జర్మనీ నిర్ణయం సబబేనా?

28 Jan, 2023 04:07 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం రేపో మాపో పరిసమాప్తం కాకతప్పదని, పెను సంక్షోభంలో చిక్కుకున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకోవటం మొదలవుతుందని ఆశిస్తున్నవారిని తాజా పరిణామం తీవ్ర నిరాశలోకి నెట్టింది. ఉక్రెయిన్‌కు లెపార్డ్‌ 2 రకం భారీ యుద్ధ ట్యాంకులు అందజేయడానికి గత కొన్ని నెలలుగా ససేమిరా అంటున్న జర్మనీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని మార్చుకుంది. యుద్ధంలో ఆయుధ సంపత్తి ప్రధానమే కావొచ్చుగానీ... ప్రతిఘటనదారుల సంకల్పబలం ముందు అవి దిగదుడుపేనని యుద్ధ నిపుణులంటారు. ఒక చిన్న దేశం వియత్నాం ముందు అరవయ్యో దశకంలో అమెరికా చిత్తయిన ఉదంతం మొదలుకొని తాజాగా రష్యాపై ఉక్రెయిన్‌ సాగిస్తున్న ప్రతిఘటన వరకూ అది రుజువవుతూనే ఉంది. నెలరోజుల్లో ఉక్రెయిన్‌ను పాదాక్రాంతం చేసుకోవాలనుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఏడాది గడిచాక దాన్నుంచి బయటి కొచ్చే దారీతెన్నూ కానక ఆపసోపాలు పడుతున్నారు.

అందరూ ఏకమై పుతిన్‌ మెడలువంచి ఆయన్ను చర్చలకు ఒప్పించాల్సివున్న ఈ తరుణంలో ఉక్రెయిన్‌కు ఆయుధాలందిస్తూ ఆ యుద్ధాన్ని మరింత సాగదీసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే జర్మనీ అంత సులభంగా ట్యాంకు లివ్వటానికి అంగీకరించలేదు. అమెరికా తన ఎం1 అబ్రామ్‌ ట్యాంకుల్ని కూడా తరలించేందుకు ఒప్పుకుంటేనే లెపార్డ్‌ 2 ట్యాంకులు అందిస్తామన్న షరతు విధించింది. ఈ విషయంలో జర్మనీ చాన్సలర్‌ ఒలోఫ్‌ షుల్జ్‌ మనసు మారేలా చేసేందుకు అమెరికా అన్నివిధాలా ప్రయత్నించింది. జర్మనీలోని పాలక, ప్రతిపక్షాలతోపాటు నాటో కూటమి దేశాలు సైతం షుల్జ్‌పై ఒత్తిళ్లు తెచ్చాయి. నేరుగా ఉక్రెయిన్‌కు ఇవ్వటం అభ్యంతరమైతే తమకు సరఫరా చేసిన లెపార్డ్‌లివ్వటానికైనా అనుమ తించాలని పోలెండ్‌ గత కొన్ని వారాలుగా డిమాండ్‌ చేస్తోంది. నిజానికి ఇది ట్యాంకు లివ్వటంతో ఆగదు. విమాన విధ్వంసక చీతా ట్యాంకులివ్వాలని కూడా జర్మనీపై ఒత్తిడి ఉంది. వాటితోపాటు ఉక్రెయిన్‌ ఎఫ్‌–16 యుద్ధ విమానాలివ్వాలని చాన్నాళ్లుగా అమెరికాను కోరుతోంది.

