దేశం నొసటన సిందూరం

3 Aug, 2021 03:29 IST|Sakshi

దేశం ఉప్పొంగిన క్షణాలివి. తెలుగు జాతి తేజరిల్లిన సందర్భమిది. విశ్వ క్రీడా సంరంభంలో త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడింది. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా మన తెలుగమ్మాయి పూసర్ల వెంకట సింధు సృష్టించిన చరిత్ర ఓ చిరస్మరణీయ ఘట్టం. ఏళ్ళ తరబడి చేసిన నిరంతర శ్రమ, కరోనా కష్టకాలంలోనూ ఆగని సాధన, కొత్తగా వచ్చిన కొరియన్‌ కోచ్‌ పార్క్‌ ఇచ్చిన శిక్షణ, స్వయంగా క్రీడాకారులైన తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహం, ట్రైనర్ల మొదలు తెలుగు ప్రభుత్వాల దాకా ప్రతి ఒక్కరూ అండగా నిలబడిన తీరు – ఇలా సింధు విజయం వెనుక ఎన్నెన్నో స్ఫూర్తిగాథలు. ఆదివారం నాడు చైనా క్రీడాకారిణి బింగ్జి యావోపై ఆమె చూపిన అసాధారణమైన ఆట తీరు ఆకలిగొన్న బెబ్బులి వేటను తలపించింది. నాన్న మాటలతో ముందురోజు ఓటమి నుంచి బయటకొచ్చి, తండ్రికి బహుమతిగా పతకాన్ని అందిం చడం కళ్ళు చెమర్చే ఓ కమనీయ ఘట్టం.

నిరుడు రజతం సాధించి, ఈసారి కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చినా, మరో మూడేళ్ళలో వచ్చే 2024 పారిస్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణానికి సిద్ధమన్న ఈ బ్యాడ్మింటన్‌ స్టార్‌ మాట నవతరం భారత నారీశక్తి చేస్తున్న అచంచల ఆత్మవిశ్వాస ప్రకటనకు సంకేతం. ఒకప్పుడు ఒలింపిక్స్‌లో తొలిసారి పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన వెయిట్‌ లిఫ్టర్‌ కరణం మల్లేశ్వరి (2000 సిడ్నీ ఒలింపిక్స్‌లో కాంస్యం) కూడా తెలుగు తేజమే. పాతికేళ్ళ వయసులో ఆమె ఆ రికార్డు సాధిస్తే, 26 ఏళ్ళకు ఇప్పుడు సింధు వరుస రెండు ఒలింపిక్స్‌ పతకాల కొత్త చరిత్ర రచించడం మనందరికీ గర్వకారణం. 

గమనిస్తే – తాజా ఒలింపిక్స్‌లో మనదేశం తరఫున నారీలోకానిదే పైచేయి. తొలి రోజు మణిపురీ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి ఛాను (రజతం) నుంచి ఇప్పటి దాకా గత పది రోజుల్లో భరతమాత నొసట పతకాల సిందూరం దిద్దింది మహిళా అథ్లెట్లే! రానున్న పతకాల్లో కూడా కనీసం మరో ఒకట్రెండు – అస్సామీ బాక్సింగ్‌ క్రీడాకారిణి లొవ్లీనా తదితర స్త్రీమూర్తులు తీసుకు రానున్న గౌర వమే అని ఆటల సరళిని బట్టి అర్థమవుతోంది. 2016 రియో ఒలింపిక్స్‌లో మనకొచ్చిన 2 మెడల్స్‌ (పీవీ సింధు – రజతం, రెజ్లర్‌ సాక్షీ మాలిక్‌ కాంస్యం) సహా, గడచిన 4 ఒలింపిక్‌ పతకాలూ మహి ళలు మన దేశానికి సాధించి పెట్టినవే! అలాగే, మూడోసారి ఒలింపిక్స్‌ బరిలోకి దిగిన భారత మహిళా హాకీజట్టు ఈసారి ఇప్పటికే సెమీ ఫైనల్స్‌కు చేరడం మరో శుభవార్త. ఆ జట్టు కెప్టెన్‌ రాణీ రామ్‌పాల్‌ మొదలు డిస్కస్‌ త్రోలో ఆశలు రేపిన పంజాబీ కమల్‌ప్రీత్‌ కౌర్‌ దాకా ఎంతోమంది రైతుబిడ్డలు, చిన్నస్థాయి నుంచి శ్రమించి పైకొచ్చినవారు కావడం గమనార్హం. 

