ఘంటసాల ఘన స్మరణ

6 Dec, 2021 01:54 IST|Sakshi

ఇంటి నుంచి పారిపోయిన నౌషాద్‌ ముంబైలో పెద్ద సంగీత దర్శకుడయ్యాడన్న సంగతి ఇంట్లో తెలియదు. దర్జీ అని చెప్పుకున్నాడు. దర్జీ అనే తండ్రి పెళ్లి చేశాడు. ఆ పెళ్లికి లక్నో వెళ్లి గుర్రం మీద ఊరేగుతుంటే నౌషాద్‌ కట్టిన పాటలనే బ్యాండు మేళం వాళ్లు వాయించడం మొదలుపెట్టారు. గుర్రం మీద ఉన్న పెళ్లికొడుకే వాటికి సంగీత దర్శకుడని బ్యాండు వాళ్లకు తెలియదు. పెళ్లి వాళ్లకూ తెలియదు. ఘంటసాల ఆ నౌషాద్‌ కంటే మూడేళ్లు చిన్న. మేనమామ కూతురైన సావిత్రిని వివాహమాడి ఆ సాయంత్రమే అతిథుల కోసం నుదుట బాసికం, పెళ్లి చుక్కతో కచ్చేరీ చేశాడు. ఇలాంటి ఘనత, పరంపర ఉత్తరాన నౌషాద్‌కు, దక్షిణాన ఘంటసాలకే ఉంది.

‘శేష శైలావాస.. శ్రీ వెంకటేశా’... వేంకటేశ్వరుని ఎదుట ఘంటసాల పద్మాసనం వేసుకుని పాడుతుంటే ఘంటసాల ఇలా ఉంటాడా అని కళ్లు ఇంతింత చేసుకుని చూశారు సామాన్య జనం. నిన్న మొన్నటి వరకూ ప్రతి ఊళ్లో మార్నింగ్‌ షో మొదలెట్టే ముందు ఘంటసాల పాడిన ‘నమో వెంకటేశా..’ ప్లే చేయడం సెంటిమెంటు. ఘంటసాల బతికినంత కాలం సినిమా ఆయనకు సిరి, సంపద ఇచ్చింది. ఘంటసాల తాను పోయాక కూడా సినిమాకు స్ఫూర్తి ఇస్తూ వెళ్లాడు. కోట్ల మంది తెలుగువారికి మాత్రలు అక్కర్లేని స్వస్థతను ఇస్తూనే వెళుతున్నాడు. కనుకనే సుమతీ శతకకారుడు అప్పిచ్చువాడు, ఎడతెగక పారే ఏరు, ఘంటసాల పాట లేని ఊరు తక్షణమే వదిలిపెట్టమన్నాడు.

సంస్కృతి కొందరిని పుట్టిస్తుంది. కొందరు పుట్టి సంస్కృతిగా మారుతారు. ఘంటసాల తెలుగువారి సంస్కృతి. తెలుగువారి ఉషోదయం... ఎండకాసే మధ్యాహ్నం... వీవెనలు వీచే రాత్రి కూడా. ‘దినకరా... శుభకరా’ ఉదయాన్నే వినాలి. ‘పలకరించితేనే ఉలికి ఉలికి పడతావు’... మధ్యాహ్నం వినాలి. రాత్రి నిద్రపోయే ముందు ‘పాడుతా తీయగా చల్లగా’ వినాలి. ఉత్తమమైన తెలుగు సాహిత్యం పట్ల రుచి కలిగి ఆ సాహిత్యం జాతికి అందాలి అని సొంతగా రికార్డులు విడుదల చేసినవాడు ఘంటసాల. ‘కుంతీ విలాపం’, ‘పుష్ప విలాపం’, ‘తల నిండ పూదండ దాల్చిన రాణి’, ‘రావోయి బంగారి మామా’.... ఇక అనారోగ్యంతో ఉన్నానని తెలిసి కూడా బాధ్యతగా ఆథ్యాత్మిక సంపదగా ఇచ్చి వెళ్లిన ‘భగవద్గీత’ది చెల్లించలేని రుణం. భగవద్గీత శ్లోకాలకు బాణీ కట్టడంలో ఘంటసాల ఎంత జీనియస్‌నెస్‌ చూపించాడో మ్యూజిక్‌ రివ్యూయెర్‌ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్‌ రాసిన వ్యాసాలు చదివితే తెలుస్తుంది. 

