అంతా బానే ఉంది!

11 Apr, 2022 00:23 IST|Sakshi

చింతనాపరుడైన ఒక బాటసారి ఏవో యాత్రలు చేస్తూ మార్గమధ్యంలో అలసి కాసేపు విశ్రమిద్దా మనుకున్నాడు. అడవిలోని పిల్ల బాట అది. దగ్గరలోనే పుచ్చకాయల తీగ ఒకటి కనబడి, ఆకలి కూడా పుట్టించింది. మోయలేనంత పెద్ద కాయను ఒకదాన్ని తెంపుకుని, అక్కడే ఉన్న మర్రిచెట్టు నీడన కూర్చున్నాడు. ఏ పిట్టలు కొరికి వదిలేసినవో అంతటా మర్రిపండ్లు పడివున్నాయి. ‘‘ఈ తమాషా చూడు! అంత సన్నటి తీగకేమో ఇంత బరువైన కాయా? ఇంత మహావృక్షానికేమో ఇంతింత చిన్న పండ్లా? ఈ సృష్టి లోపాలకు అంతం లేదు కదా! పరిమాణం రీత్యా ఆ తీగకు మర్రి పండ్లు, ఈ చెట్టుకు పుచ్చకాయలు ఉండటం సబబు’’ అనుకున్నాడు.

ఆలోచిస్తూనే ఆ కాయను కడుపునిండా తిన్నాడేమో, ఆ మిట్ట మధ్యాహ్నపు ఎండ తన మీద పడకుండా చెట్టు కాపు కాస్తున్న దేమో, అటే నిద్ర ముంచుకొచ్చింది. మర్రిపండు ఒకటి ముఖం మీద టప్పున రాలినప్పుడు గానీ మెలకువ రాలేదు. ‘‘ఆ, నేను తలపోసినట్టుగానే ఆ కాయ దీనికి కాసి ముఖం మీద పడివుంటే ఏమయ్యేది నా పరిస్థితి? ఔరా, ఈ సృష్టి విలాసం!’’ అనుకుని చక్కా పోయాడు బాటసారి. ఏ దేశపు జానపద గాథో! ఏది ఎలా ఉండాలో అది అలాగే ఉందని సృష్టి క్రమాన్ని అభినందిస్తుంది.

పాలగుమ్మి పద్మరాజు రాసిన ఓ కథలో కూడా ఇంకా సున్నితం కోల్పోని కాంట్రాక్టర్‌ అయిన కథా నాయకుడికి ఇలాంటి సందేహమే వస్తుంది. ఆ కూలీలు ఎర్రటి ఎండలో ఆ ఇంటి నిర్మాణం కోసం చెమటలు కక్కడమూ, వారి తిండీ, వారి బక్కటి శరీరాలూ, వారి మోటు సరసాలూ, అరుపులూ, ఇవన్నీ చూశాక అతడికి ఊపిరాడదు. సాయంత్రం పని ముగించి, తిండ్లు తినేసి, ఎక్కడివాళ్లక్కడ ఆదమరిచి నిద్రలోకి జారుకుంటారు. కలత నిద్రలో ఉన్నాడేమో, ఆ రాత్రి వీస్తున్న చల్లటి గాలి ఎందుకో అతడిని ఉన్నట్టుండి నిద్రలేపుతుంది. దూరంగా ఆ వెన్నెల కింద తమదైన ఏకాంతాన్ని సృష్టించుకుని ఆనంద పరవశపు సాన్నిహిత్యంలో ఉన్న ఒక కూలీల జంటను చూడగానే అతడిలోని ఏవో ప్రశ్నలకు జవాబు దొరికినట్టు అవుతుంది. ప్రపంచం మనం అనుకున్నంత దుర్మార్గంగా ఏమీ లేదు అనుకుంటాడు. అసలైనదీ, దక్కాల్సినదీ ఈ భూమ్మీద అందరికీ దక్కితీరుతుందన్న భావన లోనేమో అతడు తిరిగి హాయిగా నిద్రలోకి జారుకుంటాడు.

