నకిలీ... అంతా నకిలీ! 

28 Jun, 2021 00:26 IST|Sakshi

అసలు అపురూపమైపోయింది. మనసు మొదలు మనిషి వరకు, వాస్తవాల మొదలు వార్తల వరకు అంతా నకిలీలు, నకళ్ళు ప్రబలుతున్న ప్రపంచం ఇది. అందుకే, ఇక్కడ అసలు సిసలువి ఎక్కడ కనపడినా, అబ్బురమైపోయింది. ఈ కరోనా కాలం మనిషి తనలోని మానవత్వాన్ని చూపాల్సిన సందర్భం. అది తన కోసమే కాదు... తోటివారి కోసం కూడా! కానీ, ఇలాంటి సమయంలోనూ ఆరోగ్య చికిత్స, ఆసుపత్రుల ఫీజులు, చివరకు టీకాలు వేయడంలోనూ మోసాలు జరుగుతున్నాయంటే ఏమనాలి? ప్రాణాంతక వేళలోనూ మానవ స్వభావం మారదా అని మనసు చివుక్కుమంటుంది. ఆసుపత్రుల్లో పడకల మొదలు ఆక్సిజన్, రెమ్‌డెసివర్‌ ఇంజక్షన్ల దాకా అన్నిటినీ అవసరాన్ని చూసి, అధిక రేట్లకు అమ్మిన ఘటనలు కొద్ది నెలలుగా అనేకం. చేయని చికిత్సకు సైతం వేసిన భారీ బిల్లు ఉదంతాలు అసంఖ్యాకం. టీకాల కొరతను అదనుగా చేసుకొని గంపగుత్తగా టీకాలను ప్రైవేటు మార్కెట్‌కు తరలించినవాళ్ళనూ చూశాం. తప్పని తెలిసినా తమ వాళ్ళకు టీకాల కోసం అలాంటి అక్రమార్కులకు డబ్బులు పంపి, మోసపోయిన సినీ నిర్మాతలనూ, మీడియా సంస్థలనూ చూశాం. తాజాగా కోల్‌కతాలో దేవాంజన్‌ దేవ్‌ అనే ప్రబుద్ధుడు ఐ.ఏ.ఎస్‌. అధికారిగా పోజిస్తూ, కలకత్తా నగరపాలకసంస్థకు జాయింట్‌ కమిషనర్‌నని చెప్పుకుంటూ చేసిన నిర్వాకం వీటికి ఏకంగా మరో మెట్టు పైది! 

ఒకటికి మూడుసార్లు నకిలీ కోవిడ్‌ టీకా శిబిరాలు ఏర్పాటు చేసి, కొన్ని వందల మందికి ఉచితంగా టీకా వేస్తున్నట్టు మనవాడు ప్రచారం కొట్టేశాడు. నిజానికి, నకిలీ టీకా టేబుళ్ళు అతికించి, అతగాడు వేసినవన్నీ మామూలు యాంటీ బయాటిక్‌ ఇంజెక్షన్లు. అతగాడి బండారం అనుకోకుండా బయటపడింది. పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎం.పి –∙సినీనటి మిమీ చక్రవర్తి సైతం ఈ టీకా కుంభకోణం బాధితురాలే. ప్రచారం కోసం ఆమెను పిలిచి, టీకా వేయించాడీ ప్రబుద్ధుడు. తీరా టీకా వేసుకున్నట్టు మెసేజ్‌ కానీ, ప్రభుత్వ అధికారిక కో–విన్‌ పోర్టల్‌ నుంచి సర్టిఫికెట్‌ కానీ రాలేదేమిటని ఆమెకు అనుమానం వచ్చింది. అలా అనుకోకుండా ఈ కుంభకోణం బయటపడింది. తొమ్మిది బ్యాంకు ఖాతాలు... వివిధ ప్రభుత్వ శాఖల నకిలీ స్టాంపు ముద్రలు... వాటితో తయారు చేసిన నకిలీ ప్రభుత్వ లేఖలు... ఇలా అతగాడి పద్ధతే పెద్ద మోసం. రెండేళ్ళలో కోటి రూపాయలు కొట్టేసినట్టు తేలింది. 

