అస్పష్ట ఆర్థిక చిత్రం

30 Jan, 2021 00:47 IST|Sakshi

ఒక అనిశ్చితి వాతావరణంలో దేన్నయినా స్పష్టంగా అంచనా వేయటం సమస్యే. బడ్జెట్‌కు ముందు గడిచిన సంవత్సర స్థితిగతుల్ని తెలిపే ఆర్థిక సర్వేను రూపొందించటంలో ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ సమస్యను ఎదుర్కొనివుంటుంది. కరోనా వైరస్‌ మహమ్మారి మన దేశంతోపాటు ప్రపంచ దేశాలన్నిటినీ చుట్టుముట్టి ఆర్థిక వ్యవస్థల్ని తలకిందులు చేసిన వర్తమానంలో అదంత సులభం కాదు. అయితే శుక్రవారం పార్లమెంటుకు సమర్పించిన ఆర్థిక సర్వే ఉన్నంతలో పరిస్థితిని అంచనా వేయటానికి ప్రయత్నించింది. దాని ఆధారంగా రాగల ఆర్థిక సంవత్సరం ఎలా వుండబోతు న్నదో తెలిపింది. కరోనా మహమ్మారిని అదుపు చేసే వ్యాక్సిన్లు అందుబాటులోకొచ్చాయి గనుక మన ఆర్థిక వ్యవస్థ మళ్లీ జవసత్వాలు పుంజుకునే అవకాశం వున్నదని ఆర్థిక సర్వే హామీ ఇస్తోంది.

రాగల ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి రేటు సాధ్యమేనని, ఆ మరుసటి సంవత్సరానికి 6.5 శాతం వృద్ధి వుండితీరుతుందని చెబుతోంది. కరోనా మహమ్మారి పర్యవసానంగా వర్తమాన ఆర్థిక సంవ త్సరంలో ఈ వృద్ధి మైనస్‌ 7.7 శాతానికి పడిపోయిందని అంచనా వేసింది. అయినా వీ షేప్‌ రిక వరీతో ఇది మళ్లీ కోలుకుంటుందని తెలిపింది. అంటే ఏ తీరులో వృద్ధి రేటు పడిపోయిందో అదే తీరులో మళ్లీ వేగంగా పుంజుకుంటుందని హామీ ఇచ్చింది. వివిధ రకాల సంస్కరణలు, ఇప్పుడున్న నియంత్రణలను సరళీకరించటం, మౌలిక రంగ పరిశ్రమల్లో పెట్టుబడుల్ని ప్రోత్సహించటం, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు, స్వల్ప వడ్డీరేట్లతో రుణాల మంజూరు వంటి ప్రభుత్వ విధానాలే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటానికి తోడ్పడతాయని ఆర్థిక సర్వే భావించింది. అయితే ద్రవ్యలోటు తీవ్రంగా వుంది. ఆర్థిక సర్వే గణాంకాలే ఆ సంగతి చెబుతున్నాయి. ప్రభుత్వానికొచ్చే ఆదాయానికీ, దాని వ్యయానికీ మధ్య లోటు రూ. 11,58,469 కోట్లని సర్వే అంచనా వేసింది. ఆర్థిక ఒడిదుడుకు లను తట్టుకోవటం కోసం ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీలు, ఆహార ధాన్యాల పంపిణీ వగైరాల కోసం ప్రభుత్వ వ్యయం బాగా పెరిగింది. 

కరోనావల్ల సేవా రంగం, తయారీ రంగం, నిర్మాణరంగం తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అయితే లాక్‌డౌన్‌ కాలంలో చెప్పుకోదగ్గ ప్రధాన అంశం ఒకటుంది. అన్ని రంగాలూ కుంటుపడిన వేళ సాగు రంగం ఒక్కటే ఆర్థిక వ్యవస్థ వెనక దృఢంగా నిలబడింది. అది మరింత దిగజారిపోకుండా ఆదుకుంది. ఆర్థిక సర్వే కూడా దీన్ని గుర్తించింది. నిజానికి కరోనా వ్యాక్సిన్‌ ఇంకా అందరికీ అందుబాటులోకి రాకుండానే ఆ వ్యాధి క్రమేపీ తగ్గుముఖం పడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ప్రజానీకంలో సామూహిక రోగ నిరోధకత ఏర్పడటమేనని వాదించేవారున్నారు. అందుకు ఉదాహరణగా బిహార్‌ ఎన్నికలను చూపుతున్నారు. భారీగా జనసమూహం పాల్గొన్న వేడుకలను ఉదహరిస్తున్నారు. కానీ ఆ విషయంలో తొందపడి నిర్ణయానికి రావటం అసాధ్యం. యూరప్‌ దేశాల్లోగానీ, అమెరికాలోగానీ ప్రస్తుతం వున్న పరిస్థితులే ఆ సంగతిని వెల్లడిస్తున్నాయి. అక్కడ అందరూ కరోనా వైరస్‌ దాదాపు నియంత్రణలోకొచ్చిందని స్వేచ్ఛగా సంచరించారు. కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలబడలేదు. ఇప్పుడు మళ్లీ కరోనా కేసుల సంఖ్య పెరిగింది. కొన్ని నెలల క్రితం ప్రారంభమైనట్టు కనబడిన ఆర్థిక కార్యకలాపాలు మందగించాయి. కనుక వీ షేప్‌ రికవరీ సాధ్యమేనని చెబుతున్న ఆర్థిక సర్వేను విశ్వసించి భరోసాతో వుండగలమా?

