రాజ్యం మెడలు వంచిన రైతు 

20 Nov, 2021 00:25 IST|Sakshi

ప్రజాసానుకూలత, ప్రజావ్యతిరేకత అన్నవే ప్రజాస్వామ్యంలో పాలకుల విధాన నిర్ణయాలను ప్రభావితం చేసేవి. మానవేతిహాస గమనంలో, అట్టడుగు మట్టిమనుషుల్లో పుట్టి ఎదిగిన ప్రజా ఉద్యమాలు చరిత్ర గతినే మార్చిన సందర్భాలు కొల్లలు! భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓ గొప్ప విజయాన్ని దేశ రైతాంగోద్యమం ఇవాళ సాధించింది. ఎన్నో ఏళ్ల నుంచి, అందునా దశాబ్ద కాలంగా పలు సమస్యలతో నలుగుతున్న ఈ దేశ రైతాంగం, ఏడాదికిపైబడి బలిదానాలతో సాగిం చిన పోరాటం చరిత్రలో నిలిచిపోయే గెలుపు నమోదు చేసింది.

పాలకపక్షాలెంత బలోపేత శక్తులైనా, ఆధునిక శాస్త్ర–సాంకేతికతతో ఎన్ని మాయోపాయాలు చేసినా... రాజ్యాంగబద్దమైన తమ హక్కులను ఉద్యమించి సాధించుకోవచ్చని రైతులు నిరూపించిన ఘట్టం కార్తీక పౌర్ణమినాడు ఆవిష్కృతమైంది. ఈ శరత్కాల వెన్నెల.. పోరాటాల బాట పట్టిన వ్యవసాయ రంగానికో కొత్త ఆశా రేఖ! వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు  నిర్ణయించినట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో చట్టాల రద్దు ప్రక్రియ చేపడతామన్నారు. జరిగిన పరిణామాలకు దేశప్రజలను ప్రధాని క్షమాపణలు కోరి, ఔన్నత్యం చాటారు.

దేశ వ్యవ సాయ రంగాన్ని ఈ చట్టాలు మలుపుతిప్పుతాయని, విస్తృత సంస్కరణల్లో భాగమై రైతును రాజు చేస్తాయని, ఎత్తివేసే ప్రసక్తేలేదని... ఇంతకాలం నమ్మబలుకుతూ వచ్చిన పాలకపక్ష వాదనలు గాలికి పోయాయి. రైతు మరింత నలుగుతాడని, వ్యవసాయం, ఆహారోత్పత్తి–సరఫరా అన్నీ గంపగుత్తగా ఇక మార్కెట్‌ను శాసించే కార్పొరేట్‌ శక్తుల గుప్పిట్లోకి జారిపోతాయనే చట్టాల రద్దు కోరిన ఉద్యమ కారుల మాట సత్యమై నిలిచింది. దేశ రాజధాని ఢిల్లీలో, సరిహద్దుల్లో రహదారుల దిగ్బంధనంతో సాగించిన రైతాంగ ఉద్యమం ఎన్నో కడగండ్లను చూసింది. పోలీసు కాల్పులు, లాఠీ చార్జీలు, అక్కడ క్కడ చెలరేగిన అల్లర్లు, ప్రమాదాలు, ఇతరత్రా రేగిన హింస... ఏదైతేనేం, ఈ ఉద్యమ గర్భంలో దాదాపు 700 మంది ప్రాణత్యాగాలు న్నాయి.

వాటికెవరు బాధ్యత వహిస్తారు? ఉద్యమ నాయకు లతో కేంద్రం సంప్రదింపులు, రాజకీయ పక్షాల సమాలోచనలు, సుప్రీంకోర్టు జోక్యం కూడా సమస్య పరిష్కరించి, నేరుగా న్యాయం అందించలేకపోయాయి. చివరకు, ప్రజావ్యతిరేకత నాడి పాలకు లకు దొరికాక, అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట్లో, పార్లమెంటు శీతాకాల భేటీ సమీపి స్తుంటే ఉన్నట్టుండి పరిష్కారం దొరకటమే బాధాకరం. చట్టాల్ని వ్యతిరేకించే వారినే కాక మద్దతు దారుల్నీ ఇది విస్మయపరచింది. ఈ తెలివిడి ఆనాడే ఉంటే, ఇన్ని అనర్థాలు జరిగుండేవి కాదనే వాదన ‘పాలకూర కట్ట దొంగిలించిన నాడే....’ సామెతను గుర్తుకు తెస్తోంది.

