పుస్తకం హస్తభూషణం

13 Dec, 2021 01:15 IST|Sakshi

‘వెర్బా వోలంట్, స్క్రిప్టా మానెంట్‌’ అని లాటిన్‌ సామెత. అంటే మాట అశాశ్వతం, రాత శాశ్వతం అని అర్థం. రోమన్‌ సెనేటర్‌ కేయస్‌ టైటస్‌ సెనేట్‌లో ప్రసంగిస్తూ చేసిన వ్యాఖ్య ఇది. ఆయన మాటే తర్వాతి కాలంలో సామెతగా నిలిచిపోయింది. మాటలదేముంది, తేలికగా గాలిలో కలిసిపోతాయి. అవి ఎంతోకాలం జ్ఞాపకం ఉండవు. మరపు మరుగున పడి కాలప్రవాహంలో కనుమరుగైపోతాయి. రాతలే చరిత్రలో శాశ్వత సాక్ష్యాలుగా నిలిచిపోతాయి. అవి శిలా శాసనాలైనా కావచ్చు, మట్టి పలకలైనా కావచ్చు, తాళపత్ర, భూర్జపత్ర గ్రంథాలైనా కావచ్చు, అచ్చుయంత్రం వచ్చాక అందరికీ తేలికగా అందుబాటులోకి వచ్చిన పుస్తకాలైనా కావచ్చు, ఇప్పటి ఇంటర్నెట్‌ తరంలోని ఈ–పుస్తకాలైనా కావచ్చు– మాటలకు లిఖితరూపమైన అక్షరాలే శాశ్వతం. అలాంటి అక్షరాలను ఇముడ్చుకునే పుస్తకాలు జ్ఞాన భాండాగారాలు, తరతరాలకు దిక్సూచికలు. మనిషి మాట నేర్చుకోవడం, మాటకు అక్షరరూపమిచ్చి లిపిబద్ధం చేయడం, అక్షరాలను తేలికగా నిక్షిప్తపరచుకునేందుకు తాళపత్ర, భూర్జపత్రాలు, రాగిరేకులు, తోలుపత్రాల పుస్తకాల దశను దాటి, ఆధునిక అచ్చుయంత్రాలతో ముద్రించిన పుస్తకాల వరకు ఎదగడం ఒక సుదీర్ఘ పరిణామక్రమం. రాత శాశ్వతత్వాన్ని గుర్తించినా, రాత పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన చరిత్ర స్పష్టమైన ఆధారాలతో అందుబాటులో లేదు. ప్రాచీన ఈజిప్టు, మెసపొటేమియా, సింధులోయ, చైనా నాగరకతల ప్రజలకు వారి వారి లిపులు ఉండేవి. ఈ లిపులు వేటికవి స్వతంత్రంగా అభివృద్ధి చెందాయా, లేదా పరస్పరం సంబంధం కలిగి ఉన్నాయా అనేది తేల్చిచెప్పగలిగే ఆధారాలు లేవు.

చాలామంది మేధావులు చరిత్రను పుస్తకాలకెక్కించారే తప్ప, పుస్తక చరిత్రను పుస్తకాలకెక్కించిన సందర్భాలు చాలా తక్కువ. వాట్‌ ఈజ్‌ బుక్‌ హిస్టరీ?’ పేరిట అమెరికన్‌ చరిత్రకారుడు రాబర్ట్‌ డార్న్‌టన్‌ 1982లో ఒక పరిశోధనా వ్యాసం రాశాడు. పుస్తక చరిత్ర రచనలో దీనినొక మైలురాయిగా పరిగణిస్తారు. పుస్తక చరిత్ర అధ్యయనానికి విధి విధానాలను రూపొందించిన వారిలో డార్న్‌టన్‌ ప్రముఖుడు. డార్న్‌టన్‌ సహా మరికొందరు చరిత్రకారుల కృషి ఫలితంగా కొన్ని పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో పుస్తక చరిత్ర అధ్యయనం కోసం ప్రత్యేక విభాగాలు ఏర్పడ్డాయి. మన దేశంలో ఏ ఒక్క విశ్వవిద్యాలయమూ దీనిని పట్టించుకున్న దాఖలాల్లేవు. భారతీయ భాషల్లో పుస్తకచరిత్ర గురించి చెదురు మదురు రచనలు వచ్చినా, అవన్నీ అచ్చు పుస్తకాల చరిత్రకే పరిమితమయ్యాయి. 

