-

ఇది నిరుద్యోగ భారతం!

5 Aug, 2021 00:34 IST|Sakshi

దేశ ప్రజల జీవితంపై కరోనా మహమ్మారి చూపిన దుష్ప్రభావం ఇప్పుడు గణాంకాల సాక్షిగా మరోసారి ఆవిష్కృతమైంది. కరోనా మొదలయ్యాక నిరుద్యోగం భారీగా పెరిగిందని ఇప్పుడు ప్రభుత్వ అధికారిక లెక్కలలోనే తేలింది. గత ఏడాది 2020 ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో దేశంలో ‘నిరుద్యోగ రేటు’ 20.9 శాతానికి పెరిగింది. కరోనా రాక ముందు ఏడాది 2019లో ఇదే త్రైమాసికంలో ‘నిరుద్యోగ రేటు’ 9.1 శాతమే. అంటే కరోనాతో పాటు దేశవ్యాప్తంగా నిరుద్యోగమూ విస్తరించి, రెట్టింపు అయిందన్న మాట. నిరుద్యోగ రేటు పురుషుల్లో 20.8 శాతానికీ, స్త్రీలలో 21.2 శాతానికీ పెరిగింది. పట్టణ ప్రాంత నిరుద్యోగం 21 శాతమైంది. ఇవన్నీ సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ (ఎన్‌ఎస్‌ఓ) విడుదల చేసిన తాజా ‘నియమిత కాలిక శ్రామిక శక్తి సర్వే’ (పీఎల్‌ఎఫ్‌ఎస్‌) చెప్పిన లెక్కలు. కరోనా తొలి వేవ్‌లో ఉపాధి, ఉద్యోగాలు పోయి, నెత్తి మీద తట్టాబుట్ట, చంకలో పిల్లలతో కాలిబాటన ఇంటిదోవ పట్టిన లక్షలాది కుటుంబాల విషాద దృశ్యాలను గుర్తు తెచ్చుకుంటే, ఈ లెక్కలు ఆట్టే ఆశ్చర్యం అనిపించవు. ఇంకా చెప్పాలంటే, ఈ లెక్కల్లో కనిపించని వ్యథార్థ జీవుల యథార్థ గాథలు ఇంకెన్నో అనిపిస్తుంది. పాలకుల తక్షణ కర్తవ్యమూ గుర్తుకొస్తుంది. 

ఎంచుకున్న శాంప్లింగ్‌ యూనిట్లను బట్టి అంకెల లెక్కలు అన్నిసార్లూ నిజాన్ని పూర్తిగా ప్రతిఫలిస్తాయని చెప్పలేం కానీ, ఎంతో కొంత వాస్తవాల బాటలో దారిదీపాలవుతాయి. దేశంలోని సామాజిక, ఆర్థిక పరిస్థితులపై ‘జాతీయ గణాంకాల కార్యాలయం’ అందించే లెక్కలు, చేసే సర్వేల నుంచి అసలు సూక్ష్మం గ్రహించడం కూడా ముఖ్యం. ఏడాది మొత్తంగా తీసుకొని 2019 జూలై మొదలు 2020 జూన్‌ వరకు చూస్తే మాత్రం – నిరుద్యోగ రేటు నిరుటి 5.8 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గినట్టు పైకి అనిపిస్తుంది. కానీ, కరోనా తొలి వేవ్‌ సమయంలో 70 రోజుల లాక్‌డౌన్‌ సమయం అత్యంత కీలకం. ఆ కాలాన్ని లెక్కించిన ఆఖరు త్రైమాసికం చూస్తే, పట్టణ ప్రాంతాల్లో ఐటీ సహా సేవారంగాలన్నీ దెబ్బతిన్నాయి. ఫలితంగా గణనీయంగా నిరుద్యోగం పెరిగిందని అసలు కథ అర్థమవుతుంది. 

నిజానికి, నాలుగేళ్ళ క్రితం 2017 ఏప్రిల్‌ నుంచి ప్రతి త్రైమాసికానికీ మన దేశంలో ఇలా ‘శ్రామిక శక్తి సర్వే’ జరుగుతోంది. దేశంలోని నిరుద్యోగ స్థితిగతులను ఈ సర్వే రికార్డు చేస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెంటిలోనూ రకరకాల నిరుద్యోగాలు, వివిధ ఉద్యోగాలలో వస్తున్న వేతనాలు, పని గంటలకు సంబంధించిన సమాచారాన్ని ఈ సర్వేలో సేకరిస్తారు. స్త్రీ పురుషుల్లో ఎవరెంత నిరుద్యోగులో, మొత్తం మీద ‘నిరుద్యోగ రేటు’ (యూఆర్‌) ఎంతో లెక్కిస్తారు. సూక్ష్మస్థాయిలో అయితే దేశంలో నిరుద్యోగ నిష్పత్తిని ఈ ‘యూఆర్‌’ సూచిస్తుంది. స్థూలంగా చెప్పాలంటే, ‘నిరుద్యోగ రేటు’ తక్కువగా ఉందంటే జనం చేతుల్లో డబ్బులు ఎక్కువున్నట్టు లెక్క. తద్వారా వస్తువుల గిరాకీ పెరుగుతుంది. అది ఆర్థికవృద్ధికి తోడ్పడుతుంది. కానీ, ద్రవ్యోల్బణం, మరింత ఉద్యోగ కల్పనను బట్టి ఉండే ఆర్థిక వృద్ధిని కరోనా బాగా దెబ్బతీసింది.