‘నీవేనా నను పిలిచినది... నీవేనా నను తలచినది...’... ఘంటసాల కట్టిన పాట ఇది. ఆ కాలంలోనే వేరొక గొప్ప సంగీత దర్శకుడు ఉండేవాడు. అతడు బాణీలు కడుతుంటే హార్మోనియం మెట్లను చూస్తూ నిర్మాత నాగిరెడ్డి ‘ఎప్పుడూ తెల్లవే నొక్కకండి. నల్లవి కూడా నొక్కండి’ అనేవాడట. అంటే పాశ్చాత్య బాణీలను కాపీ చేయొద్దు అని సూచన. కాని ఘంటసాల బాణీలన్నీ దేశీయమైనవి. ఆయన తన హార్మోనియం మెట్ల మీద నల్ల మెట్లను నొక్కడానికే ఇష్టపడ్డాడు. ‘తెల్లవార వచ్చె తెలియక నా స్వామి...’. ఘంటసాల మహా గాయకుడైన బడే గులాం అలీఖాన్‌ ఏకలవ్య శిష్యుడు. కర్ణాటక సంగీతంతో పాటు హిందుస్థానీ ప్రియుడు. బడే ఎప్పుడు మద్రాసు వచ్చినా రెండు మూడు నెలలు ఘంటసాల ఇంట్లోనే బస. కనుకనే ఘంటసాల పాడిన పాట మాత్రమే కాదు  కట్టిన పాట కూడా దేశీయమైనది.

‘కొండలే రగిలే వడగాలి... నీ సిగలో పూలేనోయ్‌’... రిక్షాలో వెళుతున్న పండితుడు పక్కనున్న వ్యక్తితో ‘ఈ మాటకు అర్థమేంటండీ’ అని తర్కిస్తూ ఉంటే రిక్షావ్యక్తి ‘తాగుబోతు మాటలకు అర్థాలేముంటాయి బాబయ్యా’ అన్నాడట. ఘంటసాల తెలుగువారి తొలి మాస్‌ సింగర్‌. ‘వెండి వెన్నెల జాబిలి... నిండు పున్నమి జాబిలి’.. రొమాంటిక్‌ సింగర్‌. ‘ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి...’ లేడీస్‌ ఫాలోయింగ్‌ ఉన్న సింగర్‌. ‘జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా’... మోటివేషనల్‌ సింగర్‌. ‘ఘనాఘన సుందర’... ఆధ్యాత్మిక సింగర్‌. ‘తెలుగు వీర లేవరా.... దీక్ష బూని సాగరా’... రివెల్యూషనరీ సింగర్‌. ‘అమ్మా అని అరచినా ఆలకించవేమమ్మా’ ట్రాజెడీ సింగర్‌...  ‘ఒహొ సుందరి నీ వంటి దివ్య స్వరూపం’... కామెడీ సింగర్‌. ఘంటసాల వంటసాలలో పక్వానికి రాని ఫలం లేదు. కుదరని పాకం లేదు. ఘంటసాలతో కలిసి  రావు బాలసరస్వతి, పి.లీల, జిక్కి, సుశీల, జానకి... తెలుగువారికి తేనె రాసిన తమలపాకులను అందించారు. ఆ చరణమే చర్వితం. చర్వితమే ఆ చరణం.

1974 ఫిబ్రవరి 11న తన 52వ ఏట ఘంటసాల మరణించాడు. ఇది దేహ గతింపుకు సంబంధించిన వార్తే తప్ప తెలుగువారికి ఆయన గానంతో వచ్చిన ఎడబాటు కాదు. అలాంటి ఎడబాటు ఎన్నటికీ రాదు. ఘంటసాల పాట గతంలో ఉంది. నేడు ఉంది. రేపు ఉంటుంది.  అందుకే రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఘంటసాల శత జయంతి ఉత్సవాలు డిసెంబర్‌ 4న ఘనంగా మొదలయ్యాయి. 2022 డిసెంబర్‌ 4 వరకూ ఇవి ఊరు వాడలా జరుగుతాయి. ఘంటసాల ఘనతను స్మరించుకోవడం అంటే తెలుగవారు తమ కీర్తి కిరిటానికి కొత్త బంగారు నీరు ఎక్కించుకోవడం. ఆ మహనీయునికి వంద వందనాలు. ఈ సంవత్సరమంతా ఆయన పాటల చందనాలు. ప్రతి ఇంటా ఘంటసాల పాట ప్రాప్తిరస్తు. 
 

మరిన్ని వార్తలు