-

శిశుసంరక్షణపై మరింత శ్రద్ధ అవశ్యం

11 Sep, 2020 01:46 IST|Sakshi

చిన్నారుల ఆరోగ్యం పట్ల ఎలా వ్యవహరిస్తున్నామన్న అంశమే ఏ సమాజ భవిష్యత్తుకైనా గీటురాయి అవుతుందని నల్ల సూరీడు నెల్సన్‌ మండేలా ఒక సందర్భంలో చెప్పారు. శిశువులను జాతి సంపదగా భావించి వారి శ్రేయస్సుకు చేతనైనదంతా చేస్తేనే భవిష్యత్తు సమాజం మెరుగ్గా వుంటుంది. సహస్రాబ్ది లక్ష్యాల్లో ఒకటైన శిశు మరణాల నియంత్రణలో మన దేశం ఆనాటికానాటికి పురోగతి సాధిస్తోందని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో వున్న శిశు మరణాల అధ్యయన సంఘం నివేదిక చెబుతోంది. ఆ నివేదిక ప్రకారం 1990లో మన దేశంలో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతి వేయి మందికి 126మంది చనిపోయేవారు. ఇప్పుడా సంఖ్య 34కి తగ్గింది. ఈ వయసు పిల్లల్లో మరణాల రేటు గత రెండు దశాబ్దాల్లో ఏటా 4.5 శాతం చొప్పున తగ్గుతున్నదని నివేదిక అంటోంది. అంకెల రూపంలో చెప్పాలంటే 1990లో అయిదేళ్లలోపు పిల్లల మరణాలు మన దేశంలో 34 లక్షలుంటే... ఇప్పుడది 8,24,000కు తగ్గింది. మాతా శిశు సంరక్షణ కోసం పథకాలు రూపొందించి, వాటికి తగినన్ని నిధులు కేటాయించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పుకోవాలి. అయితే ఈ కృషి సరిపోదు. ఈ రంగంలో మరింత శ్రద్ధ పెట్టి పనిచేస్తేనే అనుకున్న లక్ష్యాలు సాధించగలమని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే ప్రపంచంలో అయిదేళ్లలోపు పిల్లల మరణాల్లో 49 శాతం కేవలం అయిదు దేశాల్లో సంభవిస్తున్నాయని నివేదిక వివరిస్తోంది. ఆ అయిదు దేశాల్లో నైజీరియా ప్రథమ స్థానంలో వుంటే మన దేశం రెండో స్థానంలో, పాకిస్తాన్, ఇథియోపియా, కాంగో ఆ తర్వాతి స్థానాల్లో వున్నాయి. అంటే ప్రపంచ దేశాల్లో సంభవిస్తున్న మరణాల్లో దాదాపు సగం ఈ దేశాల్లోనే జరుగుతున్నాయి. 


గర్భధారణ సమయంలో మహిళలకు అవసరమైన పోషకాలు లభ్యమయ్యేలా చూస్తే, వారి ఆరోగ్యానికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటే పుట్టే శిశువు ఆరోగ్యవంతంగా వుంటుంది. ఆ సమయంలో మహిళకు అందించే కొద్దిపాటి ఆసరా ఆమె ప్రాణాలను నిలబెట్టడమే కాదు... పుట్ట బోయే శిశువుకు సైతం ఎంతగానో ఉపకరిస్తుంది. గర్భిణులూ, బాలింతల్లో రక్తహీనత వుంటే శిశువుల్లో కూడా ఆరోగ్యపరమైన సమస్యలు తప్పవు.  ప్రసూతి సమయంలో సమస్యలు ఏర్పడటం, తక్కువ బరువుతో శిశువు జన్మించడం, పుట్టిన నెలలోనే వ్యాధిబారిన పడటం, న్యూమోనియా, డయేరియా, మలేరియా వంటి వ్యాధులు అయిదేళ్లలోపు శిశువుల మరణాలకు కారణమవుతు న్నాయి. సకాలంలో వ్యాక్సిన్‌లు అందించడంవల్లనే గత మూడు దశాబ్దాల్లో ఈ మాదిరి మరణాలు చాలా వరకూ అరికట్టడం సాధ్యమైంది. అయితే ఈ కృషి మరింతగా పెరగాలి.

