గ్రహణాలు వీడాలి!

24 Oct, 2022 00:19 IST|Sakshi

దీపాలు లేని లోకాన్ని ఊహించగలమా? దీపాలే లేకుంటే రోజులో సగం చీకటిమయమయ్యేది; జీవితాల్లో సగం అంధకారబంధురమయ్యేది. నాగరకత ఇంకా నత్తనడకనే కొనసాగే లోకంలో అలముకున్న తిమిరాన్ని తరిమికొట్టేవి దీపాలే! నిప్పు రాజెయ్యడం నుంచి వివిధ తైలాలతో ప్రమిదలను నింపి దీపాలు వెలిగించడం వరకు సాగిన పరిణామ క్రమానికి సహస్రాబ్దాల కాలం పట్టింది. విద్యుద్దీపాలను కనుగొన్న తర్వాత నాగరకత విద్యుద్వేగాన్ని పుంజుకుంది. 

‘దీపం జ్యోతి పరబ్రహ్మ’ అంటూ దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంతో పోల్చారు మన పూర్వులు. పరంజ్యోతి అంటే పరబ్రహ్మమే! మనుషుల్లో అజ్ఞానం తొలగిపోవాలంటే, జ్ఞాన దీపాలను వెలిగించాల్సిందే! దీపావళి పండుగ గురించి అనేక పురాణగాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో నరకాసుర వధకు సంబంధించిన గాథ ప్రసిద్ధమైనది. రావణ వధా నంతరం రాముడు అయోధ్యకు చేరుకుని ఈరోజే పట్టాభిషిక్తుడయ్యాడనే గాథ ప్రచారంలో ఉంది. బలి చక్రవర్తిని వామనుడు ఇదేరోజు పాతాళానికి అణగదొక్కాడని పురాణాల్లో ఉంది.

దీపావళి ముందురోజు చతుర్దశినాడు యమధర్మరాజును దీపాలు పెట్టి పూజించితే పితృదేవతలు నరక విముక్తులవుతారని, అందువల్లనే దీనికి ‘నరక చతుర్దశి’గా పేరు వచ్చిందని కూడా చెబుతారు. పితృదేవతలను నరక విముక్తులను చేసే పర్వదినంగానే దీపావళిని జరుపుకోవడం మొదలైందని సురవరం ప్రతాపరెడ్డి ‘హిందువుల పండగలు’లో అభిప్రాయపడ్డారు.

ఆరుద్ర కూడా సురవరం అభిప్రాయాన్నే బలపరుస్తూ ‘వాస్తవానికి నరకాసురుడికి, దీపావళికి సంబంధం లేదు. బలి చక్రవర్తితో కొంత సంబంధం ఉంది’ అంటూ ‘వ్యాసపీఠం’లో ప్రాచీన ధర్మశాస్త్ర గ్రంథాలను ఉటంకిస్తూ రాశారు. నరకాసుర వధ తదితర గాథలను తదనంతర కాలంలోనే దీపావళికి ఆపాదించుకున్నారని అనుకోవచ్చు. కథలూ గాథలూ ఎలా ఉన్నా, జనాలందరూ వేడుకగా జరుపుకొనే పండుగ దీపావళి.

దీపావళికి మన సంస్కృతిలోనే కాదు, దేశంలోని వివిధ భాషల సాహిత్యంలోనూ ఇతోధిక స్థానం ఉంది. దీపావళి ఆలంబనగా కొందరు హర్షాతిరేకాలను ప్రకటిస్తే, మరికొందరు  నిరాశా నిర్వేదాలను పలికించారు. పురాణ ప్రబంధ సాహిత్యాల్లో దీపావళి వర్ణన పెద్దగా కనిపించదు గాని, ఆ తర్వాత వెలువడిన సాహిత్యంలో దీపావళి ప్రస్తావన కనిపిస్తుంది. ‘గౌతమీ కోకిల’ వేదుల సత్యనారాయణశాస్త్రి తొలికావ్యం ‘దీపావళి’. ‘లోన జ్వలియించు చున్న మహానలమున/ కొక స్ఫులింగమె కాద యీ యుత్సవాగ్ని/ శైశవమ్మాది ప్రేమ శ్మశానమైన/ జీవి కొకనాటి కేటి దీపావళి యిక’ అంటూ నిర్వేదాన్ని పలికిస్తారు.

