-

సమీపంలో మహా సంక్షోభం

21 May, 2022 00:23 IST|Sakshi

ఉత్తరాదిన భానుడి చండప్రతాపం 50 డిగ్రీల సెంటీగ్రేడ్‌. అంటే గడచిన 122 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా ఈ మార్చి, ఏప్రిల్‌లలో ఉష్ణోగ్రత. దక్షిణాదిన బెంగుళూరులో గంటల వ్యవధిలో ఒక్కపెట్టున కురిసిన వర్షంతో తిప్పలు. అస్సామ్‌ సహా ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు, భూపతనాలు. ఎండ, వాన, చలి – అన్నీ అతిగానే! ఏదైనా అకాలమే!! ఈ శతాబ్దంలో భారత్‌ ఎదుర్కొంటున్న పెను ముప్పు వాతావరణ సంక్షోభం అని శాస్త్రవేత్తలు మొత్తుకుంటున్నది అందుకే! ప్రపంచ వ్యాప్తం గానూ ప్రధాన సమస్యలు – వాతావరణ మార్పులు, కాలుష్యమే. ఐక్యరాజ్య సమితి (ఐరాస) తాజా నివేదికలు ఆ మాటే చెబుతున్నాయి. వాతావరణ మార్పునకు ప్రధాన సూచికలైన నాలుగూ (గ్రీన్‌హౌస్‌ వాయువుల సాంద్రత, సముద్ర మట్టంలో పెరుగుదల, మహాసముద్రాల వేడిమి, ఆమ్లీకరణ) గత ఏడాది రికార్డు స్థాయిలో పెరిగాయి. మానవాళి మహా సంక్షోభం దిశగా వెళుతోంద నడానికి ఇదే సాక్ష్యమంటూ ఐరాస ప్రమాద ఘంటిక మోగిస్తోంది. 

ఒక రకంగా ఐరాస విడుదల చేసిన వాతావరణ రిపోర్ట్‌ కార్డు ఇది. దీన్ని బట్టి చూస్తే, ఉష్ణోగ్రతను పెంచే గ్రీన్‌హౌస్‌ వాయువుల స్థాయి ప్రపంచమంతటా 2020లోనూ, ఆ వెంటనే 2021లోనూ పెరుగుతూ పోయింది. పారిశ్రామికీకరణ ముందు రోజులతో పోలిస్తే ఇప్పుడు వాతావరణంలో కార్బన్‌ డయాక్సైడ్‌ సాంద్రత ఏకంగా 149 శాతం హెచ్చింది. ఇక, సముద్రమట్టం ఏటా సగటున 4.5 మి.మీ. వంతున పెరుగుతోంది. మహా సముద్రాల ఉష్ణోగ్రత, ఆమ్లీకరణ సైతం ఎక్కువవుతూ వస్తోంది. దీని వల్ల పగడాల దిబ్బలలాంటి నీటిలోని జీవావరణ వ్యవస్థలు, ప్రాణికోటి నాశనమవుతాయి. 

కాలుష్యం సంగతికొస్తే – వాయు, జల, రసాయన తదితర కారణాలతో ఒక్క 2019లోనే ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మంది మరణించారు. ‘లాన్సెట్‌ ప్లానెటరీ హెల్త్‌’ బుధవారం బయటపెట్టిన ఈ లెక్క ప్రకారం ప్రతి 6 మరణాల్లో ఒకటి కాలుష్య మరణమే. ఈ మొత్తంలో దాదాపు 24 లక్షల చావులు భారత్‌లో సంభవించినవే. ప్రపంచ కాలుష్య మరణాల్లో 66.7 లక్షల ప్రధాన వాటా వాయు కాలుష్యానిది. మన దేశంలోనూ కాలుష్య కోరలకు బలైన 24 లక్షల మందిలో... 16.7 లక్షల మంది పీల్చే గాలే ప్రాణాంతకమైనవారు. ఆ లెక్కన భారత్‌లో వాయు కాలుష్య మరణాల సంఖ్య ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనంత ఎక్కువ. 

