మరపురాని క్షణాలు

20 Dec, 2022 00:20 IST|Sakshi

ఫుట్‌బాల్‌ ప్రియుల జ్ఞాపకాలలో డిసెంబర్‌ 18 నాటి రాత్రి అనేక సంవత్సరాలు గుర్తుండిపోతుంది. 2022 ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌ ఫైనల్‌ సాగిన తీరు అలాంటిది. ప్రపంచ ఫుట్‌బాల్‌ సంఘం ‘ఫిఫా’ సారథ్యంలో నాలుగేళ్ళకోసారి జరిగే ఈ క్రీడా ఉత్సవంలో అర్జెంటీనా, ఫ్రాన్స్‌ల ఫైనల్‌ వంద కోట్ల పైచిలుకు మందిని తెర ముందు కట్టిపడేసింది. దిగ్గజాలైన 35 ఏళ్ళ మెస్సీ (అర్జెంటీనా), 24 ఏళ్ళ ఎంబాపే (ఫ్రాన్స్‌)ల మధ్య పోటాపోటీలో నిర్ణీత 90 నిమిషాలు, ఆపై అదనపు సమయాల్లోనూ ప్రత్యర్థులను సమవుజ్జీలుగా నిలిపిన ప్రతి ఘట్టం కుర్చీ అంచున కూర్చొని చూసేలా చేసింది. చివరకు పెనాల్టీ షూటౌట్‌లో 4–2 గోల్స్‌ తేడాతో అర్జెంటీనా, ఫ్రాన్స్‌నుఓడించడంతో ఉద్విగ్నత ముగిసింది. అయితే, ఈ 2022 విశ్వక్రీడా కిరీట పోరాటంపై చర్చ మాత్రం ఇప్పుడప్పుడే ఆగదు. 

అర్జెంటీనా కెప్టెన్‌ మెస్సీ అనేక ఏళ్ళుగా తనను ఊరిస్తున్న స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. 1986 తర్వాత 36 ఏళ్ళకు తమ దేశానికి మరోసారి ప్రపంచ కప్‌ తెచ్చిపెట్టి, నవతరం క్రీడాభిమా నుల్లో తమ దేశానికే చెందిన మునుపటి ఫుట్‌బాల్‌ మాంత్రికుడు డీగో మారడోనాను మరిపించారు. తమ దేశం సాధించిన ఈ 3వ వరల్డ్‌ కప్‌ ట్రోఫీని చిరకాలం గుర్తుంచుకొనేలా చేశారు. ఫుట్‌బాల్‌ క్రీడాచరిత్రలో 5 వరల్డ్‌ కప్‌లలో పాల్గొన్న ఆరుగురు ఆటగాళ్ళలో ఒకడిగా నిలిచారు. ఏకంగా 4 ఛాంపియన్స్‌ లీగ్స్‌ సహా అనేక ఘనతలు సాధించినా, వరల్డ్‌కప్‌ ట్రోఫీ మాత్రం చిరకాలంగా మెస్సీకి అందకుండా ఊరిస్తూ వచ్చింది. 2014లో ఆఖరి దాకా వెళ్ళినా, ఆ కలను నెరవేర్చుకోలేకపోయారు.

ఇప్పుడా లోటు భర్తీ చేసుకోవడమే కాక, ఈ వరల్డ్‌ కప్‌లో ప్రతి నాకౌట్‌ గేమ్‌లోనూ గోల్‌ చేసిన అరుదైన ఆటగాడయ్యారు. ఒకటీ రెండు కాదు... 13 వరల్డ్‌ కప్‌ గోల్స్‌ చేసి, దిగ్గజ ఆటగాడు పీలేను సైతం అధిగమించారు. ఫిఫా వరల్డ్‌ కప్‌లో 2 సార్లు గోల్డెన్‌ బాల్‌ ట్రోఫీని గెల్చిన ఏకైక ఆటగాడనే ఖ్యాతి గడించారు. గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ (జీఓఏటీ) పట్టానికి అర్హుడినని నిరూపించారు. పీలే, మార డోనా తర్వాత సరికొత్త ప్రపంచ ఫుట్‌బాల్‌ దేవుడిగా అవతరించారు. ఫైనల్‌లో హ్యాట్రిక్‌ గోల్స్‌తో రికార్డు సృష్టించినా, గాయాల బారినపడ్డ ఫ్రాన్స్‌కు కిరీటం కట్టబెట్టలేకపోతేనేం... 23 ఏళ్ళ ఎంబాపే కోట్లాది జనం మనసు గెలిచారు. ప్రపంచం కళ్ళప్పగించే మరో సాకర్‌ స్టార్‌ అనిపించుకున్నారు.

కాలం మారింది. తాజా ప్రపంచ కప్‌ పోటీలు పాత కథను చెరిపేశాయి. వివిధ జట్ల మధ్య అంతరాన్ని చెరిపేశాయి. మరుగుజ్జులని అంతా భావించిన ఆసియా, ఆఫ్రికా ప్రాంత జట్లు ఆకలి గొన్న పులుల లాగా మైదానంలో ప్రత్యర్థి జట్లను వేటాడి, విజయాలు సాధించాయి. ప్రపంచంలో 80 శాతం జనాభా నివసించే ఈ ప్రాంత జట్లు విశ్వవేదికపై ఫేవరెట్లు కాదని అందరూ భావించినా, అగ్రస్థానంలోకి దూసుకొచ్చాయి. ఈ సాకర్‌ పోరాటంలో జపాన్‌ జట్టు 2014, 2010 వరల్డ్‌ ఛాంపి యన్స్‌ జర్మనీ, స్పెయిన్‌లను ఓడించి, ఆశ్చర్యపరిచింది. నరాలు తెగే ఉత్కంఠలోనూ స్థిమితంగా ఉంటూ, పూర్తి భిన్నమైన ఆట తీరు చూపడం జపాన్‌ జట్టు ప్రధాన కోచ్‌నే అబ్బురపరిచింది. 

