హర్షించదగ్గ పరిణామం

13 Feb, 2021 00:40 IST|Sakshi

భారత్‌–చైనాల మధ్య వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వద్ద సరిహద్దు తగాదా మొదలై పది నెలలు కావస్తుండగా ఇరు దేశాలూ వివాదం తలెత్తిన ప్రాంతాల్లోవున్న తమ తమ దళాలను వెనక్కి పిలవాలని నిర్ణయించుకున్నాయి. ఈ విషయంలో ఒప్పందం కుదిరిందని గురువారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. వివాదాలపై పరస్పరం చర్చించుకోవటం, సామరస్యంగా పరిష్కరించుకోవటం మంచిదే. ఘర్షణ వాతావరణం దీర్ఘకాలం కొనసాగితే ఏదో ఒకరోజు అది కట్టుదాటే ప్రమాదం వుంటుంది. అయితే వైరి పక్షాలు హేతుబద్ధంగా వాదనలు వినిపించాలి. వాస్తవాలను అంగీకరించాలి. అప్పుడే ఆ చర్చలు ఫలవంతమవుతాయి. గత నెలలో అరుణాచల్‌ ప్రదేశ్‌కు అయిదు కిలోమీటర్ల దూరంలోని నిర్మానుష్య ప్రాంతాల్లో హఠాత్తుగా మూడు గ్రామాలు వెలిశాయి.

ఒకపక్క లద్దాఖ్‌లో రేగిన వివాదం గురించి అంతకు ఏడెనిమిది నెలల ముందు నుంచీ సైనిక కమాండర్ల స్థాయి చర్చలు జరుగుతున్నాయి. మన దేశం తన వాదనకు మద్దతుగా పాత, కొత్త ఉపగ్రహ ఛాయా చిత్రాలను చైనాకు ఇచ్చింది. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు కూడా మాట్లాడుకున్నారు. అయినా చైనా వెనక్కు తగ్గిన దాఖలా కనబడలేదు. సరిగదా... రెచ్చ గొట్టేవిధంగా గ్రామాలే నిర్మించింది. పొరుగు దేశాన్ని రెచ్చగొట్టి, దాంతో గిల్లికజ్జాలు పెట్టు కోవాలన్న ఉద్దేశం తప్ప ఇందులో వేరే పరమార్థం కనబడదు. ఎందుకంటే చైనా ఆక్రమణలో వున్న ప్రాంతం... ప్రత్యేకించి కొత్తగా వెలిసిన గ్రామాలున్న ప్రాంతం సాధారణ జన జీవనానికి పనికొచ్చేది కాదు. దశాబ్దాలుగా అక్కడ లాంఛనంగా కొనసాగే సైనిక దళాల గస్తీ తప్ప మరేమీ లేదు.

3,440 కిలోమీటర్ల నిడివున్న ఎల్‌ఏసీ వద్ద ఇరు దేశాల మధ్యా ఇంతవరకూ సరిహద్దులు ఖరారు కాలేదు. అందుకే అక్కడక్కడ తమ దళాలను అవి వున్న చోటు నుంచి ముందుకు తోయటం... ఆ ప్రాంతం తనదేనని వాదనకు దిగటం చైనాకు అలవాటుగా మారింది. వెనక్కి వెళ్లాలని కోరినా కదలకపోవటం రివాజైంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ తీరువల్ల మనదైన 38,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఇప్పుడు చైనా దురాక్రమణలో వున్నదని సైనిక నిపుణులు చెబుతున్నారు. ఇందుకు ప్రతిగా చైనా ఏకంగా తమకు చెందిన 90,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం భారత్‌ స్వాధీనంలో వున్నదని చెప్పుకుంటోంది.