ఇప్పుడీ పుస్తక ప్రస్తావన ఎందుకంటే, మరో నాలుగు రోజుల్లో హైదరాబాద్‌లో జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమవుతోంది. జనవరి మొదట్లో విజయవాడలోనూ పుస్తకాల పండగ ఉంది. పుస్తక ప్రదర్శనలు ప్రపంచంలో ఎక్కడ జరిగినా, అవి పుస్తక ప్రియులకు వేడుకలే! ‘కరోనా’ కారణంగా ఏడాది అంతరాయం తర్వాత ఈసారి జరిగే పుస్తక ప్రదర్శనల్లో పాఠకుల ప్రతిస్పందన రెట్టింపు స్థాయిలో ఉంటుందని అంచనా వేయవచ్చు. ప్రపంచంలో తొలి పుస్తక ప్రదర్శన జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జరిగింది. ఐదువందల ఏళ్లకు పైగా ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఏటా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన జరుగుతూనే ఉంది. మన దేశంలో కోల్‌కతాలో గడచిన నాలుగున్నర దశాబ్దాలుగా అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ఏటా జరుగుతోంది. అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలు మన దేశంలోని మరిన్ని నగరాల్లో కూడా నిర్వహించేట్లయితే, పుస్తక ప్రియుల జ్ఞానతృష్ణ మరింతగా తీరగలదు. 

‘కరోనా’ కాలంలో ప్రజల్లో పఠనాభిలాష పెరిగినట్లు రకరకాల గణాంకాలు చెబుతున్నాయి. సాంకేతికత పెరిగి, ఈ–పుస్తకాలు, ఆడియో పుస్తకాలు వంటివి అందుబాటులోకి వచ్చినా, మన దేశంలో అచ్చుపుస్తకాలకు ఆదరణ ఏమాత్రం తగ్గలేదు సరికదా, ‘కరోనా’ కాలంలో గణనీయంగా పెరిగింది. పుస్తకాల అమ్మకాలు కూడా పెరిగాయి. ‘కరోనా’ లాక్‌డౌన్‌ కాలానికి ముందు పాఠకులు వారానికి సగటున తొమ్మిది గంటల సమయాన్ని పుస్తక పఠనానికి కేటాయిస్తే, లాక్‌డౌన్‌ కాలం నుంచి ఈ సమయం పదహారు గంటలకు పెరిగిందని ‘అమెజాన్‌’ అధ్యయనంలో తేలింది. గడచిన ఏడాది కాల్పనిక సాహిత్యానికి చెందిన పుస్తకాల విక్రయాల్లో 21.4 శాతం, కాల్పనికేతర సాహిత్య పుస్తకాల్లో 38.3 శాతం పెరుగుదల నమోదైనట్లు ‘నీల్సెన్‌’ నివేదికలో వెల్లడైంది. పుస్తకాలకు మంచిరోజులు మళ్లీ మొదలయ్యాయనేందుకు ఈ గణాంకాలే నిదర్శనం.‘లాక్‌డౌన్‌ కాలంలో జనాలకు బాగా తీరిక దొరికింది. టీవీ సీరియళ్లు, ఓటీటీల్లో నానా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూసి చూసి విసిగి వేసారిన జనం ఈ కాలంలో నెమ్మదిగా వివిధ కళల్లో తమ ప్రతిభా పాటవాలను మెరుగుపరచుకోవడం వైపు, పుస్తక పఠనం వైపు మళ్లారు. దాని ఫలితంగానే పుస్తక పఠనం మళ్లీ పుంజుకుంది’ అని ‘సేజ్‌’ పబ్లికేషన్స్‌ ఇండియా డైరెక్టర్‌ ఆర్తీ డేవిడ్‌ అభిప్రాయపడ్డారు. 

లక్షలాది ప్రాణాలను కబళించిన ‘కరోనా’ మహమ్మారి ప్రపంచాన్ని ఇప్పటికీ పీడిస్తూనే ఉన్నా, పుస్తక పఠనం విషయానికొస్తే దీనివల్ల కొంత మేలు కూడా జరిగింది. ‘కరోనా’కు ముందు బిజీ బిజీ జీవితాల్లో పుస్తకాలకు దూరమైన జనాలు మళ్లీ పుస్తకాలను చేతుల్లోకి తీసుకోవడం మొదలుపెట్టారు. తమ అభిరుచులకు సంబంధించిన పుస్తకాలకోసం అన్వేషణ సాగించి మరీ కొనుగోళ్లు చేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు. పాఠకులలో వచ్చిన ఈ మార్పు రచయితలకు, ప్రచురణకర్తలకు కొత్త ప్రోత్సాహాన్నిస్తోంది. హైటెక్‌ అరచేతుల్లో స్మార్ట్‌ఫోన్‌లే అలంకారంగా మారిపోయిన ఈ కాలంలో ఇదొక శుభ పరిణామం. ‘పుస్తకం హస్తభూషణం’ అనే నానుడి మళ్లీ నిజమవుతోంది. 

మరిన్ని వార్తలు