సరిగా అరవయ్యేళ్ల కిందట– 1962లో చైనాతో యుద్ధం జరుగుతున్నప్పుడు తిలక్‌ చైనాను నరకాసురుడితో పోలుస్తూ ‘మళ్లీ ఒక దీపావళి’ కవిత రాశారు. ‘మన ప్రధాని శ్రీకృష్ణుడు, ప్రజాశక్తి సత్యభామ/ దొంగచాటు బందిపోటు చైనాసురుడొరుగుతాడు/ మన పతాక హిమగిరిపై మళ్లీ ఆడుతుంది–/ మళ్లీ ఒక దీపావళి మళ్లీ ఒక దీపావళి’ని మనసారా ఆకాంక్షించారు. దాదాపు అదేకాలంలో మల్లవరపు జాన్‌ ‘కుమతులై దేశమును దురాక్రమణ జేయు/ ద్రోహచిత్తులు భీతిల్లి తొలగిపోవ/ ఢమ ఢమ యటంచు నశని పాతముల బోలి/ ధ్వని జనించె; దీపావళి దినముఖమున’ అంటూ దీపావళి విజయోత్సవ సంరంభాన్ని వర్ణించారు.

హైదరాబాద్‌ విలీనమై తర్వాత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడినప్పుడు వానమామలై వరదాచార్యులు ‘దీనికె రాములు సెట్టి/ జీవితమును ముడిబెట్టి/ కడకు విశాలాంధ్ర గలుప/ కాస్త అయ్యెను పొట్టి... ఈ దీపావళి వెలుగున/ ఇరువురమును సోదరులుగ/ తెలిసికొంటి మెడద నెడద/ కలిపికొంటి మొకటైతిమి’ అంటూ ‘అపూర్వ దీపావళి’కి ఆహ్వానం పలికారు.

ప్రపంచ దారుణాలకు మనసు చెదిరిన బైరాగి ‘పీడిత దరిద్ర శాపంతో/ క్రుంగిన ధరిత్రి కడుపు పగిలి/ వెలిగిన ప్రళయ ప్రదీపావళి/ దీపావళి వచ్చిందండీ’ అంటూ ‘చీకటి నీడలు’లో నిష్ఠుర పోయాడు. అమావాస్య రోజున వచ్చే వెలుగుల పండుగ దీపావళి. మన కవులలో కొందరు దీపావళిలో అమావాస్య చీకట్లనే చూస్తే, ఇంకొందరు ఆశల వెలుగులను తిలకించారు. వెలుగులు, చీకట్లను చూసిన కవులూ తమ సమకాలీన చారిత్రక పరిణామాలను నమోదు చేయడం విశేషం.

ఈసారి దీపావళి గ్రహణాన్ని వెంటబెట్టుకుని వస్తోంది. దీపావళి, సూర్యగ్రహణం ఒకేసారి రావడం చాలా అరుదు. ఇలాంటి పరిణామం ఇరవై ఏడేళ్ల కిందట ఒకసారి ఏర్పడింది. గ్రహణం శుభ సంకేతం కాదని చాలామంది నమ్ముతారు. అమవాస్య రోజు సూర్యగ్రహణం, పున్నమి రోజున చంద్రగ్రహణం ఏర్పడతాయి. భూమికి సూర్యుడికి మధ్యగా చంద్రుడు వచ్చినప్పుడు సూర్య గ్రహణం, సూర్యుడికి చంద్రుడికి మధ్యగా భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడతాయని ఖగోళ శాస్త్రవేత్తలు శతాబ్దాల కిందటే కనుగొన్నారు. అయినా గ్రహణాల చుట్టూ అల్లుకున్న నమ్మ కాలు జనాల్లో ఈనాటికీ సజీవంగానే ఉన్నాయి.

ఖగోళ పరిణామాల వల్ల ఏర్పడే గ్రహణాల సంగతి అలా ఉంచితే, మనుషులు నిత్యం ఎదుర్కొనే గ్రహణాలు చాలానే ఉన్నాయి. రెండేళ్లుగా ప్రపంచాన్ని పట్టి పీడించి, అతలాకుతలం చేసిన ‘కరోనా’ గ్రహణం ఇప్పుడిప్పుడే వీడింది. అంతమాత్రాన సమాజానికి గ్రహణమోక్షం లభించిందని సంతోషించే పరిస్థితులు లేవు. ఆకలి బాధలు, ఆర్థిక అసమానతలు, అవినీతి, బంధుప్రీతి, కుల మత లింగ వివక్షలు, నేరాలు ఘోరాలు వంటి గ్రహ ణాలు సమాజాన్ని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్నాయి. ఇలాంటి దారుణ గ్రహణాలు వీడినప్పుడే మానవాళికి అసలైన దీపావళి! అంతవరకు ఆశల దీపాలను వెలిగించి ఉంచుదాం. 

మరిన్ని వార్తలు