Israel- Palestine: క్షతగాత్రి పాలస్తీనా

14 May, 2021 00:38 IST|Sakshi

ఒక సంక్లిష్ట సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడం వెనకుండే ప్రధాన లక్ష్యం  పరస్పరం తలపడే వైరి వర్గాల మధ్య సామరస్యాన్ని కుదర్చడం, శాంతి స్థాపన జరిగేలా చూడటం. కానీ ఆ పరిష్కారాన్ని వైరి వర్గాలు ఒక ఎత్తుగడగా మాత్రమే భావిస్తే, భవిష్యత్తులో బలాబలాల సమీకరణకు చిక్కిన వ్యవధిగా విశ్వసిస్తే... కనుగొన్న పరిష్కారం కాస్తా సమస్యను మించి జటిలంగా మారుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్‌ దళాలు నిరంతరాయంగా కురిపిస్తున్న నిప్పుల జడిలో ధ్వంసమవుతున్న పాలస్తీనాలో జరిగింది అదే. ఈ ఘటనల నేపథ్యాన్ని ఒకసారి చూడాలి. ఇజ్రాయెల్‌లో గత రెండేళ్లుగా నాలుగుసార్లు ఎన్నికలు నిర్వహించినా ఏ పార్టీకీ మెజారిటీ రాలేదు. పాలస్తీనాలో 2006 నుంచి పెండింగ్‌లో వున్న పార్లమెంటు ఎన్నికలు ఘర్షణలు మొదలైన వెంటనే వాయిదా పడ్డాయి. ఇప్పుడు వర్తమాన ఘర్షణల వెనకున్నదెవరో, ఏ ప్రయోజనం ఆశించి వీటిని సాగిస్తున్నారో సులభంగానే అంచనా వేయొచ్చు.

మొత్తానికి ఇటు గాజా స్ట్రిప్‌ ను పర్యవేక్షిస్తున్న హమాస్‌కూ, అటు ఇజ్రాయెల్‌ దళాలకూ మధ్య సాగుతున్న సంకుల సమరంలో ఇంతవరకూ 83 మంది పాలస్తీనా పౌరులు కన్నుమూశారు. ఇందులో 17 మంది పిల్లలు, మరో ఏడుగురు మహిళలు. 480 మంది గాయ పడ్డారు. ఇజ్రాయెల్‌వైపు ఒక సైనికుడు, ఆరుగురు పౌరులు మరణించగా అందులో కేరళకు చెందిన ఒక నర్సు కూడా వున్నారు. ఆకాశాన్నంటే భవంతులు కుప్పకూలాయి. మీడియా సంస్థ లున్న భవనం సైతం ఇజ్రాయెల్‌ దాడిలో నాశనమైంది. హింస నివారించి, అన్ని పక్షాలూ శాంతి స్థాపనకు ప్రయత్నించాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పిలుపునిచ్చారు. కానీ ఎప్పటిలాగే ఆయన ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచారు. ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఆ దేశానికున్నదంటూ సమర్థించారు. అరబ్‌–ఇజ్రాయెల్‌ ఘర్షణల్లో ఇది రివాజే.

ఇజ్రాయెల్‌ ఆరోపిస్తున్నట్టు హమాస్‌ మిలి టెంట్లు తొలి దాడికి దిగివుండొచ్చుగానీ... కానీ దానికి దారి తీసిన పరిణామాలేమిటి? ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్‌ మాసంలో చరిత్రాత్మకమైన అల్‌–అక్సా మసీదులో ఎప్పటిలాగే ప్రార్థన లకు ఉపక్రమించిన వేలాదిమందిపై ఇజ్రాయెల్‌ పోలీసులు ఎందుకు దాడి చేశారు? ఇజ్రాయెల్‌కు ఆత్మ రక్షణ హక్కు వున్నట్టే పాలస్తీనా పౌరులకూ వుండాలి కదా! తటస్థంగా వుండదల్చుకుంటే వేరు. కానీ ఆ ముసుగులో ఒక పక్షానికే కొమ్ము కాయడం, దాని తీరు సరైందన్న అభిప్రాయం కలిగించే ప్రయత్నం చేయడం వంచన తప్ప మరేం కాదు. 


