మన నిర్లక్ష్యానికి మూల్యమెంత?

6 Dec, 2022 02:34 IST|Sakshi

కొన్ని సంఘటనలు అంతే... పెనునిద్దర నుంచి పెద్ద మేలుకొలుపుగా పనిచేస్తాయి. దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌)లోని సర్వర్లపై జరిగిన సైబర్‌దాడి అలాంటిదే. నవంబర్‌ 23న ఆగంతకులు భారీమొత్తం డిమాండ్‌ చేస్తూ జరిపిన రాన్సమ్‌వేర్‌ దాడితో కుప్పకూలిన సర్వర్లు పన్నెండు రోజులైనా ఇప్పటికీ బాగు కాలేదు. దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక ఆరోగ్యరక్షణ సంస్థలోని ఈ ఘటన మన దేశ సైబర్‌ భద్రతా మార్గదర్శకాలను సమగ్రంగా పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోంది.

డిజిటల్‌ ఇండియా పేరిట అన్ని రకాల ప్రభుత్వ విధులనూ, ప్రజా సేవలనూ, నగదు చెల్లింపులనూ ఆన్‌లైన్‌లో జరపాలని ప్రోత్సహిస్తున్నవేళ అత్యవసరం వచ్చిపడింది. సైబర్‌ దాడులు అంటువ్యాధిలా వ్యాపించి, ఎయిమ్స్‌ ఘటన లాంటివి మరిన్ని జరగక ముందే సురక్షిత వ్యవస్థనూ, ఆపత్సమయంలో సమాచారాన్ని వెనక్కి రప్పించే పద్ధతులనూ సృష్టించుకోవడం తక్షణ కర్తవ్యమని తెలిసివచ్చింది. 

వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య రికార్డుల సమాచారం గాలికి పోయిన ఎయిమ్స్‌ ఘటన దేశంలోనే అతి పెద్ద సైబర్‌ దాడి. ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన దాడి మునుపెన్నడూ జరగలేదు అని దేశ తొలి సైబర్‌ సెక్యూరిటీ హెడ్‌ మాట. డిసెంబర్‌ 1న జలశక్తి శాఖ ట్విట్టర్‌ ఖాతా హ్యాకింగ్‌కు గురైంది. ఇటీవల ఓ ప్రభుత్వ శాఖపై జరిగిన రెండో పెద్ద సైబర్‌ దాడి ఇది.

నవంబర్‌లో ఢిల్లీలోనే సఫ్దర్‌జంగ్‌ హాస్పిటల్‌పైనా సైబర్‌ దాడి జరిగింది. నిజానికి, ఆరోగ్య రంగంపై సైబర్‌ దాడుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్‌ ఉందని సైబర్‌ భద్రతా నిఘా సంస్థ క్లౌడ్‌సెక్‌ లెక్క. ఒక్క 2021లోనే దేశంలోని సైబర్‌ దాడుల్లో 7.7 శాతం ఆరోగ్య రంగంపై జరిగినవే. 

గత మూడేళ్ళలో భారత్‌లో సైబర్‌ దాడులు 3 రెట్లు పెరిగాయి. సైబర్‌ ముప్పును ఎదుర్కోవడా నికి ఉద్దేశించిన ప్రధాన సంస్థ ‘ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌’ (సీఈఆర్టీ–ఇన్‌) డేటా ప్రకారం 2019లో జరిగిన ఉల్లంఘనలు 3.94 లక్షల చిల్లర. 2020లో అది 11.58 లక్షల పైకి, 2021లో 14.02 లక్షలకూ ఎగబాకింది. ఈ ఏడాదిలో జూన్‌ నాటికే 6.74 లక్షలయ్యాయి.

వెరసి మూడున్నరేళ్ళలో 30 లక్షలకు పైగా కేసులొచ్చాయి. కానీ, సైబర్‌ భద్రతా నిధుల వినియోగం అర కొరగా సాగింది. రూ. 213 కోట్లు మంజూరైతే, రూ. 98.31 కోట్లే ఖర్చు పెట్టడం నిర్లక్ష్యానికి నిలువు టద్దం. అంతకన్నా దారుణం ఎయిమ్స్‌లో 30–40 ఏళ్ళుగా కంప్యూటర్లు, సాఫ్ట్‌వేర్లను మార్చక పోవడం. ఈ ఇక్ష్వాకుల కాలపు సామగ్రి పట్ల ఆందోళన వ్యక్తమైనా పట్టించుకున్న నాధుడు లేడు. పైగా ఐటీ ఓనమాలు తెలీని డాక్టర్‌ గారే ఇప్పటికీ అక్కడ కంప్యూటర్‌ విభాగాధిపతి అంటే ఏమనాలి! 

