కేజ్రీవాల్‌దే పైచేయి

13 May, 2023 03:09 IST|Sakshi

ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి ఉండాల్సిన అధికారాలపై ఎనిమిదేళ్లుగా సాగిస్తున్న పోరులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎట్టకేలకు విజయం సాధించారు. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో అక్కడి గవర్నర్‌ వ్యవహారశైలిని తప్పుబడుతూ తీర్పునిచ్చిన గురువారం రోజే ఢిల్లీలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌కీ(ఎల్‌జీ), అక్కడి ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రభుత్వానికీ మధ్య సాగుతున్న వివాదంపై కూడా నిర్ణయాత్మక తీర్పు వెలువడింది.

ఈ రెండు తీర్పులూ రెండు వేర్వేరు రాజ్యాంగ ధర్మాసనాలు ఇచ్చినా... ప్రాతినిధ్య ప్రజాస్వామ్య ప్రాధాన్యతనూ, ఎన్నికైన ప్రభుత్వాల విషయంలో వ్యవహరించాల్సిన తీరుతెన్నులనూ ఆ తీర్పులు నిర్దేశించాయి. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వానికెదురైన సమస్య ప్రత్యేక మైనది. అధికారుల బదిలీకి కూడా ప్రభుత్వానికి అధికారం లేదన్నట్టు అక్కడి ఎల్‌జీ వీకే సక్సేనా ప్రవర్తించారు. ఆ వివాదం పైనే ప్రస్తుత తీర్పు వెలువడింది.

పోలీసు వ్యవస్థ, శాంతిభద్రతలు, భూసంబంధ అంశాల్లో మినహా ఇతర అధికారాల విషయంలో ఎల్‌జీకి అజమాయిషీ ఉండదనీ, ఢిల్లీ ప్రభుత్వ కేబినెట్‌ సలహాలకు ఆయన లోబడి ఉండాల్సిందేననీ ఈ ఏకగ్రీవ తీర్పు స్పష్టం చేసింది. ఆ వెంటనే కేజ్రీవాల్‌ సర్వీసు వ్యవహారాల కార్యదర్శిని బదిలీ చేశారు. రాగల రోజుల్లో మరిన్ని బదిలీలు ఉంటాయని ఆయన సంకేతాలిచ్చారు.

వాస్తవానికి 2018లో అయిదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు ఇలాంటి సమస్యలకు ముగింపు పలికిందని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత ఆప్‌ ప్రభుత్వం కొంతమంది అధికారులకు ఇచ్చిన బదిలీ ఉత్తర్వుల అమలు సాధ్యపడదని సర్వీసు వ్యవహారాల కార్యదర్శి చెప్పటంతో సమస్య మొదటికొచ్చింది.

దానిపై ఆప్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టేయటం, సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనంలోని న్యాయమూర్తులిద్దరూ భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేయటంతో రాజ్యాంగ ధర్మాసనం ముందుకు ఈ కేసు వెళ్లింది. ఈలోగా 2021లో కేంద్రం 1991నాటి ఢిల్లీ ప్రభుత్వ రాజధాని ప్రాంత చట్టానికి సవరణలు తీసుకురావటం ద్వారా పాలనాపరమైన నిర్ణయాలపై ఎల్‌జీ ఆధిపత్యాన్ని ప్రతిష్టించింది.

2018 నాటి సుప్రీం తీర్పును వమ్ము చేయటమే ఈ సవరణ ఆంతర్యమని ఎవరికైనా అర్థమవుతుంది. అయితే ఢిల్లీ కూడా ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల వంటి దేనన్న కేంద్రం వాదనతో 2018 లోనూ, ఇప్పుడూ కూడా సుప్రీంకోర్టు ఏకీభవించలేదు. 1991లో 69వ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేరిన 239 ఏఏ అధికరణ ఇతర కేంద్ర పాలిత ప్రాంతాలకు భిన్నంగా ఢిల్లీ సర్కారుకు ప్రత్యేక ప్రతిపత్తినిచ్చిందని గుర్తుచేసింది.

2018 తీర్పులో ప్రస్తావించిన కేంద్ర పరిధిలోని మూడు అంశాల్లో సర్వీసు వ్యవహారాల గురించి ప్రత్యేకించి చెప్పకపోయినా అది కూడా అంతర్లీనంగా ఉన్నట్టేనని కేంద్రం వాదిస్తూ వస్తోంది. అయితే 239 ఏఏ అధికరణంలోని క్లాజు (3)(ఏ) ఢిల్లీ సర్కారుకు విస్తృతాధికారాలిస్తోందని తాజా తీర్పు స్పష్టం చేసింది.

