ద్వీపంలో అలజడి!

29 May, 2021 00:21 IST|Sakshi

అరేబియా సముద్రంలో దూరంగా విసిరేసినట్టు... తన లోకం తనదన్నట్టు వుండే లక్షద్వీప్‌లో ఆర్నెల్లుగా అగ్గి రాజుకుంటోంది. పేరుకు లక్షద్వీప్‌ అయినా ఇది 36 ద్వీపాల సముదాయం. ఒక ద్వీపం పరాలీ సముద్ర జలాల కోతవల్ల దాదాపు నీట మునిగి, నివాసయోగ్యం కాకుండా పోయింది. కేరళకు పశ్చిమాన 300 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ సముదాయమంతా కలిసి కేవలం 32 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. ఒకే ఒక్క జిల్లా... అందులో పది డివిజన్లు. ఈ లక్షద్వీప్‌ పాలనా వ్యవహర్తగా గుజరాత్‌ బీజేపీ నేత ప్రఫుల్‌ ఖోడా పటేల్‌ వచ్చినప్పటినుంచీ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ఈ ఆగ్రహావేశాలకు కారణం. పాలన వేరు... పెత్తనం వేరు. పాలకులుగా వున్నవారు ప్రజల సంక్షేమానికి, వారి అభ్యున్నతికి దోహదపడాలి. ప్రజాస్వామ్య భావనలు ఇంతగా పెరిగిన ఈ కాలంలో కూడా పెత్తనం మీదే ఆసక్తి కనబరిస్తే, స్థానికుల మనోభావాలు పట్టించుకోవడంలో విఫలమైతే సహజంగానే అది అశాంతికి దారితీస్తుంది. 


ద్వీపాల పాలనను నేరుగా కేంద్రం పర్యవేక్షించటానికి రెండు కారణాలుంటాయి. దేశ భద్రతలో ద్వీపాలది కీలకపాత్ర. సముద్రమార్గంలో అక్కడ అవాంఛనీయ శక్తులు చొరబడకుండా చూడటం అవసరం. అలాగే స్థానికులకు పాలనలో భాగస్వామ్యం కల్పించి, వారికి ప్రజాస్వామిక సంస్కృతి అలవాటు చేయడం కూడా ముఖ్యమైనదే. నిజానికి లక్షద్వీప్‌ ఎప్పుడూ సమస్యాత్మకం కాలేదు. ఇబ్బందంతా తరచు వచ్చే తుపానులతోనే. జనాభా కేవలం 64,000 కావడంతో నేరాల రేటు సహ జంగానే తక్కువ. దారుణమైన నేరాలు చాలా అరుదు. అలాంటిచోట ఉత్తపుణ్యాన గూండా చట్టం లాంటి కఠినమైన చట్టం అవసరమని పటేల్‌కు ఎందుకనిపించిందో అనూహ్యం. ఆ చట్టంకింద ఎవరినైనా కారణం చూపకుండా ఏడాదిపాటు నిర్బంధించే వీలుంది. అంతేకాదు... జనాభాలో 65 శాతం మందివుండే ఆదివాసీల్లో ఎక్కువమంది ముస్లింలు. వృత్తిపరంగా జాలర్లు. వారికి పశు మాంసమే ప్రధానాహారం. పటేల్‌ నిబంధన ప్రకారం అక్కడి హోటళ్లు పశుమాంసంతో  వంటకాలు చేయకూడదు. దుకాణాల్లో అమ్మకూడదు. గోవధ నిషేధం సరేసరి. వీటిని ఉల్లంఘిస్తే ఏడేళ్ల జైలు శిక్ష. పిల్లలకు పెట్టే మధ్యాహ్నభోజనంలో మాంసం నిషిద్ధం! కానీ విచిత్రంగా మద్యపానం అలవాటే లేని లక్షద్వీప్‌లో కొత్తగా మద్యం దుకాణాలకు అనుమతించారు. ఇద్దరు పిల్లలున్నవారు పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులంటూ తీసుకొచ్చిన నిబంధన కూడా వివాదాస్పదమైంది. ప్రభుత్వ విభాగాల్లో క్యాజువల్, కాంట్రాక్టు సిబ్బందిగా పనిచేస్తున్నవారిని ఆయన ఒక్కవేటుతో తొలగించారు. సరుకు రవాణాకు స్థానికంగా వున్న బైపోర్‌ పోర్టును తప్పించారు. కర్ణాటకలోని మంగళూరు పోర్టునుంచే కార్యకలాపాలుండాలని ఆదేశించారు. వలలు, ఇతర ఉపకరణాలు భద్ర పరుచుకోవ డానికి మత్స్యకారులు తీరంలో ఏర్పాటు చేసుకునే షెడ్లు తీరప్రాంత రక్షణ నిబంధనలు ఉల్లంఘిస్తు న్నాయంటూ తొలగించారు. అభివృద్ధి కోసం భూమి స్వాధీనానికి వీలుకల్పించే ముసాయిదా  స్థాని కుల ఆస్తిహక్కుకు మంగళం పాడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇందులో కొన్ని ప్రతిపాద నల స్థాయిలో వుంటే కొన్ని అమలవుతున్నాయి. ఏ ఒక్క అంశంలోనూ ప్రజాప్రతినిధులనూ, స్థాని కులనూ సంప్రదించకపోవటం సహజంగానే అసంతృప్తికి దారితీసింది. ఇన్నాళ్లూ అత్యవసర చికిత్స అవసరమైనవారిని హెలికాప్టర్‌లో కేరళకు తరలించే సౌకర్యం వుండేది. దాన్ని పటేల్‌ రద్దుచేశారు.


