గుర్తింపు పోరాటం!

11 Oct, 2022 00:19 IST|Sakshi

మహారాష్ట్ర రాజకీయం మరో అంకానికి చేరింది. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గాలలో ఎవరిది అసలైన శివసేన పార్టీ అనే పంచాయతీలో ఎన్నికల సంఘం (ఈసీ) ప్రస్తుతానికి ఇద్దరినీ సమదూరం పెట్టేసింది. బాలాసాహెబ్‌ ఠాక్రే పెట్టిన అసలు శివసేన పార్టీ పేరు, విల్లంబుల చిహ్నం ఇరువర్గాలూ వాడకుండా స్తంభింపజేస్తూ, మధ్యంతర నిర్ణయం తీసుకుంది. మూడు ప్రత్యామ్నాయాలతో కొత్త పేరు, కొత్త ఎన్నికల గుర్తు ప్రతిపాదనల్ని సోమవారాని కల్లా పంపాల్సిందని నిర్దేశించింది. రెండుగా చీలిన శివసేన ఇప్పుడు ప్రత్యామ్నా యమైన పేర్లు, ఎన్నికల గుర్తుల కసరత్తుతో గుర్తింపు సమస్యలో పడింది. నవంబర్‌ 3న అంధేరీ (ఈస్ట్‌) అసెంబ్లీ ఉప ఎన్నిక, ఆపై రానున్న ముంబయ్‌ కార్పొరేషన్‌ ఎన్నికలతో ఇది కీలకంగా మారింది. ఉప ఎన్నికలో కమలం గుర్తుపై సొంత అభ్యర్థిని నిలబెట్టి, శిందే వర్గాన్ని అక్కున చేర్చుకున్న బీజేపీకి ఇది కలిసొచ్చే అంశం. 

ఉప ఎన్నిక దగ్గరవుతున్నందున మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్న తమకే పార్టీ విల్లంబుల గుర్తు ఇవ్వాలంటూ శివసేన తిరుగుబాటు వర్గానికి సారథ్యం వహిస్తున్న శిందే అక్టోబర్‌ 4న ఈసీని అభ్యర్థించారు. అయితే, ఎమ్మెల్యేలు గోడ దాటినా, కార్యకర్తల్లో అధిక సంఖ్యాకులు తన వైపే ఉన్నారన్నది ఉద్ధవ్‌ వాదన. వీటి ఫలితమే – ఈ తాత్కాలిక ఆదేశం. ఎన్నికల్లో గందరగోళం నివారించడానికే ఈ నిర్ణయమని ఈసీ తేల్చేసింది. నిజానికి కాంగ్రెస్, శరద్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీలను అక్కునచేర్చుకొని, అసలైన శివసేన సిద్ధాంతాలకు ఉద్ధవ్‌ తిలోదకాలిస్తున్నారని శిందే వాదన. ఆ ఆరోపణలు చేస్తూనే మొన్న జూన్‌లో ఆయన తన వర్గంతో బయటకొచ్చి, పార్టీని నిలువునా చీల్చారు. బాలాసాహెబ్‌ అసలైన సేన తమదేనని వాదిస్తున్నారు. అయితే, శివసేన సంస్థాపకుడి వారసుడిగా పార్టీని నడుపుతున్న ఉద్ధవ్‌ను శివసేన గుర్తుకు దూరం చేస్తూ ఈసీ ఇచ్చిన ఆదేశం ప్రజాస్వామ్యాన్ని స్తంభింపజేయడమేనని కపిల్‌ సిబల్‌ తదితరుల విమర్శ. బీజేపీతో అంట కాగుతున్న శిందే వర్గానికి అప్పనంగా అన్నీ అప్పజెప్పడానికే ఈ ప్రయత్నమని వారి ఆరోపణ. 

నిజానికి, ఒకే పార్టీకి చెందిన ప్రత్యర్థి వర్గాలు గనక పార్టీ పేరు, జెండా, గుర్తులపై అధికారంపై జగడానికి దిగితే, ‘ఎన్నికల చిహ్నాల (కేటాయింపు) ఆదేశం–1968’, సెక్షన్‌ 15 ప్రకారం నిర్ణయాధికారం ఈసీదే. అసలు శివసేన ఎవరిదనే విషయంలో ఈసీ నిర్ణయం తీసుకోవడం సుదీర్ఘ ప్రకియ. అందుకు నెలలు పడుతుంది. ఇటీవలే సుప్రీమ్‌ కోర్ట్‌ సైతం ఉద్ధవ్‌ వర్గం వేసిన పిటిషన్‌పై రూలింగ్‌ ఇస్తూ, ‘అసలైన శివసేన’ ఎవరిది లాంటి అంశాలు నిర్ణయించే అధికారం ఈసీదేనని స్పష్టం చేసింది. శిందే వర్గంలోకి వెళ్ళిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై మాత్రం విచారణ జరుపుతోంది. ఈ పరిస్థితుల్లో ఈసీ నిర్ణయం ‘అన్యాయ’మని అభివర్ణిస్తున్న ఉద్ధవ్‌ చేసేదేమీ లేక ప్రస్తుతానికి వేరే గుర్తులు ప్రతిపాదిస్తూ, తమను ‘బాలాసాహెబ్‌ ఠాక్రే శివసేన’గా గుర్తించాలని కోరారు. 