ఈ భూమండలం నిత్య కల్లోలం. మూలమూలనా ఏదో అలజడి, ఏదో ఘర్షణ, ఏదో సమస్య, ఏదో దారుణం. శ్రీలంకలో బాలేదు, పాకిస్తాన్‌లో బాలేదు, ఉక్రెయిన్‌లో అంతకంటే బాలేదు. రష్యాలో మాత్రం బాగుందని చెప్పలేం. ఇక్కడ మనదేశంలో మాత్రం? ఇన్ని యుద్ధాలు, ఇన్ని సంక్షో భాలు చుట్టూ చూస్తూ కూడా ఈ లోకం బానేవుంది అని ఎవరూ అనే సాహసం చేయరు. కానీ ఎప్పుడు ఈ ప్రపంచం బాగుందని! కనీసం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉందని! ప్రపంచం దాకా ఎందుకు? వ్యక్తిగత జీవితంలో మాత్రం నేను బాగున్నానని గట్టిగా చెప్పగలిగేవాళ్లు ఎందరు? ‘నా ప్రపంచంలో అంతా బాగానే ఉంది’ అని అనుకోగలిగే వాళ్లెవరు? దీనివల్లే అసంతృప్తులు, కొట్లాటలు, చీకాకులు, ఇంకా చెప్పాలంటే అనారోగ్యాలు. అవును, అనారోగ్యం! ఇదొక్కటే ప్రపంచంలో అసలైన సమస్య. దీని ప్రతిఫలనాలే మిగిలినవన్నీ! మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఏ ప్రతికూలతకూ కారణం కాలేడు– అది ప్రపంచంలోనైనా, ఇంట్లోనైనా. అందుకే మనిషికి సర్వతో ముఖ ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యంతో సంతోషం కలుగుతుంది, ఆ సంతోషంతో ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే మనంబాగుంటాం. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది.

‘‘అనారోగ్యంగా పిలవబడే ప్రతిదాన్నీ మన శరీరంలో మనమే సృష్టించుకుంటాం,’’ అంటారు తొలితరం కౌన్సిలర్‌ లూయిస్‌ హే. బలమైన సంకల్పం, సానుకూల ఆలోచనలు తేగలిగే అనూహ్య మార్పులను గురించి ఆమె ఎన్నో పుస్తకాలు రాశారు. మన సమస్యలన్నీ మన అంతర్గత ఆలోచన విధానాల వల్ల కలిగే బాహ్య ప్రభావాలు మాత్రమేనని చెబుతారామె. నెగెటివ్‌ థింకింగ్‌ వల్ల బ్రెయిన్‌లో ఆటంకాలు ఏర్పడుతాయి; అక్కడ ఫ్రీగా, ఓపెన్‌గా సంతోష ప్రవాహం ముందుకు సాగ డానికి అవకాశం ఉండదంటారు. ఏ రకమైన ఆలోచనా విధానం ఏయే రకమైన జబ్బులకు కారణ మవుతుందో... దురద, చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, సైనస్, మలబద్ధకం, చిగుళ్ళ సమస్యలు, మైగ్రేన్‌... ఇలా పెద్ద జాబితా ఇస్తారు. అయితే ఏ రకమైన వ్యాధికైనా భయం, కోపం– ఈ రెండు మెంటల్‌ పాటరన్స్‌ మాత్రమే మూలకారకాలుగా ఉంటాయంటారు. మనల్ని మనం నిజంగా ప్రేమించుకోవడం, ఎదుటివాళ్లను నిందించి మన శక్తిని అంతా వదిలేసుకునే బదులు ఇవ్వాల్సిన ‘క్షమాపణ’ ఇచ్చేయడం, ఆమె సూచించే మార్గాలు.

ఈ ప్రేమకు సమస్త భూగోళాన్నీ హీల్‌ చేయగల శక్తి ఉందని ఆమె స్థిర విశ్వాసం. ‘‘మనం ఏది ఆలోచించాలనుకుంటామో, ఏది నమ్మాలనుకుం టామో, ఆ ప్రతి ఆలోచననీ, నమ్మకాన్నీ విశ్వం పూర్తిగా సమర్థిస్తుంది, అవి జరగడానికి సహకరి స్తుంది’’ అంటారు. ఈ సృష్టి మనకోసం మన జీవితాన్ని దాని సర్వశక్తితో డిజైన్‌ చేసేవుంటుంది. మనం సమస్యలు అనుకునేవి సృష్టి విన్యాసంలో అసలు సమస్యలే కాకపోవచ్చు. కానీ మన ప్రాణాలకు అవన్నీ నిజమే. ‘గజం మిథ్య, ఫలాయనం మిథ్య’ అని మన సాధారణ చూపుతో అనుకోలేక పోవచ్చు. కానీ ఈ సృష్టి అశాశ్వతత్వంపై ఒక ఎరుక ఉంటే, జీవితాన్ని చూసే తీరు మారిపోవచ్చు. జీవితంతో కొనసాగిస్తున్న ఒక ఘర్షణ ఏదో తొలగిపోవచ్చు. ఎక్కడో ఒకరు మరణిస్తున్నప్పుడు కూడా ఇంకెక్కడో ఎవరో పుడుతూనే ఉన్నారు!  

మరిన్ని వార్తలు