వ్యాక్సిన్‌ రిహార్సల్‌!

29 Dec, 2020 00:23 IST|Sakshi

మరికొన్ని రోజుల్లో మన దేశంలో కూడా కరోనా వైరస్‌ మహమ్మారిని అరికట్టే ఒకటి రెండు వ్యాక్సిన్‌లకు అనుమతి లభించవచ్చునని వార్తలొస్తున్న నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల్లో వ్యాక్సిన్‌ మాక్‌ డ్రిల్‌ సోమవారం మొదలైంది. రెండురోజులపాటు నిర్వహించే ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, అస్సాంలలో ప్రారంభించారు. వ్యాక్సిన్‌ కేంద్రాలకొచ్చేవారికి టీకా ఇవ్వడానికి వాస్తవంగా ఎంత సమయం పడుతుంది... దానికి ముందు పూర్తి చేయాల్సిన లాంఛనాలు అమలు జరపడంలో ఎదురయ్యే ఇబ్బందులేమిటి... వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తలెత్తే పక్షంలో చేయాల్సిందేమిటì  అనే అంశాలు ఇందులో గుర్తిస్తారు. వ్యాక్సిన్‌ల భద్రత, వాటి తరలింపు, అందులో ఏర్పడే లోటుపాట్లు తెలుసుకోవటం... వ్యాక్సిన్‌ తీసుకోవటానికొచ్చేవారు నిబంధనల ప్రకారం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలూ పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించటం ఈ డ్రై రన్‌ వెనకున్న ఉద్దేశం.

ఈ కార్యక్రమం అమలుచేసే క్రమంలో వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సిబ్బంది, అధికారుల మధ్య సమన్వయం ఎలావున్నదో కూడా చూస్తారు. వీటన్నిటినీ పరిశీలించి మరింత పకడ్బందీ విధానానికి రూపకల్పన చేస్తారు. ఈ బృహత్తర ప్రక్రియలో ప్రభుత్వానికి చెందిన అనేక విభాగాల్లో పనిచేసే కోట్లాదిమంది పాలుపంచుకుంటారు గనుక ఎక్కడా లోటుపాట్లు లేకుండా, సాఫీగా పూర్తయ్యేలా చూడాలి. ఇదొక పెద్ద సవాలు. వాస్తవంగా అవసరమైనవారికి టీకాలిచ్చే ప్రక్రియ ప్రారంభించినప్పుడు ఏ స్థాయిలోనూ గందరగోళం తలెత్తకుండా చూడాలంటే ఇలాంటి డ్రైరన్‌లు తప్పనిసరి. ఇప్పుడు డ్రైరన్‌లు అమలవుతున్నచోట గుర్తించిన అంశాలను క్రోడీకరించి ఈ నాలుగు రాష్ట్రాల్లోని టాస్క్‌ఫోర్స్‌లు సవివరమైన నివేదికలు రూపొందిస్తాయి.

వాటి ఆధారంగా దేశవ్యాప్తంగా అమలు చేయడానికి అవసరమైన మార్గదర్శకాలు రూపొందుతాయి. ఇప్పుడు ఎంపిక చేసిన నాలుగు రాష్ట్రాలూ నాలుగు జోన్‌లలో వున్నాయి. ఈ రాష్ట్రాల్లో వుండే జిల్లా ఆసుపత్రులు, కింది స్థాయిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోవుండే ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేటు ఆసుపత్రులు వ్యాక్సిన్‌ విషయంలో ఏమేరకు సంసిద్ధతలో వున్నాయో ఈ డ్రైరన్‌లో వెల్లడవుతుంది. ఈ కార్య క్రమంలో ఇచ్చేది డమ్మీ వ్యాక్సినే అయినా ఇందుకోసం రూపొందించిన ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంలో ప్రతి దశనూ నమోదు చేస్తున్నారు. ఇలా వస్తున్న డేటాను కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటుంది. 

అంటురోగాల నివారణకు టీకాలివ్వటం మన దేశంలో సాధారణమైన విషయమే అయినా తొలిసారి 1978లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. 1985లో దాన్ని  సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమం(యూఐపీ) గా పేరు మార్చి మరింత విస్తృతపరిచారు. గర్భిణులకు, పిల్లలకు వివిధ రకాల వ్యాధులు సోకకుండా ముందుజాగ్రత్త చర్యగా టీకాలివ్వటం అప్పటినుంచీ కొనసాగుతోంది. దేశంలో దాదాపు అన్నిచోట్లా కనబడే పోలియో, కోరింత దగ్గు, మశూచి, ఆటలమ్మ, క్షయ వంటి 12 రకాల వ్యాధుల నివారణకు జాతీయ స్థాయిలోనూ, నిర్దిష్ట ప్రాంతాల్లో కనబడే రోటావైరస్, మెదడు వాపు వ్యాధి, న్యూమోనియావంటి వ్యాధుల నివారణకు టీకాలిచ్చే కార్యక్రమాలు అప్పటినుంచీ కొనసాగుతున్నాయి. ఈ టీకాలను భద్రపరచటంలో, తరలించటంలో, అవసరమైనవారికి అందించటంలో అవలంబించాల్సిన విధివిధానాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