భారత్‌లోనే కాదు... ప్రపంచమంతటా ఉగ్ర ఉష్ణపవనాలు, తుపానులు, అకాల వర్షాలు, కొన్నిచోట్ల అనావృష్టి, సముద్రమట్టాల పెరుగుదల ఊహించని రీతిలో తరచుగా సంభవిస్తున్నాయి. వీటికి కాలుష్యం, పర్యావరణ మార్పులే కారణమన్నది శాస్త్రవేత్తల విశ్లేషణ. దేశంలో ఇవాళ 63.8 కోట్ల జనాభాకు ఆవాసమైన 75 శాతానికి పైగా జిల్లాలు ఈ విపరీత వాతావరణ మార్పులకు కేంద్రాలట. ఇలాంటి వాతావరణ వైపరీత్యాలు 1970 నుంచి 2019 మధ్య 50 ఏళ్ళలో 20 రెట్లకు పైగా పెరిగాయి. భారతీయ మేధావుల బృందమైన ‘కౌన్సిల్‌ ఆన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ వాటర్‌’ (సీఈఈడబ్లు్య) తన అధ్యయనంలో ఈ సంగతి తేల్చింది. ఇది పైకి కనిపించకుండా శ్రామికశక్తినీ, ఆర్థిక వ్యవస్థనూ కూడా దెబ్బతీస్తున్న విషవలయం. ఏ ఏటికాయేడు పెరుగుతున్న వైపరీత్యాలతో ఇటు పట్నాల్లో, అటు పల్లెల్లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. జీవనోపాధి పోతోంది. 
స్వయంకృతాపరాధమైన వాతావరణ వైపరీత్యాలతో భారీ సామాజిక ఆర్థిక మూల్యం చెల్లిం చాల్సి వస్తోంది. పెరుగుతున్న వేడిమి వల్ల వ్యావసాయిక ఉత్పత్తి క్షీణిస్తోంది. ఏటా 2.5 నుంచి 4.5 శాతం స్థూల జాతీయోత్పత్తిని నష్టపోయే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ శ్రామిక సంస్థ (ఐఎల్‌ఓ) లెక్క ప్రకారం ఉష్ణతాపంతో తీవ్రంగా దెబ్బతింటున్న దేశాల్లో భారత్‌ ఒకటి. వేడిమి వల్ల 1995లో దేశంలో 4.3 శాతం పని గంటలు వృథా అయ్యాయి. వచ్చే 2030 నాటికి ఆ వృథా 5.8 శాతానికి చేరుతుందని అంచనా. దేశంలో గోధుమల ధర పెరగడానికీ పరోక్షంగా వాతావరణ మార్పులే కారణం. ఈ వేసవిలో ఉష్ణపవనాలతో 10 నుంచి 15 శాతం గోధుమ పంట నష్టపోయాం. అదే సమ యంలో ప్రపంచ గోధుమల ఎగుమతిలో ప్రధాన పాత్రధారి ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో సరఫరా చిక్కుల్లో పడింది. గో«ధుమ పిండి ఖరీదైపోయి, సామాన్యుల చపాతీలపై దెబ్బ పడింది. ఇలాంటి ఉదాహరణలు అనేకం. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నీటి భద్రత పైనా ప్రభావం చూపనున్నాయి. మరి, నీటి లభ్యతను కాపాడుకోవడంలో, నిల్వ చేసుకోవడంలో ఎలాంటి చర్యలు చేపడుతున్నాం? 

తాత్కాలిక పరిష్కారాలతో సమస్య తీరేది కాదు. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు విధానపరమైన మార్పులు తప్పనిసరి. పునర్వినియోగ ఇంధనం దిశగా మళ్ళాలి. వేడిని పెంచే ఏసీలు, కార్ల బదులు గాలి – వెలుతురు ధారాళంగా వచ్చే ఇళ్ళు, చల్లటి మిద్దెలు, హరితవనాల పెంపకం, అనువైన పౌర రవాణా వ్యవస్థలను ఆశ్రయించాలి. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కీలకం. నిజానికి ప్రతి రాష్ట్రంలో వాతావరణ మార్పును పర్యవేక్షించే సెల్‌ ఉంది. వాటన్నిటికీ పెద్దగా ప్రధాన మంత్రికి వాతావరణ మార్పుపై సలహాలిచ్చే కౌన్సిల్‌ కూడా ఉంది. కానీ, 2015 జనవరిలో తొలి సమావేశం తర్వాత మళ్ళీ ఇప్పటి దాకా సదరు కౌన్సిల్‌ కలిస్తే ఒట్టు. అలాగే, అన్ని రాష్ట్రాల్లోని సెల్స్‌ను కూడా పట్టించుకుంటున్న పాపాన పోలేదు. ప్రకృతి పెనుకేక పెడుతోంది. చెవి ఒగ్గకపోతే ముప్పు మనకీ, మన పిల్లలకే! 

మరిన్ని వార్తలు