ఒక్క జపానే కాదు... మొరాకో, సెనెగల్‌ లాంటి అనేక ఇతర నాన్‌ ఫేవరెట్‌ జట్లూ, బలమైన యూరోపియన్‌ జట్లకు చెమటలు పట్టించాయి. సెమీస్‌కు చేరిన తొలి ఆఫ్రికన్‌ దేశంగా మొరాకో చరిత్ర సృష్టించింది. ఆసియా, ఆఫ్రికా ప్రాంత జట్లు టైటిల్‌ విజేతలు కాకపోతేనేం, తమను ఇక తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదని చాటాయి. ఇంకా అనేక ఆశ్చర్యాలకు ఖతర్‌లో సాగిన ఈ 2022 వరల్డ్‌ కప్‌ వేదికైంది. జగజ్జేత అర్జెంటీనా సైతం సౌదీ అరేబియా చేతిలో, రన్నరప్‌ ఫ్రాన్స్‌ జట్టు ట్యునీసియా చేతిలో మట్టికరిచాయి. టోర్నమెంట్‌కు ముందు ఫేవరెట్లుగా భావించిన బెల్జియమ్, జర్మనీ, డెన్మార్క్‌లు మధ్యలోనే ఇంటి ముఖం పట్టాయి. అయితే, ఆద్యంతం వినోదానికి కొరవ లేదు. అదే సమయంలో స్వలింగ సంపర్కుల ఆకాంక్షలపై షరతులు, వేదికగా నిలిచిన ఖతార్‌ మానవ హక్కుల రికార్డులపై విమర్శలు, వివాదాలూ లేకపోలేదు.
ప్రపంచమంతటి లాగే భారత్‌లోనూ సాకర్‌పై ఆసక్తి అపారం. మన దేశంలో 1982లో వరల్డ్‌ కప్‌ ఫుట్‌బాల్‌ ప్రత్యక్ష ప్రసారాలు మొదలయ్యాయి.

యాంటెన్నాలతో, చుక్కలు నిండిన బ్లాక్‌ అండ్‌ వైట్‌ టీవీలే మహాప్రసాదంగా ప్రపంచ శ్రేణి ఆటగాళ్ళ ఆటను తొలిసారి తెరపై సామాన్యులు చూశారు. ఆ దెబ్బకు అప్పుడే బెంగుళూరులో జరుగుతున్న ఐటీఐ, హెచ్‌ఏఎల్‌ లాంటి అగ్రజట్ల మధ్య ఫుట్‌ బాల్‌ లీగ్‌ మ్యాచ్‌లకు స్టేడియమ్‌లు నిండిపోయాయట. నిజానికి, బెంగాల్, కేరళల్లో సోకర్‌పై పిచ్చి ప్రేమ ఆది నుంచీ ఉన్నదే. ఈసారీ దేశంలో టీవీని దాటి, 11 కోట్ల మందిపైగా వీక్షకులు యాప్‌ల ద్వారా డిజిటల్‌గా ఈ వరల్డ్‌ కప్‌ చూశారు. డిజిటల్‌ వ్యూయర్‌షిప్‌లో ఇది ఓ రికార్డ్‌. ఇంతగా ప్రేమి స్తున్న ఆటకు ప్రభుత్వ ప్రోత్సాహమెంత? విశ్వవేదికపై కనీసం క్వాలిఫై కాని మన ఆట తీరేంటి?  
ఈ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ దెబ్బతో 1998లో స్థాపించిన గూగుల్‌ సెర్చ్‌లో గత పాతికేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేనంతటి రద్దీ ఆదివారం ఏర్పడింది.

ఫైనల్‌ విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకొనేందుకు జనం ఆతురత చూపారు. క్రికెట్‌ లాంటివెన్ని ఉన్నా, ప్రపంచం మొత్తాన్నీ ఉర్రూతలూపేది ఫుట్‌బాల్‌ అనేది అందుకే. అదే సమయంలో క్రీడాస్ఫూర్తిని పెంచాల్సిన ఆటలో ఫలితాలు వచ్చాక గ్రూప్‌ దశలో, ఫైనల్‌ తర్వాత ఫ్రాన్స్‌ సహా వివిధ దేశాల్లో విధ్వంసాలు రేగడం విషాదం. మారాల్సిన వికృత నైజానికివి నిదర్శనం. ఏమైనా, ఇవన్నీ 2026లో వచ్చే వరల్డ్‌ కప్‌కు పాఠం కావాలి. వర్ణాలు, వర్గాలకు అతీతంగా ఫుట్‌బాల్‌ గెలవాలి. వట్టి మెస్సీ, ఎంబాపేల నామ జపం కన్నా అది ముఖ్యం. 

మరిన్ని వార్తలు