సాంకేతికత వృద్ధి చెందాక ఇదంతా సులభంగా పూర్తవుతోంది. వ్యాక్సిన్‌ల స్టాక్‌ ఎక్కడుందో, ఎంతుందో, అవన్నీ నిబంధనల ప్రకారం నిర్దిష్టమైన ఉష్ణోగ్రతల్లో వున్నాయా లేదా వంటి అంశాలను ఎప్పటికప్పుడు అన్ని స్థాయిల్లోని అధికారులూ తెలుసుకోవటానికి అనువైన విధానం రూపొందింది. అయితే ప్రక్రియలు దేశ జనాభాలో పరిమిత వర్గాలకు ఉద్దేశించినవి. కానీ కరోనా వ్యాక్సిన్‌ అలా కాదు. అది దేశంలో అన్ని ప్రాంతాలవారికీ, అన్ని వయసులవారికీ అందాల్సిందే. కనుకనే ఈ వ్యాక్సిన్‌ విష యంలో ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించటం తప్పనిసరైంది. కరోనా వ్యాక్సిన్‌పై జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నిపుణుల బృందం తొలి దశలో వ్యాక్సిన్‌ ఇవ్వటానికి మూడు కేటగిరీలను గుర్తించింది.

ఆరోగ్య రంగ కార్యకర్తలకు(దాదాపు కోటిమంది), కరోనాపై ముందుండి పోరాడే వారికి (దాదాపు 2 కోట్లు), ముప్పు అధికంగా వుండే వృద్ధులకు (దాదాపు 27 కోట్లు) ఈ వ్యాక్సిన్‌ ఇవ్వాలనేది ప్రభుత్వ సంకల్పం. ఇలా మొత్తంగా తొలి దశలో 30 కోట్లమందికి రెండు దఫాలు టీకాలివ్వాలి. అంటే 60 కోట్ల డోస్‌లను ప్రభుత్వాలు తరలించాలి. వాటికి అవసరమైన కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాలు, రవాణా, టీకాలిచ్చే వైద్య సిబ్బంది, ఇతరత్రా ప్రభుత్వ విభాగాల సిబ్బంది సహాయ సహకారాలు ఈ బృహత్తరకార్యక్రమానికి అవసరం.  
ఏడాదికాలంగా కరోనా వైరస్‌ మహమ్మారి సృష్టించిన భీతావహం అంతా ఇంతా కాదు. ప్రపంచ వ్యాప్తంగా 8 కోట్ల 14 లక్షలమందికి ఆ వ్యాధి సోకగా, దాదాపు 18 లక్షలమంది దానికి బలయ్యారు. మన దేశంలో ఇంతవరకూ కోటి 2 లక్షలమందికి ఆ వ్యాధి సోకగా లక్షా 48 వేలమంది మరణించారు.

గత కొన్ని వారాలుగా అది క్రమేపీ ఉపశమిస్తున్న జాడలు కనబడుతుండగా అక్కడక్కడ కొత్త రకం కరోనా వైరస్‌ తలెత్తినట్టు వార్తలొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావటం అందరికీ ఎంతో ఉపశమనం కలిగించే పరిణామం. ఇప్పటికే బ్రిటన్, అమెరికా, రష్యా వంటి దేశాల్లో కరోనా వ్యాక్సిన్‌లివ్వటం మొదలైంది. అక్కడక్కడ కొందరిలో దుష్ప్రభావాలు కన బడిన ఉదంతాలు మీడియాలో వస్తున్నా, మొత్తంగా చూస్తే అవి సురక్షితమైనవేనని తేలింది. ఇలా వ్యాక్సిన్‌ తీసుకున్నవారిలో రోగ నిరోధక వ్యవస్థ ఏమేరకు బలపడిందో, అది కరోనా నిరోధానికి ఎంతగా తోడ్పడిందో రాగలరోజుల్లో వెల్లడవుతుంది. ఈలోగా మన పౌరులకు టీకా అందించటానికి మన సన్నద్ధత ఎంతో మదింపు వేసుకోవటం అవసరం. అది ఈ డ్రై రన్‌ నెరవేరుస్తుంది. 

మరిన్ని వార్తలు