నకిలీ నోట్లు... నకిలీ వార్తలు... ఆఖరికి మనిషి ప్రాణాల్ని కాపాడే టీకా కూడా నకిలీ అంటే నోరు నొక్కుకోక ఏం చేస్తాం! వ్యవస్థలు బలంగా లేనప్పుడు సామాన్యుల అవస్థలు ఎన్నని చెబుతాం!! విచిత్రం ఏమిటంటే, ఇలాంటి నకిలీలకు అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు చేష్టలుడిగి చూస్తుండడం! సందర్భాలు, సంఘటనలు వేర్వేరు కానీ, తూర్పున బెంగాల్‌ నుంచి పడమట మహారాష్ట్ర దాకా, ఉత్తరాన దేశ రాజధాని నుంచి దేశపు దక్షిణపు కొస దాకా – అన్నిచోట్లా ఇలాంటి వార్తలే. పరీక్షలు చేయకుండానే లక్షల్లో కోవిడ్‌ పరీక్షలు చేసినట్టు చూపిన హరిద్వార్‌ కుంభమేళా స్కామ్‌... దొంగతనంగా తరలించిన టీకాలతో విలాసవంతమైన హౌసింగ్‌ సొసైటీ నివాసితులకు టీకా వేసినట్టు చూపిన ఓ మహారాష్ట్ర హాస్పటల్‌ కుంభకోణం... మచ్చుకు రెండు ఉదాహరణలు. 

ప్రజారోగ్య వ్యవస్థలోని ఈ కుంభకోణాలకు అసత్యాలు, నకిలీ వార్తలు మరో చేదోడు. టీకా రెండు డోసులూ వేసుకుంటే ఒంటికి పళ్ళాలు, చెమ్చాలు అతుక్కునేలా మనిషికి అయస్కాంత శక్తి వచ్చిందంటూ వీడియోలు వైరల్‌ అయ్యాయి. తలతన్యత, అతుక్కునే చర్మం లాంటి శాస్త్రీయ అంశాలు వదిలేసి, అమాయకులను నమ్మించాయి. అలాగే, టీకాలలో ట్రాకింగ్‌ పరికరాలుంటాయట... టీకా వేసుకుంటే డి.ఎన్‌.ఎ. మారిపోతుందట... లాంటి అసత్య వార్తలు, వీడియోలకైతే లెక్కలేదు. అలాగే, ‘ఫలానా టీకాలో... ఫలానా ఉందట’ అంటూ మతం రంగు పులిమే ప్రయత్నాలూ జరగడం విడ్డూరం. అంతకు ముందు రెండేళ్ళతో పోలిస్తే గత ఏడాదిలో టీకాలకు వ్యతిరేకంగా మన దేశంలో సోషల్‌ మీడియాలో పేజీలు 50 శాతం పెరిగాయి. బి.బి.సి. మానిటరింగ్‌ తాజా పరిశోధనలో తేలిన సంగతి అది. ఈ టీకా వ్యతిరేక వార్తలకు అందరం అడ్డుకట్ట వేయాల్సి ఉంది. ఆ పని చేయకపోగా, వీటిని కూడా ఎన్నికల స్వార్థంతో, ప్రత్యర్థిపై పైచేయి సాధించడం కోసం రాజకీయ నేతలు వాడుకోవడం మరో విషాదం. 

మన దేశంలో ఇప్పటి దాకా వేసినవి 32 కోట్ల టీకా డోసులని ఓ లెక్క. థర్డ్‌ వేవ్‌ను తట్టుకోవాలంటే, పెద్దల్లో నూటికి 80 మందికైనా టీకా వేయాలి. ఆ లెక్కన రోజుకు కోటి టీకా డోసులు అవసరం. కానీ, నకిలీ చికిత్సలు, నకిలీ టీకాలు, నకిలీ వార్తలు – అన్నీ కలిసి ఈ బృహ త్తర యజ్ఞాన్ని నీరుకారుస్తున్నాయి. అసలే మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో టీకాలు వేయ డానికి అనేక సవాళ్ళు. జనంలో అనేక అనుమానాలు. అంతంత మాత్రమైన అక్కడి వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఈ తాజా సంఘటనలు తోడై, జనంలో అసలు కరోనా చికిత్స, టీకా ప్రక్రియ మీదే నమ్మకం పోతుంది. మాయ... అంతా మాయ... అంటూ అనుమానాలు పెరిగి పోయే ప్రమాదం ఉంది. అదే జరిగితే... అంతకన్నా ఘోరం మరొకటి లేదు. ఎందుకంటే, ఇది మనకు మనమే చేస్తున్న పాపం. స్వయంకృతాపరాధాలతో మానవాళి తనకు తాను పెట్టుకుంటున్న పెనుశాపం.  

మరిన్ని వార్తలు