దేశ రాజధాని కావటం వల్ల ఢిల్లీ ప్రభుత్వానికి ఉండే అధికారాలు పరిమితమైనవే. పూర్తి ప్రతిపత్తి ఉన్న రాష్ట్రాల అధికారాలే కుంచించుకుపోతున్న వర్తమానంలో, పరిమితుల చట్రంలో ఉండే ఆప్‌ ప్రభుత్వం తనదైన విధానాలను అమలు చేయటం ఎంత కష్టమో ఊహించుకోవచ్చు. ఢిల్లీ ప్రభుత్వానికి తగిన అధికారాలివ్వటంలో పార్టీలతో సంబంధం లేకుండా కేంద్రంలో ఉండే ప్రభుత్వాలు అలసత్వాన్నే ప్రదర్శిస్తూ వచ్చాయి.

1993లో ఢిల్లీలో అసెంబ్లీని పునరుద్ధరించిన నాటి నుంచీ ఈ డిమాండు వినిపిస్తూనే ఉంది. చిత్రమేమంటే కేంద్రంలో ఇతర ప్రభుత్వాలున్నప్పటి మాట అటుంచి వాజ్‌పేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ ఏలుబడిలోగానీ, మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యూపీఏ ఏలుబడిలోగానీ ఢిల్లీలో తమ పార్టీ సర్కార్లే నడుస్తున్నా ఏ నాయకత్వమూ ఢిల్లీ సర్కారుకు తగిన అధికారాలివ్వటానికి ముందుకు రాలేదు.

ఢిల్లీలో బీజేపీ నేతలు మదన్‌లాల్‌ ఖురానా, సాహిబ్‌ సింగ్‌ వర్మ, సుష్మా స్వరాజ్‌లు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. కాంగ్రెస్‌కు చెందిన షీలా దీక్షిత్‌ దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రజలెన్నుకున్న ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నా తమను నామమాత్రావశిష్టం చేయటమేమిటన్నదే వీరందరి ప్రశ్న.

ప్రజల ద్వారా ఎన్ని కైన ఢిల్లీ దేశ రాజధాని ప్రాంత(ఎన్‌సీటీడీ) ప్రభుత్వాన్ని ప్రజలకు జవాబుదారీగా చేయాలని,అందుకోసం దానికి తగిన అధికారాలను కట్టబెట్టాలని దేశ కార్యనిర్వాహక వ్యవస్థ భావించలే దంటే... ఆ విషయంలో అయిదేళ్ల వ్యవధిలో రెండుసార్లు న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోక తప్ప లేదంటే పరిస్థితెలా ఉందో అర్థమవుతుంది. 

తాజా తీర్పు ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వానిదే పైచేయి తప్ప ఎల్‌జీది కాదని తేల్చింది. మూడు అంశాలు మినహా ఇతర విషయాల్లో ఢిల్లీ సర్కారుకు వేరే రాష్ట్రాలతో సమానంగా అధికారాలుంటాయని ఈ తీర్పు స్పష్టం చేసింది గనుక రెండు పక్షాలూ అనవసర వివాదాలకు స్వస్తి పలకాలి. కేజ్రీ వాల్‌ స్థానంలో ఒక రాజకీయ నేత సీఎంగా ఉంటే ఇంత పట్టుదలగా పోరాడే వారు కాదేమో! ఆ సంగతలావుంచి ఆప్‌ సర్కారు చిన్నచూపు చూస్తున్నదని అక్కడ పనిచేసే ఐఏఎస్‌లు ఆరోపిస్తుంటారు.

ఇద్దరు ఆప్‌ ఎమ్మెల్యేలు తమపై దౌర్జన్యం చేశారంటూ 2018లో సమ్మెకు కూడా దిగారు. రోజువారీ వ్యవహారాల్లో పట్టువిడుపులుండాలనీ, అధికారులతో సామరస్యంగా పోవాలనీ కేజ్రీవాల్‌ గుర్తించటం అవసరం. రాజకీయ నాయకత్వానికీ, పాలనా వ్యవస్థకూ మధ్య సామరస్యత ఉన్నప్పుడే ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించటం సాధ్యపడుతుందని ఆయన గ్రహించాలి. ఇకపై ఎల్‌జీ కూడా తన పరిధులకు లోబడి వ్యవహరించటం అవసరమని తెలుసుకోవాలి. 

మరిన్ని వార్తలు