విజయదశమికి ఉద్ధవ్, శిందే వర్గాలు పోటాపోటీ ర్యాలీలు జరిపి, బలప్రదర్శనకు దిగాయి. అసలు బలం వచ్చే వివిధ ఎన్నికల్లో తేలనుంది. మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనుంది. రాష్ట్రంలో రెక్కలు చాస్తున్న బీజేపీ, ఉద్ధవ్‌పై పాత పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతోంది. కన్ను మూసిన తమ ఎమ్మెల్యే స్థానంలో ఆయన భార్యను నిలబెట్టిన ఉద్ధవ్‌ సేన అసెంబ్లీలో కాకున్నా ప్రజల్లో బలం తమదేనని నిరూపించుకోవాల్సిన పరిస్థితిలో పడింది. అసలే ఎమ్మెల్యేలు చేయిదాటి పోయి, కార్యకర్తలపై పట్టుపోతున్న వేళలో ఈ ఎన్నికలు, అందులోనూ అలవాటైన ఎన్నికల గుర్తు లేకపోవడం ఉద్ధవ్‌కు ఇరకాటమే. కొత్త గుర్తు, పేరు జనంలోకి తీసుకెళ్ళడం ఇప్పటికిప్పుడు తేలికేమీ కాదు. కాకపోతే, ఈసీ నిర్ణయంపై ఉద్ధవ్‌ వర్గం సోమవారం ఢిల్లీ హైకోర్ట్‌ను ఆశ్రయించింది. రేపు కథ సుప్రీమ్‌ దాకా వెళ్ళవచ్చు. అప్పుడు విల్లంబుల గుర్తు శాశ్వత స్తంభనకు గురికావచ్చు. 

గతంలో 1969లో సీనియర్లతో ఇందిరా గాంధీకి తీవ్ర విభేదాలు వచ్చినప్పడు కాంగ్రెస్‌ అసలు గుర్తు కాడి – జోడెద్దులు గుర్తు శాశ్వత స్తంభనకు గురైంది. ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్‌ (ఆర్‌)కు ఆవు – దూడ గుర్తు, కాంగ్రెస్‌ (ఒ)కు చరఖాపై నూలు వడుకుతున్న స్త్రీ గుర్తు ఇవ్వడం ఓ చరిత్ర. అప్పట్లో ఇందిరా గాంధీ కొత్త ఎన్నికల గుర్తు ఆవు – దూడపైనే పోటీ చేసి, ‘గరీబీ హఠావో’ నినా దంతో 1971 లోక్‌సభ ఎన్నికల్లో, 1972 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. 1978లో కాంగ్రెస్‌ రెండోసారి చీలినప్పుడు ఇందిర వర్గానికి హస్తం గుర్తు దక్కింది. 1960లలో కమ్యూనిస్ట్‌ పార్టీ చీలిక వేళ, సీపీఐ (ఎం) కొడవలి – సుత్తి – నక్షత్రం గుర్తును ఎంచుకోవడం మరో కథ. ఆ మధ్య 2017లో ఓ ఉప ఎన్నిక వేళ అన్నాడిఎంకే వర్గాల మధ్య పోరులో రెండు ఆకుల చిహ్నాన్ని ఇప్పటిలాగే ఈసీ తాత్కాలికంగా స్తంభింపజేసింది. 
ఇలా ఎన్నికల చిహ్నాలపై పార్టీలలో చీలిక వర్గాలలో పోరు కొత్త కాదు. శివసేన వ్యవహారం రేపు ఏ మలుపు తీసుకుంటుందన్నది చూడాలి. ఒకరకంగా ఈసీ తన నిష్పాక్షికతనూ, స్వతంత్ర ప్రతిపత్తినీ మరోసారి నిరూపించుకోవాల్సిన సందర్భం ఇది. ఫలితం ఏమైనా, యాభై ఆరేళ్ళ క్రితం 1966 జూన్‌లో బాలాసాహెబ్‌ చేతుల మీదుగా ఆరంభమై, మరాఠా రాజకీయాలను దశాబ్దాలుగా శాసించిన బలమైన ప్రాంతీయ పార్టీకి ఇది దీర్ఘకాలంలో దెబ్బే. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చిన విధంగా ఈ గొడవలో చివరకు లాభపడేది కమలనాథులే! 

మరిన్ని వార్తలు