క్లిష్టసమయంలో కీలక బాధ్యత

20 Aug, 2021 00:22 IST|Sakshi

పదవి గౌరవమే కానీ, దానితో వచ్చే బాధ్యతలే బరువు. అదీ... క్లిష్టమైన సందర్భంలో పీఠమెక్కితే, కిరీటం మరింత బరువనిపించడం సహజం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ)కి అధ్యక్ష స్థానంలో నెల రోజుల పాటు కూర్చొనే గౌరవం ఈ ఆగస్టు మొదట్లో భారత్‌కు దక్కినప్పుడు ఇలా ఎవరూ అనుకోలేదు. కానీ, అఫ్గాన్‌ పరిణామాలతో అంతర్జాతీయంగా ఒక్కసారిగా పరిస్థితులు మారాయి. భద్రతామండలికీ, ఈ నెల రోజులు అధ్యక్ష స్థానంలో ఉండే మన దేశానికీ బాధ్యతలు పెరిగాయి. ఒకవైపు ప్రపంచ దేశాల పక్షాన ఐరాస ద్వారా అఫ్గాన్‌ విషయంలో చేపట్టాల్సిన చర్యలున్నాయి. మరోవైపు అఫ్గాన్‌లో చిక్కుకున్న భారతీయుల భద్రత బాధ్యత ఉంది. ఇవి కాక, పొరుగు దేశమైన అఫ్గాన్‌ దెబ్బతో ఆర్థిక, రక్షణ రంగాల్లో మనపై పడే ప్రభావంపైనా దృష్టి సారించాల్సి ఉంది. వెరసి, కొద్దికాలం పాటు భారత సర్కారుకు చేతి నిండా పని, బుర్ర నిండా ఆలోచనలు తప్పవు. 

2012 తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకు భద్రతామండలి అధ్యక్ష పీఠం దక్కించుకోవడం మన దేశ దౌత్య విజయమే. అలా అంతర్జాతీయ భద్రత అంశాలపై మన గొంతు వినిపించే అవకాశమూ లభించింది. గమనిస్తే– అంతర్జాతీయ వేదికపై ఐక్యరాజ్య సమితి (ఐరాస) కీలకం. దానిలో అతి కీలకవిభాగం భద్రతామండలి. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనాలు అయిదింటికే అందులో శాశ్వత సభ్యత్వం ఉంది. ఎప్పటికప్పుడు మరో 10 దేశాలకు రెండేళ్ళ తాత్కాలిక సభ్యత్వం ఇస్తుంటారు. మానవాళిలో ఆరోవంతుకు ప్రాతినిధ్యం వహిస్తూ, దాదాపు 3 లక్షల కోట్ల డాలర్ల జీడీపీ, థర్మో న్యూక్లియర్‌ ఆయుధాలున్న భారత్‌కు భద్రతామండలిలో నేటికీ శాశ్వత సభ్యత్వం దక్కకపోవడం విచిత్రం. అది భద్రతా సమితి ప్రాసంగికతపైనా అనుమానాలూ రేపుతోంది. 

తాత్కాలిక సభ్యత్వం పొందడం మాత్రం మన దేశానికి ఇది ఎనిమిదోసారి. వంతుల వారీగా దక్కే అధ్యక్ష పీఠాన్ని ఈ ఎనిమిదిసార్లుగా భారత్‌ అధిష్ఠిస్తూనే ఉంది. తాజాగా ఈ ఆగస్టు 2 నుంచి నెలరోజుల భారత భద్రతామండలి సారథ్యం మొదలైంది. ఆ వెంటనే భద్రతామండలి నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన తొలి భారత ప్రధాని అనే ఘనత మోదీ దక్కించుకున్నారు. సాగరజలాల భద్రత, తీవ్రవాద నిరోధం, శాంతిపరిరక్షణ ప్రధానాంశాలంటూ భారత్‌ మొదటే చెప్పేసింది. తొలి చర్చలోనే సాగర జలాల భద్రత అంశాన్ని చేపట్టి, మనం చైనాను ఇరుకునపెట్టాం. కాబూల్‌ తాలిబన్ల వశం కాక ముందే, అఫ్గాన్‌ అంశంపై ఆఖరు నిమిషంలో చర్చకు తెర తీసి, మార్కులు సంపాదించాం. అయితే, తాలిబన్ల పూర్తిస్థాయి విజృంభణతో అసలు సవాలు ఇప్పుడు మొదలైంది. 