2004లో తొలి డిజిటల్‌ దాడి రికార్డయిన నాటి నుంచి ఇప్పటి దాకా సైబర్‌ నేరాలు అంతకంతకూ పెరుగుతూ వస్తున్నాయి. విస్తరించిన ఇంటర్నెట్‌కు విపరిణామం – ప్రపంచవ్యాప్త సైబర్‌ భద్రతా ఉల్లంఘనలు. నిజానికి, ప్రపంచంలో అత్యధికంగా డేటా చౌర్యం జరుగుతున్న దేశాల్లో భారత్‌ది 6వ స్థానం. ప్రతి వంద మంది భారతీయుల్లో 18 మంది డేటా చోరీ అయిందని నెదర్లాండ్స్‌ సంస్థ సర్ఫ్‌షార్క్‌ మాట.

మన పార్లమెంటరీ స్థాయీ సంఘం సైతం ఈ ఏటి నివేదికలో పొంచివున్న ప్రమాదాలను ఎదుర్కోవడానికి మన దేశ సామర్థ్యాన్ని పెంచుకోవడం తప్పనిసరి అంది. ప్రభుత్వాలు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయన్నది ప్రశ్న. సైబర్‌ ముప్పుపై తగిన నియంత్రణ వ్యవస్థకు ఎలక్ట్రానిక్స్‌–ఐటీ శాఖ కింద ‘సైబర్‌ భద్రతా విభాగా’న్ని కేంద్రం నెలకొల్పింది. అది ఎంత సమర్థంగా పనిచేస్తోందో తెలీదు. ఎయిమ్స్‌ సంక్షోభ పరిష్కారానికి కేంద్రం ఎన్‌ఐఏ, డీఆర్‌డీఓ, గూఢచారి విభాగం, సీబీఐ నిపుణులను బరిలోకి దింపాల్సి వచ్చింది. 

రక్తం చిందని ఈ అభౌతిక, ఆధునిక యుద్ధంతో ఉక్రెయిన్‌ – ఆస్ట్రేలియాల్లో పవర్‌ గ్రిడ్లు, నిరుడు మన దేశంలో నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజ్, ఇరాన్‌లో అణు సదుపాయాలు, జార్జియాలో టెలికామ్‌ సేవలు, వివిధ దేశాల్లో ఎయిర్‌లైన్స్, ప్రభుత్వ సేవలకు తీవ్ర విఘాతం కలిగింది. అవన్నీ వాటి పొరుగు శత్రుదేశాల పనే. ఇక, మేధాసంపత్తి హక్కులు, వ్యక్తిగత డేటా చౌర్యాలు లెక్కలేనన్ని.

ఐటీ సిస్టమ్స్‌పై దాడితో డేటాను ఎన్‌క్రిప్ట్‌ చేసేసి, సమాచారాన్ని తిరిగి అందుబాటులో ఉంచాలంటే డబ్బులివ్వాలని డిమాండ్‌ చేసే రాన్సమ్‌వేర్‌ దాడులు ప్రధానంగా మున్సిపిల్, ఆరోగ్య సంరక్షణ, బ్యాంకులు సహా ఆర్థిక సేవలపై విరుచుకుపడుతున్నాయి.

ఇవాళ మన బ్యాంక్‌ సేవల నుంచి టోల్‌గేట్ల వద్ద ఫాస్టాగ్‌లు, పాస్‌పోర్ట్‌ సమాచారం, పౌర విమాన యానం దాకా అంతా డిజటలే! స్టార్టప్‌ ఇండియా, డిజిటల్‌ ఇండియా అంటున్న పాలకులు డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థతో పాటు పెరిగే సైబర్‌ ముప్పుపై దృష్టి పెట్టకుంటే ప్రాథమిక వసతులకూ పెను ప్రమాదమే!

వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొనే సమగ్ర సైబర్‌ భద్రతా విధానం కావాలి. ఘటన జరిగాక హడావిడి కాక ముందుగానే వాటిని నివారించేందుకు సీఈఆర్టీ–ఇన్‌ ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలను సంసిద్ధం చేయాలి. డిజిటల్‌ సేవలు కావాల్సిందే గనక సమాచార నిల్వ, ఆపత్కాలంలో తిరిగి తీసుకొనేలా సమర్థ విధానాలు పెట్టుకోవాలి. ఎప్పటికప్పుడు ఆధునికీకరించాలి.

సైబర్‌ రక్షణ రంగా నికి నిధులిచ్చి, అత్యాధునిక కృత్రిమ మేధ, మిషన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌) పరిష్కారాలతో సత్తా సమ కూర్చుకోవాలి. అప్పుడే డిజిటల్‌ ప్రపంచం సురక్షితమవుతుంది. ఈ కృషిలో నూతన ఆవిష్కరణలం దేలా ఉత్ప్రేరణ కలిగించాల్సింది విధాన రూపకర్తలే. అప్పుడే డిజిటల్‌ ఇండియా విజయం సాధ్యం! 

మరిన్ని వార్తలు