ఆ మాటకొస్తే, నూతన సహస్రాబ్ది ఆరంభం నుంచి మన మహిళా అథ్లెట్లు విశ్వవేదికపై జోరు పెంచారు. మేరీ కోమ్‌లు, సైనా నెహ్వాల్‌లు, సానియా మీర్జాలు, అంజూ బాబీ జార్జ్‌లు అవతరిం చారు. అంతకు ముందు పరుగుల రాణి పీటీ ఉష లాంటి వారు (1984 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌) కేవలం 0.01 సెకన్ల తేడాతో ఒలింపిక్స్‌ పతకాన్ని చేజార్చుకున్న ఘట్టం నుంచి మన అథ్లెట్లు ఇప్పుడు చాలా ముందుకు ఉరికారు. గణాంకాలు చూస్తే – 2000 మొదలు ఇప్పటి దాకా ఒలింపిక్స్‌లో మన దేశానికి వచ్చిన 14 వ్యక్తిగత పతకాలలో 6 పతకాలు ఆడవాళ్ళ ఘనతే. పురుషులతో పోలిస్తే, మహిళా అథ్లెట్ల సంఖ్య మన దేశంలో మొదటి నుంచి తక్కువే. కానీ, ఇప్పుడు అదీ మారుతోంది. వివిధ క్రీడల్లో ఆడవాళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒలింపిక్స్‌లోనూ 2000 నాటికి భారత్‌ నుంచి 21 మంది మహిళలే వెళితే, ఈసారి మొత్తం 128 మంది అథ్లెట్లలో 57 మంది మహిళలే. అందుకే, ‘వివాహాల మొదలు ఒలింపిక్స్‌ దాకా... అన్నిచోట్లా మహిళలే భారత్‌కు బంగారం తేవాలి’ అంటూ సోషల్‌ మీడియా పోస్టులు చక్కర్లు కొట్టడం ఆశ్చర్యం అనిపించదు. 

ఇప్పుడు కళ్ళు తెరిస్తే కనిపించే నిజం ఒకటే – ఆడవాళ్ళకు ఆటలేమిటి అన్న సమాజానికి ఇప్పుడు ఆ మహిళలే మెడల్స్‌ తెచ్చే దిక్కయ్యారు. క్రికెట్‌ను తప్ప మరో ఆటను పెద్దగా పట్టించుకోని దేశానికి ఆడవాళ్ళే అంతర్జాతీయంగా పరువు నిలిపేవారయ్యారు. పాఠశాలల్లో ఆడుకోవడానికి ఖాళీ స్థలం మొదలు కనీస సౌకర్యాలు కూడా కష్టమైన దేశంలో, మార్కులు తప్ప ఆటలెందుకని ఆలో చించే పెంపకంలో, వంటింట్లో తప్ప మైదానంలో ఆడవాళ్ళకేం పని అనే మారని మానసిక స్థితిలో, ఎంత ప్రతిభ ఉన్నా ఆర్థిక – హార్దిక ప్రోత్సాహం కరవైన పరిస్థితుల్లో, ఆటల్లోనూ అధికారుల రాజకీ యాలున్న సందర్భాల్లో... మన దేశంలో ఈ మాత్రమైనా క్రీడాకారులు, అందులోనూ మహిళలు పైకి రావడం విశేషం. 

సహాయ సహకారాల మాటెలా ఉన్నా, అంతర్జాతీయ పోటీల్లో ప్రతిసారీ దేశ ప్రతిష్ఠను నిలబెట్టే బాధ్యతను భుజాన వేసుకొంటున్నందుకు ఈ స్త్రీమూర్తులను అభినందించాలి. పతకం చేజారిన ప్రతిసారీ పెల్లుబికే ప్రజాగ్రహాన్ని పళ్ళ బిగువున భరిస్తున్న ఆ సహనమూర్తులకు చేతులెత్తి మొక్కాలి. ఇకనైనా, ఇంటా బయటా తగినంత ప్రోత్సాహం, శిక్షణ అందిస్తే మన ఇంట్లోనే మరో సిందూరపూవు పూస్తుందని గ్రహించాలి. నారీశక్తి సాధించిన ఈ చిరస్మరణీయ విజయాలు సింధు చెప్పినట్టు ‘‘నవ తరానికి స్ఫూర్తిదాయకాలు.’’ తరతరాలుగా సమాజంలో అణచివేతకు గురైన స్త్రీమూర్తులు స్వశక్తిని గుర్తుచేసే శక్తిమంత్రాలు. ఆడవాళ్ళూ... మీకు జోహార్లు! 

మరిన్ని వార్తలు