ఇరు దేశాల మధ్యా 1962లో జరిగిన యుద్ధం తర్వాత చాన్నాళ్లు దౌత్య, వాణిజ్య సంబంధాలు నిలిచిపోయాయి. పొరపొచ్చాలకు సరిహద్దు తగాదా కారణమన్న అభిప్రాయం అందరికీ కలుగుతున్నా, నిజానికి అంతకన్నా లోతైన సమస్యలున్నాయని తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ఒకసారి అన్నారు. ఆసియాలో రెండూ రెండు పెద్ద దేశాలు కావటంతో... అంత ర్జాతీయంగా తమను అవతలి పక్షం అధిగమిస్తుందేమోనన్న శంకతోనే చైనా ఈ వృధా వివాదాన్ని పదే పదే తెరపైకి తెస్తోందని ఆయన అభిప్రాయం. ఏమైతేనేం చైనాలో డెంగ్‌ జియావో పెంగ్‌ పెత్తనం వచ్చాక రెండు దేశాల మధ్యా స్నేహపూర్వక భేటీలుగా మొదలై దౌత్య సంబంధాల వరకూ వచ్చాయి. వివాదాలను ఒకపక్క చర్చించుకుంటూనే, వాటి పర్యవసానాలతో సంబంధం లేకుండా వాణిజ్య సంబంధాలను నెలకొల్పుకుందామన్న ప్రతిపాదన చైనాయే చేసింది.

అందుకు మన దేశం కూడా అంగీకరించింది. వాణిజ్య, ద్వైపాక్షిక సంబంధాలు పెరగవలసినంతగా పెరగ కపోయినా క్రమేపీ మెరుగుపడుతున్న సూచనలైతే కనబడేవి. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చాక చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ రెండుసార్లు ఇక్కడికి రావటం, మోదీ అక్కడకు వెళ్లటం జరిగాయి. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌(బీఆర్‌ఐ) పేరిట బృహత్తరమైన ఆధునిక సిల్క్‌ రూట్‌ను నిర్మించి సెంట్రల్‌ ఆసియా, యూరప్, ఆఫ్రికాలతో పటిష్టమైన వాణిజ్య బంధాన్ని ఏర్పర్చుకోవాలన్న చైనా ప్రతిపాదనకు మన దేశం పెద్దగా సుముఖత చూపలేదు. బీఆర్‌ఐలో భాగంగా నిర్మించ తలపెట్టిన చైనా–పాక్‌ ఆర్థిక కారిడార్‌ ప్రాజెక్టులో ఆక్రమిత కశ్మీర్‌ భూభాగం వుండటం అందుకు ఒక కారణం. మరోపక్క అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలతో మన దేశానికి బల పడుతున్న బంధం... దాని పర్యవసానంగా రూపుదిద్దుకుంటున్న క్వాడ్‌ తనకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టిందే నన్న శంక చైనాకుంది. వీటన్నిటివల్లా సరిహద్దుల్లో మనల్ని చికాకు పరిచేందుకు చైనా ప్రయ త్నించింది. ఏమైతేనేం ఇరు దేశాల మధ్యా ఇప్పటికి ఎనిమిది దఫాలు చర్చలు జరిగాయి. గతంలో వేరే దేశాలతో వున్న తగాదాల విషయంలో వ్యవహరించిన తీరుకు భిన్నంగా చైనా వెనక్కి తగ్గటం సంతోషించదగ్గదే. 

అయితే గత అనుభవాలరీత్యా మన దేశం జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. నిరుడు జూన్‌లో ఎల్‌ఏసీ వద్ద గల్వాన్‌ లోయలో చొరబడి, ఆ తర్వాత రెండు పక్షాలూ వెనక్కి తగ్గాలన్న అవగాహన కుదిరాక హఠాత్తుగా దాడికి తెగబడి కల్నల్‌ సంతోష్‌బాబుతో సహా 20 మంది భారత జవాన్ల ప్రాణాలు బలితీసుకున్న ఉదంతాన్ని మరిచిపోలేం. ప్యాంగాంగ్‌ సో సరస్సు ప్రాంతం నుంచి బలగాల ఉపసంహరణ సజావుగా ముగిసి, అక్కడ ఉద్రిక్తతలు సడలాలని కోరుకుంటూనే సమస్యాత్మకంగా వున్న ఇతర ప్రాంతాల విషయంలో కూడా చర్చలు ఫలించి, సాధ్యమైనంత త్వరగా యధాపూర్వ స్థితి ఏర్పడాలని ఆశించాలి. ఈ మొత్తం వ్యవహారంలో చైనా తన తీరు తెన్నులను సమీక్షించుకుని లోటుపాట్లను సరిదిద్దుకోవాలి. 

మరిన్ని వార్తలు