ఇంత బాధలో మేధో హక్కులా?

10 May, 2021 00:04 IST|Sakshi

కరోనా విజృంభిస్తున్న వేళ విశ్వజనులకు వేగంగా వ్యాక్సిన్‌ అందించే అడుగులు పడుతున్నాయి. కోవిడ్‌ వ్యాక్సిన్‌ పేటెంట్‌ రక్షణను తాత్కాలికంగానైనా నిలిపివేయాలనే ప్రతిపాదనకు సానుకూల స్పందన వస్తోంది. అంటే, మేధో సంపత్తి హక్కుల మాఫీ అన్నమాట! ఏకాభిప్రాయం కుదిరితే వ్యాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ విశ్వవ్యాప్తమై సత్వరమే అందరికీ వ్యాక్సిన్‌ లభిస్తుంది. ఫలితంగా కరోనాపై మన ఉమ్మడిపోరు విజయావకాశాలు మెరుగవుతాయి. ఇదొక ఆరోగ్యకర వాతావరణానికి సంకేతం! ముఖ్యంగా వైద్యరంగంలో సరికొత్త సంస్కరణలకు తెరలేపడమే! కొన్నేళ్లుగా లోలోన రగులుతున్న ఈ అంశం ఇప్పుడు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) వేదికపైకి రావడం విశేషం. భారత్, దక్షిణాఫ్రికా చేసిన ప్రతిపాదనకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సానుకూలంగా స్పందించడం పెద్ద ముందడుగు. అమెరికా మరింత స్పష్టతతో వస్తే అప్పుడాలోచిస్తామని తాజాగా పేర్కొన్న యురోపియన్‌ యూనియన్‌ (ఈయూ), ఈ విషయంలో లోతైన చర్చకు తాము సిద్ధమే అనడం కొత్త మలుపు. ఇదివరకటి వారి వైఖరికిది పూర్తి భిన్నం. ఇప్పటికీ జర్మనీ, బ్రిటన్, స్విట్జర్లాండ్‌. నార్వే వ్యతిరేకిస్తున్నాయి. ఫ్రాన్స్‌ మాత్రం సానుకూలంగా స్పందించింది. ‘పేటెంట్‌ హక్కులు తర్వాత, ముందు ప్రజల ప్రాణాలు కాపాడటం ముఖ్యం’ అన్న ఫ్రాన్స్‌ లాంటి వైఖరే తాజా ముందడుగు వెనుక మూలసూత్రం. అందరూ ఒక్కటై, కరోనా మహమ్మారిపై పోరాడాల్సిన సంక్లిష్ట సమయంలో... ఏ కొందరి వాణిజ్య ప్రయోజనాలకో–లాభార్జనకో రక్షణ కల్పించడం సరికాదనేది రక్షణ సడలించాలనే వారి వాదన.

కోవిడ్‌ వ్యాక్సిన్, దాని ముడిసరుకుల విషయంలో పేటెంట్‌ హక్కులున్న పరిమిత కంపెనీలు సంపన్న దేశాల్లోనే ఉత్పత్తులు జరుపుతున్నాయి. ఉత్పత్తి ఎక్కడ జరిపినా.. పంపిణీలో వివక్ష వల్ల ఆయా సంపన్న దేశాల్లో జరిగినట్టు టీకాలిచ్చే ప్రక్రియ ఇతర అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో జరగటం లేదు. మహమ్మారిని తరిమికొట్టాలన్న విశాల లక్ష్యానికి ఇది విఘాతం. సంపన్న దేశాల్లో టీకాలివ్వడం రేపు సంపూర్ణమైనా, ఆ సమయానికి వ్యాక్సిన్‌ దొరక్క అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలు ఇంకా వైరస్‌తో పోరాడుతూ ఉంటే సమస్యను ఎదుర్కోవడంలో సమతూకం చెడుతుంది. ఉత్పరివర్తనతో వైరస్‌ మరిన్ని రూపాలు సంతరించుకొని వ్యాప్తి చెందడం వ్యాక్సిన్‌ పొందిన సంపన్నదేశాలకూ ప్రమాదమే! అలా కాక, పేటెంట్‌ రక్షణ కవచం తొలగి, ఉత్పత్తి–పంపిణీ వేగంగా విశ్వవ్యాప్తమైతే సకాలంలో టీకా ప్రక్రియ ముగించి మహమ్మారిని శాశ్వతంగా తరిమికొట్టవచ్చని సానుకూలవాదులంటారు.

