ఈ మార్పు మంచికేనా?

29 Mar, 2023 00:15 IST|Sakshi

ప్రజాందోళన పెరిగితే దాన్ని నీరుగార్చడానికైనా పాలకులు ఒక అడుగు వెనక్కి వేస్తారు. కనీసం వేసినట్టు కనిపిస్తారు. మూడు నెలలుగా సాగుతున్న ప్రజా ఉద్యమం ఉద్ధృతరూపం దాల్చడంతో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతెన్యాహూ ఆ పనే చేశారు. ప్రభుత్వమే జవాబుదారీ అంటూ ఆ దేశ న్యాయమూర్తులకు ఇప్పటి దాకా అనేక అధికారాలున్నాయి. వాటిని నిర్వీర్యపరిచేలా న్యాయ వ్యవస్థలో మార్పులకు దిగిన ఆయన, చివరకు ప్రజాగ్రహంతో ఆగాల్సి వచ్చింది.

రక్షణమంత్రిపై వేటు ప్రకటన గత వారాంతంలో కథలో ఈ కొత్తమలుపునకు దారి తీసింది. ప్రధాని చర్యలకు వ్యతిరేకంగా దేశంలోని అతి పెద్ద కార్మిక సంఘం సమ్మెకు దిగేసరికి, ఆస్పత్రులు, విద్యాలయాలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, విదేశాల్లో ఇజ్రాయెలీ దౌత్యకార్యాలయాలు – అన్నీ సోమవారం మూతబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ స్తంభించడం, సొంత దేశాధ్యక్షుడితో పాటు అమెరికా సహా అంత ర్జాతీయ సమాజదృష్టి పడడంతో ఒత్తిడి పెరిగి నెతెన్యాహూ మనసు మార్చుకున్నట్టు కనిపించారు.

మిత్రదేశమైన అమెరికా సైతం నెతెన్యాహూకు సుద్దులు చెప్పాల్సి వచ్చింది. రక్షణమంత్రి ఉద్వాసన వార్తలందాక కలవరపడి, ప్రజాస్వామ్యానికి అప్రతిష్ఠ తీసుకురావద్దని ఇజ్రాయెల్‌ను పదే పదే హెచ్చరించింది. మార్పులకు విరామమిచ్చినట్టు నెతెన్యాహూ ప్రకటించగానే, ఆయనను అమెరికా అధ్యక్షుడితో భేటీకి ఆహ్వానిస్తున్నట్టు అమెరికన్‌ రాయబారి వెల్లడించడం గమనార్హం.

ప్రధానిగా నెతెన్యాహూ పదవి చేపట్టి 3 నెలలు దాటినా, ఇంతవరకూ కలవని అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు హుటాహుటిన భేటీ జరపనుండడం ఆసక్తికర పరిణామమే. మధ్యప్రాచ్యంలో అమెరికాకు అనేక ప్రయోజనాలున్నాయి. వాషింగ్టన్, జెరూసలేమ్‌ల సైనిక భాగస్వామ్యంపైనే దాని దృష్టి.   

నిజానికి మార్పుల్ని వ్యతిరేకించిన రక్షణమంత్రిని ఇంటికి పంపి, తన పంతం నెగ్గించుకోవచ్చని నెతెన్యాహూ తప్పుగా అంచనా వేశారు. ఇజ్రాయెలీ సైనికదళాలకు వెన్నెముక లాంటి సైనిక రిజర్వి స్టులు సైతం విధులకు హాజరయ్యేందుకు నిరాకరించడంతో దేశ భద్రతకే ముప్పొచ్చింది. ఎగసిన వ్యతిరేకతకు తలొగ్గి, మార్పులకు సర్కార్‌ బ్రేకులు వేయాల్సి వచ్చింది. 73 ఏళ్ళ నెతన్యాహూ మాట నమ్మి, కార్మిక సంఘం సమ్మె విరమించింది.

అలా మంగళవారం ఇజ్రాయెలీ వీధులు పైకి ప్రశాంతంగా కనిపించాయి. కానీ, సంక్షోభం పరిష్కారమైందనుకోలేం. అవినీతి ఆరోపణల్ని ఎదుర్కొంటున్న నెతెన్యాహూ జడ్జీల ఎంపిక వ్యవస్థపై పట్టు బిగించే ప్రతిపాదిత బిల్లుకు పూర్తిగా స్వస్తి పలికారనుకోలేం. మిత జాతీయవాదులు, ఛాందసులు, అతి మితవాదుల కలగాపులగమైన సంకీర్ణ సర్కారు ఆ బిల్లు తుది రూపాన్ని మంగళవారం పరిశీలనకు చేపట్టడమే అందుకు ఉదాహరణ. 

