలయ్యేలా చూడాలి.

వంద మంది దోషులు తప్పించుకున్నా ఫరవాలేదు కానీ, ఒక్క అమాయకుడికైనా శిక్ష పడకూడదనేది అంతటా అంగీకరించే న్యాయసూత్రం. ఉరిశిక్ష పడుతున్న ఖైదీల విషయంలో అది అమలు కావాలంటే, నింది తుడి తరఫు వాదనలూ సాకల్యంగా వినాలి. అందుకు న్యాయబద్ధమైన అవకాశమిస్తూ, మార్గదర్శ కాలు రూపొందించే ప్రయత్నమే ప్రస్తుతం జరగనుంది. అది ఎంత త్వరగా జరిగితే అంత మేలు.  

మరిన్ని వార్తలు