ఇలా కరోనా కొట్టిన దెబ్బకూ, పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభానికీ మరిన్ని ఉదాహరణలు తాజా సర్వే లెక్కల్లో బయటకొచ్చాయి. నిరుటి జూలై నుంచి సెప్టెంబర్‌ త్రైమాసికంలో మహిళా శ్రామికుల భాగస్వామ్యం 16.1 శాతానికి పడిపోయింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోకెల్లా అతి తక్కువ మహిళా భాగస్వామ్యం ఇదే. ప్రపంచ బ్యాంకు అంచనాలూ ఆ మాటే చెబుతున్నాయి. పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌ (30.5 శాతం), శ్రీలంక (33.7 శాతం)ల కన్నా మన దగ్గర మహిళా శ్రామికుల భాగస్వామ్యం చాలా తక్కువైంది అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. మన దేశంలో మహిళలు ఎక్కువగా వ్యవసాయంలో, కర్మాగారాల్లో కార్మికులుగా, ఇంట్లో పనివాళ్ళుగానే ఉపాధి పొందుతున్నారు. దురదృష్టవశాత్తూ, ఈ రంగాలన్నీ కరోనా కాలంలో తీవ్రంగా దెబ్బతినడం వారికి ఊహించని ఇబ్బందిగా మారింది. 

సర్వసాధారణంగా పట్టణాలతో పోలిస్తే, గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి ఎక్కువ. గ్రామీణ భారతంలో దాదాపు 50 శాతం పైగా తమ కాళ్ళ మీద తాము నిలబడితే, పట్టణాల్లో ఆ సంఖ్య 31 శాతమే అని లెక్క. అదనుకు వర్షాలు కురిసి, పంటలు చేతికి రావడంతో ఈ సర్వే కాలంలో గ్రామీణావనిలో పరిస్థితి కొంత మెరుగ్గా ఉండవచ్చు. కానీ, దేశంలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలే పెరిగిందంటే నమ్మలేం. అధికారిక లెక్క కన్నా అసలు కథ ఎక్కువే ఉండడం ఖాయం. గత ఏడాది జనవరి నుంచి మార్చి వరకు కాలంతో పోలిస్తే, జూన్‌తో ముగిసిన త్రైమాసికం తర్వాత నిరుద్యోగం రెట్టింపు అయింది. ఆ సంగతి ఆర్థికవేత్తలే తేల్చారు. 15 ఏళ్ళు దాటిన ప్రతి అయిదుగురిలో ఒకరికి చేతిలో పనిలేదు. 15 నుంచి 29 ఏళ్ళ లోపు వారిలో ప్రతి మూడో వ్యక్తికీ ఉద్యోగం లేదు. షాపులు, మాల్స్, ఆఫీస్‌లు, స్కూళ్ళు, సంస్థలు మూతబడడంతో జనానికి చేతిలో తగినంత పని లేదు. ఇది నిష్ఠురసత్యం. కరోనా తర్వాత ఏకంగా 55 లక్షల ఉద్యోగాలు పోయాయని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ’ సైతం అంచనా వేయడం గమనార్హం. 

నిజానికి, ఆసియాలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. కరోనా కాటుతో ఈ మార్చితో ముగిసిన ఆర్థిక వత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం మేర కుంచించుకు పోయింది. స్వాతంత్య్రం వచ్చాక గడచిన ఏడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని ఆర్థిక మాంద్యం ఇది. ఇప్పటికే కోట్లాది జనం ఉపాధి పోయి వినియోగదారుల గిరాకీ తగ్గింది. మరోపక్క కరోనాకు కవచమైన టీకా ప్రక్రియేమో మందకొడిగా సాగుతోంది. వీటన్నిటి మధ్య కరోనా కాస్తంత నెమ్మదించినా, సత్వర ఆర్థిక పురోగతిని ఆశించలేం. భారత ఆర్థిక వ్యవస్థ కరోనా ముందటి స్థాయికి మళ్ళీ చేరే సూచనలు వచ్చే 2022 మార్చి వరకైతే లేనే లేవని పలువురి ఉవాచ. 

నిరాశ ధ్వనించినా, ఈ హెచ్చరికలు, సర్వేలు చెబుతున్న నిరుద్యోగ గణాంకాలను పాలకులు నిశితంగా గమనించాలి. భయపెడుతున్న కొత్త వేవ్‌ల పట్ల జాగ్రత్తలు తీసుకుంటూనే, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకొనేలా చర్యలు చేపట్టాలి. అది అనివార్య పరిస్థితి. వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇస్తున్నది ఆ దృష్టితోనే! కాకపోతే, అదొక్కటే కాదు.. ఆర్థిక పునరుత్తేజానికిచ్చిన ప్యాకేజీల్లో లోటుపాట్లనూ సవరించుకోవాలి. ఉపాధి కల్పనకు వీలుగా వృత్తివిద్యా శిక్షణను పెంచాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు టీకా అస్త్రంతో అందరికీ కరోనా నుంచి ఆరోగ్య సంరక్షణనివ్వాలి. అప్పుడు జనం సత్వర ఉపాధి అన్వేషణలో పడతారు. ఆర్థికవ్యవస్థ పురోగతిలో భాగమవుతారు. నేటి కరోనా పూరిత నిరుద్యోగ భారతావనిలో అందరూ ఎదురుచూస్తున్నది ఆ శుభఘడియల కోసమే! మరి, తెల్లవారేదెప్పుడు? ఈ చీకటి విడివడేదెప్పుడు? 

మరిన్ని వార్తలు