శ్రమదమాదులకు ఓర్చి, వ్యూహాలను మార్చి, ప్రాణ త్యాగాలకు నిలిచి.. రైతులు సాధించిన గొప్ప గెలుపును తక్కువ చేయడం కాదు గానీ, ఇదే రైతాంగ సంపూర్ణ విజయం కాదు. ప్రమాదం పొంచే ఉంది! మౌలిక సమస్యలైన విత్తనం, రుణం, దిగుబడి, ధర, కొనుగోలు, మార్కెట్‌ వంటి అంశాల్లో సమస్యలు అపరిష్కృతమే! ఇందులో ఎన్నో సైద్దాంతిక వైరుధ్యాలు, మతలబులు, ఏకాభి ప్రాయం కుదరని అంశాలూ ఇమిడి ఉన్నాయి. రైతాంగం యావత్తు ముక్తకంఠంతో వద్దు మొర్రో అన్న చట్టాల్ని రద్దు చేసే తాజా వెనుకడుగు పాలకుల అవసరాల రీత్యా వచ్చిందే! వారి  వ్యావ సాయిక ఆలోచనల్లో మార్పు ఫలితం కాదు.

గొప్ప సంస్కరణలు తీసుకువస్తూ కూడా, రైతుల్లో ఒక వర్గానికి అవగాహన కలిగించలేకపోయామని ప్రధాని చెప్పిన మాటలు కీలకం! విడమర్చి చెప్ప డంలో విఫలమయ్యామన్నారే తప్ప రైతాంగం చెబు తున్నట్టు అవి వారి వ్యతిరేక విధానాలని అంగీ కరించలేదు. అందుకే, చట్టాలు వెనక్కి మళ్లినంత మాత్రాన, ఇవే అంశాలు ఇంకో రూపంలో వచ్చే ప్రమాదం లేదని నిశ్చింతంగా ఉండలేమని ఉద్య మకారులంటున్నారు. రైతాంగ అప్రమత్తతే అవసరం! ఢిల్లీ చుట్టూ అల్లుకున్న రైతాంగ ఉద్యమంలో బలంగా ఉన్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో అసెంబ్లీలకు ఎన్నికలు రానున్నాయి.

ఈ ఉద్యమ వాతా వరణం ప్రజావ్యతిరేకతకు భూమిక ఏర్పరిస్తే, రాబోయే ఎన్నికల్లో తమ పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళనే, ఒక అడుగు వెనక్కి వేయించిన యుద్ధ వ్యూహంగా అభివర్ణిస్తున్నారు. నిజంగా చిత్తశుద్దే ఉంటే ఉన్నతస్థాయి కమిటీ వేయాలి. సంబంధీకులను భాగస్వాముల్ని చేసి, సమస్యలకి సామరస్య పూర్వక–శాశ్వత పరిష్కారాలు కనుక్కోవాలి. అప్పుడే రైతులది సంపూర్ణ విజయం.

మొక్కవోని దీక్షతో రైతులు సాగించి, ఫలితం సాధించిన ఉద్యమం కేంద్ర పాలకపక్షానికే కాకుండా కాంగ్రెస్‌తో సహా పలు రాజకీయ పార్టీలకూ గుణపాఠమే! కేంద్రంలో  విపక్షమైన కాంగ్రెస్‌ తన వి«ధానాలపై పునరాలోచన చేయాలి. ప్రపంచ దృష్టినాకర్షించిన రైతాంగ ఉద్యమంలో కాంగ్రెస్‌ గానీ, మరో ఇతర పార్టీగానీ ఎందుకు భాగం కాలేకపోయాయి? ఏ రాజకీయ పక్షాన్నీ తమ వేదికల పైకి ఉద్యమనాయకత్వం రానీయలేదు. ఇందుకు రెండు బలమైన కారణాలు. ఒకటి, రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాలు పిండుకునేందుకే యత్నిస్తాయి. ఉద్యమ ఉధృతిని అది తగ్గిస్తుంది.

రెండు, వ్యవసాయరంగ మౌలిక సమస్యలపై విపక్ష పార్టీల ఆర్థిక– సామాజిక–రాజకీయ విధానాలు భిన్నమైనవేమీ కావు. ఈ విషయంలో అన్ని పాలకపక్షాలూ ‘ఒకే తాను ముక్కలు’ అన్న భావన రైతాంగ నాయకత్వానికుంది. ప్రజాపక్షం వహించడమే పార్టీల ఎజెండా కావాలి. ప్రజాభిప్రాయమే పాలనా నిర్ణయాలకు ప్రాతిపదిక కావాలి. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది, బలపడుతుంది. 

మరిన్ని వార్తలు