ఇందుకు భిన్నంగా, పేటెంట్‌ రక్షణను సడలించకూడదనే వారికీ కొన్ని వాదనలున్నాయి. సడలిస్తే ఉత్పత్తి ఎవరెవరి చేతుల్లోకో పోయి వ్యాక్సిన్‌ నాణ్యత పడిపోతుందని, వినియోగదారుల్లో విశ్వాసం సన్నగిల్లుతుందని వారంటారు. పైగా అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో నాణ్యతా ప్రమాణాలుండవనే వాదనను వారు ముందుకు తెస్తున్నారు. ఇదొక తప్పుడు వాదన. వ్యాక్సిన్లు, ఇతర మందులకు పేటెంట్‌ హక్కులు ఖాయం చేసుకున్న తర్వాత ఇవే పెద్ద కంపెనీలు, పలు చిన్న కంపెనీలకు సబ్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వడమో, స్వయంగా తామే రంగంలోకి దిగో ఆ పేద దేశాల్లోనే ఉత్పత్తి చేస్తుంటాయి. తేరగా మౌలిక సదుపాయాలు, చౌకగా కూలీలు లభించడం వల్ల అటు మొగ్గి ఇబ్బడిముబ్బడిగా లాభాలార్జిస్తున్నారు. మరి అప్పుడు లేని నాణ్యతా సందేహాలు, పేటెంట్‌ హక్కుల్ని సడలిస్తేనే వస్తాయా? నిజంగా ఉత్పత్తి నాణ్యతపై భయ–సందేహాలుంటే... విశ్వసనీయత కలిగిన సంస్థల పర్యవేక్షణ, గట్టి నిఘాతో అది సాధించుకోవచ్చు.

మేధో సంపత్తి హక్కులు లేకుంటే పెద్ద పరిశ్రమలు భారీ వ్యయంతో పరిశోధనలకు, నూతన ఆవిష్కరణలకు, పెట్టుబడులకు ముందుకు రావంటారు. అందుకే, వారికి తగిన ఆర్థిక ప్రతిఫలం ఉండాలంటారు. అది కొంత నిజమే అయినా, ప్రస్తుత ఉపద్రవం తగ్గేవరకైనా పేటెంట్‌ హక్కుల్ని నిలిపివేయాలని కొన్ని దేశాలు కోరుతున్నాయి. ఈ విపత్కాలంలో ఓ వైపు లక్షలాది మంది ప్రాణాల్ని మహమ్మారి తోడేస్తుంటే, మరోవైపు కొన్ని కంపెనీలు పేటెంట్‌ రక్షణ కవచం నీడన పెద్దమొత్తం లాభాలార్జించడం ఎలా? సమంజసమనే సందేహం పుడుతోంది. ప్రజాధనంతో పనిచేసే విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో ప్రాథమిక శాస్త్ర పరిశోధనలు, ఆవిష్కరణలే ఆయా వ్యాక్సిన్‌ అభివృద్ధికి శాస్త్రీయ మూలమైనపుడు కంపెనీలకు అంతటి అపరిమిత హక్కులు ఎందుకనేది ప్రశ్న. మేధో సంపత్తి హక్కులు–బహిరంగ శాస్త్ర పరిజ్ఞానం వాదనలకు మధ్య ఇదో ఘర్షణ.

ఇల్లు అలకగానే పండుగ కాదు. ఓటింగ్‌ పద్ధతి కాకుండా ఏకాభిప్రాయానికి మొగ్గే డబ్ల్యూటీవో లోని 164 సభ్య దేశాలు అంగీకరిస్తేనే ఏదైనా సాధ్యం. పేటెంట్‌ రక్షణకు సడలింపు ప్రతిపాదనను ఏ ఒక్కదేశం వ్యతిరేకించినా నిర్ణయం జరగదు. పెద్ద దేశాల చొరవతో ఏకాభిప్రాయం సాధ్యమే! పేటెంట్‌ రక్షణను సడలించాలి. సాంకేతికత బదిలీ జరగాలి. లైసెన్సింగ్‌ సులభమవాలి. అలా అని, అడ్డదిడ్డంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేసి వినియోగదారుల కళ్లలో దుమ్ముకొట్టే సంస్థలు రాత్రికి రాత్రి పుట్టగొడుగుల్లా పుట్టి, డబ్బు దండుకొని, జారిపోవాలని ఎవరూ కోరుకోరు. పేటెంట్‌ హక్కుల సడలింపు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, ఉత్పత్తి వికేంద్రీకరణ, సమరీతి పంపిణీ, హేతుభద్దమైన ధర... ఇవన్నీ సాకారమై కరోనా మహమ్మారిపై మానవ విజయం పరిపూర్ణం కావాలన్నదే అందరి కోరిక. 

Read latest Editorial News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు