తీరుమారని ‘ఉన్నతశ్రేణి’

23 Jul, 2022 00:07 IST|Sakshi

సమాజానికి దీపధారులుగా దాని అభ్యున్నతికి పాటుపడవలసిన ఉన్నతశ్రేణి విద్యాసంస్థలు అందుకు విరుద్ధమైన పోకడలు పోతున్నాయని తాజాగా పార్లమెంటుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సమర్పించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అంతర్జాతీయ రేటింగ్‌ల మాటెలా ఉన్నా దేశంలో ఇప్పటికీ ఉన్నతశ్రేణి మేధో కేంద్రాలుగా ఐఐటీ, ఐఐఎంలదే అగ్రస్థానం. ఎన్నడో 50వ దశకంలో ప్రథమ ప్రధాని నెహ్రూ హయాంలో ఈ సంస్థలు మొగ్గతొడిగి క్రమేపీ విస్తరించాయి. కానీ వాటి ఆలోచనా శైలి, పనితీరు మాత్రం ఆ కాలంలోనే ఉండిపోయాయన్న సందేహం కలుగుతుంది. నిరుడు ఢిల్లీ ఐఐటీలోని 8 విభాగాల్లో పరిశోధనలు చేసేందుకు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు చెందినవారు 637 మంది దరఖాస్తు చేసుకుంటే వారిలో ఒక్కరంటే ఒక్కరిని కూడా తీసుకోలేదు. మొత్తం 53 పీహెచ్‌డీ సీట్లుంటే ఆర్థికంగా వెనకబడిన కోటా(ఈడబ్ల్యూఎస్‌) కింద వచ్చిన 1,362 దరఖాస్తుల నుంచి ఆ సీట్లకు ఎంపిక చేశారు. దేశంలోని మరో 9 ఐఐటీల్లో కూడా పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. హైదరాబాద్, తిరుపతి ఐఐటీలు సహా ఎనిమిదింటిలో కొన్ని విభాగాల్లో అసలు ఎస్టీ విద్యార్థులే లేరు. మండీ ఐఐటీ అయితే ఎస్టీలతోపాటు ఎస్సీల నుంచి ఒక్కరంటే ఒక్కరిని కూడా తీసుకోకుండా చరిత్ర సృష్టించింది. ఎనిమిది ఐఐటీల్లో ఆరు సబ్జెక్టుల్లో ఓబీసీలకు స్థానమే లేదు. ఈ ఐఐటీల్లో హైదరాబాద్, తిరుపతి కూడా ఉన్నాయి. అటు ఐఐఎంల వాలకం కూడా ఇంతే. ఈ సంస్థలు కూడా పీహెచ్‌డీ సీట్లలో నిబంధనలన్నిటినీ గాలికొదిలాయి. పీహెచ్‌డీ సీట్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఓబీసీలకు 27 శాతం వాటా దక్కాల్సి ఉండగా 2018–19 మొదలుకొని 2021–22 విద్యాసంవత్సరం వరకూ ఏటా కనీసం 4 శాతం కూడా ఆ వర్గాలకు రాలేదు. ఉన్నత శ్రేణి విద్యాసంస్థలకు స్వయం ప్రతిపత్తి ఉండాలనీ, వాటిపై మితిమీరిన ప్రభుత్వ నియంత్రణ ఉండరాదనీ అందరూ కోరుకుంటారు. వర్తమానంలో ఎదురయ్యే సవాళ్లకు దీటుగా ఆలోచించేలా, సంక్లిష్ట సమస్యలకు మెరుగైన పరిష్కారాలను రూపొందించేలా విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఆ ప్రతిపత్తి తోడ్పడాలి తప్ప అట్టడుగు వర్గాలవారి అవకాశాలకు గండికొట్టేందుకు కాదు.

ఉన్నత శ్రేణి విద్యాసంస్థలు కావొచ్చు, మరేవైనా కావొచ్చు... అవి వైవిధ్య భరిత భారత సమాజాన్ని ప్రతిబింబించాలి. అన్ని వర్గాలవారికీ అందులో భాగస్వామ్యం ఉండాలి. దీనివల్ల రెండు రకాల ప్రయోజనాలుంటాయి. భిన్న వర్గాలవారు కలిసి చదువుకోవడంవల్ల సమాజ పోకడలు ఎలా ఉంటాయో, పరిష్కారాలు ఆలోచించే తీరెలా ఉండాలో అందరికీ అవగాహన కలుగుతుంది. అది అంతిమంగా సమాజ అభ్యున్నతికి దోహదపడుతుంది. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల సారథులు విశాల దృక్పథంతో వ్యవహరిస్తే అదేమంత కష్టం కాదు. కానీ ఇప్పుడు వెల్లడైన నివేదికలు గమనిస్తే ఆ సంస్థలు శల్యసారథ్యంతో కునారిల్లుతున్నాయనీ, రిజర్వేషన్ల మౌలిక ఉద్దేశమే దెబ్బతింటున్నదనీ అర్థమవుతుంది. ఆరేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్‌ వేముల ఆత్మహత్య ఉదంతమైనా, మూడేళ్లక్రితం ముంబైలోని ఉన్నత శ్రేణి వైద్య కళాశాల పీజీ విద్యార్థిని పాయల్‌ తాడ్వి ప్రాణం తీసుకున్న వైనమైనా వాటి సారథుల వైఫల్యాలనూ, ఆ విద్యాసంస్థల నిర్వహణ తీరునూ పట్టిచూపాయి. ఈ ఉదంతాలు మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. కానీ మీడియాకు ఎక్కని, కారణాలు వెల్లడికాని ఆత్మహత్యలు మరెన్నో చూస్తే గుండె చెరువవుతుంది. నిరుడు పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ లోక్‌సభకు అందజేసిన గణాంకాల ప్రకారం 2014–21 మధ్య ఉన్నతశ్రేణి విద్యాసంస్థల్లో 122 మంది విద్యార్థులు బలిదానం చేస్తే అందులో 71 మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల పిల్లలు. ఇక మధ్యలో చదువు చాలించుకుని వెళ్తున్నవారిలో సైతం అట్టడుగు వర్గాలవారే ఎక్కువ. నిరుడు ఆగస్టులో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం ఏడు ఐఐటీల్లో 60 శాతంమంది డ్రాపౌట్లు రిజర్వేషన్‌ కేటగిరీలవారే. ఉన్నతశ్రేణి విద్యాసంస్థల తీరుతెన్నులకు ఈ గణాంకాలు అద్దం పడ తాయి. దశాబ్దాల తరబడి ఈ విద్యాసంస్థలు ఇలా అఘోరిస్తుంటే పాలకులు ఏం చేస్తున్నట్టు? పార్లమెంటులో ప్రశ్నలు తలెత్తినప్పుడు వివరాలు తెప్పించుకోవడం, సభముందు పెట్టడం తప్ప మరేమీ చర్యలుండటం లేదా? పదే పదే రాజ్యాంగ విలువలకూ, నియమ నిబంధనలకూ తూట్లు పొడుస్తుంటే ప్రభుత్వాలు నిస్సహాయంగా మిగిలిపోవడం సరైందేనా? ఓబీసీ వర్గంనుంచి వచ్చిన నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్నా ఇది కొనసాగడం వింత కాదా?

నిజానికి ఐఐటీ, ఐఐఎంలు నెలకొల్పినప్పుడు వాటిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాల్లోని విద్యా సంస్థలు కూడా ఎదుగుతాయని అందరూ ఆశించారు. అయితే పాఠ్యాంశాలు మొదలుకొని అన్ని విషయాల్లో మన విద్యాసంస్థలు ఈనాటికీ తీసికట్టే. బడ్జెట్‌లలో విద్యారంగానికి ఎప్పుడూ అరకొర కేటాయింపులే గనుక వాటి ఎదుగుదల ఆరోగ్యవంతంగా లేదు. అసలు ఉన్నతశ్రేణి విద్యాసంస్థల నిర్వహణే ఇంత అన్యాయంగా ఉంటే ఇతరేతర అంశాల్లో ఏం జరుగుతున్నదనుకోవాలి? అధ్యాపక నియామకాలకు ప్రధానార్హత పీహెచ్‌డీ కనుక అట్టడుగు వర్గాలవారికి అందులో దక్కే అవకాశం సామాజికంగా ఎందరికో స్ఫూర్తిదాయకమవుతుంది. మరింతమంది ఎదగడానికి తోడ్పడుతుంది. అందుకే వివిధ వర్గాలకు దక్కవలసిన వాటా కచ్చితంగా అమలయ్యేలా చూడాలి. నూరు పూలు వికసించేందుకూ, వేయి ఆలోచనలు వర్ధిల్లేందుకూ ఉన్నతశ్రేణి విద్యా సంస్థలు వేదికలు కావాలి. 

మరిన్ని వార్తలు