యాభై అయిదేళ్లక్రితం...అంటే 1967లో ఆరు రోజులపాటు జరిగిన అరబ్‌–ఇజ్రాయెల్‌ యుద్ధంలో వర్తమాన విషాదానికి బీజాలున్నాయి. ఆ యుద్ధంలో తూర్పు జెరూసలేం ప్రాంతాన్ని జోర్డాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ దళాలు కైవసం చేసుకున్నాయి. జెరూసలేం తమ రాజధాని అంటూ ఆ తర్వాత ఇజ్రాయెల్‌ ప్రకటించినా అంతర్జాతీయంగా దాన్నెవరూ గుర్తించలేదు. శాంతి ఒప్పందంలో భాగంగా తూర్పు జెరూసలేంలోని అల్‌–అక్సా మసీదు నిర్వహణ బాధ్యత జోర్డాన్‌ ఆధ్వర్యంలోని ఇస్లామిక్‌ ట్రస్టు అధీనంలో వుంది. కానీ ఆ కట్టడం వున్న 35 ఎకరాల ప్రాంతం ముస్లింలతోపాటు క్రైస్తవులకూ, యూదులకూ కూడా పవిత్రమైన ఆవరణ. యథాపూర్వ స్థితి ఏర్పడేలా చూసినప్పుడే ఏ శాంతి ఒప్పందమైనా నాలుగు కాలాలపాటు మనుగడ సాగిస్తుంది.

కానీ జరిగింది అది కాదు. తూర్పు జెరూసలేంనుంచి ఇజ్రాయెల్‌ను పొమ్మనకుండా, అల్‌–అక్సా ఆవరణను మూడు మతాల వారూ సందర్శించడానికి వీలుకల్పిస్తూ రాజీ కుదిర్చారు. ఇదే సమస్యను మరింత జటిలం చేసింది. అక్కడ భిన్న మతాల తీవ్రవాద బృందాలమధ్య ఘర్షణలు జరగడం... వాటిని ఎప్పటికప్పుడు ఏదో రకంగా చల్లార్చడం రివాజైంది. అల్‌–అక్సా ప్రాంతంలో యూదు తీవ్రవాద బృందాల కదలికలు ఎక్కువయ్యాయని గత నెలలో జోర్డాన్‌ విదేశాంగమంత్రి ఫిర్యాదు చేశారు. ఇది రంజాన్‌ మాసమై నందువల్ల ఏ చిన్న ఘర్షణైనా పెనుముప్పుగా పరిణమించొచ్చని హెచ్చరించారు.

ఈలోగా తమకూ ప్రార్థించే హక్కుందంటూ యూదు తీవ్రవాద బృందాలు పేచీ మొదలెట్టాయి. అంతక్రితమే పాత నగరంలో యూదు ఛాందస బృందాలకూ, పాలస్తీనా పౌరులకూ ఘర్షణలు రాజుకున్నాయి. ఆ సాకుతో ముస్లింలు అటు రావడానికి వీల్లేదంటూ ఇజ్రాయెల్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. అలాగే ఇజ్రాయెల్‌ పౌరుల కోసం ఆవాసాల నిర్మాణం మొదలైంది. ఇవన్నీ ఎందుకు చోటుచేసు కున్నాయో సులభంగానే అంచనా వేయొచ్చు. 


అధికారాన్ని అంటిపెట్టుకుని వుండాలన్న ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఆశలపై గత రెండేళ్లలో ఒకసారి కాదు... నాలుగుసార్లు ఆ దేశ ప్రజలు నీళ్లు చల్లారు. మళ్లీ పాలస్తీనా పోరు రాజేసి గట్టెక్కాలని ఆయన ప్రయత్నించినా సాధ్యం కావడం లేదు. తాజాగా  ఇజ్రాయెల్‌ విపక్షాలన్నీ నెతన్యాహూ లేకుండా కూటమి ప్రభుత్వం ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాయి. వర్తమాన ఘర్షణ నెతన్యాహూ కోరుకుంటున్నట్టు ఆయన స్థితిని మెరుగుపరుస్తుందో లేదో చూడాలి.

అయితే ఈ దారుణ మారణ హోమంలో పాలస్తీనా పౌరులు సమిధలవుతున్నారు. దీన్నంతటినీ నిర్వికారంగా చూస్తూ వుండిపోవడం మానవీయతకే అపచారమని ప్రపంచ పౌరులు గుర్తిస్తే తప్ప ఇందుకు శాశ్వత పరిష్కారం దొరకదు. దురాక్రమణదారుగా, మారణహోమ సృష్టికర్తగా, అకారణ పేచీలతో నిత్యం పాలస్తీనా పౌరులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న ఇజ్రాయెల్‌ 1967కు ముందునాటి భూభాగానికి ఉపసంహరించుకోవడం ఒక్కటే వారి శాశ్వత భద్రతకు గ్యారంటీ ఇవ్వగలదు. 

చదవండి: వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, హమాస్‌

మరిన్ని వార్తలు