ఉన్నతాధికారులనూ, అలా పనిచేసి రిటైరైనవారిని గవర్నర్లుగా, లెఫ్టినెంటు గవర్నర్లుగా, పాలనా వ్యవహర్తలుగా నియమించడాన్ని కొందరు తప్పుబడతారు. వారు నిబంధనలకు విలువి చ్చినంతగా జనం మనోభావాలకు విలువనివ్వరన్న అభిప్రాయం ఎప్పటినుంచో వుంది. అడపా దడపా అది నిజమేనన్నట్టు వ్యవహరించేవారూ లేకపోలేదు. అయితే గతంలో లక్షద్వీప్‌కు ఐఏఎస్‌లే పాలనా వ్యవహర్తలుగా వున్నారు. స్థానికుల్లో వారిపై అసంతృప్తి రాజుకున్న వైనం ఎప్పుడూ లేదు.  కానీ ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా అనుభమున్న ప్రఫుల్‌ ఖోడా పటేల్‌లో నిరంకుశాధికార పోకడలే వుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 2016లో ఆయన్ను కేంద్ర పాలిత ప్రాంతం దామన్‌ డయూల పాలనా వ్యవహర్తగా నియమించగా అక్కడ సైతం ఆయనకు వివాదాలు తప్పలేదు. ఎన్నికల సమ యంలో కోడ్‌ను ఉల్లంఘించేవిధంగా ఆయన ఆదేశాలిస్తున్నారని, ప్రశ్నించినందుకు తనకు షోకాజ్‌ నోటీసు జారీచేశారని అప్పటి దాద్రా నాగర్‌ హవేలీ కలెక్టర్‌ కణ్ణన్‌ గోపీనాథన్‌ ఫిర్యాదు చేయగా... ఎన్ని కల కమిషన్‌ ఆ నోటీసును ఉపసంహరించుకోవాలని పటేల్‌ను ఆదేశించింది. ఆ యువ ఐఏఎస్‌ అధికారి ఎన్నికల అనంతరం సర్వీస్‌కు గుడ్‌బై చెప్పి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటు న్నారు. దాద్రా నాగర్‌ హవేలీ ఎంపీగా ఆరోసారి ఎన్నికైన మోహన్‌ దేల్కర్‌ మొన్న ఫిబ్రవరిలో ఆత్మహత్య చేసుకుంటూ రాసిన లేఖలో పటేల్‌ నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొన్నట్టు ప్రస్తావించడం కూడా వివాదానికి దారితీసింది. అయితే అందులో నిజానిజాలేమిటో ఇంకా నిర్ధారణ కావాల్సివుంది. కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ గత ఫిబ్రవరిలో తొలిసారి పటేల్‌ నిర్ణయాలపై గళమెత్తారు. ఇప్పుడు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ మొదలుకొని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వరకూ అందరూ పటేల్‌ పోకడలపై ఆగ్రహంతో వున్నారు. స్థానిక బీజేపీ నేతలు, శ్రేణులు కూడా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఎప్పుడూ ప్రశాంతంగా వుండే లక్షద్వీప్‌లో పరిస్థితి మరింత దిగజారకముందే కేంద్రం జోక్యం చేసు కుని సరిదిద్దాలి. స్థానికుల మనోభావాలకు విలువనిచ్చే వాతావరణాన్ని కల్పించాలి.  

మరిన్ని వార్తలు