జనం ఎన్నుకొనని శిష్టవర్గీయుల చేతిలో, వామపక్షం వైపు మొగ్గే వ్యవస్థగా జ్యుడీషియరీ మారిందనేది ప్రభుత్వ ఆరోపణ. సుప్రీం కోర్ట్‌ నిర్ణయాల్ని సైతం సాధారణ మెజారిటీతో పార్లమెంట్‌ కొట్టిపారేసే వీలు కల్పించాలనీ, జడ్జీల నియామక సంఘంలో ప్రభుత్వ ప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచాలనీ, న్యాయ సలహాదారుల సలహాను మంత్రులు శిరసావహించాలనే చట్టాన్ని ఎత్తేయా లనీ... ఇలా పలు మార్పులు చేద్దామని ప్రభుత్వ యోచన. కానీ, ఈ మార్పులు చివరకు న్యాయ వ్యవస్థను నీరుగార్చి, పాలకుల వైపే మొగ్గుతో ప్రజాస్వామ్యానికి హాని చేస్తాయని ప్రజలు, ప్రతిపక్షాల ఆందోళన.

ప్రభుత్వం మాత్రం పాలకులకు మరింత జవాబుదారీగా ఉండేలా న్యాయ వ్యవస్థలో మార్పులు తేవాలనే తమ ప్రయత్నం అంటోంది. దాన్ని అడ్డుకోవడం అప్రజాస్వామిక మని నెతెన్యాహూ బృందం వాదిస్తోంది. వెరసి, పార్లమెంట్‌ తదుపరి సమావేశాల్లో ఈ బిల్లు కథ మళ్ళీ పైకి రావచ్చు. ఈ 2 నెలల జాప్యంతో భారీ పౌర నిరసనపై నీళ్ళు జల్లి, ఏకాభిప్రాయం పేర ఏదో ఒక రూపంలో బిల్లుకు ముద్ర వేయాలనేది పాలకుల ప్రస్తుత వ్యూహం. 

అబద్ధాలు చెప్పడం, తిమ్మిని బమ్మిని చేయడం నెతెన్యాహూ స్వభావం కాబట్టి, కుట్రలకు ఆయన తెర దించేవరకూ ప్రజా ఉద్యమంతో ఒత్తిడి పెట్టాల్సిందేనని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి. తాజా పరిణామాలతో నెతెన్యాహూకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆయన రాజకీయ బుద్ధి సూక్ష్మతకూ, అవసరమైతే రాజీపడే నేర్పుకూ గట్టి దెబ్బే తగిలింది.

పరస్పర విరుద్ధ ఎన్నికల హామీ లిచ్చిన పార్టీల్ని సైతం కలుపుకొని, పంచకూట కషాయమైన సంకీర్ణ సర్కార్‌ను ఆయన ఏర్పాటుచేసి నిండా 4 నెలలైనా కాలేదు. న్యాయవ్యవస్థను తిరగదోడే పని ఆయన కొనసాగిస్తే ప్రజాగ్రహం తప్పదు. ఆపేస్తే సంకీర్ణంలో అతి మితవాద పక్షాలు వైదొలగుతాయి. ముందు నుయ్యి, వెనుక గొయ్యి. దీన్నెలా దాటతారన్న దాన్నిబట్టి ఆయన ఎంతకాలం పదవిలో ఉంటారో తేలుతుంది. 

వరుస సంక్షోభాలతో, గత నాలుగేళ్ళలో 5 సార్లు ఎన్నికలతో ఇజ్రాయెల్‌ రాజకీయ అని శ్చితితో సతమతమవుతోంది. మళ్ళీ వెంటనే మరో ఎన్నికను భరించలేని ఇజ్రాయెల్‌కూ, అక్కడి ప్రజాస్వా మ్యానికీ తాజా సంక్షోభం మరో అగ్నిపరీక్ష. కాకపోతే మూడు నెలలుగా లక్షలాది ప్రజలు వీధికెక్కి, తెలుపు – నీలం రంగుల జాతీయ పతకాన్ని చేబూని, నిరసన ప్రదర్శనలు చేస్తున్నా హింసాకాండ చెలరేగకపోవడం, చుక్క రక్తం చిందకపోవడం చెప్పుకోవాల్సిన విశేషం.

జీవం తొణికిస లాడుతున్న ప్రజాస్వామ్యానికి సంకేతం. ఇప్పటికైతే ఇజ్రాయెల్‌ ప్రజలకు దక్కింది తాత్కాలిక విజయమే కావచ్చు. లక్షలాది జనం పార్లమెంట్‌ ముంగిట చేస్తున్న ‘డెమోక్రాషియా’ (ప్రజాస్వామ్యం) నినాదాలు, ప్రతిధ్వనిస్తున్న జెరూసలేమ్‌ వీధుల ప్రజాచేతన... ప్రపంచానికి ఆశాకిరణాలు.  

మరిన్ని వార్తలు