కరోనా కాటుకు దేశవ్యాప్తంగా 1,53,847మంది మరణించారు. దాని వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్రం అమలు చేసిన లాక్‌డౌన్‌తో సర్వం స్తంభించిపోవటం వల్ల లక్షలాదిమంది ఉపాధి కోల్పో యారు. అన్ని వర్గాల ప్రజల ఆదాయమూ గణనీయంగా పడిపోయింది. కుటుంబాల నెలసరి ఆదాయం తగ్గిపోవటంతో వ్యయంపై దాని ప్రభావం పడింది. రేపన్న రోజు ఎలాగన్న అనిశ్చితి ఏర్పడటంతో ఖర్చుకన్నా పొదుపుపైనే జనం దృష్టి పెట్టారు. కేవలం తిండి, ఆరోగ్యంవంటి ప్రధాన అవసరాల కోసమే వెచ్చించే ధోరణి అలవడింది. చిన్న దుకాణాలు మొదలుకొని భారీ పరిశ్రమల వరకూ అన్నీ ఒడిదుడుకుల్లో పడ్డాయి. ఉత్పాదకత దెబ్బతింది. ద్రవ్యోల్బణం బాగా పెరిగింది. ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా కుంటుపడటంతో వివిధ వర్గాలు బ్యాంకులకు సక్రమంగా రుణాలు చెల్లిం చటం సాధ్యపడలేదు. బ్యాంకులు కూడా దీన్ని గమనించి రుణాల వసూళ్లలో సంయమనంతో వ్యవహరించాయి. దీన్ని సర్వే పరిగణనలోకి తీసుకుందా అన్న సందేహం వస్తోంది.

ఎన్‌పీఏలు తగ్గాయో, పెరిగాయో బ్యాంకులు వసూళ్లు మొదలుపెడితేగానీ నికరంగా తెలియదు. ఆ రకంగా చూస్తే ఆర్థిక సర్వే మరీ ఎక్కువగా ఆశలు పెట్టుకుందేమోనన్న అభిప్రాయం కలుగుతోంది. అలాగే సాగు రంగ సంస్కరణలతో ఆ రంగం మరింత బలోపేతమవుతుందని సర్వే ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఆ సంస్కరణల్లో భాగంగా తీసుకొచ్చిన మూడు చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపి వేస్తామని ఇప్పటికే కేంద్రం ప్రకటించింది. పైగా ఆ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో సాగు రంగ సంస్కరణలు ఎంతవరకూ సాధ్యమో చూడాల్సివుంది. అలాగే ఆహార సబ్సిడీల వ్యయం పెరిగిపోతున్న తీరును వివరిస్తూ దీన్ని అదుపు చేయాల్సి వుంటుం దని, అందుకోసం కేంద్ర జారీ ధరను పెంచాల్సివుంటుందని సూచిస్తోంది.

అది కూడా అంత సులభమేమీ కాదు. ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులను అధిగమించాలంటే గట్టి చర్యలు అవసరమవు తాయన్న ఆర్థిక సర్వే భావన సరైందే. అయితే ఆ చర్యలు ఏమిటన్నది ఫిబ్రవరి 1న ప్రవేశ పెట్టబోయే బడ్జెట్‌లోగానీ తెలియదు. ఆ చర్యలు పకడ్బందీగా వుంటే భిన్న రంగాలు పుంజుకోవటం, మళ్లీ ఆర్థిక వ్యవస్థ తేరుకోవటం సాధ్యపడొచ్చు. ఆదాయానికీ, వ్యయానికీ మధ్య సమతూకం సాధిస్తూ ద్రవ్య లోటు విజృంభించకుండా చూడటం వర్తమాన పరిస్థితుల్లో కత్తిమీద సామే. రాగల బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఆ పని ఎంత సమర్థవంతంగా చేయగలుగుతుందో చూడాలి. 

మరిన్ని వార్తలు