మన గ్రామీణ ప్రాంతాల్లో వైద్యపరమైన సదుపాయాలు ఇప్పటికీ అంతంతమాత్రమేనన్నది చేదు నిజం. పేరుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నా అక్కడ తగినంతగా సిబ్బంది వుండరు. అవసరమైన మందులు లభించవు. ఊరూరా తిరిగి గర్భిణులను గుర్తించి, వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించే విస్తృతమైన నెట్‌ వర్క్‌ మన దేశంలో అమలవుతోంది. కానీ ఇదింకా పూర్తి సంతృప్తికరంగా లేదు. ఆ నెట్‌వర్క్‌ ద్వారా గర్భిణులకు కొంత మేర సాయం అందుతున్నా వైద్య రంగ మౌలిక సదు పాయాలు పూర్తి స్థాయిలో లేకపోవడం పెద్ద శాపంగా మారింది. కనుకనే ప్రసవాల కోసం మంత్ర సానులను ఆశ్రయించే ఆచారం ఇంకా తగ్గలేదు. ఈ విషయంలో ఉత్తరాది రాష్ట్రాల కన్నా దక్షిణాది రాష్ట్రాలు ఎంతో మెరుగని చెప్పాలి. ఆసుపత్రిలో ప్రసవాలు జరిగినప్పుడే నవ జాత శిశుమరణాలు తగ్గుముఖం పడతాయని వైద్యరంగ నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నారు. 2030 నాటికల్లా ప్రపంచ దేశాలన్నీ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు సాధించాలని 2015 సెప్టెంబర్‌లో ఐక్య రాజ్యసమితి తీర్మానించింది. ఈ లక్ష్యాల్లో పేదరిక నిర్మూలన, శిశు మరణాల తగ్గింపు, ఆహారభద్రత, నాణ్యతగల విద్య తదితరాలున్నాయి. ఇవి సాధించాలంటే మనం ఇంకా ఎంతో కృషి చేయాల్సిన అవసరం వుంది. అలా చేయగలిగితే నైజీరియా, పాకిస్తాన్, కాంగో వంటి దేశాల సరసన చేరే పరిస్థితి రాదు. 

కరోనా వైరస్‌ మహమ్మారి విరుచుకుపడి అన్ని రంగాలనూ ధ్వంసం చేసినట్టే ఆరోగ్య రంగ వ్యవస్థనూ కూడా దెబ్బతీసింది. ముఖ్యంగా శిశు మరణాల అదుపుకోసం దశాబ్దాలుగా శ్రమించి సాధించిన విజయాలను అది నాశనం చేసే ప్రమాదం కనబడుతోంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలన్నీ అప్రమత్తతతో వ్యవహరించాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకుం టున్న చర్యలు ఎంతో ప్రశంసించదగ్గవి. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రభుత్వం గ్రామీణ వైద్యం రూపురేఖలు మార్చడానికి నడుంకట్టింది. రాష్ట్రంలో 7,458 ఆరోగ్య ఉపకేంద్రా లుంటే వాటిల్లో 80 శాతం కేంద్రాలకు సొంత భవనాలు లేవు. ఇకపై ప్రతి ఒక్క కేంద్రానికీ అన్ని సదుపాయాలతో కూడిన సొంత భవనం వుండాలన్నది ఏపీ ప్రభుత్వం తాజాగా పెట్టుకున్న లక్ష్యం. వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల పేరిట వీటి రూపురేఖలు సంపూర్ణంగా మార్చి ప్రతి 2,500 మందికి ఒక కేంద్రం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అందులో గర్భిణులు, బాలింతలు, చిన్నారులు టీకాలు వేయించుకునే అవకాశం వుండటంతోపాటు 90 రకాల మందులు లభ్యమవుతాయి. బీఎస్సీ నర్సింగ్‌ పూర్తిచేసినవారు, ఏఎన్‌ఎం అక్కడ అందుబాటులో వుంటారు. ఇటు తెలంగాణలో గ్రామీణ వైద్యరంగాన్ని మెరుగుపరచడంతోపాటు మాతా శిశు రక్షణకు అనేక చర్యలు తీసుకుంటున్నారు. 2017లో ప్రారంభించిన కేసీఆర్‌ కిట్‌ పథకం, ఆ మరుసటి ఏడాది ప్రారంభించిన అమ్మ ఒడి శిశు మరణాల రేటను తగ్గించడంలో గణనీయంగా తోడ్పడిందని గణాంకాలు చెబుతున్నాయి. ఏపీ, తెలంగాణలను ఆదర్శంగా తీసుకుని దేశవ్యాప్తంగా...ముఖ్యంగా ఉత్తరాదిన వైద్య రంగ మౌలిక సదుపాయాలను మెరుగుపరిస్తే ప్రభుత్వాలు క్రియాశీలకంగా పనిచేస్తే అసంఖ్యాక పసిప్రాణాలను గండం నుంచి గట్టెక్కించగలమని పాలకులు గుర్తించాలి.

మరిన్ని వార్తలు