తుపాకి నీడలో అమెరికా

25 Jun, 2022 01:11 IST|Sakshi

ఇంకా నాగరిక విలువలూ, ప్రజాస్వామిక విలువలూ పూర్తిగా వికసించని మూడు శతాబ్దాలనాడు అంటిన తుపాకి సంస్కృతి చీడను అమెరికా సమాజం ఇప్పటికీ వదుల్చుకోలేకపోతున్నదని గురువారం అక్కడ జరిగిన రెండు భిన్న పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఈమధ్యకాలంలో వరసగా టెక్సాస్, న్యూయార్క్, కాలిఫోర్నియా తదితర ప్రాంతాల్లో ఉన్మాదుల తుపాకి గుళ్లకు పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయాక అమెరికన్‌ కాంగ్రెస్‌ ఈ సంస్కృతిని నియంత్రించడానికి నడుం బిగించింది.

తుపాకి పరిశ్రమల లాబీకి అండదండలందించే రిపబ్లికన్‌ పార్టీకి చెందిన సెనెటర్లను సైతం ఈ ఉదంతాలు పునరాలోచింపజే సిన పర్యవసానంగా గురువారం రాత్రి సెనేట్‌ 65–33 వోట్ల తేడాతో తుపాకుల లభ్యతను కఠినం చేసే బిల్లును ఆమోదించింది. అదే రోజు మధ్యాహ్నం తుపాకి నియంత్రణకు న్యూయర్క్‌ రాష్ట్రం 109 ఏళ్లక్రితం తీసుకొచ్చిన చట్టం చెల్లదంటూ అమెరికా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మారణాయుధాలు ధరించి తిరగడం అమెరికన్‌ పౌరుల హక్కని తేల్చిచెప్పింది.

ఈ తీర్పు ఇంగిత జ్ఞానానికీ, రాజ్యాంగ విలువలకూ గొడ్డలిపెట్టని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సరిగానే వ్యాఖ్యానించారు. ఈమధ్య బఫెలోలో జరిగిన హత్యాకాండకు పదిమంది పౌరులు బలయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా తుపాకుల బెడదను మరింత పెంచగల ఈ తీర్పునివ్వడానికి న్యాయమూర్తులు వెనకాడలేదు. వాస్తవానికి న్యూయార్క్‌ తుపాకి నియంత్రణ చట్టం అంత కఠినమైనదేమీ కాదు. మారణాయుధాలు దగ్గర ఉంచుకుంటామనేవారు అందుకు గల కారణాలు వివరించాలి.

అవి సంతృప్తికరమైతే లైసెన్సు మంజూరు చేస్తారు. కానీ ఇలా షరతు విధించడం పౌరుల హక్కులను హరించడమే అంటున్నది సుప్రీంకోర్టు. గడపదాటి బయటి కెళ్లే ప్రతి ఒక్కరివద్దా ఆత్మరక్షణ కోసం మారణాయుధం ఉండాల్సిందేనని చెబుతున్నది. అందుకు రెండో రాజ్యాంగ సవరణను చూపుతున్నా దాన్ని న్యాయమూర్తులు సక్రమంగా అవగాహన చేసుకోలేదన్నది న్యాయ కోవిదుల వాదన. 

వరదలూ, తుపానులూ, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాల ముందు ఎటూ మనిషి నిస్స హాయంగా తలవంచక తప్పడంలేదు. అమెరికాలో తుపాకి సంస్కృతి కూడా ఈమాదిరి వైపరీత్యం గానే పరిణమించింది. మొత్తం 19 రాష్ట్రాలు, వాషింగ్టన్‌లలో ఏదోమేరకు తుపాకి నియంత్రణ చట్టాలున్నాయి. కానీ అవి పెద్దగా అక్కరకు వచ్చిన దాఖలాలు లేవు. అయినా కూడా రాలిపడు తున్న అమాయక ప్రాణాలకు కాదు... ఉన్మాదుల హక్కుకే విలువ అధికమన్నట్టు వ్యవహరించడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

సుప్రీంకోర్టు తాజా తీర్పుతో న్యూయార్క్‌లోనూ, అదే మాదిరి చట్టాలు అమల్లో ఉన్న కాలిఫోర్నియా, హవాయీ, మసాచూసెట్స్, న్యూజెర్సీ తదితర రాష్ట్రాల్లోనూ మారణా యుధాలు విచ్చలవిడిగా పెరిగే ప్రమాదం ఉంటుంది. తాజాగా అమెరికన్‌ సెనేట్‌ ఆమోదించిన బిల్లు కూడా ఏమంత సమర్థవంతమైనది కాదు. అది డెమొక్రాట్లు ఆశించిన స్థాయి బిల్లు కాదు.

రిపబ్లికన్‌లలో కొందరి ఆమోదమైనా పొందడం కోసం డెమొక్రాట్లు రాజీ పడి చేసిన మార్పుల పర్యవసానంగా రూపొందిన బిల్లు. మరో వారం పదిరోజుల్లో డెమొక్రాట్ల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రతినిధుల సభలో ఈ బిల్లు ఆమోదం పొందితే చట్టమవుతుంది. అయితే సుప్రీంకోర్టు తాజా తీర్పు ప్రభావం ఆ చట్టంపై ఏమేరకుంటుందో చూడాల్సి ఉంది. 

ప్రమాదకరమైన వ్యక్తుల చేతుల్లోకి మారణాయుధాలు పోకుండా ప్రయత్నించే రాష్ట్రాలకు ప్రోత్సాహకాలివ్వాలని సెనేట్‌ ఆమోదించిన బిల్లు ప్రతిపాదిస్తోంది. విద్యాసంస్థల భద్రతకూ, మానసిక వ్యాధులను అరికట్టడానికీ రాష్ట్రాలకు వందలకోట్ల డాలర్ల అదనపు నిధులివ్వడానికి వీలుకల్పిస్తోంది. అలాగే 21 ఏళ్లలోపువారికి మారణాయుధాల లభ్యత కఠినతరం చేస్తోంది. అలాంటివారి గత చరిత్రనూ, వారి మానసిక ఆరోగ్యాన్నీ మారణాయుధాల విక్రేత పోలీసుల సాయంతో తెలుసుకోవాల్సి ఉంటుంది.

మూడురోజులపాటు జరిగే ఈ ప్రక్రియలో అనుమానాస్పద అంశాలు కనిపిస్తే రెండో దశ తనిఖీ ఉంటుంది. అది పదిరోజులపాటు సాగుతుంది. అసలు మారణాయుధాల కొనుగోలుకు ఇప్పుడున్న కనిష్ఠ వయసు అర్హతను 18 నుంచి 21కి మార్చాలన్న డెమొక్రాట్ల ప్రతిపాదనకు రిపబ్లికన్‌లు అంగీకరించలేదు. సాధారణ పౌరులకు తుపాకులు దక్క నీయకుండా ఏం చేయాలన్న ఆలోచనకు బదులు వాటి పేరుతో విద్యాసంస్థలకూ, ఆసుపత్రులకూ కోట్లాది డాలర్లు దక్కేలా చేయడం వల్ల ఒరిగేదేమిటో అంతుబట్టదు. 

పైకి ప్రజాస్వామ్య దేశంగా కనబడే అమెరికాలో తుపాకుల తయారీ యాజమాన్యాల నేతృత్వంలోని నేషనల్‌ రైఫిల్స్‌ అసోసియేషన్‌(ఎన్‌ఆర్‌ఏ) సమాజాన్ని శాసిస్తున్నది. తుపాకి కలిగి ఉండటం ఒక హోదాకు చిహ్నమనీ, అది లేకపోతే ఆత్మరక్షణ అసాధ్యమనీ పౌరులకు భ్రమలు కల్పించడంలో అది ఎన్నడో విజయం సాధించింది. రెండు ప్రధాన పార్టీల్లోనూ ఎన్‌ఆర్‌ఏ లాబీలు పనిచేస్తుంటాయి.

కాకపోతే రిపబ్లికన్‌లతో పోలిస్తే డెమొక్రాట్లు కాస్త నయం. 2020లో తుపాకులకు 45,222 మంది మరణించారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో మూకుమ్మడి హత్యా కాండలు మొదలుకొని ఆత్మహత్యల వరకూ అన్నీ ఉన్నాయి. తుపాకి నీడన బతుకీడ్చే దుస్థితినుంచి సాధ్యమైనంత త్వరగా అమెరికా బయటపడాలని, బైడెన్‌ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టం ఆ దిశగా ఒక మంచి ప్రారంభమవుతుందని ఆశించాలి. 

మరిన్ని వార్తలు