ఉక్రెయిన్‌కు ఏడాదిగా జర్మనీ చేస్తున్న సాయం తక్కువేం కాదు. కానీ అదంతా నాటో కూటమి సాయంలో భాగంగా ఉంది. ప్రత్యక్షంగా ట్యాంకులు పంపటం మొదలైతే ఆ చర్య రష్యాను రెచ్చ గొడుతుందన్న భయం షుల్జ్‌కి ఉంది. అదే జరిగితే ఆర్థికంగా, సైనికంగా కూడా జర్మనీ నష్టపోతుందని ఆయన అంచనా. దానికితోడు అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పుణ్యమా అని జర్మనీకి ఆ దేశంపై ఎన్నో సంశయాలున్నాయి. యుద్ధంలోకి దిగాక చివరివరకూ అమెరికా అండగా ఉంటుందా అన్నది దాని ప్రధాన సందేహం. అబ్రామ్‌ ట్యాంకులు విడుదల చేయటం  ససేమిరా కుదరదని అధ్యక్షుడు బైడెన్‌ చెప్పటం ఆ సందేహాన్ని మరింత పెంచింది. అమెరికా రక్షణమంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ జర్మనీని ఈ విషయంలో ఒప్పించటానికి అన్నివిధాలా ప్రయత్నించి విఫలమయ్యాక చివరకు బైడెన్‌ను అంగీకరింపజేయగలిగారు. అయితే తన అమ్ములపొదిలో ఉన్న ట్యాంకులు కాకుండా తయారీదారులనుంచి కొనుగోలు చేసుకోవాలని అమెరికా అంటోంది. జర్మనీకి మరో సమస్య కూడా ఉంది. దానిదగ్గర ప్రస్తుతం లెపార్డ్‌ 2 ట్యాంకులు భారీ సంఖ్యలో లేవు. ప్రచ్ఛన్న యుద్ధ సమయంలో 4,000 వరకూ ఉండే ఆ ట్యాంకుల సంఖ్య ఇప్పుడు 300కు పడిపోయింది. వాటిని పెంచుకోవాలంటే చాన్నాళ్లు పడుతుంది. పైగా తోటి యూరప్‌ దేశాలకు ఇప్పటికే ఎగుమతి చేసిన ట్యాంకులకు విడి భాగాలు అందించాల్సివుంది. నిజానికి అమెరికా సైతం అలాంటి అభ్యంతరమేచెప్పింది. ప్రస్తుతం తమ బలగాల దగ్గరున్న 4,000 ట్యాంకులు దేశ భద్రతరీత్యా కదల్చటం సాధ్య పడదంటున్నది. అందుకు బదులు కొనుగోలు చేసుకోవాలంటున్నది. అమెరికా తయారీ అబ్రామ్‌ లముందు లెపార్డ్‌లు కొంత తీసికట్టే. గల్ఫ్‌ యుద్ధంలో, 2003 నాటి ఇరాక్‌ దురాక్రమణలో, అఫ్గానిస్తాన్‌ దురాక్రమణలో అమెరికాకు అబ్రావ్‌ులు అక్కరకొచ్చాయని సైనిక నిపుణులంటారు. అయితే ఇందుకు ఎంతో సమన్వయం అవసరం. అఫ్గాన్‌లో మందుపాతరలనూ, ఇతర బాంబు దాడులనూ అవి తట్టుకున్నాయి. కానీ వాటి సాంకేతికత అత్యంత సంక్లిష్టమైనది. నెలల తరబడి శిక్షణ ఉంటేనే వాటిని వినియోగించటం సాధ్యం. అదీగాక అబ్రామ్‌ల వ్యయం, వాటి విడి భాగాలు భారీ ఖర్చుతో కూడుకున్నవి. ఈ విషయంలో లెపార్డ్‌లు మెరుగే అయినా వాటిపైన కూడా ప్రత్యేక శిక్షణ అవసరం. అందువల్ల తక్షణం ఈ ట్యాంకులు యుద్ధ క్షేత్రానికి రాలేవు. 

తనపై నేరుగా లడాయికి దిగే ధైర్యం నాటోకు ఉండదని, ఆ కూటమిలో చీలిక రావటం ఖాయమని మొదటినుంచీ అనుకుంటున్న రష్యాకు జర్మనీ నిర్ణయం శరాఘాతమే. నేరుగా తమ గడ్డపై దాడి చేయగల భారీ ట్యాంకుల్నీ, అధునాతన యుద్ధ విమానాలనూ మోహరిస్తే ఆత్మ వినాశనం కొని తెచ్చుకున్నట్టేనని రష్యా చేస్తున్న హెచ్చరికల సారాంశం పుతిన్‌  మొదటినుంచీ బెదిరిస్తున్న అణుయుద్ధమే అయితే ప్రపంచానికి చేటుకాలం దాపురించినట్టే. తమ ఆహార అవస రాల్లో 80 శాతం వరకూ ఉక్రెయిన్‌పైనే ఆధారపడ్డ ఈజిప్టువంటి దేశాలు ఇప్పటికే సంక్షోభంలో పడ్డాయి. ఇతరత్రా ఉత్పత్తులు మందగించి ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పరిస్థితి మరింత క్షీణించేలా మారణాయుధాలు తరలించటంకాక యుద్ధం ఆపేందుకు అవసరమైన ఇతరత్రా చర్యలన్నిటిపైనా దృష్టి సారించాలి. ఆ విషయంలో శాంతిని కోరుకునే ప్రపంచ ప్రజానీకం ఒత్తిళ్లు తీసుకురావాలి. అప్పుడు మాత్రమే పరిస్థితి కుదుటపడుతుంది. 

మరిన్ని వార్తలు