అఫ్గాన్‌లోని మొత్తం 34 ప్రావిన్స్‌లలో ఒక్క పాంజ్‌షిర్‌ (అయిదు సింహాల) లోయలో మాత్రమే తాలిబన్లకు ప్రతిఘటన స్వరాలు వినిపిస్తున్నాయి. ఛాందస, తీవ్రవాద, సాయుధ తాలిబన్ల మూక పొరుగుగడ్డపై పట్టు సాధించడంతో మన జాతీయ భద్రతా సవాళ్ళు మరింత సంక్లిష్టమయ్యాయి. మరోపక్క తాలిబన్లు సైతం భారత్‌తో అన్ని రకాల ఎగుమతులూ, దిగుమతులూ ఆపేశారు. అది ఓ పెద్ద దెబ్బ. అఫ్గాన్‌తో అనాదిగా సంబంధ బాంధవ్యాలున్న భారత్‌ ఇప్పటికే 300 కోట్ల డాలర్ల మేర అక్కడ పెట్టుబడులు పెట్టింది. వాటి అతీ గతీ చెప్పలేం. వీటన్నిటికీ తోడు అఫ్గాన్‌ భూభాగం మన దేశంపై దాడులకు బేస్‌ క్యాంప్‌ అయ్యే ప్రమాదం సరే సరి. పేలుతున్న తుపాకీలు.. పెరుగుతున్న నిర్బంధాలు.. మానవహక్కుల ఉల్లంఘనలతో ఇప్పుడు కాబూల్‌ అల్లకల్లోలంగా మారింది.

ఎలాగైనా సరే దేశం విడిచిపోవాలని కాబూల్‌ విమానాశ్రయం వెలుపల గుంపుల కొద్దీ జనం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి విమానాశ్రయం అమెరికా సైనిక బలాల పహారాలో ఉన్నా, తగిన పత్రాలున్న వారిని సైతం తాలిబన్లు లోపలకు పోనివ్వడం లేదని వార్త. సైనిక ఉపసంహరణకు అమెరికా పెట్టుకున్న గడువు ఆగస్టు 31. అది దాటిపోయినా సరే, ఆఖరు అమెరికన్‌ను కాబూల్‌ నుంచి భద్రంగా వెనక్కి తెచ్చేవరకు తమ బలగాలు అక్కడే ఉంటాయని వెల్లువెత్తుతున్న విమర్శల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ గొంతు సవరించుకున్నారు. భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ సైతం కాబూల్‌లోని పరిస్థితులను భారత్‌ నిశితంగా గమనిస్తుదన్నారు. ఇప్పటికైతే భారత్‌ దృష్టి మొత్తం అఫ్గాన్‌లోని మన పౌరుల్ని సురక్షితంగా మాతృదేశానికి తీసుకురావడం మీదే ఉంది. అందుకు ఐరాస ప్రధాన కార్యదర్శితో, అమెరికా, బ్రిటన్‌లతోనూ చర్చిస్తోంది. మరోపక్క శాంతిపరిరక్షణ లాంటి అంశాలపై పత్రాలకు భద్రతామండలిలో ఏకగ్రీవ ఆమోదం సంపాదించింది.

భారత దౌత్యనైపుణ్యానికి ఇది పరీక్షా సమయం. తీవ్రవాద నిరోధంపై గురువారం నాటి భద్రతా మండలి సమావేశంలో కోవిడ్‌ లానే తీవ్రవాదం నుంచీ ఎవరూ సురక్షితం కాదన్న జైశంకర్‌ వ్యాఖ్యలు అందరినీ తాకేవే. తీవ్రవాద నిరోధానికి సప్తసూత్రాలన్న భారత ప్రతిపాదన గమనార్హం. మంచి తీవ్రవాదం, చెడు తీవ్రవాదం అని వేర్వేరుగా ఉండవంటూ– జైష్, లష్కరే తోయిబా లాంటి తీవ్రవాద సంస్థల పేరెత్తడం ద్వారా పాక్‌ ప్రస్తావన తేకనే తెచ్చారు. అఫ్గాన్‌పైనా దృష్టి పడేలా చేశారు. నిజానికి తాలిబన్లకు తాళం వేస్తున్న చైనా, పాక్‌ లాంటి వాటికి పగ్గం వేయాలంటే భారత్‌కు భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వమూ కీలకమే. 1950లలో తప్పిపోయిన శాశ్వత సభ్యత్వాన్ని, ఇప్పుడు వీటో హక్కుతో సహా దక్కించుకోవడం అవసరం. దానివల్ల అఫ్గాన్‌ సహా అనేక అంశాలపై భారత్‌ పట్టుపట్టగలుగుతుంది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో మనకు మళ్ళీ భద్రతామండలి సారథ్యం దక్కనుంది. అప్పటికైనా అఫ్గాన్‌ సంక్షోభానికి తెర పడుతుందా? అది మరీ అంత సులభం కాదేమో! 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు